విశ్వకారణమయిన మూల తత్త్వాన్ని విగ్రహంలో సాకారంగా ఆరాధించే విధానాలను, నియమనిబంధనలను వివరించే సాహిత్యము ఆగమసాత్యము. తరతరాల సాధకుల అనుభవాల అంతరాల్లోంచి ఆవిర్భవించిన ఈ సాహిత్యము ఎప్పుడారంభమయిందో తెలియదు.ఆగమాలకే కాదు సంస్కృత సాహిత్యంలో ఏ ప్రక్రియకు గాని ఆరంభాన్ని ఇదిమిత్థంగా నిర్ణయించి చెప్పడం సాధ్యం కాదు. ఏతావతా కాలగమనంలో పాత తరాల అనుభవాల పునాదుల మీద వర్తమాన అవసరాలు అభిరుచులకనుగుణంగా నిర్మించుకున్న సాహిత్య సౌధాలే ఈ ఆగమ శాస్త్రాలు. తరతరాల విశ్వాసాలని, వ్యక్తిగత బాధ్యతలని, సామాజిక కట్టుబాట్లని వివరించే ఆగమాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువల వికాసంలోని వివిధ దశలని మన ముందుంచుతాయి.

'ఏకం సద్విప్రా: బహుధా వదంతి' అంటూ ఏకత్వంలోని వైవిధ్యతని ప్రతిబింబించే వేదవచనమే ఆగమసాహిత్యానికి ఆలంబనము. బహుదేవతారాధనల నభిమానించే హిందువుల మనస్తత్వానికి ప్రతీకలు ఆగమాలు. ఆరాధకుల అభిరుచికనుగుణంగా ఆయా దేవతల చుట్టూ అల్లుకున్నదే ఆగమ సాహిత్యము. పరతత్త్వాన్ని ప్రకృతతత్త్వంతో అంటుగట్టి, ఇష్టదేవతల స్వరూపస్వభావాలని విశ్వచైతన్యానికి ఆపాదించి, ఆరాదించే ప్రక్రియావిధానాలను ఆగమాలు ప్రతిపాదిస్తాయి.

ప్రాచీన భారతం వివిధ మతాలకి ధర్మాలకి పెట్టనికోట. శైవ, వైష్ణవ, శాక్తాలు ఈ సమాజాన్ని శాసించిన ప్రధానమతాలు. వీటి ప్రాచీన ఆర్వాచీనాలను నిర్ణయించడం సాధ్యం కాదు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృతి సింధూనదీతీరంలో వెలిసినట్టు చరిత్రకారుల సిద్ధాంతం. హరప్ప మోహంజదారో ప్రదేశాలలో లభించిన పురావస్తు అవశేషాలు శైవమత ప్రాచీనతకు తిరుగులేని ఆధారాలు. ఆనాటి ప్రజల ఆరాధ్యదైవము పశుపతి శివుడు. అతనిని లింగాకారంలో ఆరాధించేవారు. లింగారాధన ప్రధానమయిన శైవము, ఒక మతంగా, ధర్మంగా వివిధ కాలాలలో వివిధ పేర్లతో వ్యవహరించబడింది. అంతేకాదు ఈ దేశంలోని జనజీవన విధానము మీద అత్యంత ప్రభావాన్ని చూపిన ధార్మిక చైతన్యమే శైవమతమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రత్యభిజ్ఞమన్న పేర కాశ్మీరంలోను, పాశుపతమన్న పేర పశ్చిమ భారతం (గుజరాత్, రాజస్థాన్) లోను, లాకులమన్నపేర పూర్వ, ఈశాన్యభారతంలోను, సిద్ధాంతశైవము, వీరశైవము అన్నపేర దక్షిణ భారతంలోను నేటికీ అధిక సంఖ్యాకుల చేత ఆరాధించబడి, అనుసరించబడుతున్న సజీవమతము శైవము. ఆరాధనావిధానాలలోను, ఆచార వ్యవహారాలలోను, దార్శనిక దృక్పథంలోనూ కించిత్ వైవిధ్యమునా, అన్ని శైవమత భేదాలకు మూల ఆకరాలు ఇదువదియెనిమిది శైవాగమాలు.

ఈ ఆరాధనావిధానాలను సాక్షాత్తు పరమశివుడే కౌశికాది మహర్షులకు బోధించినట్టు ఆగమాలలోని తంత్రావతార పటలాలు తెలియచేస్తున్నాయి. శివుడు పంచముఖుడు, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష అనే నాలుగు ముఖాలు వరుసగా ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పు, దిక్కులకభిముఖమయితే ఈశానమనే ఐదవముఖం ఆకాశాభిముఖంగా ఉంటుంది.

ఆగమాలంటే శైవాగమాలే. దేవతారాధనా ప్రధానములయిన సంహితా, తంత్రాది గ్రంథాలు కూడా అనాదికాలము నుండి సాంప్రదాయరూపంగా సంక్రమించిన సాహిత్యమనే అర్థములో 'ఆగమా'లన్న పేర వ్యవహరించబడినాయి. విష్ణువు యొక్క అవతారాల ఆదాధనని వివరంచే సాహిత్యాన్ని వైష్ణవాగమాలంటారు. ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రతిపాదించే పద్మసంహితా, విశ్వామిత్ర సంహితా, ఆహిర్బుద్న్యసంహితా, మరీచి సంహితా వంటి గ్రంథాలపేర్లలో ఎక్కడా ఆగమశబ్దం లేదు. అలాగే శక్తిని ప్రధాన దేవతగా ఆరాధించే శాక్తాగమ గ్రంథాల పేర్లలో కూడా ఆగమశబ్తం కనబడదు. ఉదా:- శ్రీవిద్యార్ణవ తంత్రము, శక్తిసంగమ తంత్రము, భైరవతంత్రము. గనుక కారణాగమము, కామికాగమము, అజితాగమము, మకుటాగమము అని 'ఆగమ ' శబ్దాన్ని తమ పేర్లలో అవిభాజ్యంగా గలిగిన శైవాగమాలే ఆగమాలని శైవుల అభిప్రాయము. ఇలా వ్యవహరించడం ఆనవాయితీ మాత్రమేగాని నియమము కాదు

శైవాగమాల స్వరూపాన్ని తెలుసుకునే ముందు అసలు 'ఆగమ' శబ్ద నిర్వచన స్వారస్యాన్ని తెలుసుకుందాము. 'ఆగమ' శబ్దం 'ఆ' అనే ఉపసర్గ పూర్వకమైన 'గం' ధాతువునుండి ఉత్పన్నమయింది. గత్యర్థ ధాతువులన్నీ జ్ఞానార్థకాలు అన్నది వ్యాకరణ నియమం. ఉపసర్గగా చేరిన 'ఆ' పరిపూర్ణతను సూచిస్తుంది. అందువలన ఆగమమంటే పూర్ణజ్ఞానము, అత్యుత్తమజ్ఞానము, పవిత్రజ్ఞానము అని అర్థము. ఈ జ్ఞానాన్ని ఆగమాలు విమలజ్ఞానమని, జ్ఞానమని, నిరాకులజ్ఞానమని, గుహ్యాత్ గుహ్యాతరం జ్ఞానమని, శివజ్ఞానమని, దివ్యశాస్త్రమని, అవబోధరూపజ్ఞానమని, సిద్ధాంతజ్ఞానమని పరిపరివిధాలుగా పేర్కొంటూ ఆగమశబ్ద ఔన్నత్యాన్ని కొనియాడుతున్నాయి.

ఏ జ్ఞానముచేత సమస్తమూ తెలియబడుతున్నదో అదియే ఆగమమని పింగళమతం చెబుతున్నది. పరమశివునిచే బోధించబడి గురుశిష్యపరంపరచేత సంక్రమించిన శాస్త్రవిజ్ఞానము ఆగమమని పాశుపతసూత్రం వివరిస్తుంది. ఆగమాలు అభ్యుదయమార్గాన్ని, నిశ్ర్శేయస ప్రాప్తిని కలుగచేస్తాయని వాచస్పతి మిశ్రుని వచనం. ఆగమాలు పరమాత్ముని వచనాలు గనుక అవి శాశ్వతసత్యాలు అని ఆధునికుల అభిప్రాయము. 'ఆగమ 'అనే మూడక్షరాలు ఈక్రింది శ్లోకపాదాల ఆరంభాక్షరాల సముదాయమని 'తంత్రసముచ్ఛయం' చెబుతున్నది.

ఆగతం పంచవక్త్రాత్తు గతం చ గిజాననే।

మతం చ వాసుదేవస్య తస్మాదాగమముచ్యతే॥

పంచవక్త్రాత్ ఆగతం, గిరాజయై గతం, వాసుదేవస్య మతం, అనే మూడు అక్షరాల సమాహారం 'ఆగమ' శబ్దావిర్భాన్ని తెలియజేయడం ఇక్కడ చమత్కారం. ఆ తరువాత కాలంలో కించిత్ పరివర్తనతో వైష్ణవాగమాల ఉగమానికి కూడా ఇటువంటి శ్లోకమే రూపుదాల్చింది.

పంచముఖుడయిన శివుడు ఇరువదియెనిమిది ఆగమాలను బోధించినాడు. అతని సద్యోజాతముఖము నుండి 1.కామిక (3), 2. యోగజ(5), 3. చింత్య (6), 4.కారణ (7), 5. అజిత (4) మనే ఐదు ఆగమాలు కౌశిక మహర్షికి, వామదేవ ముఖమునుండి 6. దీప్త (9), 7. సూక్ష్మ (1), 8. సహస్ర (10), 9. ఆంశుమత్(12), 10.సుప్రభేద (1) మనే ఐదు ఆగమాలు కశ్యప మహర్షికి, అఘోర ముఖము ముండి 11.విజయ(8), 12.నిశ్స్వాస(8), 13.స్వయంభువ(3), 14.అనల(1), 15.వీర(13) మనే ఐదు ఆగమాలు భారద్వాజ మహర్షికి, తత్పురుష ముఖము నుండి 16.రౌరవ(6), 17.మకుట(2)18.విమల(16), 19.చంద్రజ్ఞాన(14), 20.ముఖబింబ(1) మనే ఐదు ఆగమాలు గౌతమ మహర్షికి, ఈశాన ముఖము నుండి 21.ప్రోద్గీత(16), 22.లలిత(3), 23.సిద్ధ(4), 24.సంతాన(7), 25. శర్వోక్త(5), 26.పారమేశ్వర(7), 27.కిరణ(9), 28.వాతుల(12) మనే ఎనిమిది ఆగమాలు అగస్త్య మహర్షికి బోదించబడినట్టు కామికాగమము పేర్కొంటున్నది. ఈ ఇరువది ఎనిమిది ఆగమాలలోని ఒక్కొక్క ఆగమానికి కొన్ని ఉపాగమాలు అనుసంధించబడినాయి. అవి మొత్తము 207 ఆగమాలు. సద్యోజాత వామదేవ ముఖాల నుండి వెలువడిన మొదటి పది ఆగమాలు శివభేదాలని, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాల నుండి వెలువడిన పద్దెనిమిది ఆగమాలను రుద్ర భేదాలని చెప్పబడినాయి.

పరమేశ్వరుడు పార్వతికో, ప్రమథగణాలకో, మహర్షులకో ఉపదేశించినట్టుగా సాగే ఆగమాలు నాలుగు పాదాలను కలిగి ఉంటాయి. అవి జ్ఞానపాదము, ప్రియాపాదము, చర్యాపాదము మరియు యోగపాదము. కొన్ని ఆగమాలలో స్పష్టమయిన పాద విభజన లేకపోయినా ఈ నాలుగు పాదాల విషయాలని వరుసగా వివరిస్తాయి. జానపాదాన్ని విద్యాపాదము అని కూడా అంటారు. ఆగమశైవానికి సంబంధించిన పతి, పశు, పాశము వంటి తాత్త్విక అంశాలను చర్చించేది జ్ఞానపాదము. దేవాలయ నిర్మాణానికి సంబంధించి స్థలసేకరణతో ఆరంభించి, దేవతాప్రతిష్టానము వరకు అవసరమైన వాస్తుశిల్పాది వివిధ శాస్త్రవిషయాలను వివరించేది క్రియాపాదము. దేవాలయములో ఉదయం నుండి రాత్రి వరకు జరిగే కార్యక్రమాల వివరాలని, సంవత్సరంపొడుగునా నిర్వహించవలసిన వివిధ ఉత్సవాలని, దేవాలయ కార్యనిర్వహణలో భాగస్వాములయినవారి ఆచారవ్యవహారాలని చర్యాపాదము నిర్దేశిస్తుంది. పరమపురుషార్థ ప్రాప్తినాశించి అధ్యాత్మికోన్నతికుపకరించే వైయక్తికసాధనలను గురించిన అంశాలు యోగపాదంలో ఉంటాయి. ఈ పాదాలు విషయాలని బట్టి అనేక పటాలాలుగా విభజించబడి ఉంటాయి. ఇప్పుడు మనకు లభించే ఆగమాలలో క్రియాపాదాలు చాలా పెద్దవి. జ్ఞానపాదాలు అతిచిన్నవి. కొన్ని ఆగమాలు పాదాల ఆధారంగా కాకుండా పూర్వ - ఉత్తర భాగాలుగా కూడా విభజింపబడి ఉన్నాయి. పాదవిభజన అయినా భాగవిభజన అయినా ఆగమాలలోని అధ్యాయాలు పటలాలని పిలువబడుతున్నాయి. పటలాలలోని శ్లోక సంఖ్య విషయాన్ని బట్టి ఉంటుంది. తంత్రావతార పటాలలో సూచించిన ఆగమాలలోని శ్లోకసంఖ్యకి ప్రస్తుతము మనకు అందుబాటులో నున్న ఆగమాలలో కనిపించే శ్లోకసంఖ్యకి హస్తిమశకాంతరమున్నది. ఇది ఆగమాల బాహ్యస్వరూపము.

ఇక ఆంతరిక స్వరూపాన్ని అవలోకించినట్టయితే ఆగమాలు ఆరాధనా ప్రధానమైన శాస్త్రాలు. అవి ఆత్మార్థపూజ, పరార్థపూజలనే రెండురకాల పూజావిధానాలని పేర్కొంటాయి. ఆత్మోన్నతికోసం, కుటుంబ సంక్షేమంకోసం, తనకభీష్టమైన దేవతనుద్దేశించి తన యింట తనకు తాను చేసే అర్చన లేదా ఆరాధన అత్మార్థపూజ. గ్రామ, రాష్ట్ర, దేశ, సమాజక్షేమాన్ని అపేక్షించి దేవాలయములో చేసే సామూహిక ఆరాధన పరార్థపూజ. ఆగమాలు విధించిన ఈ ఆరాధనారీతులు దక్షిణ భారతదేశంలో పటిష్టమైన పునాదులమీద సాకారాన్ని పొంది, సజీవంగా ఉండటం నేటికీ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అనంతవిశ్వాన్ని లింగాకారంగా భావించి దానిని అరచేతిలో నుంచుకొని ఆరాధించే ఆత్మార్థపూజ వీరశైవధర్మం లేదా మతంగా కర్ణాటక దేశంలో సుస్థిరమైతే, విశ్వవ్యాపకుడయిన పరమాత్మకు బృహన్మందిరాలను నిర్మించి వాటిలో జరిపే పరార్థపూజకు పరమవైభవాన్ని కూర్చింది తమిళదేశంలోని సిద్దాంతశైవము.

వివిధ ప్రాంతాలలోని శైవశాఖలు, వాటికి సంబంధించిన విషయాలను కలిగివున్న ఆగమభాగాలను మాత్రమే ఆదరించి, మిగిలిన భాగాలను నిర్లక్ష్యం చేయడంవల్ల అనంతమైన ఆగమ సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయింది. ఏ ఒక్క ఆగమము సమగ్రంగా లభించడం లేదు. పరార్థపూజా విధిని తెలియజేసే కొన్ని ఆగమభాగాలు తమిళదేశంలో గ్రంథలిపిలో భద్రపరచబడినాయి. అదేవిధంగా ఆత్మార్థపూజను వివరించే భాగాలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలోని శివాచార్యులచేత సమరక్షించబడినాయి.