వీరశైవ పంచపీఠములు

ప్రపంచమందుండిన అత్యంత ప్రాచీన ధర్మములలో వీరశైవ ధర్మమొకటి. ఇది విశ్వవ్యాప్తమైనట్టిది. సృష్టి మొదలుకొని నేటి వరకు విరాజమానమై మిగుల శోభీయమానముగా వెలుగొందుచునే యున్నది. వీరశైవ మతధర్మమును జగత్తునకందజేసి తమ శిష్యగణముచే ప్రచారమొనరింప జేసినవారు శ్రీజగదాది జగద్గురు పంచాచార్యులు. వారే ఈ మత స్థాపకులు కూడా. పరమశివుని పంచముఖములగు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానముఖముల మూలకముగా ఆయాపవిత్ర క్షేత్రములందలి లింగముల నుండి ఉద్భవమంది జగదాది జగద్గురువులుగా ప్రసిద్దిగాంచినారు.

కృతయుగమున ఆంధ్రప్రదేశ్ నందలి నల్గొండ జిల్లాలోని ఆలేరు పట్టణసమీపమున సుమారు 7 కి.మీ. దూరములో నుండిన కొలనుపాక శైవక్షేత్రమందలి శ్రీసోమేశ్వర లింగము నుండి ఏకవక్త్ర శివాచార్య భగవత్పాదులు, మధ్యప్రదేశమునందలి ఉజ్జయినీ నగర సమీపముననున్న వటక్షేత్ర శ్రీసిద్దేశ్వర లింగోద్భవులుగా ద్వివక్త్ర శివాచార్య భగవత్పాదులు, ఆంధ్రప్రదేశమున గల తూర్పుగోదావరి జిల్లా దక్షారామములోని భీమ(రామ)నాథ లింగద్భవులుగా త్రివక్త్ర శివాచార్యులు, ఆంధ్రప్రదేశముననే ప్రసిద్ద శైవక్షేత్రమైన శ్రీశైలమునందలి శ్రీమల్లిఖార్జున జ్యోతిర్లింగము నుండి చతుర్వక్త్ర శివచార్యులుగా ఉద్భవమందిరి. ఉత్తరప్రదేశమునందేగాక దేశవ్యాప్తముగా ప్రసిద్దిగొన్న వారణాసి నగరమున పావన గంగాతీరమునందలి శ్రీవిశ్వనాథ జ్యోతిర్లింగము నుండి పంచవక్త్ర శివాచార్యులుగా వెలసి శ్రీజగదాది జగద్గురువులుగా పంచాచార్యులు ప్రసిద్ధినొందిరి.

వీరలే త్రేతాయుగమునందు అదే సుక్షేత్రమునందలి ఆయా లింగము నుండి ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర, చతురక్షర, పంచాక్షర శివాచార్య భగవత్పాదులుగా వెలసి వెలుగొందిరి. అదే రీతిన ద్వాపర యుగమునకు వీరలే అదే క్షేత్రములందలి ఆలింగముల నుండియే రేణుకాచార్యులు, దారుకాచార్యులు, ఘంటాకర్ణ శివాచార్యులు, ధేనుకర్ణ శివాచార్యులు, విశ్వకర్ణ శివాచార్యులుగా వెలసి ప్రసిద్దిగాంచిరి. కలియుగమునకు అదే రీతినగనే రేవణసిద్ధ, మరుళసిద్ద, ఏకోరామారాధ్య, పండితారాధ్య, విశ్వారాధ్య శివాచార్య భగవత్పాదులుగా ఉద్భవమంది వీరశైవధర్మమును విశ్వవ్యాప్తమొనరించిరి.

పంచాచార్యులైదుగురు ఆయాస్థానములందు ఉద్భవమందినను రేణుకాచార్యులు కొలనుపాకను వీడి లోకసంచార మొనరించుచు ముందుకుసాగి కర్ణాటక రాష్ట్రమునందలి సహ్యద్రి సానువులలో మలయాచల పాదమున ఆహ్లాదకరమగు మలయమారుతమునకు ప్రకృతి సౌందర్యమునకు లోగి భద్రానదీ తీరమున రంభాపురి పీఠమును నెలకొల్పిరి, అచటనే అగస్త్య మునిని శిష్యునిగా చేకొని శక్తివిశిష్టాద్వైత సిద్ధాంత తత్వములను ఉపదేశమొనరించి అతనిచేతనే ఆ సిధ్ధాంతములను విశ్వవ్యాప్తముగావించిరి.

మరొక పీఠమగు ఉజ్జయినియు మధ్యప్రదేశమును వీడి సంచార వీధిని కర్ణాటక రాష్ట్రమును చేరి బళ్ళారి జిల్లా కూడ్లిగి తాలుకాలోని ఉజ్జయిని (ఉజిని) అభిదానముతో వెలుగొందుచున్నది. హంపి క్షేత్రమునందు ఆలయ బాహ్యమునను ఉజ్జయిని ఆలయ అంతర్భాగమునను గల శిల్పకళ చూడవలసినదే గాని వర్ణింప సాధ్యము గాదు గదా!

ఈ విధముగా ఈ రెండు పీఠములు కర్ణాటక రాష్ట్రమును చేరుటచే వీరశైవమతము అత్యధికముగా ఈ ప్రాంతములందు ప్రాచుర్యమందినది. కన్నడ రాజ్యమున ఏ వీరశైవ పీఠమును వెలయలేదు.

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాయందలి దక్షారామ సుక్షేత్రము నందలి కేదారపీఠము ఉత్తరాంచలము నందలి రుద్రప్రయోగ జిల్లా ఊఖీమఠముగా (ఉషామఠము) పేర్కొనబడుచున్నది. ఆ ప్రాంతమున మనమెవరిని కేదార వైరాగ్య సింహాసన పీఠమెచటనున్నదని ప్రశ్నించినను 'ఓక్యా హై హమునా మాలూం నహీ!' అనియేబదులిత్తురు. కాని సరియైన సమాధానము దొరకదు. ఇది మన దురదృష్టకరము.

శ్రీశైల పీఠము, కాశీపీఠములచటనే విరాజిల్లుచున్నవి. రంభాపురి ఉజ్జయిని హిమవత్కేదారము శ్రీశైల పండితారాధ్య పీఠము, కాశీజంగమవాడి పీఠములు వీరసింహాసనము, సద్దర్మసింహాసనము, సూర్య సింహాసనము,జ్ఞానసింహాసనము లుగా అస్తిత్వము కలిగి పేరుకు తగినట్లే అవి వెలుగొందుచున్నవి.

రంభాపురి ఉజ్జయిని పీఠములు రెండును కర్ణాటక రాష్ట్రమున ఉండుటచేతను, ఈ పీఠములన్నింటికిని కర్ణాటక రాష్ట్రీయులో లేక మహారాష్ట్రీయులో పీఠాధిపతులు అగుటచేత ఆరెండు రాష్ట్రములలోనే వీరశైవ మతము బహుళ వ్యాప్తి నొందినది. అంతియేగాదు స్వాములనినను, జగద్గురువులనినను అమితభక్తి ప్రపత్తులతో సేవించుచూ తమ తమ ప్రాంతములకు ఆమంత్రణములు సలుపుచు యుగమానోత్సవములో దసరా దర్భారులనో నిర్వహించుచు శ్రీభగవత్పాదుల వారిచే శుభాశీర్వాద మంగళాశీస్సులనందుకొనుచున్నారు.

ఆంధ్రప్రదేశ్ నందు మూడు పీఠములు (రంభాపురి, శ్రీశైలం, కేదారము) వెలసినను ఆపీఠాధీశులు కన్నడియులో మహారాష్ట్రీయులో అగుటచేత తెలుగు భాష వారికి రానందునను, ఆంధ్రులకు కన్నడ మహారాష్త్ర భాషలు రానందునను వారి విషయములు గాని, యుగ మానోత్సవములు గాని నిర్వహించుట మనమెరుగము. స్వాములన్న దక్షణలు పూజలు కొరకే అను భావనయు మనకున్నది. ఇది మన దురదృష్టమనదగును.

ఇటువంటి పీఠములకు కృతయుగము నుండి కలియుగమునను నేటివరకు జగదాది జగద్గురువులుగా సుమారు 668 మంది జగద్గురువులు పీఠారోహణము చేసి కీర్తి గడించినవారే. ఈ జగద్గురువులెల్లరును పండిత ప్రకాండులే, జ్ఞానసింధువులే, అనితర శివపూజా దురందులే, నైష్టిక తత్పరులే, నిష్టాగరిష్ఠులే యేదు మిక్కిలి శక్తి విశిష్టాద్వైత సిద్దాంత తత్వములను దేశము నలుమూలల చేరునట్లు సంచారము సలిపి ప్రచారము కొనసాగునట్లు భాసిల్లుచున్నారు.