పారమేశ్వరాగమము ఆత్మార్థపూజా ప్రధానమయిన వీరశైవ ధర్మానికి చెందిన ఆగమము. శైవాగమాలలో వీరశైవమత భేదాలను, ధర్మాలను, లక్షణాలను, ఆరాధనా విధానాలను తెలియజేసే ఆగమాలలో చంద్రజ్ఞానాగమము, మకుటాగమము, కారణాగమము, సూక్ష్మాగమము, వీరాగమము, వాతులాగమము, పారమేశ్వరాగమము ముఖ్యమైనవి. వీటిలో ఇరువదిమూడు పటలాలతో రెండువేలకు పైబడినశ్లోకాలతో ఉన్న పారమేశ్వరాగమము బృహద్ గ్రంథముు. ఇది మూలాగమాలలో ఇరవయ్యారవది.

ఈశానముఖమునుండి వెలువడినదిగా చెప్పబడుతున్న వాటిలో ఆరవది. ఈ ఆగమానికి ఏడు ఉపాగమాలు అనుసంధింపబడినవి. ఈ ఏడు ఉపాగమాలలో ఒక ఉపాగమము పేరు కూడా పారమేశ్వరాగమమే. అంటే పారమేశ్వరాగమము పేర ఒక మూలాగమము ఒక ఉపాగమము ఉన్నాయి. ఇదిమూలాగమమా? ఉపాగమమా? అన్న సందేహానికి, మూలగ్రంథాన్ని పరిష్కరించిన పండిత వ్రజవల్లభ ద్వివేది గారు - వీరశైవమతము ఆగమాలలోని ఉత్తరభాగాలలో ప్రతిపాదించబడినదన్న 'సిద్ధాంతశిఖామణి ' వాక్యాన్ని ఆధారంగా స్వీకరించి ఈ పారమేశ్వరాగమము మూలాగమము యొక్క ఉత్తరభాగమయి ఉంటుందని అభిప్రాయాన్ని అభివ్యక్తం చేశారు.

పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రశ్నసమాధానాల రూపంలో సాగే పారమేశ్వరాగమము వీరశైవ మతధర్మాలను, మతభేదాలను, దీక్షావిధానాలను ఆవాంతర శాఖాలను, వాటి లక్షణాలను, వీరశైవుల ఆచారవ్యవహారాలను ఇరువది మూడు పటలాలలో వివరిస్తున్నది.

మొదటి పటలము మంగళాచరణముతో ఆరంభమై, సౌగత - వైదిక - సౌర - వైష్ణవమతములను, వాటి అవాంతరభేదాలను, ఏడు విధములైన శైవమతములను, వీరశైవ, వైష్ణవ, శాక్త, సౌర, వినాయక, కాపలదర్శనములను, వీరశైవమత వైశిష్ట్యమును, భస్మరుద్రాక్షలింగధారణమహాత్మ్యమును, వీరశైవ పద నిర్వచనమును, లింగపూజావిధానమును, శివయోగి మహిమను సూక్ష్మంగా పరిచయం చేస్తేతరువాతి పటలాలు ఈ విషయాలనే మరింత విస్తృతంగా వివరిస్తాయి.

రెండవ పటలమున లింగలక్షణము, లింగభేదములు, ఇష్టలింగార్చకుల శ్రేష్టత్వము, సజ్జికాశివసూత్రముల లక్షణములు, వాటి కలయికల పరమార్థము, దీక్షకై గురువు నాశ్రయించుట, గురువు మరియు శిష్యునిలక్షణములు, శిష్యుని ధర్మములు, దీక్షాక్రమము, లింగధారి నియమాలు వివరించబడినాయి.

మూడవ పటలము దీక్షావిధానమున మండపనిర్మాణము, యజమాని విధులు, దీక్షాక్రమము, ఇష్టలింగార్చనావిధానము, పూజోపయోగకుసుమాలు, దీక్షితుని కర్తవ్యము, కరడిక శివసూత్రముల సంస్కారము, ఘంటానాదమహిమ, శివయోగి నియమములు, లింగ - విభూతి - రుద్రాక్షధారణమహిమలను వర్ణిస్తుంది.

నాలుగవ పటలములో వీరశైవదీక్షాంగముగా హోమవిధానము, స్తండిల, కుండ భేదములు, అగ్నికి అష్ట సంస్కారములు, అగ్ని స్థాపనము, రుద్ర ధ్యానము, అగ్నికి జాతకర్మాది సంస్కారములు, అగ్నియొక్క సప్తజిహ్వలు, మేఖలాపూజ, అగ్నిప్రార్థన, పరిధిస్థానము, యజ్ఞపాత్రస్థాపనము, హోమవిధానము వివరించబడినాయి.

అయిదవ పటలము కరడిక - శివసూత్ర - లింగముల సమ్యోగవిధానము, లింగస్తుది, లింగాభిషేకము, విభూతి - రుద్రాక్షధారణము, గురుపూజ, మంత్రోపదేశము, కోరికలనుబట్టి శరీరముపై లింగమును ధరించవలసిన ప్రదేశము, దీక్షితుడైన శిష్యునికి నిత్యలింగపూజావిధి, జాతివర్ణాశ్రమాది నిషేధము, లింగపూజా మహాత్మ్యము, లింగధారుల నడుమ ఉండవలసిన గౌరవాదరములు, దీక్షితుని ప్రత్యేక నియమములు, అతిథిసత్కారములు, జంగమార్చన, శివయోగుల నియమములు, వీరశైవమతశ్రేష్ఠతాదివిషయాలను కలిగియున్నది.

ఆరవపటలమున స్థలముల నామకరణము, భక్తస్థల లక్షణము, మహేశ్వర స్థల లక్షణము, ప్రాసాదిస్థల లక్షణము, ప్రాణలింగస్థల లక్షణము, శరణస్థల లక్ష్నము, ఐక్యస్థల లక్షణము, మహేశ్వరుని షఢంగములు ఉపాంగషట్కములు, భక్తిలక్షణము, కర్మలక్షణము, బుద్దిలక్షణము, విచారలక్షణము, దర్పసంక్షయ లక్షణము, సమ్యగ్ జ్ఞానలక్షణము, అంగ-ఉపాంగముల సంబంధము, షడూర్ములు, అరిషడ్వర్గములు, సాధనాతారతమ్యము, శివస్తుతి, ఫలశ్రుతులు వివరించబడినవి.

ఏడవపటలమున అనాదిశైవ -ఆదిశైవ -అనుశైవ - మహాశైవ - యోగశైవ -జ్ఞానశైవముల లక్షణములు, జ్ఞానకర్మ సముచ్ఛయము, మతభేదముల సాదృశ్యవైదృశ్యములు, వీరశైవుని నియమములు, అష్టావరణములు, లింగధారులు పాటించవలసిన నియమములు, పుష్పసేకరణ, పూజాక్రమము, వీరశైవుని లక్షణము, వీరశైవమతశ్రేష్టత్వము వర్ణించబడినవి.

ఎనిమిదవ పటలమున వీర శబ్దనిర్వచనము, వీరశైవవ్రతము, భస్మధారణము, పంచాక్షరీజపము, శివస్తుతి, శివపూజ, శివపూజాసమయము, జంగముని భిక్షాటనప్రకారము వివరించబడినవి.

తొమ్మిదవ పటలము వీరశైవమతానుయాయులకు లభించు మోక్షస్వరూపము, తత్సాధనకై వారనుసరించవలసిన ఆచారవ్యవహారములు, వీరశైవుడు కాని సన్న్యాసికి, జంగమునికి గల సామ్యవైషమ్యాలు, జంగముని నియమనిష్ఠలు, వీరశైవమతమహాత్మ్యము, అవాంతరశైవమతములలో అనుసరించవలసిన సోపానక్రమమును తెలియజేయును.

పదియవ పటలమున అనాదిశైవము నుండి వరుసగా నాలుగు మతములందు వివరించబడిన విధిస్వరూపము, యోగశైవబేధము, యోగాసన నిరూపణము, ధ్యాన పద్ధతి, శివధ్యానము, ధ్యానఫలము, యోగముయొక్క ఎనిమిది అంగములు, వీరశాఇవుని షడంగములు, దయామహాత్మ్యము, పంచాక్షర జపమహాత్మ్యము వివరించబడినవి.

పదకొండవ పటలము పంచాక్షర - షడక్షర మంత్రమహాత్మ్యమును, ప్రణవవైశిష్ట్యమును, పంచాక్షరీవిద్యకు సంబంధించిన వర్ణ - బీజ - ఋషి - చందో - దేవతాదులను, శివపంచాక్షరికి చెందిన షడంగములను, మంత్రవర్ణన్యాసమును, ధ్యాన - జప - హోమ విధానమును, మంత్రప్రాప్తికి గురూపసదనమును, షడధ్వశుద్ధిని, పునశ్చరణ విధానమును, త్రివిధ జపమును, జపానుష్ఠానమును, జపోపకరణములను, మంత్రజపసంఖ్యను బట్టి కలుగు ఫల భేదములను సవిస్తరముగా వర్ణించుచున్నది.

పండ్రెండవ పటలమున జ్ఞానయోగముల పరస్పరాపేక్ష, భజనరీతులు, శివధర్మపాలనమునకషికారులు, వారి లక్షణములు, భక్తిలోని భేదములు, వాటి లక్షణములు. శివయోగుల సేవామహిమ, శివధర్మమునందలి నాలుగు మార్గములు, పతి-పశు-పాశముల తత్త్వనిరూపణము, పాశనాశనమునకు సాధనము వీరశైవ దీక్ష, శివపారమ్యము, జీవులందలి తారతమ్య భావన, నామస్మరణ మహిమ, శ్రద్ధవలననే భక్తి, భక్తులయినవారికి మాత్రమే వీరశైవమున అధికారము, వీరశైవుల విశేష సదాచారములు వివరించబడినవి.

పదమూడవ పటలమున శివపూజకుపయోగించు పాణిపీఠము యొక్క వైశిష్ట్యము, పాణిపీఠస్వరూపము, దిక్ దేవతాకల్పన, కరపంకజ పూజాక్రమము, పూజానియమము, అభిషేక క్రమము, అభిషేకమున కుపయోగించు పాత్రలు, జలము, అభిషేకానంతర పూజాక్రమము, పూజానియమములు, పూజాఫలము, కరపీఠవైశిష్ట్యము, కరపీఠమునందుచేయు అర్చనా మహాత్మ్యము, పూజా సమయమునందు నిషేధించిన కార్యములు పేర్కొనబడినవి.

పదునాల్గవ పటలము సఖండ - అఖండ లింగభేదములను, ఇష్టలింగ ప్రమాణములను, లింగనాశనమయినచో ప్రాయశ్చిత్త విధులను, దీక్షావిధానమున ఉపయోగించు పాత్రల లక్షణములను, తీర్థావాహనములను, ఇష్టలింగపూజ కనువైన దిక్కులను, గురు-దేవతల ఐక్యభావనను, సద్గురు స్మరణను, సద్గురు మహాత్మ్యమును వివరించుచున్నది.

పదునైదవ పటలమున వీరశైవమతవైశిష్ట్యము, సామాన్య - విశేష - నిరాభారమను మూడువిధముల వీరశైవము, వాటి లక్షణములు, ఇష్టలింగ నాశనమున నిరాభార వీరశైవుని కర్తవ్యము, అతడు పాటించవలసిన నియమములు వివరించబడియున్నవి.

పదునారవ పటలమున ఆరువిధములయిన లింగలక్షణములు, లింగప్రమాణములు, జగత్తు - లింగ - దేహముల ఐక్యభావన, నిరాభారి వీరశైవుడు పాలించవలసిన నియమములు, లింగనాశనమున ప్రాణమున త్యజించుట, ఇతరులకు నమస్కరించకుండుట, నిరాభారికి చేయు శుశ్రూషాఫలము, తుర్యవీరశైవవ్రతము యొక్క శ్రేష్ఠత్వము వివరించబడినవి.

పదునేడవ పటలమున జాతికర్మలననుసరించి వీరశైవమును శుద్ధ - మిశ్ర - మార్గ - వీర భేదములుగా వర్గీకరించుట, వాటి లక్షణములు, శైవతత్త్వములు, విరక్తశైవుల పది ప్రత్యేకగుణములు, శైవుల దినచర్య, భస్మనిర్మాణప్రకారము, భస్మ రుద్రాక్షధారణవిధము, భస్మ మహిమ, కరమున ఇష్టలింగపూజాక్రమము, విరక్తుల భిక్షాటన విధానము, వీరమాహేశ్వరులాచరించవలసిన పంచయజ్ఞములు, వారికి నిర్దేశించిన ఎనిమిది లక్షణములు పేర్కొనబడినవి.

పదునెనిమిదవ పటలము నిర్యాణయాగపటలమనబడినది. ఇందు ప్రాణోత్క్రమణమునకు ముందు, ఆ తరువాత శిష్యుడు గాని, పుత్రుడుగాని, చేయవలసిన విధులు, లింగదేహమును తరలించుటకు విమాననిర్మాణము, వూరేగింపుతో స్మశానమును చేర్చుట, గర్తనిర్మాణము, గర్తము యొక్క ప్రమాణము,అందు లింగిదేహమునుంచి గర్తమును పూడ్చుట, దానిపై సమాధిని నిర్మించి శివాలయమును స్థాపించి పూజాదికములు నిర్వహించుట, నైవేద్యాదుల వితరణ, లింగముద్రాంకితమయిన వృషభమును వదలిపెట్టుట, నిర్యాణయాగవిధులు, ఆరామాదుల నిర్మాణము, నిర్యాణయాగఫలము, కార్తీక మాసమున చేయవలసిన ప్రత్యేక విధులు చెప్పబడియున్నవి.

పంతొమ్మిదప పటలము గురుశిష్య సంప్రదాయ పరంపరను, లింగధారులయిన శిష్యులకు లభించు ఫలభేదములను, గురువుయొక్క వేదికపై శిష్యుడు చేయవలసిన మంటపాది నిర్మాణములను, ఇష్టాపూర్త విధానములను జాతిభేదరాహిత్యమును, పుణ్యకాలములందు ప్రధానముగా లింగైక్యాది దినములందాచరించవలసిన ధర్మకార్యములను, భక్తి సాధన శ్రేష్ఠత్వమును, సమాధి క్షేత్రములందు చేయు పూజాదానాదుల మహాత్మ్యమును, అంతరాయములు కలిగించువారి అద:పతనమును అశక్తులు, విధవలయినవారు ఆచరించవలసిన విధులను తెలియజేయుచున్నది.

ఇరువదవ పటలమున అయోగ్యులకు శివదీక్షానిషేధము, దీక్షకధికారులయిన వారి లక్షణములు, వీరశైవమత ప్రవేశమునకు అవసరమైన యోగ్యతలు, సామాన్యవీరశైవులకు త్రికలశదీక్షా, తుర్యవీరశైవులకు పంచకలశ దీక్షా, తుర్యవీరశైవుల విధినిషేధముల కతీత తత్త్వమును, వారి ఆచార నియమములు, అష్టాంగమైథున వర్జనము, స్వేచ్ఛాసంచారము, అనాదిశైవము నుండి తుర్యవీరశైవమునకు సోపానక్రమము వివరించబడినవి.

ఇరువదియొకటవ పటలమున జ్ఞానయోగస్వరూపనిరూపణము, జ్ఞానలక్షణము, శివస్వరూప వర్ణనము, సర్వమూ శివమయము, జ్ఞానయోగము ద్వారా శివైక్యము, పరమాత్మ జీవాత్మగా అవతరించిన విధానము, శివశక్త్యత్మకమయిన జగత్తు, జీవాత్ముల లక్షణము, మాయా మోహితుడయిన జీవుడు తనను పరమాత్మునికన్న వేరుగా భావించుట, జీవాత్మ - పరమాత్మల అభేదము, అఖండా విద్యాశక్తి విలాసము, బింబ ప్రతిబింబన్యాయమున అధ్యాస ప్రవర్తన, ప్రపంచ వ్యవహార మంతయూ స్వాభిన్నశక్తియొక్క నటనాచాతుర్యము, సుఖదు:ఖాదులు బుద్దియొక్క వ్యాపారములు ఇత్యాది విషయములు వివరించబడియున్నవి.

ఇరువదిరెండవ పటలమయిన సాంఖ్యయోగములకన్నా భక్తి యొక్క శ్రేష్ఠత్వము, సర్వోత్తముడయిన భక్తుడు, భక్తిమహిమ, భక్తిలక్షణము, సద్భక్తి ఫలము, గురుశుశ్రూషవలన భక్తి, భక్తియొక్క అభ్యాసము వలన జ్ఞానయోగముల సిద్ధి, భక్తుడు కానివాని దుర్గతి, మతభేదములు మోక్షమునకు సోపానమార్గములు, పరమశ్రేష్ఠమయిన గుహ్యజ్ఞానము, దాని అంగములు, దృఢమైన శివభక్తియే పరమలాభము వంటి విషయములు నిరూపించబడియున్నవి.

ఇరువదిమూడవ పటలమున శివాద్వయ ప్రతిపాదనముతో గ్రంథము ముగియును.