మాహేశ్వర స్థలము షట్ స్థల సాధనయందు రెండవ సోపానము. భక్త స్థలపు సాధకునందు నెలకొనియుండిన శ్రద్దాభక్తి పూర్ణత్వమును పొందినపుడు భక్తుడే మాహేశ్వరుడగుచున్నాడు. ఈ స్థలపు సాధకుడు తానారాధించెడు మహేశ్వరుడయిన పరమశివుడిని తన సంభంధమే (తన వాడే) యని నమ్మియుంటాడు.ఈ భావన యొక్క పరిణామము స్వయముగా భగవంతుడు కూడా ఇతడిని తన వాడిగా భావిస్తాడు. ఇట్లు ఈ స్థలము నందు భక్తుడు - భగవంతుని మధ్య ఆత్మీయసంబంధము పెంపొందుతూ ఉంటుంది.  
సామాన్యముగా ప్రపంచమునందు జన్మనెత్తిన పిదప మానవుడు జీవన పర్యంతము అనేక సంబంధములను పెంపొందించుకుంటూ వెళ్తాడు. సంబంధములు రెండు రకములు. 1) రక్త సంబంధము మరియు 2) భావ సంబంధము. ఈ సంబంధములనే మరొక విధముగా విభజింపవచ్చును. 1) బంధనమును పెంపొందించెడు సంబంధములు మరియు 2) బంధనమును విడదీసెడు సంబంధములు.ఈ బంధాలు/బంధనములు మరియు వాటి అర్థ/పరమార్థములు క్రింద చూపిన పటలమునందు విశదీకరించబడినది.
మాహేశ్వర స్థలము

రక్త సంబంధములు మరియు భావ సంబంధములు శాశ్వతమగు సంబంధములు కావు. ఈ రెండింటికి మించిన సంబంధము ఆత్మ సంబంధము. ఇది నిత్యమే కాక సత్యమైనట్టిది. దేహము ఉన్నంతవరకే రక్తసంబంధము, భావమున్నంతవరకే భావసంబంధము. జీవ పరమాత్ములందున్నదే ఆత్మైక సంబంధము.

వాస్తవికముగా విచారించినచో దీనిని సంబంధమని చెప్పుటయూ కష్టము. ఎందుకనగా రెండు వస్తువులు లేక ఇరువురు వ్యక్తుల పొందిక లేక కలయిక అనుదానిని సంబంధమందురు. కాని జీవ పరమాత్ములు పరమార్థముగా పరిశీలించిన విభిన్నులు కారు. ఒకటియే అయ్యియుందురు. అయితే జీవునకు అజ్ఞానముతో బాటు మలములంటుకొని యుండుటచేత ఆ వాస్తవిక సత్యమన్నదానిని మరిచిపోయినది. అందుచేత వేరువేరు అని ప్రకాశమానమగుచున్నది. ఆత్మ యొక్క ఈ ఏకత్వమన్నది తెలియనపుడు విభిన్నత్వము భాసమగు చుండుటచేత జీవుడు వేరు, దైవము వేరు అని యనిపించుచున్నవి. ఏకత్వమును గుర్తించునపుడు ఇరువురు ఒకటేయని నమ్ముదుము. ఈ విధంగా అజ్ఞాన సమయము వలన రెండనిపించినది, జ్ఞానము కలిగిన పిదప ఒకటే యనిపించుట చేత దీనికి సంబంధమని పేరిడవలసి వచ్చినది.

ప్రతియొక సంబంధము పూర్ణము కావలయుననిన అది ఆత్మ ఎత్తునకు చేరవలసి యుండును. సంభంధములన్నవి దైహికముగా ప్రారంభమయి, అచటనే తుద చెందుతుంటాయి.కొన్నిసార్లు భావన వరకు చేరుతుంటాయి. భావనాత్మకమయి మారుతూ ఉంటాయి. దీనికన్నా పైకి మాత్రము వెళ్ళజాలవు. ఎందుకనగా శాశ్వతమగు సంభంధమొకటి ఉన్నదను జ్ఞానము దానికుండదు. కొందరయితే భావనత్మకులై కూడా జీవితమును సాగించుట లేదు. అంతయును యాంత్రిక జీవనమే. యాంత్రికమైన ప్రేమయే. మానవుడు చేయు పనుల్లన్నింటినీ యంత్రములే చేయుచున్నవి. అయితే యంత్రములకు భావ భంధములు గాని సంవేదన సంభందములు గాని లేవు. కాని సంవేదన శీలుడైన మానవుడు కూడా భావహీనుడై యంత్రిక మనిషి లాగా బ్రతుకుచుండుత దు:ఖదాయకము. సంబంధములన్నవి భావపుటెత్తునకు చేరవలెను. ఆత్మయెంత లోతున ఉంటుందో అంతవరకు దిగవలసి యుండును. అప్పుడు సంబంధమన్నది పూర్ణ వికాసము చెందినట్లవుతుంది.

రామక్రిష్ణ పరమహంస, శారదా మాత; బసవన్న, నీలాంబిక వంటి మహాత్ములు తమ లౌకిక సంభంధములను ఆధ్యాత్మికటెత్తునకు తెచ్చుకున్నారు. ఏవిధముగా బండిని ముందుకు తీసుకు వెళ్ళటానికి మొదటి గేరుతోనే ప్రారంభించి, టాపు గేరుకు వెళ్ళతామో, అలాగే, లౌకిక కాల్పానిక సంబంధముతోనే సాధన మొదలవ్వవలసి ఉన్నది. ఒకేమారు టాపు గేరులో నుండి నేరుగా బండిని ముందుకు నడుపుటకు సాధ్యము కాజాలదో, అట్లాగే ఒకేమారు ఆత్మ సంబంధమును తెలియుటకు సాధ్యము కాజాలదు.

అదేరీతిగ మాహేశ్వర స్థలము యొక్క సాధకుడు భగవంతుడిని, తన సమీపమున మెలగు వాడిగను, తాను అతనికి సంబంధమని భావించెడు కారణముగా అతనితో లౌకికము మరియు కాల్పానికముగ సంబంధము జోడిచుట జరుగును. ఈ సంబంధము ఒకేరీతిలో నుండక అనేక విధములుగా నుండును. భగవంతునితోడి సంబంధమును అక్కమహాదేవి పతియని, యశొద కొడుకని, ధ్రువుడు తండ్రియని భావించెను. ఇంకనూ అనేకులు అనేక విధములుగా భగవంతునితో సంబంధములు కల్పించుకొని, ఆ సంబంధపు ఆధారముతో దైవము నందు ప్రగాఢమైన నిష్ఠను పొందియున్నారు.

అక్కమహాదేవి యందు చెన్న మల్లిఖార్జునుడు తన పతి యని భావించిన భావన, మల్లిఖార్జునుడు కనిపించు వరకు చెందిన ఆ అతురత, ఆరాటము ఎంతో బలిష్ఠమైనది.ఆ ఆరాటమునకు అడ్డుకట్ట వేసి నిలుపుటకు తల్లిదండ్రులకు, బంధు బలగమునకు, ధనకనకములు నిండిన సామ్రాజ్యమునకు సాధ్యపడలేదు. కామాసక్తుడైన కౌశికునకు కాలేదు. అది నిష్ట యొక్క పెనుగులాట. ఈ రీతిగ హద్దులేని నిష్ఠ గలిగిన భక్తుడు మాహేశ్వరుడగును. భక్త స్థలమందలి సాధకునందు శ్రద్ధాభక్తులున్నట్లు మాహేశ్వర స్థలపు సాధకునందు నిష్ఠా భక్తులుంటాయి. భక్త స్థలమందలి సాధకునందలి శ్రద్ధాభక్తియు నిష్ఠాభక్తి యొక్క రూపమును దాల్చినపుడు భక్తుడే మాహేశ్వరుడగును.

"స్వాత్యాం సాగర శుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే" యనునట్లు స్వాతి కార్తె యందలి వాన చినుకు సాగరము పై తేలే గవ్వ చిప్పయందు పడి కొన్ని దినములందే అది గట్టిపడి విలువ గలిగిన ముత్యము వంటి మణి యగునట్లు, భగవత్ప్రేమ రూపమగు శ్రద్ధాభక్తియు భక్తుడి హృదయమును ప్రవేశించి, కొన్ని దినముల పిదప గట్టిపడి నిష్ఠా రూపమును ధరించును. శ్రద్ధయందు చంచలత అనెడు దోషముండుట అనునది సంభవించును. గాలియందుంచిన దీపము యొక్క కాంతి కొట్టుమిట్టాడెడు రీతి వలన దాని కాంతి యెల్లెడల వ్యాప్తి చెందును. అయితే గాలి లేని చోట ఉంచిన దీపకాంతి నిశ్చలయయి యుండుట చేత దాని ప్రభ వ్యాప్తిచెంది నిలకడ కలిగి యెల్లెడల ప్రసరించును. దీనివలెనే చంచలమైన భగవద్భక్తియు పరిణామకారి కాజాలదు. నిశ్చలత్వముతో గూడిన భక్తియే పరిణామకారి అవుతుంది. అంతేగాదు ఫలకారియును కాగలదు. భక్తిలో మిశ్రితమైన చంచలత్వము నాశనమై నిశ్చలత్వయొందినపుడు అదే నిష్ఠ యనబడును. మరొక ప్రక్కకు ప్రాకులాడక ఒకే ప్రక్క నిలచెడు అచంచల భగవత్ప్రేమయే నిష్ఠ.

సర్వజ్ఞుడైన సర్వేశ్వరునకు మన కష్తము గురించి తెలియకుండునా! సకలము తెలిసిన వాడికి, మనకు సంభవించిన కష్టములను గురించెడు జ్ఞానము కలిగియే యుంటుంది. సర్వము తెలిసిన ఈశ్వరునికి మన కష్టమును వివరించి తెలుపుకొనుటన్నది కేవలము మన తృప్తి కొరకు మాత్రమే.

మనము ఇంటిలో జరిగెడు చెడుకు, శని పీడ యుండవచ్చునని భావించి దాని నివారణ కొరకు ఒక దేవాలయమునకు పోదుము. మన తాపత్రయములను ఆ దైవానికి వివరింతుము, వాటిని పరిహరించుటకు ప్రార్థింతుము. వాటి పరిహారమునకై వేడికోలును తెలిపి ఏమేమో లంచములు (నైవేద్యం, ధనము, నగలు మొదలగునవి) నిచ్చుచుండుము. ఏవేవో కోరికలు తెలుపుకొందుము. నాలుగు శనివారములట్లే గదిచిపొతాయి. మన కష్టములు మొదలున్నట్లే యుండినవి. అప్పుడు ఈ దైవమునందు మన కష్టపరంపర తొలిగించెడు శక్తియున్నదో లేదో యను సంశయము మనలో కలుగును. ఈ సంశయముతోడనే మరొక రెండు శనివారములు గడిచిపోయినవి. కష్టమయ జీవితమున మార్పు మాత్రము లేదు. ఈ దైవమునకు మన కష్టములను, శని బధలను తొలగజేయునంతటి శక్తి లేదని, ఇటువంటి అశక్తుడగు దైవమును ఎన్ని శనివారమౌలు సేవించినను ప్రయోజన మేమియును గలుగ జాలదని భావించిమరొక దైవము ప్రక్కకు నడక ప్రారంభింతుము. అక్కడను కష్టములు దూరము కాజాలవు. అటులే ఒక దైవము పిదప మరొక దైవము వేడుట జరుగును. ఈ విధముగ దైవమును మార్చుటందే మన జీవన గతి గడచిపోతుంది. మన యందు నిష్ఠ యన్నది జరుగుటలేదు.

మన మనస్సునందు నాటిన భక్తియను మొక్క ఫలించు వరకును వేచియుండెడు ఇంద్రియ నిగ్రహయు కాని, ఓర్పుకాని లేకుండట చేత దైవమును మార్చుచూ పోదుము. ఏక నిష్ఠలేని మానవుని భక్తి ఫలవంతము కాజాలదు.  అందువలననే బసవేశ్వరులు

"పతిపైని స్నేహముండని సతి

లింగము పైని నిష్ఠలేని భక్తుడు

ఉండనేమి? శివ శివా పోయిన నేమి శివ శివా..."

అని అన్నారు. వీరశైవుడైనవాదు లింగమునందే పరమనిష్ఠ కలిగి బ్రతుకవలయును. మనందరి ఇష్టార్థములను ఈడేర్చెడు సామర్థ్యము ఇష్టలింగము నందు నెలకొని యుండును. ఇటువంతి ఇష్టలింగమును ప్రక్కకు నుంచి వివిధ దైవములను గూర్చి వీధి వీధులకు తిరుగునతడు వీరశైవుడగులెట్లు?

ఏ దైవము నందైన మనమునందు పరమ నిష్ఠ కలుగవలయు ననిన ఆ దైవము యొక్క పరమోత్కృష్టము మరియు "కర్తుం అకర్తుం అన్యధా కర్తుం శక్తి:" (ఏ కార్యమునైనను చేయుటకు, చేయుకుండుటకు లేక మరొక రీతిని చేయుటకు సమర్థుడు) అనెడి సర్వశక్తి మంతుడైన వాడు అనెడి భావముండవలయును.

మాహేశ్వరస్థలపు సాధకునందు శివుడే సర్వోత్తముడు, సర్వశక్తి యుక్తిమంతుడు అని మరియు శివరూప స్వరూపులయిన గురు-లింగ-జంగములె ఈ లోకమున పరమ పూజ్యులనెడు నమ్మకము కలిగి యుండవలెను. ఈ నమ్మకమే అతడి నిశ్చల నిష్ఠా స్థితికి కారణమై యున్నది. శ్రీ సిద్ధాంత శిఖామణి యందు శ్రీ రేణుక భగవత్పాదులు మాహేశ్వరుని యందలి లింగ నిష్టను ఉపదేశించుచు ఇట్లనెను.

అపగచ్చతు సర్వస్వం శిరచ్ఛేదన మస్తు వా|

మాహేశ్వరో న ముంచేత లింగపూజా మహావ్రతం||

సర్వస్వమంతయు అపహరింప బడిననూ, భయానక శిరచ్ఛేదన పరిస్థితి సన్నిహితమైననూ, మాహేశ్వర స్థలము యొక్క సాధకుడు లింగ పూజా మహావ్రతము నందు ఎప్పటికినీ విముఖుడు కాజాలడని ప్రతిపాదించి యున్నారు.

వీరశైవ ధర్మమందు త్యాగమునకు విశిష్ఠ స్థానమున్నది. ఈ ధర్మము యొక్క సాధకుని గురువునకు తనువును, లింగమునకు మనమును, జంగమునకు ధనమును సమర్పించి త్యాగమయ జీవితమును అలవరచుకొనును. ఇటువంటి త్యాగమునకు ధర్మ పరిభాషయందు దానమని పేరు. మాహేశ్వర స్థలపు సాధకుడు పూజ్యులయిన గురు-లింగ-జంగముల తను-మను-ధనములను అత్యంత సహజముగా సమర్పించుట ద్వారానే తన నిష్ఠను బలపరచుకొనును.

వీరశైవ సిద్ధాంతము మూడు విధములగు దానములను ప్రతిపాదించుచున్నది. 1. సోపాధిక దానము 2. నిరుపాధిక దానము, 3. సహజ దానము.

సోపాధిక దానము పేరుకు మాత్రమే దానము. ఎందుకనగా ఇచ్చెడు క్రియ వెనుక తీసుకొనెడు ఉద్ధేశము బలీయమై ఉంటుంది. అనగా ఇచ్చుటకై ఇవ్వడం లేదు. తాను మరొకటి పొందుటకై ఇచ్చుచున్నాడన్న మీదట దీనికి దానమనుటేల? అను సందేహము మనలో ప్రవేశించును. ఎవరికి నివ్వక స్వార్థపరుడై జీవించుదానికంటెను, పుణ్యము లేక స్వర్గాపేక్షతో నైనను ఇచ్చువాడు ఉత్తముడను కారణముగా సోపాధిక దానమునకు దానమని పిలువ వలసి యున్నది.

ఈ ప్రపంచము నందు కొందరికి ధనార్జన చేయునది మాత్రమే తెలుసు. తాను దాని ఉపయోగించుటగాని, అనుభవించుటగాని తెలియదు.మరొకరికి ఇచ్చుట అన్నదియును చాల దూరమైన మాటయే. ఇటువంటి లోభులు మరొకరికి ఇవ్వక, తాము ఉపయోగింపక, గడించిన ధనము నంతటిని సంగ్రహించి ఒకచోట ఉంచి తుదకు దానినంతటిని ఇక్కడనే వదిలి మృత్యువాత పడుచుందురు. వారు సంపాదించినదంతయు మరొకరి పాలగును.

ధనము యొక్క గతిని తెలుపునట్టి సుభాషితం:

దానం భోగో నాశస్తిస్రోగతయో భవంతి విత్తస్య|

యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి||

దానము, భోగము, నాశనము అనునవి ధనమును ఉపయోగించుటకు ఉన్న మూడే దారులు. దానము చేయని వాడి యొక్కయు, తాను ఉపయోగించని వాడి యొక్కయు సంపత్తు మూడోవ దారిని చూసుకుంటుంది. అనగా నాశనమై పోవును. ఇచ్చినది తనకు మిగులును. సంగ్రహించి యుంచినది పరులకు దక్కును.

మనము గడించిన దానిని మన వెంట గొనిపోవలయుననిన దానమొకటే దానికి దారి. అమెరికా యందు భరతదేశపు నాణ్యము చెల్లదు. భారతీయులు అచటికి పోవునపుడు, మొదట భారతదేశపు నాణెములగు రూపాయల నిచ్చి, అమెరికా డాలర్లు ఖరీదు చేయవలసి యుండును. వాటికే అచట వెల. ఇహ లోకమందే యున్న అమెరికాలో మన నాణెము చెల్లదనిన పైన పరలోకమునందు ఎట్లు చెల్లుతుంది. దీనివలెనే మనము గడించిన సంపదను మన జన్మకు లేక పరలోకమునకు గొనిపోవలయుననిన దానిని పుణ్యరూపమునందు మార్చుకొనవలసి యుండును. సంపదను దానము చేయుట తోడనే పుణ్యముగా మార్చుకొన వీలగును.

అనగా ధనమును సత్పాత్రులకు దానమొనరించి పుణ్యమును సంపాదించినచో మరుజన్మ యందు ఆ పుణ్యము యొక్క ప్రభావము తోడ ధనికుడై సుఖ భోగములతో బతుకుటకు సాధ్యమగును. దానము చేయనివాదు ఆగర్భ శ్రీమంతుడైనను వాడి సంపద మున్ముందు వాడికి ఉపయోగపడదు.

దానమొనరింప జాలని దోషముతో మానవుడు దరిద్రుడగును. పేదరికముతో కష్టమును సహింపలేక పాపము చేయసాగును. పాపి దరిద్రుడై నరకము ననుభవించును. పాపి దరిద్రుడగుచూ, దరిద్రుడు పాపి యగుచు నిరంతరము దు:ఖమునకు లోనగుచుండును. ఈ దారిద్యము మరియు పాపముల నివారణకు దానమే దివ్యౌషధము. మనము చేసిన దానము ఈ జన్మము నందు మరొక జీవి సంతోషమునకు కారణ మవుతుంది. ముందటి జన్మమందు మన సంతోషమునకు కారణమవుతుంది.

ఈ రీతిగ ఎవరికిని పెట్టక తాను ఉపయోగించి తినక ధనమోహితమగుట కంటే యేదోయొక ఉద్దేశము నుంచుకొని దానిని ఉపయోగించు కొనవలయునని తలచియైనను దానమొనరించుట అలవరచుకొనవలయును. అదియే ఉత్తమ మయినదిగా నిరూపించుట కొనుట కొరకు ఈ సోపాధిక దానమును, దానము యొక్క విభాగము లందొకటిగా అంగీకరించ వలసి యున్నది.

నిరుపాధిక దానము: ఎటువంటి ఫలాపేక్ష లేకయే ఈశ్వరార్పణ బుద్ధితో నొసగెడు దానము నిరుపాధికము. సోపాధిక దానము కంటె నిరుపాధిక దానము శ్రేష్ఠమైనది. మనసునందు యే కోరికలు లేక ఇచ్చునదే తన కర్తవ్యమని తెలిసికొని నిష్కామ భావముతో నిచ్చెడు దానము నిరుపాధిక దానమనబడును. మరొకటి పొందవలయునను భావము లేక కేవలము ఇవ్వవలెనను భావమే దీనిలో ఉండుట వల్ల ఇది పరిశుద్ధమైన దానము.

కర్ణుడు క్షౌరము చేయించు కొనుటకు కూర్చొని యుండెను. ఎదురుగా క్షురకుడు కూర్చొని యుండెను. కర్ణుని ఎడమ వైపు బంగారపు గిన్నె యుండెను. దానిలో నీరు పోసి క్షౌరమునకై ఉపయోగించబడుచున్నది. భిక్షకుడొకడు ఆ సమయమున కర్ణుని చెంతకు వచ్చి "మహారాజా! నావారందరు చాలా కష్టములందున్నారు. దిక్కుతోచకున్నది. తాము దానశూరులని విని తమ చెంత కరుదెంచితిని. సహాయము చేసి పుణ్యము కట్టుకొనండి" అని ప్రార్థించెను. కర్ణుడు తక్షణమే తన యెడమ ప్రక్కనున్న బంగారు గిన్నెను ఎడమ చేతితోడనే ఇచ్చి వేసెను. ఎదురుగా కూర్చొనిన క్షురకుడు "ప్రభూ! తమరు అనుమతించిన ఒక మాటను అడుగవలయునని ఉన్నది." అనెను. కర్ణుడు కానిమ్ము అడుగుము అనెను. "రాజా! ఎడమ చేతితో దానము చేయుటచే యే ప్రయోజనము కలుగబోదు. కుడిచేతితో దానము చేయవలెనని శాస్త్రవిధి యున్నది. అయితే తాము ఎడమ చేతితో దానము చేసితిరిగదా యని ప్రశ్నించెఉ. క్షురకుని కుతూహలమును గాంచిన కర్ణుదు నవ్వి ఇట్లనెను. "ఏదోయొక ఫలము లభించని లేక పుణ్యము రానిమ్మని నేను దానము చేయలేదు. అతడి కష్టమునకు సానుకూలమయితే చాలని మాత్రమే నా ఆశ. అట్లుండినపుడు నాకు శాస్త్రపు గొడవెందుకు? ఇంతియే గాక ఎడమ ప్రక్క నుండిన గిన్నెను కుడిచేతితో తీసికొనునంతలో నా మనసు ఇవ్వ వద్దు అని అనిన ఏమి చేయుదును. అందుకే నేను ఇవ్వలయుననిన ఆ క్షణముననే అన్ని విషయములను ప్రక్క నుంచి ఇచ్చివేసితిని".

ఇట్లు మనసు యొక్క కోరికల విషయముల నన్నిటిని ప్రక్కకుంచి చేయునట్టి దానమె నిరుపాధికము. ఇది సోపాధిక దానము కంటెను అధికమైనది. అయితే దీనియందును అభిమానము అను దోషము చేరి ఇది కూడా మలినమగుటకు అవకాశమున్నది. కోరికలు అను వాటిని ప్రక్కకుంచి దానము చేయుదుము. అయితే అహంకారమును ప్రక్కకుంచి దానము చేయవలయును గదా!

మనసు పసిడి, పడతి, మన్ను మొదలగు వాటి నెల్లను వదలగలదు. వీటిని త్యజించుట వలన మరొక వస్తువు ఏదోయొకటి మనకు లభ్యము కావలయునను ఆకాంక్షను వదలవచ్చును. అయితే నేను వీటన్నిటిని వదలితిని అనెడు అహంకారమును మాత్రము అంత సులభముగా వదలలేదు. మానవుడిని తనను వెన్నంటి వచ్చు నీడవలె సకల కార్యముల వెనుకనూ 'అహం' అనునది వెన్నంటియే వచ్చి అతని జన్మాంతరమునకు కారణమగుచున్నది. సామాన్యముగా నేను నేను అనెడు అభిమానాత్మక చిత్తవృత్తినే అహంకారమందురు. సంస్కృతమునందు అహంకార శబ్దము యొక్క వ్యుత్పత్తిని చ్యుహి యను సమాసము ద్వారా అత్యంత అర్థపూర్ణముగా నిరూపించబడినది.

"న అహం అనహం, అనహమేవ అహం కరోతీతి అహంకార:"

తాను కానిదానిని తానని భావించి తనతో కానట్టి దానిని తానే చేసితినని భావించెడు భావమే అహంకారము. వస్తుత: మానవుడు చేయు దానము నందు తనదన్నది యేదియును లేదు. అంతయునూ భగవంతునిదే.

"ఇల మీ దానము. పైరు మీ దానము. సుడి తిరిగి వీచు సుడిగాలి మీ దానము, మీ దానము ననుభవించి పరుల పొగడు నట్టి కుక్కల నేమందు రామనాథ! ఎద్దు మీ దానము, సమయము మీ దాన్మౌ, నాటి పెంచెడు ధాన్యములు మీ దానము, మీ దానము ననుభవించి పరుల పొగడెడు కుక్కల నేమందు రామనాథ!"

అని దేవర దాసిమయ్య సకలము తనదని మురిసిపోవు మానవుల మనసునకు తనదని ఎచ్చరిక సందేశమును చాతి చెప్పినారు. ఈ రీతిగ తనది కాని దానిని తనదని, తాను గడించితినని, తాను సాధించితిననిి భావించి, ఆ వస్తువులను సత్పాత్రులకు దానమిచ్చిన పిమ్మట నేనిచ్చితినని అభిమానము చూపెడు చిత్తవృత్తియే ఇట అహంకారము.

సహజ దానము: ఇచ్చువాడు శివుడే, తీసుకొనువాడు శివుడే. తీసుకొనుట అను ప్రక్రియ కూడా శివరూపమను భావము బలీయమై తాను దేనికిని కర్తను కాదని నమ్మి సహజ భావముతో నొసగెడు దానము సహజ దానము.

వస్తువులను ఇచ్చుట, వదులుట యనునవి నిజమైన త్యాగమనిపించుకొనవు. వాటితో బాటు వాటీ వదిలితిని అనెడు అభిమానమును వదిలినపుడే త్యాగమనిపించుకొనును. మహానుభావుడు బసవన్నయును వ్రాసిన ఒక వచనము ఇక్కడ స్మరించుకొనవలెను.

చేసితనునది మనసున కలిగిన

వెన్నంటి పీడించు శివుని ఢమరుకము

చేసితనకురా లింగమునకు చేసితనకురా జంగమునకు

చేసితనునది మనసునందు లేకున్న వేడిన నీవె

కూడల సంగమ దేవ!

గురు-లింగ-జంగములకు తను-మను-ధనములను సమర్పించునపుడును, అతిధులకు నమస్కరించునపుడును, సత్పాత్రులకు దానమిచ్చునపుడును మనో ఐహిక కోరికలను ప్రక్కకుంచుటతో బాటు సమర్పించితి, సత్కరించితి, ఇచ్చితి నను భావనను వదిలివేయాలి. ఒక చేతితో చేసిన దానము మరొక చేతికి తెలియరాదు. అట్లించ్చిననే అది భగవంతుని కృపకు కారణమవుతుంది. "చేసినట్లుండాలి, చేయనట్లుండాలి. చేయుపని యందు తాను లేనట్లుండాలి". ఈ రీతిగ చేయుటయే, ఇచ్చుటయే కర్మ కౌశలము. అదియే యోగము.

"ధర్మ: క్షరతి కీర్తనాత్" అనుటచే తాను చేసిన పుణ్య కార్యమును గురించి పరుల యెదుట చెప్పుకొనుట చేత అది (పుణ్యము) నశించిపోవును. ఆ కారణముగ తుద కే విధమగు ఫలమును లభిచదు. ఎందుకనగా తాను చేసిన దాన ధర్మములు గురించి పరుల యెదుట చెప్పుటన్నది ఆ దానధర్మము వెనుక నున్నది నేను చేసితిని అను అభిమానము. అటువంటి అభిమానమును వదిలివేసి ఇచ్చువాడు శివుడే, తీసుకొను వాడు శివుడే, ఎచ్చెడు మరియు తీసుకొను చేతులును శివమయమే అని తెలుసుకొని, తాను దేనికిని కారణము కాదని భావించి యొసగెడు దానమే సహజ దానమిపించును. ఇటువంటి దానమే పరమోత్కృష్టమైనది. పరమేశ్వరునికి ఇష్టమైనది.

మహేశ్వరస్థలపు సాధకుడు ఇటువంటి సహజ దానమును తన జీవితమున అలవరించుకొని ఉండును. ఇతడియందు తానొసగెన దానమునకు మారుగా మరొకటి వారి నుండి పొందవలయునను కోరిక లేక శివుడే యొసగెను, శివుడే గ్రహించెను, తాను అతడి నుండి ఇతడికి చేరవేయుటకు తగినట్టి మధ్యవర్తిని మాత్రమే అని భావించి అత్యంత నిష్ఠతో గురు-లింగ-జంగమ దాసోహము చేయుచు జీవించును. గురు భక్తి, లింగనిష్ఠ, జంగమ దాసోహమను వాని యొక్క ఆంతర్యము నిరభిమానము. ఇవి మహేశ్వర సాధకుని ఆచరణయందలి ముఖ్యాభిప్రాయము.

దాసోహము చేయునపుడు నేను చేసితి నను భావము కొంచెమైనను మనసునందు గుర్తునకు రారాదు. చేసితినను భావము తోచినచో అది దానము కావచ్చును కాని, సేవావృత్తి కాజాలదు. దాసోహము చేయించిన సద్భక్తుని ఇంటికి విచ్చేసిన జంగములు భక్తుడు చేయించిన ప్రసాదమును స్వీకరించుటకు మొదలు సకల పదార్థములను వడ్డన చేసి నివేదించిన పిదప భక్తునకు సాష్టాంగము చేయ నాజ్ఞాపించి "శివయోగిని సంత్రుప్తౌ" యను మంత్రమును చెప్పి చివరగ "అన్నదాతా సుఖీభవ, దాతా భోక్తా స్వయం శివ:" (అన్నదాత నీకు సుఖము కలుగనీ, వడ్డింప జేయువాడు శివుడే, స్వీకరించువాడును శివుడే) అని చెప్పిన పిదప పసాదమును స్వీకరింతురు. ఈ విషయమున వీరశైవ ధర్మపు ఉదాత్తతా కల్పన నిలువెత్తుగా లేచి కనిపించును. భక్తుడు, తినెడు జంగమునియందు నీవు స్వయం శివుడవే! నీ నుండి వచ్చిన అన్నమే ప్రసాదమను భావన యుండవలెను. వడ్డించెడు వానియందు జంగముడు మహానుభావుడే! జంగముడు మెట్టిన నేల పావనము అన్నదే ప్రసాదము, జంగముడు శివ స్వరుపుడు. జంగముదు సేవించి వదిలినదే ప్రసాదము అను భావన మనసునందు నిందారియుండవలెను. అపుడే అది ప్రసాదమవుతుంది, వడ్డించునది దాసోహమవుతుంది.

అట్లుగాక జంగములకు తినబెట్టి, కాపాడెడి వాడిని నేనను భావము భక్తుని యందు కలిగినచో, భక్తుని దాసోహమును స్వీకరించి, ఆశ్వీరదించి అతని జీవనమును పావనమొనరించెడి వాడను నేనను భావన జంగమునకు వచ్చినచో, అతడు భక్తుడు కానేరడు, ప్రసాదమును స్వీకరించిన వాడు జంగముడు కాడు. వారిరువురి మధ్యన దాసోహముకలుగదు, ప్రసాదమును సిధ్ధించదు. ఏలననగా ఇక్కడ భావ సామరస్యము లేదు. నిరభిమనము లేదు. శివానుభవమంటూ లేనే లేదు.

శూన్య సింహాసనాధికారియగు శూన్యమూర్తి అల్లమ ప్రభువు సాటిలేని భక్తుడగు 'బసవణ్ణ ' ఇంటికి విచ్చేసిరి. వినమ్ర శిరస్కుడై చేతులు జోడించి అల్లమ ప్రభువునకు నమస్కరించి స్వాగతము పలికెను. బసవణ్ణతో లోకాభి రామాయణము మాట్లాడుచు "బసవరసా! అందరు కుశలమే గదా! ఏ కష్టములును కలుగుటలేదు గదా! మందిరమున గొప్ప మనసుతో ఉదారముగా నడుపబడు దాసోహము ఎట్లు నదుచుచున్నది?" అని ప్రశ్నించిరి. "ప్రభూ! వాటన్నంటి వెన్నంటి తన్నుండగ దానికి కొరతేమి యుండును. తమ దయతో అంతయును సక్రమముగ నడుచుచున్నది. అయితే నేను ఆపేక్షించినంత మంది జంగములు వచ్చుట లేదు. వేడెడు వారు లేక పేద వాడినయితిని." అని బసవేశ్వరులు పలికిరి. బసవేశ్వరుల ఈ మాటలు విన్నచో మనందరకు ఆశ్చర్యమనిపిస్తుంది. 

మనము ధనధాన్యములు, ఆస్తిపాస్తులు, నగనట్రలు, వస్తు తతులు లేనందుకు పేదవారమయితే బసవణ్ణ గారు కోరెడు వారు లేక పేదవాడినయితిని అని చెప్పుటను పరిశీలించినపుడు వారి త్యాగము, దాసోహపు మనోభావము యొక్క గొప్పదనము మనకు తెలియుచున్నది.

మన అలోచన ఈ విధముగా ఉండగ, అల్లమ ప్రభువుల ఆలోచనా పథమే వేరు. ప్రతియొక సంఘటన మరియు మాటల వెనుకటి భావనలోని సూక్ష్మతను లోతుగా పరిశీలించెడు దృష్టి అల్లమ ప్రభువుల వారిది. వేడెడు వారు లేక పేదవాడినయితినని బసవణ్ణ పలికినట్లయిన మిగిలినవారు వేడెడి వారు, పెట్టెడివాడను నేను అనెడు సన్నపాటి గర్వము వారిలో పొటమరించును. ఈ గర్వమును తొలుదొల్తనే త్రుంచివేయుట మంచిదని భావించిన అల్లమ ప్రభు "బసవరసా! నేను వేడుటకై వచ్చినవాడను, నన్ను తృప్తి పరుచు" అని పలికి అతడితో గూడి లోనికి ప్రవేశించి, స్నాన పూజాదులను ముగించుకొని ప్రసాదమునకై కూర్చొనిరి. ప్రసాదమును నివేదించిరి. వడ్డించిన దంతటిని ముగించి ఇంకనూ తెమ్మని పలికిరి. తెచ్చి తిరిగి వడ్డించిరి. అదియును ముగిసిపోయెను. ఇట్లు లక్షల కొలది గణముల కొరకు సిద్ధము చేయబడిన ప్రసాదమును ప్రభుదేవు లొకరే సేవించి ఇంకను ప్రసాదమును వడ్డించుడని ఆజ్ఞాపించిరి. బసవణ్ణ చేతులు జోడించి "ప్రభూ! చేసిన వంటకమంతయును ముగిసి పోయినది. మరల చేయుటకు యత్నించుచున్నారు. అంతవరకు ఓపిక పట్టుడు." అని ప్రార్థించెను. ముసిముసి నవ్వు విరజిమ్మిన అల్లమ ప్రభు "నీవు ప్రసాదమును సిద్దమును చేయవలసిన ఆవశ్యకత లేదు. ఇట ఎడ చేయబడినదే ప్రసాదమవుతుంది. ఉండిన ధాన్యమునే ఉన్నట్లు వడ్డించుడు" అనెను. గింజ గిట్రలన్నియును అల్లమ ప్రభుని మహోదరమును చేరినవి. బసవణ్ణ భయమొందెను.

అంతలోనటకు చెన్న బసవణ్ణ విచ్చేసెను. బసవణ్ణ వ్యాకులత్వమునకు కారణము కనిపింపదయ్యెను. బసవణ్ణ వెనుక జరిగిన సంఘటన లన్నిటిని పూసగ్రుచ్చినట్లు తెలిపెను. "అల్లమ ప్రభునకు కావలసినది నీయన్నము కాదు. గింజ గిట్ర కాదు. నగనట్ర కాదు. నీ మనసు అను తరవు నందు చిగురించిన అహంకార మతనికి కావలసినది. అతని చెంతకు వెళ్ళి నన్నే స్వీకరించుమని నమస్కార మొనరింపుము. అపుడాతడు తృప్తుడగును". చెన్న బసవణ్ణ సలహా ప్రకారము అల్లమ ప్రభు చెంతకు చేరి నిలచి, పిచుక పై బ్రహ్మాస్త్రమెందుకు? ప్రభూ! తమ కృపచే మగల్గు భక్తుడను నేను. నేను తమకేమి ఇవ్వగల్గును. ఏరీతిగ తృప్తి పరచగల్గను. నన్నే తమకు నివేదనగా చేసియుంటిని. స్వీకరించి నన్ను కృతార్థునిగా చేయుము" అని సాష్టాంగ ప్రణామమొనరించిరి.

బసవణ్ణ మనోభావము మారి యుండుటను అర్థము చేసుకొనిన అల్లమ ప్రభుదేవులు "ఇపుడు తృప్తియైనది బసవణ్ణ"! అని పలుకుచు చేయి కడుగుకొని పైకి లేచిరి. బసవాణ్ణయును పైకి లేచి నిలచి చేతులు జోడించిరి. అంతలో చెన్న బసవణ్ణయును అచటకు విచ్చేసెను. అల్లమ ప్రభువుల మహా ఆకలి లీలను గాంచి ఆశ్చర్యపోయిరి. బసవణ్ణయు ప్రభుదేవులయెడ తిరిగి నా తప్పులనంత కోటి. మీ సహనమునకు లెక్కలేదు. అయిననూ "వేడెడు వారు లేక పేదనైతి" నని గర్వితుడనై పలికిన ఒక చిన్న మాటను సహింపజాలనైతిరి గదా! కొందరు ఎంతో గర్వాభిమానములతో గూడి భక్తి చూపుదురు. ఎవరి యెదుటను గర్వము చూపక ఒకటన్న ప్రల్లదములాడక, దురభిమానమును చూపక జీవించిన నేను కెవలము తమ యెదుట మాత్రమే పలికిన ఒక చిన్న మాటకు ఇంతటి కఠిన శిక్షయా? ప్రభూ! అని యడిగిరి. అప్పుడు అల్లమ ప్రభువులు,

వేశ్య అనేకుల పొందెనని నిందించు వారలు లెరు వినుమా!

పతివ్రత తనపతిని గాక మరొకరి ముఖమును చూచినపుడు

ఆమెను పతిత యన్నది లోకమంతయు

కీర్తివార్తగ చేయు భక్తుడు తప్పిన అది మనసుకు తేలేదు.

సజ్జన సద్భక్తుడు తప్పిన అది సహించరాదు వినుమా!

మా గుహేశ్వర లింగమునకు తొలినుండి అటునిటు నీవే భక్తుడైన కారణమున మనసు నొచ్చెను చూడుమో సంగన బసవణ్ణ! అని చెప్పిరి.

ఇనుమునందు ఎంతటి కల్ముషమున్నను దానిని శుభ్రపరచుటకాదు. బంగారమున కల్మషము చేరిన దానిని శుభ్రమొనరింప వలసి వచ్చును. ఆకారణముగా బసవణ్ణ! నీవు కేవలము భక్తుడవు కావు. పరిపూర్ణ భక్తుడవు. భక్త స్థలమను పరిపూర్ణ మొనరించి మాహేశ్వర స్థలమున కనువగు ఆచరణలను లోబరచు కొనుటకు తగినట్టి భక్తుడవు. చొక్కపు బంగారమున్నట్లు, దానికై నీలోను మరియు నీవు చేయు దాసోహము నందును కొంచెమైన దోషమన్నది మిగిలియుండరాదను ఆశయమే మాది. అందులకై నేనీ విధముగా చేయవలసి వచ్చినది అని మనసునకు హత్తుకొనునట్లు తెలియపరిచిరి. ఈ విధంగా సహజ దానము మరియు నైజమగు దాసోహము యొక్క విషయమును అందరికి తెలియ జేయుటకై ఈ జగతికి తెలియజేసిరి.

మాహేశ్వరపు స్థలపు సాధకుడు సాగించెడు దాసోహము నందును, చేసెడు దానము నందును ఎటువంటి దోషమును ఉండబోదు. ఇది మాహేశ్వర స్థలపు సాధకుని యొక్క బాహ్యాచరణ. బాహ్యాచరణతో బాటు ఇతడిలో ఆంతరికమైన లోక వికాసమును కలుగుచుండును.

ఇటువంటి మాహేశ్వరుడు నిష్ఠతోడను, భక్తి తోడను కూడు కొన్నప్పుడు గురులింగముతోడ అనుసంధానము చేయును. స్వాధిష్ఠాన చక్రమునందు శివయోగ సాధకునకు గోచరించెడు జ్యోతినే వీరశైవ దర్శనమునందు గురులింగ మని పేర్కొనబడినది. వీరశైవ షట్ స్థల సాధకుడు స్నానమొనరించి, శుచిర్భూతుడై పరిశుభ్రమొనరించిన స్థలమునందు తూర్పు లేక ఉత్తర దిశాభిముఖుడై పూజకు యోగ్యమైన ఆసనముపై (శాస్త్ర సమ్మతమైన ఆసనమనగా పద్మాసనము, స్వస్తికాసనము, సిద్ధాసనము, లేక సుఖాసనము) కూర్చొని, నాడీశుద్ధి మరియు ప్రాణామయములను చేసి తన ఇష్టలింగమును వామ హస్తమునందుంచుకొని, ఇష్టలింగమునందు దృష్టి నిలిపి, నిర్నిమేష దృష్టితో (కళ్ళు చిటుకరించక) ఆ లింగమును నిరీక్షించ వలయును. దానితో బాటు

చూపు నిలిచిన, తిరిగి ఎగిరెడు

గాలి నిలుచును గాలి నిలిచిన

మనసా పై నిలుచును

అను సూక్తి చొప్పున దృష్టిలో ఏకాగ్రత కలిగిన ఆ క్షణము నందె మన ప్రాణవాయువు పైన పట్టు సాధించదగును. తన స్వాధీనమునకు వచ్చిన ప్రాణవాయువును మూలాధారమందుండిన అపానవాయువునకు సంఘటింప జేయుట వలన అక్కడ జ్యోతి ఉత్పన్నమై వెలుగొందును. ఈ జ్యోతినే వీరశైవ శివయోగులు ఆచార లింగమని పిలుతురు. ఈ జ్యోతిని అనుసంధానమొనరించు భక్తస్థలపు సాధకుడు తన సహజ సాధనయందు ప్రగతిని సాథించి, ఆ జ్యోతిని ఊర్ధ్వముఖముగా నిలిపి, సుషుమ్నా మార్గముగా దానిని పైకి తెచ్చును. అది ఊర్ధ్వముఖముగా వచ్చి గుహ్యమందుండిన స్వాధిష్ఠాన చక్రమునందు నిలుచును. ఈ జ్యోతిని వీరశైవ సహజ పరిభాషయందు గురులింగమని పిలువబడును. మహేశ్వర స్థలపు సాధకుదు స్వాధిష్ఠాన చక్రమునందు నిలిచియున్న జ్యోతిరూపమగు ఈ గురులింగమును అనుసంధానమొనరించును. ఇది మహేశ్వర స్థలపు ఆంతరికమగు సహజ వికాసము.

మొత్తము మీద మాహేశ్వర స్థలపు సాధకుడు శివుడిని తన పరమ బంధువని భావించుటతో బాటు అతడిలో నిష్ఠా భక్తులు కలిగినవాడై అతడి స్వరూపమునబడు గురు-లింగ-జంగములకు సహజ దానమును మరియు దాసోహమును చేయుచు, గురులింగములతో అనుసంధానము చేయుచు తాను చేయు సాధనను ముందునకు సాగించును.

పైపటలములో చూపిన భావసంబంధమైన దైవము-భక్తి సంబంధము జీవునకంటుకొని యుండిన భవ బంధనమును విడిపించి కాపాడుతూ ఉంటుంది. ఇదొక విధముగా బట్టలకు వాడెడు సబ్బు వంటిది. శుభ్రమయిన వస్త్రములకు వివిధములగు మలినములంటుకొని అది క్రమేణా మలినమవుతుంది. దానికి సబ్బు పట్టించి ఉతికితే, మలినము తొలిగిపొయి తిరిగి తొలుతటివలె నిర్మలమవుతుంది. దీనివలెనే ప్రాపంచిక సంబంధములతో మానవుని మనసు మలినపూరితమై బంధనమునకు లోనవుతుంది. దైవ సంబంధముతో కూడినపుడు అతని మనసు నిర్మలమయి ముక్తుడౌతాడు. దీనిని క్లుప్తంగా క్రింది ఇచ్చిన పటలములో తెలియపరచబడింది.