ప్రాణలింగి స్థలము

షట్ స్థల సాధన యొక్క నాల్గవ సోపానమే ప్రాణలింగి స్థలము. "ప్రాణలింగమస్య అస్తీతి ప్రాణలింగీ" ప్రాణలింగమును పొందిన వాడు ప్రాణలింగి. ఇది ప్రాణలింగి శబ్దము యొక్క వ్యుత్పత్తి. ప్రాణలింగ స్వరూపమును, గొప్ప అంశములను తెలిసికొని దాని అను సంధానము నందు నిరతుడై యుండుటతో బాటు తన ఇష్ట లింగమును ప్రాణమువలె ప్రేమించువాడు ప్రాణలింగి స్థల సాధకుడు. సిద్ధాంత శిఖామణి యందును ప్రాణలింగము యొక్క స్వరూపమును ఉపదేశించును.

ప్రాణాపాన సమాఘాతాత్ కంఠమధ్యాద్యదుత్థితం|

ప్రాణలింగం తదాఖ్యాతం ప్రాణాపాన నిరోధిభి:|| అని నిరూపింపబడినది.

ప్రతి యొక్క మానవుని శరీరమునందు ఐదు విధములగు వాయువులండును. 1. ప్రాణవాయువు 2. అపాన వాయువు 3. సమాన వాయువు 4. ఉదాన వాయువు 5. వ్యాన వాయువు. వీటినే పంచ ప్రాణములందురు. అమర కోశము నందు వీటి వాస స్థానములను గురించి ఇట్లు తెలుపబడినది.

హృది ప్రాణో గుదేపానో సమానో నాభిమండలే|

ఉదాన: కంఠదేశే స్యాత్ వ్యాన: సర్వ శరీరగ:||

ప్రాణవాయువు హృదయము నందును, అపాన వాయువు మూలాధారము నందును, సమాన వాయువు నాభియందును, ఉదానవాయువు కంఠము నందును, వ్యాన వాయువు శరీరమందంతటను నెలకొని యుండును. వస్తుత: వాయువు ఒకటే యై యుండినను విభిన్న స్థానములందుండి విభిన్న క్రియల నొనరించుట చేత అయిదు పేర్లను పొందుచున్నది. ఒక్క వ్యక్తి ఇంటి యందుండి ఇంటిపని చేసికొనునపుడు యజమాని యనియు, ఆఫీసునకు వెళ్ళి అట పని చేయునపుదు ఆఫీసరనియు, దేహ వ్యాయామమునకై ఏదో ఒక ఆటాడు నపుడు ఆటగాడనియు పిలువబడునట్లు ఈ వాయువును వేరువేరు స్థానముల నాశ్రయించి వేరువేరు పనులు చేయుటవలన వేరువేరు పేర్లతో పిలువబడుచున్నది. ప్రాణవాయువు హృదయము నందుండి నాసిక వరకు సంచరించుచు నుండును. ఈ క్రియ దినమునకు 21,600 సార్లు ఉచ్ఛ్వాస విశ్వాసముల ద్వారా సాగుచుండును. ఈ ప్రాణవాయువు సంచారము వలననే శరీరము జీవించుచున్నది. ఇది నిలచిన దేహపు నిత్య విధులు నిలిచిపోయిన మానవుడు మరణము పొందును. దేహ జీవనమునకు ప్రాణవాయువు క్రియ అనివార్యము. ఇది ఊర్థ్వ ముఖముగా సంచరించుచుండును.

గుద స్థానమునందు నెలకొనిన అపానవాయువు మల మూత్రములను వెలికి వేయు కార్యము నొనరించును. ఈ వాయువు దుర్బలమైనపుడు మల మూత్ర విసర్జనా సమయమున ఆటంకము కలుగుతుంది. ఇది అధోముఖముగా సంచరించుచుండును.

నాభియందుండిన సమాన వాయువు మనుష్యుడు సేవించెడు అన్నమును రసమయిన రక్తమును సకల అవయవములకు అనువగు పని మరియు సమదృక్పథమునకు అనుగుణముగ సమముగా పంచెడు పనిని చేయుచుండును. ఈ రీతిగా సమానముగా పంచుట చేతనే ఈ వాయువుకు సమానవాయువను పేరు గలిగినది.

ఉదానవాయువు కంఠమునందుండి తుమ్ములు, తేపులు మొదలగు ముఖాంతరము నుండి దేహ మాలిన్యములను వెలుపలికి చిమ్ము పనిని చేయుచూ ఉంటుంది.

వ్యాన వాయువు శరీరము నందలి ప్రతి నరనరము నందుండి సంచరించుచు రక్త ప్రస్రణ క్రియను సమతౌల్యముగా కాపాడుతూ ఉంటుంది. ఈ వాయువు వికటించినపుడు సంబంధిత అర్ధాంగ వాయు మూలక వ్యాధులు శరీరము నందు చొచ్చుకుంటాయి.

ఈ ఐదు వాయువులందు శివయోగ సాధకునకు అనుకూలమైనట్టి విశిష్టమైన ప్రాణాయామ ప్రక్రియకు ప్రాణ అపాన వాయువులు చాలా ముఖ్యము. సిద్ధాంత శిఖామణి ఇంతకు పూర్వము తెలిపినట్లు శివయోగ సాధకుడు సుదీర్ఘ ప్రాణాయామము ద్వారా తన ప్రాణాయామమును గుద స్థానము నందుండిన అపాన వాయువు పర్యంతముగ కొని పోయినపుడు అట వాటి రెండింటికి ఘర్షణ చెలరేగుతుంది.అపుడు సాగిన మథనము చేత అగ్ని ఊర్థ్వముఖముగా పైకేతెంచి హృదయ స్థానము నందు నిలుచును. చలికాలము నందు తెలవారు సమయమున గడ్డి పరకలపై కనిపించు మంచు బిందువులు సూర్యోదయ అనంతరము సూర్యకిరణ తేజముతో విలీనమవునట్లు హృదయ స్థానమైన ఈ జ్యోతియందు ప్రాణవాయువు విలీనమవుతూ పోతుంది. నందా దీపము (అఖండ దీపము) నందు బొట్టు బొట్టుగా వచ్చెడు నూనెను తనలో లీనమొనరించు కొనుచు దీపము నిరంతరముగా వెలుగొందునట్లు ఈ జ్యోతియును ప్రాణవాయువును తనలో లీనమొనరించుకుంటు నిరంతరము వెలుగొందుతుంది. ఈ రీతిగ ప్రాణవాయువు యొక్క సహయోగముతో నిరంతరము ప్రజ్వలించెడు ఈ జ్యోతిర్లింగమే వీరశైవ సిద్ధాంతము నందు ప్రాణలింగమని చెప్పబడినది. ప్రసాది స్థల సాధకుడే తన ఆంతరంగిక సాధనా బలముతో ఈ ప్రాణలింగము యొక్క ఉన్నతాంశలను తెలిసికొని దాని యనుసంధానము నందు యత్నించినపుడు అతడే ప్రాణలింగి యనబడును.

ఈ ప్రాణలింగానుసంధాన విధానము వీరశైవ సిద్ధాంతము నందు అత్యంత విశిష్ట పూర్వకముగా నిరూపించబడినది. నూటొక్క స్థలములందు ప్రాణలింగార్చనమను స్థలమొకటున్నది. ఈ స్థలము నందు ప్రాణలింగ పూజకు బాహ్య పదార్థము నిరుపయోగములు. ఏలన ఆంతరిక భావ వస్తువుల తోడనే పూజింపవలెనని సూచింపబడినది. సామాన్యముగా సాధకుడు ఇష్టలింగమును నీరు, భస్మము, పూలు, పత్రి, ధూపము, దీపము మున్నగు ఉపచారములచే పూజించును. అయితే ప్రాణలింగము యొక్క పూజకు ఆంతరిక సద్గుణోపచారముల రూపమునందే ఉపయోగించుకొనవలసి యుండును.

క్షమాభిషేక సలిలం వివేకో వస్త్రముచ్యతే।

సత్యమాభరణం ప్రోక్తం వైరాగ్యం పుష్పమాలికా॥

గంధ: సమాధి సంపత్తి రక్షతా నిరహంకృతి:।

శ్రద్ధా ధూపో మహాజ్ఞానం జగద్భాసి ప్రదీపికా॥

భాంతిమూల ప్రపంచస్య నివేద్యం తన్నివేదనం।

మౌనం ఘంటా పరిస్పంద స్తాంబూలం విషయార్పణమ్ ॥

విషయ భ్రాంతి రాహిత్యం తత్ ప్రదక్షిణ కల్పనా।

బుద్ధే స్తదాత్మికా శక్తి ర్నమస్కార క్రియా మతా॥

ఏవం విధై ర్భావ పుష్టై రుపచారై రదూషితై:।

ప్రత్యఙ్మఖమనా భూత్వా పూజయే ల్లింగ మాంతరమ్॥

సిద్ధాంత శిఖామణి యందలి ఈ శ్లోకములు ప్రాణలింగమునకు చేయునట్టి ఆంతరిక సద్గుణోపచారములను ప్రతిపాదింపబడుచున్నవి. స్తుతి-నిందలు వచ్చినపుడు సుఖదు:ఖములందు మునిగియుండుట క్షేమము. సాధకుడు దీనిని తనలో నలనవరచుకొన్నచో అది ప్రాణ లింగమునకు అభిషేక జలము. నిత్యానిత్యములు, ఆత్మానాత్మలు అను వానిని తెలిసికొను జ్ఞానమే వివేకము. దీనిని అలవరచుకొనుటన్నది ప్రాణలింగమునకు వస్త్ర సమర్పణ. వాస్తవిక సంగతిని హితముగాను, ప్రియము గాను చెప్పుటయే సత్యము. ఇది ప్రాణలింగమునకు అలంకారము. ఇహ పర భోగ విషయము లందలి నిరాశయే వైరాగ్యము. ఇది ప్రాణలింగమున కర్పించెడి పుష్పమాలిక. ధ్యేయ వస్తువు నందు మనసును కేంద్రీకరించుట సమాధి. ఇదియే ప్రాణలింగమునకు అర్పించు గంధము. అభిమాన రాహిత్య రూపమున నిరహంకారమే ప్రాణలింగార్పితమగు అక్షతలు. గురువు యొక్క ప్రవచనము మరియు ఇష్టదేవత మున్నగు శ్రద్ధా వస్తు విషయమైన శ్రద్ధ దీనికి ధూపము. బ్రహ్మాండము యొక్క సమస్త విషయమును ప్రకాశింపజేయు బ్రహ్మచైతన్య జ్ఞానము దీనికి దీపము. జీవి భ్రాంతికి కారణమయిన ప్రపంచము నందలి వస్తు విషయమైన అహము మరియు మమతలు అన్నవి సమర్పించుట లింగమునకు నైవేద్యము. మౌనము ఘంటానాదము. ఇంద్రియ విషయముల త్యాగమే తాంబూలము. విషయాసక్తికి కారణమయిన విషయములందు సుఖమున్నదను బ్రాంతి మొక్క పరిత్యాగము దీనికి ప్రదక్షిణము. ఆంతరిక జ్యోతి స్వరూపమయిన ప్రాణలింగానుసంధాన మందు బుద్ధిని తాదాత్మ్య మొనరించుట దానికి నమస్కారము. ఇటువంటి భావ పదార్థములచే ప్రాణలింగ పూజ సిధ్ధమవుతుంది. ఇటువంటి సకలమయిన ఉత్కృష్టమయిన గుణములను తనలో అలవరించుకొని ఆటి మూలకముగా ప్రాణలింగార్చన చేయునట్టి సాధకుడు ప్రాణలింగి అని పిలువబడును. యోగ జ్ఞానముల సంగమ మయిన అల్లమ ప్రభువుల అనుభవము ప్రాణలింగము యొక్క అనుసంధానమునకు మరొక రూపమునిస్తుంది.

శ్రీశైల జగద్గురు సూర్య సింహాసనాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ1008 జగద్గురు డా||చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాముల వారి షట్ స్థల చింతన పుస్తకమునందు సూచించిన షట్ స్థల ప్రాణలింగ పూజ కు చిత్ర రూపము

ప్రాణలింగమునకు కాయమే శయ్య, ఆకాశ గంగ యందె స్నానము

పూలు లేని పరిమళ భరితమగు పూజ

హృదయ కమలము నందు 'శివశివా' యను నాదము

ఇయ్యదే అద్వైతము చూడుము గుహేశ్వరా॥

శంకరాచార్యులు నిరూపించెడు "ఆత్మాత్వం గిరిజామతి:" యను శివ మానస పూజా విధానము వీరశైవ సాధకుని ప్రాణలింగి అవస్థయందు సక్రమముగా జరుగుచుండెను.

శివదీక్షా సమయమున శ్రీ గురుదేవులు అనుగ్రహించిన ఇష్టలింగ పూజకు మాత్రమే వీరశైవుని సాధన పరిమితమైనది కాదు. ఇష్టలింగము ద్వారా అంతర్లింగములను తెలిసికొని వాటిని అనుసంధాన మొనరించుచు తన నిజ సాధన యొక్క అంతిమ ఘట్టమయిన లింగాంగ సామరస్యమును సాధించుటన్నదే దాని మూలమైన ఉద్ధేశ్యము. ఇటువంటి యుద్ధేశము తోడనే గురువు లింగమును అనుగ్రహించునది. షట్ స్థల జ్ఞానియగు చెన్న బసవణ్ణ గారి సుందర వచనము దీనికి నిదర్శనము.

ప్రాణలింగమునె లక్ష్యముగా చేసికొమ్ము పుత్ర! యని

శ్రీ గురు లింగ మొసగెను ఏకాంతమందు

ఇచ్చినట్టి లింగ నియమము నేమరక

ప్రాణలింగపు పరిచారము చేయు వారెవరును లేరు

అంగము నుండి ప్రాణలింగము దూరమయిన

ఈ లింగమును ముట్టు పూజించు వారందరు భంగపడిరి

జ్ఞానమాత్రమున గొప్పవారందరికి శరణ సంబంధము చాలనందున

ఆకు చాటు పిందెవలె చాటు చేసి గురుతు జూపి

పూర్ణ జగతిని దాటంచెను కూడల సంగయ్య!

శ్రీ గురువులచే శివదీక్షా సమయమున ఇష్టలింగమును పొంది గురూపదేశము మేరకు ప్రాణలింగపు వివేకమును అలవరచుకొని దాని ననుసంధించి నపుడే ఇష్టలింగము యొక్క పూజ సార్థకమగును. ప్రాణలింగము యొక్క జ్ఞానము కలిగిన పిదప ఇష్టలింగ పూజ అవసరం లేదని భావించరాదు. అట్లను కొని ఇష్టలింగ పూజకు మాత్రమే వీరశైవ షట్ స్థల సాధనము పరిమితమయినదని భావించరాదు. ఈ విధంగానె చెన్న బసవన్నగారు పై వచనము నందు "ఇచ్చినట్టి లింగ నియమము నేమరక ప్రాణ లింగపు పరిచారము చేయు వారెవరును లేరు." అని వీరశైవ సాధనయందు నిజమైన సాధకుని కొరతను వ్యక్త మొనరించుచు ప్రాణలింగ సాధకుని బాహ్యాంతరము లయిన రెండు ఆయామములను సూచించుచున్నారు. ఈ స్థల సాధకుడు ఆంతరంగికము గలిగినవాడై ప్రాణలింగానుసంధాన మందు శ్రద్ధ పూనుటతో బాటు ప్రాణలింగ సాక్షాత్కారమునకై సాధనమయిన ఇష్ట లింగమునందును అధిక ప్రేమనుంచుకొనువాడగును. ఆంతరికమగు ప్రాణలింగమును అనుసంధానించుట అన్నది ఈ స్థలము యొక్క ఆంతరిక నియమము. ఇష్టలింగమును తన ప్రాణ సమానముగా ప్రేమించుటన్నది బాహ్యావస్థ. ఈ విషయమున ప్రాణలింగి స్థల స్వరూపమును నిరూపించెడు పారమేశ్వరాగమము నందలి ఒక శ్లోకమును గమనించుట చాలా అవసరము.

యథాప్రాణే తథాలింగే యథా లింగే తథా శివే।

ప్రాణలింగ శివేష్టక బుద్ధిమాన్ ప్రాణలింగిత:॥

తన ప్రాణం వలెనే లింగమును, లింగమువలెనే శివుడిని ప్రేమిస్తు ప్రాణము లింగము శివుడు వీటిలో సమానమగు అనుభూతిని పొందునట్టి సాధకుడే ప్రాణలింగి అని పారమేశ్వర ఆగమము నందలి ఈ వచనము ఈ స్థలసాధకుని లింగ నిష్ఠను వ్య్క్తమొనరించుచున్నది.

సామాన్యముగా గురువు దీక్ష నొసగి లింగమును కరుణించి "ప్రాణ వద్ధారణీయం తత్ ప్రాణలింగ మిదం తవ" నీ చైతన్యమును తనలో మార్గదర్శకముగా నిలుపుకొనినట్టి ప్రాణ రూపమయిన ఇష్టలింగమును నీ ప్రాణ మనియే భావించి ధరించుమని యుపదేశించెను. ఇటు నీ ప్రాణము వలె ధరించు మను మాటకర్థమేమి? ఈ దేహ స్థితికి మిక్కిలి అవసరమగు ప్రాణము లింగము తోడనే తాదాత్మ్యము పొందవలెను. లింగమునందు ప్రాణము, ప్రాణము నందు లింగము ఒక దానిలో నొకటి పరస్పర మొకటి గావలయును. ప్రాణము దేహమును వదలినంతనే మానవ మరణము నిశ్చయము. ఇదే రీతిగ దేహమున ధరించిన లింగము దేహము నుండి వైదొలగిన దేహము పడిపోవలయును. (చావ వలెను) అనియే సిద్ధాంత శిఖామణియును

యది ప్రమాదాత్ పతితే లింగే దేహా న్మహీ తలే।

విముంచ సహసా ప్రాణన్ ప్రాప్తమే మోక్ష సంపదా॥

ప్రమాద వశముగా గాని, అకస్మాత్తుగా గాని దేహము నుండి లింగము దూరమయినచో తక్షణమే ప్రాణమును త్యజించి మోక్షమును పొందవలెనని నిరూపించినది. దీనిని కూడల సంగముని వచన మేమన్నదో వినుడు.

ప్రాణలింగము గ్రహించిన వాడైన పిదప

లింగరహితుడై నడుచు రీతిగనో

లింగ విరహితుడై పలుకు రీతిగనో

పంచేంద్రియ సుఖమును లింగ విరహితుడై భుజించుటకు కాదు

లింగ విరహితుడై ఎంగిలి మింగను కాదు

అను నదియే కూడల సంగని వచనము

ప్రాణలింగి స్థలావస్థకు వచ్చినపుడు సాధకునకీ స్థితి కలుగుతుంది.

దేహము నుండి లింగ వియోగము గలిగినపుడు సాధకుడు చావ వలయునను ఉపదేశము నందలి పూర్వవృత్తాంతమును ఇటు గమనింప వలసియున్నది. సామాన్యముగా మన ప్రాణము మన దేహమునందు మాత్రమే యుండుట లేదు. మనము అత్యంత గాఢముగా ప్రేమించు వస్తువులందునూ భావనాత్మకముగా ప్రాణము యొక్క చేతులు చాచికొనియే ఉంటాయి. ధనమందు అధిక ప్రేమ గలిగిన మానవుడు తన ఇంటిలో దాచిన ధన మంతయును దొంగ దోచుకొని పోయెనను విషయము వెలసిన వెంటనే అతని ప్రాణపక్షి ఎగిరిపోవును (చచ్చును). ఇదే విధంగా పత్నిని అతి ప్రేమతో చూచువాడు సతీ వియోగముతోడను, పుత్రవ్యామోహితుడగు తండ్రి పుత్ర వియోగము తోడను తమ ప్రాణములను పొగొట్టుకొనిన అనేక సంఘటనలు ప్రపంచమునందు మనము చూచుచున్నాము. ఇటువంటి సంఘటనలు మన ప్రాణము మన దేహమునందు మాత్రమే నిలిచియుండక మనము హృదయముతో ప్రేమించెడు వస్తువులందునూ భావనాత్మకముగా వ్యాపించియుండునను దానికి నిదర్శనముగా నిలుచుచున్నవి. లేకపోయినచో సమీపమందుండిన వస్తువులు, వ్యక్తులు వారి నుండి దూరమయినంత మాత్రమున వాడేల మరణమొందవలెను.

ధరించిన ఇష్టలింగము దేహము నుండి వియోగ మొంది నపుడు ప్రాణము పోవలయునను ఉపదేశము యొక్క భావమేమనగా మనమూ లింగము నంత ప్రగాఢంగా ప్రేమిచవలయు ననుటమే అయ్యి యున్నది. లింగ నిష్ట ప్రగాఢంగా ఉండినట్లయిన లింగము దూరముగా వైదొలగినంతనే ప్రాణము తనంత తానే పోవును. దానిని వదలి అరఘడియయేని ఉండరాదను గాఢమగు అభిప్రాయముతో ప్రేమిచవలయునను ఉద్దేశమున వీరశైవ దర్శనము నందు లింగ విషయమై ఇటువంటి మాటలుపదేశింపబడుచున్నవి. దీనిని తెలియని కొందరు లింగము వైదొలగిన క్షణము నందే బలవంతముగా ప్రాణమును పోగొట్టుకొనుచున్నారు. ఇది చెల్లని మాట. భారతదేశము నందు వెనుకటి కాలమున ప్రచారమందుండిన విషయ మేమన పతి మరణింపగా సతి యాతని వెంట కాటికి వెడలెడి పద్ధతి యుండినది. పతిని అత్యంత నిష్టతో ప్రేమించ వలయునను ఉద్ధేశము తోడనే ఈ పద్ధతి యుండి యుండవచ్చును. క్రమేపి అది అనివారాచరణగా రూపొంది యుండవచ్చును. అదివేరుమాట. ప్రస్తుత సందర్భమున కేవలము లింగమును ధరించుటయే చాలదు. దానిని ఇష్టపూర్వకముగా నారాధించవలయును. ప్రాణముకంటే మిన్నగా నెంచి పూజించవలెను.

ప్రాణముకన్న మిన్నగా లింగమును ప్రేమించవలయుననుట సరియె. అయితే అకస్మాత్తుగా అనుకోకుండగా శరీరము నుండి లింగము పోగొట్టుకొని పోయినపుడు తక్షణమె ప్రాణము పోనపుడు ఏమి చేయవలెను? బలవంతముగా ప్రాణములు తీసుకొనవలయునా? లేక లింగమును వదిలియే జీవించవలయునా? అనెడు సందేహములు ఇటు సహజముగా కలుగును. లింగ వియోగము జరిగినపుడు ప్రాణము పోనిచో దీక్ష నొసగిన గురువు చెంతకు పోయి తన పరిస్థితిని తెలిపి గురువు చెప్పిన చొప్పున ప్రాయశ్చిత్తము చేసికొని గురువుచే మరొక లింగమును స్వీకరించి, యా లింగమునందే పోయిన లింగమును భావించి, అంగము నందు ధరించి ఆరాధించ వలయును. లింగమును పోగొట్టుకొనిన శిష్యుడు చెంతకు వచ్చినపుడు గురువయినను శిష్యునకు ప్రాయశ్చిత్తమును తెలిపి మరియొక లింగమును అనుగ్రహించవలయును. దానికి మారుగా 'లింగమును పోగొట్టు కొంటివి. ప్రాణమును విడువ వలసియేయుండుననుటచే ఒక్కొక్కసారి జరగరాని మహాఘోరములే జరుగుచుండును.

సాధకుడొకడు నదీ స్నానమునకు పోయిన సందర్భమున అంగమదలి లింగ మగలి నీటిలో మునిగిపోయినది. ఎంత వెదికిననూ దొరకలేదు. గురువుల చెంతకు వచ్చి అత్యంత దు:ఖముతో తన యవస్థను విన్నపించి 'లింగము పోయినది. ఇకపై నేనేమి చేయవలె ' నని ప్రశ్నించెను. గురువు కోపించినట్లు నటించి ముర్ఖా! దీక్ష నొసగునపుడే దీనిని శ్రద్ధగా నుంచు కొనవలయును, ఎక్కడను పోగుట్టుకొనరాదు. ఒకవేళ పోగొట్టు కొన్నచో ప్రాణత్యాగము చేయవలసి వచ్చును అని అదేశించి యుంటివి కదా! అయినను నీవు జాగ్రత్తగా కాపాడు కొనక పోగొట్టుకొని యుంటివి. అందుచే నీవిపుడు ప్రాణ త్యాగమునకు సిద్ధము కమ్ము" అని పలికిరి. ప్రాణము వదలవలసి వచ్చినది గదా! యని ఖిన్నుడైన శిష్యుడు "గురువుగారు! నాకు ప్రాణత్యాగము చేయు కోర్కెలేదు. ప్రాయశ్చితమేదేని తెలిపి నన్ను కాపాడండి." అని ప్రార్థించెను. గురువును "జాగ్రత్తతో ధరించవలసిన లింగమును పోగొట్టు కొనుట ఒక ప్రక్క, బ్రతుక వలయునను ఆశ మరియొక ప్రక్క నీకు జీవించి యుండెడి అధికారము లేదు. చావే నీకు తగిన ప్రాయశ్చిత్తము" అని పలికిరి. "గురువుగారూ! వేరే ఉపాయము లేదన్న మీదట నేను మరణించుట ఖాయము. చచుటకు ముందుగ నాదొక ప్రార్థన మరియు కోరిక. తమ వైభవ పూర్ణమగు లింగపూజను కనులార గాంచి తదుపరి నేనగ్ని ప్రవేశ మొనర్చి ప్రాణత్యాగ మొనర్తును. అందులకై తమ లింగపూజను వీక్షించుటకై దయచేసి అవకాశము కల్పించుడు". అని వేడుకొనెను. అపురూపమయిన అంతిమ కోరికను విన్న గురువు ఆశ్చర్యమొంది "నీ యీ కోరికను విన్న నాకు గర్వమనిపిస్తున్నది. రేపు ఊరు బయట తూర్పుదిశ యందుండిన విశాలమగు బావి సమీపము నందు మేము శివపూజ చేసుకొందుము. నీవొక ప్రక్క అగ్ని కుండము నేర్పరచుకొని మా పూజను కనులార చూచి పిదప అగ్ని ప్రవేశము చేయుదువు గాక!" అని పలికిరి. మరు దినము ఊర బయట బావి సమీపమున అగ్ని కుండము నేర్పరచుకొని వచ్చి గురువు ఎదుట కూర్చొనెను. గురువులును శివపూజ యందు నిరతులయిరి. ధ్యాన జపాభిషేకము లన్నియును సుందరతరముగా సాగినవి. మంగళారతియైన పిదప గురువులొక క్షణము లింగ నిరీక్షణయందుండ సాగిరి. వెంటనే శిష్యుడు లేచి లింగము నుంచుకొనిన గురువుల చేతిని క్రింద ఫట్ మని కొట్టెను. గురువు గారి చేతియందుండిన లింగము ఎగిరి బావిలో పడెను. గాబర చెందిన గురువులు "ఇదేమి ఇటువంటి ఘాతుకము చేసితివి శిష్యా! ఇక మా గతేమి? అని పలికిరి. శిష్యుడు ముకుళిత హస్తుడై "అగ్నికుండము తయారుగా నున్నది. ఇరువురము దానిలో ప్రవేశింతము రండి" అనెను. నా యుపదేశము నాకే (తిరుగు) ఎదురు బాణమయ్యెను గదా! యనుకొనిన గురువుగారు జోలెలో నున్న లింగమును వెలికి తీసి "శిష్యా దీనినెవరి యెదుట చెప్పబోకు. తీసికొను మీ లింగమ" నిరట. అపుడా శిష్యుడీ రీతిగ చెప్పి నవ్వెనట.

"శివాగమము లందును (కారణాగమము నందు) లింగము దేహము నుండి వియోగ మంది నపుడు గురువుల చెంత కరుదెంచి వారు అనగా గురువుగారు తెలిపిన ప్రాయశ్చిత్తము నాచరించి వారినుండి లింగమును పొందవలెను. గురువు లయినను పోగొట్టు కొనిపోయిన లింగమందలి ప్రాణకళను మరొక లింగము నందు ఆహ్వానించి, ప్రతిష్ఠాపించి దానిని శిష్యున కొసగి ఆ లింగమే ఈ లింగము దీనిని జాగరూకుడవై ధరించుము. వెనుకటి వలె అజాగ్రత్త వలదని ఉపదేశించి వలయునని ప్రతిపాదింపబడినది.

సాధకుడు ప్రాణలింగి స్థలావస్థకు వచ్చినపుడు లింగము పోయినచో నాతని ప్రాణమే పోవును. అంతటి లింగనిష్ఠ అతనిలో ధృఢముగా నిలిచియుండును. ఇది ప్రాణలింగి యొక్క వైశిష్ఠ్యము.

ప్రాణలింగి స్థల సాధకుడు అనుభవ భక్తిని తనలో నలవరించుకొని యుండును. ప్రసాది స్థల సాధకుని యందలి అవధాన భక్తిని పరిపూర్ణ మొనరించు కొన్నపుడాతనిలో శివస్వరూపానుభవము కలుగుతుంది. ఈ యనుభవము తోడనే ప్రసాదియును ప్రాణలింగి యగును. అంతియే గాక శివస్వరూపము యొక్క అనుభవమును బలపరచుకొనుటకు నిత్యం యత్నించు చుండును. ఇక్కడ దేహో హమ్ (నేను దేహినను) భావము తొలగిపోయి క్రమేపి శివో హమ్ (నేను శివుడిగా నుంటిని) యను భావము తోడి జ్ఞానము పుట్టుకొస్తుంది. ఇటువంటి జ్ఞానమే సాధకుడిని మరింత ఆంతరిక సాధన ప్రక్కకు గొనిపోయి అతడి అనుభవ రూపమును ధరించును. ఈ స్థలము కంటెను వెనుక తెలుపబడిన మూడు స్థలములందు సాధకుని శ్రమ అధికమై యుండి ఫల మగోచరమై యుంటుంది. షట్ స్థల సిద్ధి శిఖరాగ్రము చేరిన శివయోగులు ఈ స్థల సాధకునందు అనుభవ భక్తిని చెప్పియున్నారు. అనుభవ మనగా నేమి? అనుభవ మంటపము యొక్క అనాది నిరంజనుడగు అల్లమ ప్రభువుల శోభయందలి అనుభవము గురించి ఇట్లు చెప్పబడినది.

అనుభవ మనుభవమను అన్నలు మీరు వినుడీ!

అనుభవ మన్న దొక వృషభము చెడియుండె

వృషభము జానెడు, కొమ్ములు మూరెడు

చెడినదెనిమిది దినాలు చూచి పదునారుదినాలు

నిన్న నాటిన మొలక మొన్న మేయుట కంటి

గుహేశ్వరనెడు వృషభము మీలోనె యున్నది తెలిసికో!

ఇటు అల్లమ ప్రభువులు అనుభవము మనగా వృషభ మనిరి. నేనను భావమే అల్లమ ప్రభువులు తెలిపిన వృషభము. దేహభావముతో వచ్చిన 'నేను ' అహంకార మవుతుంది. శివ భావముతో వచ్చినచో అది అధ్యాత్మిక అనుభవ మవుతుంది.దీనినే ఈ శోభ విస్తరింప జేయుచున్నది. అనుభవమను ఎద్దుచెడినదంగా దేహము నేనను భావము చెడినది. ఈ యెద్దు ఎటులున్నదనగా ఎద్దు జానెడు, కొమ్ములు మూరెడు అనగా నేనన్నది జానెడుండిన దీని నాశ్రయించు కొని పెరిగి నిలిచిన నాయదియను మమకారము మూరెడు. నాదను భావము ఆ ఎద్దు యొక్క కొమ్ములు. చెడినదెనిమిది దినాలు అనగా నేనను ఎద్దు చుట్టు వ్యాపించి యుండినవి అష్టమదములు. అవి నశించవలెను. చూచి పదునారు దినాలు అనగా సూక్ష్మ శరీరావయములు. అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు ప్రాణములు మరియు మనసు ఇవన్నియును కలిసి మొత్తము పదునారు సూక్ష్మ శరీరావయవములు.

వీటిని చూచి అనగా చక్కగా వివరించి చూడుడని యర్థము. నిన్న త్రొక్కిన నాట్యము మొన్న మేయుట కంటి. ఈ దేహము పుట్టుటకు ముందే అనగా పూర్వ జన్మము నందే అహం యను ఎద్దు విషయమును అనగా భోగాసక్తముగా దాని పూర్వపు వాసనను తనలో నిలుపుకొని యున్నదని యర్థము. వస్తుత: నేనన్నది దేహము గాదు. అది అమరమగు ఆత్మ. గుహేశ్వర లింగము. అది ప్రతి యొక్కరి అంతరంగ గుహమందలి (ప్రభుత) ఈశ్వరత్వము. అందరిలోను అన్నిటిలోను అన్నివేళలందును. వ్యాపించి యుండుట అన్నదానిని తెలుసుకొన వలయునంతే. అపుడు నేనను దేహము, మనసు, ఇంద్రియముల కతీతమైన ఆత్మలయనునది అనుభవ వేద్య మగును. దాని కల్లమ ప్రభువులు వెలిగెడి శోభకు చివర 'గుహేశ్వరుడను వృషభం మీలోనే యున్నది తెలుసుకో!' అని నిర్ణయించిరి. ఆత్మ నేనను జ్ఞానము అంతరంగము యొక్క లోతునకు చేరి మనసునందు చక్కగా తెలియ నారంభించి నపుడు దానిని పిలిచెడు పేరు అనుభవము. దీనిని తనలో నలవరంచుకొనువాడు అనుభవి. ఈతడి మాట అనుభావము. మనసునకు తోచిన దంతయును మాటల ద్వారా వెలువరించునది అనుభవము కాదు. చెన్న బసవన్న గారి అనుభవ పలుదు నందలి అనుభావమును గురించి ఇట్లు ప్రకటిస్తుంది.

అనుభావ అనుభావ మందురు

అనుభావమన్నది భూమిపైని రహస్య స్థానము చూడుడీ

అనుభావమన్నది అంతరంగ శుద్ధి చూడుడీ

అనుభావమనాది రచ్చజేసెడు మాటయా?

అనుభావ మన్నది సంత విషయమా?

అనుబావ మన్నది వీధి పసరమా?

ఏమని చెప్పెడు మహాఘనమును?

ఏనుగు కొలమానమున లోగునా దర్పణమునందున కాక?

చూచినచోటెల్ల గోష్ఠి నిలిచిన చోటెల్ల అనుభవము

వచ్చిన చోటెల్ల ప్రసంగ మొనర్చు నిర్బుద్ధి నీచుల

మెచ్చడు కూడల చెన్నసంగమ దేవా!

ఈ ప్రపంచము నందు అనుభవ పరులనంతయు నాలుకతో ఒక పదార్థమును సృశించి దాని రుచి చూచినపుడు అది రసానుభవము. సుందర దృశ్యమొక దానిని కనులతో వీక్ష్మిచి తనలో దాని నారోపించుకొన్నపుదు అది రూపానుభవము. సుగంధమును నాసికతో వాసన చూచినపుడది గంధానుభవము. శ్రావ్య గానమును వీనుల సొంపుగా విని మనమున తన్మయమొందినపుడది శబ్దానుభవము. ఆహ్లాదకరమగు మృదు వస్తువును తాకి దాని మృదుత్వమును తెలుసుకొన్నపుడు అది స్పర్శానుభవము. దీనివలెనే శివుడిని తనలో తెలిసికొని అతడిలో లీనమొందిన వాడై అంతట నాతనినే చూచు దృష్టిని పెంచుకొనిన అది శివానుభవమి. శబ్ద-స్పర్శ-రూప-రస-గంధము ఏనుభవించుటకు మనలో ఒక్కొక్క సాధనము కలదు. అవి చెవి-చర్మము-కన్ను-నాలుక-నాసిక యనునవి. అయితే శివుడిని అనుభవము నందు తెచ్చుకొనుటకు మనలో నెటువంటి సాధనమును లేదు. పంచేంద్రియము లందు యే ఇంద్రియమును శివుడిని తెలుసుకొనుటకు సహాయపడవు. ఏలన ఇంద్రియములు బయటనున్నవి మాత్రమే తెలిసికొనుటకు సమర్థమైనవి. అయితే శివచైతన్యము మనలో నిండికొని యున్నది. అదే విషయమును ఉపనిషత్తు 'పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభు: తస్మాత్ పశ్యతి నాంతరాత్మన్ ' అని చెప్పుట ద్వారా వెలుపలి వలయమును మాత్రమే తెలిసికొనదగిన ఇంద్రియములు అంతరాత్మను తాకుటకు సాధ్యము కాదని ప్రతిపాదించుచున్నది. దీని యర్థము శివుడు వెలుపలున్నాడని కాదు. వెలుపల లోపల అంతటను నిండియున్నాడు. అయితే అతడు ఇంద్రియములకు అగోచరుడు. ఏలననగా 'సౌక్ష్మాత్ తదనుపలబ్ది: నా భావాత్ ' అను సాంఖ్యకారికయిన ఉక్తివలె శివుడు సూక్ష్మముగా నుండుటచేత అతడు ఇంద్రియములకు లభ్యము కాడు. సకలేంద్రియములు గుణములుండిన వస్తువులను మాత్రమే తెలియగలవు. గుణరహితమయిన నిర్గుణ వస్తువులను గుర్తించజాలవు. శివ చైతన్యమన్నది ఆకారము మరియు గుణమన్నవి లేనందున దానిని తెలుసికొనుటకు ఇంద్రియములు అసమర్థమై యుండును. అటులే ఉపనిషత్తు 'యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ' అనియు, నిజగుణులు 'మాట మనసులచే నట నట జ్యోతి వెలుగుచున్నది.' అనియు ప్రతిపాదించియున్నారు. కారణమేమన శివానుభవము కేవలము ఇంద్రియాను భవము కాదు. చిత్తానుభవమును కాదు. ఇది ఆత్మానుభవము. ఇంద్రియానుభవములు బాహ్యము మరియు స్థూలములు. అయితే శివానుభవము ఆంతరికము మరియు సూక్ష్మమైనది. ప్రాణలింగి స్థల సాధకుడు ఇటువంటి శివానుభవమును తనలో అలవరించుకొనితన సాధనను ముందునకు కొనసాగించును. అందుచేత ఈ స్థలము యొక్క సాధకుని యందుండిన భక్తికి అనుభవమని పేరు.

ఇంద్రియముల నుండి పుట్టిన అనుభవము బాహ్యము. ఆత్మానుభవము ఆంతరికము. ఆత్మానుభవము అధికమైనట్లు బాహ్యానుభావములు చంచలమగు మనోకాంక్ష తక్కువయి నిర్లిప్త మనోభావమలవడుతుంది. అందుకొరకే ప్రాణలింగి స్థల సాధకుడినందు బాహ్య విషయాసక్తి కరుగుచు, ఆత్మాసక్తి అధికమవుతుంది. శరణుల వచనము దీనిని సూచించుచున్నది.

పరమారూఢుని ప్రాణమును నిర్వాణమందుండి నాతడె తెలియును

ప్రాణలింగియైనతని స్థితి యెంతుండు నంటె

ఘృత మంటని నాలుక వోలె కాటుక అంటని కన్నువోలె

దుమ్మురేగని గాలివోలె నీరంటని పద్మము వోలె

ఉష్ణము తాకని అగ్నివోలె నుండు కూడల చెన్న సంగా మీ శరణుడు.

చెన్న బసవన్న గారు ఇక్కడ ప్రాణమే లింగమయిన స్థల సాధకుని నిర్లేప జీవితమును కొన్ని ఉపమానముల ద్వారా అత్యంత అర్థవంతముగ ప్రతిపాదించి యున్నారు.

ఈ స్థల సాధకుడు జంగమ లింగమును అనుసంధాన మొనరించును. మొదట తెలిపిన ప్రాణలింగమే జంగమ లింగమను పేరుతో పిలువబడుచున్నది. 'గచ్ఛతీతి జంగమ ' యను వ్యుత్పత్తి ప్రకారము నిరంతర సంచారియై యుండుటమే జంగముని పని. యోగ సాధనతో ప్రకాశించెడు విశుద్ధ చక్రమందుండిన జ్యోతిలో సంక్షిప్తమయియుండిన ప్రాణము నిత్యగతిని పొందుట చేత దీనికి జంగమ లింగమని మరొక పేరున్నది. లోపల ఈ లింగము నందు శంతికళ రూపొందియుండి దీనిని అనుసంధానించు సాధకునకు శాంతిని సమకూర్చుతుంది. మొత్తము మీద సధనా దర్పణమయిన ఇష్ట లింగమును తన ప్రాణమని తెలిసి ఆంతరిక మయిన ప్రాణ లింగమును అనుభవ భక్తి ద్వారా అనుసంధానింప జేసి ఆత్మశాంతిని సాధించెడు, సాధకుడు ప్రాణలింగి.