పారమేశ్వరాగమము

శ్రీ విశ్వారాధ్య ప్రసన్న

భారతీయ ప్రాచీన వాజ్మయములో ప్రాధానమయినవి వేదములు, ఆగమములు. భారతీయ ఆస్తిక దర్శనములకివే ఆధారగ్రంథాలు. వేదాలు నాలుగన్నది సర్వవిదితము. అయితే ఆగమములు శైవశాక్తాది భేదములతో అనంతముగా వున్నవి. కామికాగమముతో నారంభించి వాతులాగమము వరకు గల శైవాగమములు మొత్తము ఇరువది యెనిమిది. వీటిలో నొకటి పారమేశ్వరాగమము. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవిని నిమిత్తం చేసుకుని మానవసమాజ సంక్షేమము కోసము పరమేశ్వరసంబంధమయిన విషయవస్తువును ఉపదేశించడము వలన ఈ ఆగమమును 'పారమేశ్వరాగమ ' మన్నారు.

విస్తృతమయిన శైవాగమసాహిత్యము సమగ్రముగా లభించడములేదు. కాలగమనములో లుప్తమయిపోయి అత్యంత విరళముగా అక్కడక్కడా భద్రపరచబడిన పాక్షికములయిన ఆగమములు వివిధ సంస్థలచేత ప్రచురించబడినవి. అవి సమగ్రములు కావు. శైవాగమములను మరియు సమస్త శైవ సాహిత్యమును పరిశోధనాదృష్టితో సంస్కరించి ప్రచురించాలన్న సంకల్పముతో కాశీలోని సుప్రసిద్ధమయిన శ్రీ జగద్గురు విశ్వారాధ్యా జ్ఞానసింహాసనపీఠము, జంగమవాడీ మఠము, 'శైవభారతీ శోధ ప్రతిష్టానము ' అనే పరిశోధనా సంస్థను నెలకొల్పినది. పరిశోధనా సంస్థ నిర్దేశకులు, సుప్రసిద్ద విద్వాంసులు పండిట్ వ్రజవల్లభ ద్వివేదిగారి పర్యవేక్షణలో ఈ పరిశోధనా సంస్థ 1. చంద్రజ్ఞానాగమము, 2. సూక్ష్మాగమము, 3. కారణాగమము, 4. మకుటాగమము, 5. పారమేశ్వరాగములను పరిష్కరించి హిందీభాషానువాదము వివరణలతో పాటు ప్రచురించినది.

'శైవభారతీ శోధ సంస్థానము ' ప్రచురించే అన్ని ఆగమములకు ముందు హిందీ-ఆంగ్ల అనువాదాలను ఆ తరువాత ప్రాంతీయ భాషానువాములను చేయించి ప్రచురించాలన్నది మా అభిమతము. ఆంగ్లానువాద కార్యక్రమము ముగిసినది. ప్రొ॥ ఎం. శివకుమారస్వామిగారి పర్యవేక్షణలో బెంగళూరులోని 'వీరశైవ అనుసంధాన సంస్థ ' ద్వారా ఆగమముల కన్నడానువాద కార్యక్రమము కూడా సుసంపనమయినది. కర్ణాటక మహారాష్ట్ర తరువాత అత్యధిక వీరశైవ జనాభా గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భౌగోళికపరంగానూ, మత, ధార్మిక, సాహిత్యాల పరంగానూ వీరశైవమతమునకు ఆంధ్రదేశమునకు ప్రగాఢమైన సంబంధములున్నవి. వీరశైవ ధర్మమునకు సంబంధించి మూల సంస్కృత గ్రంథముల ప్రచురణ ఆంధ్రదేశములో అవసరమయినంతగా జరుగలేదు. ఈ లోటును తొలగించవలెనను సంకల్పముతో ప్రపథమముగా వీరశైవాగమములలొ బృహద్గ్రంథమయిన పారమేశ్వరాగమమును మూలముతో పాటు ఆంధ్రానువాదము సైవరణలతో ప్రచురించి ఆంధ్రదేశములోని ఆగమ సాహిత్య ప్రియులకు ప్రధానముగా వీరశైవమతానుయాయులకు అందించడము మాకు ఆనందదాయకముగానున్నది.

సిద్ధాంతాఖ్యే మహాతంత్రే కామికాద్యే శివోదితే।

నిర్దిష్టముత్తరే భాగే వీరశైవమతం పరమ్॥

అన్న 'సిద్ధాంత శిఖామణి ' వచనానుసారము ఇరువదియెనిమిది శైవాగమములలోని ఉత్తరభాగములలో వీరశైవ సిద్ధాంతము ప్రతిపాదించబడియున్నది. ఈ పారమేశ్వరాగమమున శైవమతభేదములు, వీరశైవములోని అవాంతర మత భేదములు, వాటి లక్షణములు, వారి దీక్షావిధానము, ఆచార వ్యవహారములు, పూజా పద్దతులు వివరించబడియున్నవి. వీరశైవులకు ప్రధానమయిన వుపాస్యము ఇష్టలింగము. ఇష్టలింగము యొక్క పరిమాణము, వాటికి సంబంధించిన సజ్జికా, వాటి ఆకారములు, శివసూత్రములు, వాటి రంగులు, కరపీఠమున చేయు ఇష్టలింగార్చనావిధానము, వైశిష్ట్యము, ఫలము, లింగధారుల కర్మకాండలు ఇందు సమగ్రముగా వివరించబడియున్నవి. వీరశైవధర్మ దర్శనాల అధ్యయనము ఈ ఆగమాలను చదివినగాని పరిపూర్ణము కాదు.

మా ఆదేశముననుసరించి పారమేశ్వరాగమమునకు సవివరణలతో ఆంధ్రానువాదమును సిద్దముచేసినవారు సిద్దముచేసినవారు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమున సంస్కృతాచార్యులు డా॥ కె.ప్రతాప్ గారు. ఆగమ సాహిత్యానికి మరింత సేవచేసే శక్తి సామర్థ్యములు, ఆయురారోగ్యములు వారికి సమకూరాలని ఆశీర్వదిస్తున్నాము.

ఇత్యాశిష: