వీరశైవము - శ్రేష్ఠత్వము

"న వీరశైవ సదృశం మతమస్త జగత్రయే" అనునది ఆగమవాక్యము. ఇట్టి ధర్మమును అవలంబించెడి వీరశైవులు కర్మ, జ్ఞాన సముచ్చయ మార్గమున ఆధ్యాత్మిక సాధన చేయుచు తమ యొక్క ఔన్నత్యమును నిరూపించుకొనుచున్నారు.

వీరశైవులకు లింగాంగ సామరస్యమే ఏకైక లక్ష్యముగా నిలచియున్నది. సిద్ధాంత శిఖామణి ప్రకారము వీరశైవుడు శివ జీవైక్య సాధికయగు ఆధ్యాత్మిక విద్యలో నిరంతరము క్రీడించుచుండును. ఆ విధముగా అతడు జ్ఞాన మార్గమున మహోత్కృష్ట స్థాయిని పొందుచున్నాడు.

అంతియే కాకుండా, అతడు గురు-లింగ-జంగమ-విభూతి, రుద్రాక్ష మంత్రము, పాదోదకము-ప్రసాదములు అనెడి అష్టావరణములచే పరిరక్షితుడై అష్టమదములు - అరిషట్ వర్గములనెడి శత్రు సమూహం నుండి సురక్షితమైన కాయమును కలిగి విరాజిల్లుచుండును. గురువుగారొసగిన శివదీక్షవలన త్రిమలావరణములు పరిచ్ఛేదితములై యుండగా దేదీప్యమానముగా వెలిగెడి దివ్యప్రకాశము కలవాడుగా నుండును. షట్ చక్రముల స్థానమున షణ్ లింగము విరాజిల్లుచుండగా ఆ లింగములను షట్ స్థలముల లోనూ విలీనము చేసే ప్రక్రియలో సాధన చేసెడివారు. ఈ సాధనలో సదాచార, శివాచార, లింగాచార, గణాచార్య, భృత్వాచారములనెడి ఆచార పంచకముచే అంతరంగ బహిరంగ శుద్ధులను సాధించును. క్రమేపి భక్తి, మహేశ, ప్రసాది, ప్రాణలింగ, శరణ, ఐక్యములను షట్ స్థలముల నధిరోహించి చివరకు ఐక్య స్థలాతీతమగు శూన్యస్థలమును పొందుచున్నాడు. ఈ స్థలమే నిర్గుణ శివపరబ్రహ్మ స్థలముగా పరిగణింపబడెను. ఇది శైవ, వైష్ణవ, శాక్తేయ గణాపత్య, సౌరభృతి మతానుయాయులు కాంక్షించెడి చతుర్విధ మోక్షముల (సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య) కంటే గుణాదిక్యత కలిగియున్నది. జీవుడు శివుడిగా పరిణతి చెంది భూలోకమును కైలాసముగా మార్చెడి శక్తి సామర్ధ్యములు సాధించెడి దశకు వీరశైవ సాధకుడు చేరుచున్నాడు.

ఈ కారణము వలననే ఎందరో భక్తులు శివుడు ప్రత్యక్షమై మోక్షము ప్రసాదించెదననినను అది నిరాకరించి భూలోకముననే లింగాంగ సారరస్య సాధకుడగు వీరశైవుడుగా నిలచిపోయిన సందర్భములు బసవపురాణములో ఎన్నియో గలవు.

శివుడే పరబ్రహ్మ: శక్తి విశిష్టుడైన శివుదు తన ఆధీనమున నున్న ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తులలో సృష్టి స్థితులను గావించుచున్నాడు. అందుచేత వీరశైవతత్వమున బ్రహ్మకు సృష్టికర్తగాను, విష్ణువునకు స్థితికర్తగాను భావించు ఆస్కారమే లేదు. బసవన్న ఈ విషయమును తమవచనాలలో నొక్కి చెప్పడమయినది.

శివుడే భవుడై సృష్టిరచనను,మృడుడై జగత్ పాలనమును గావించుచున్నాడు. అంతిమ కాలమున హరుడై విలయమును చేయుచున్నాడు. నిర్గుణ శివబ్రహ్మయై తిరోధానాను గ్రహములకు కారణమగుచున్నాడు. అతడే సర్వవిద్యలకు అధిపతియై ఉన్నాడు. అందుచేత వాచస్పతిని గాని, దేవి వాచాకుగాని వీరశైవ సంస్కృతిలో విశిష్టస్థానము లేదు. క్రియాశక్తి అథిపతిగా, లోకపాలకుడుగా నున్నందున శివుని ఆజ్ఞలేనిది చీమయైన కుట్టదు. కావున ఇంద్రాది దిక్పాలకులకు కూడా వీరశైవమున ప్రత్యేక స్థానము లేదు. ఈ కారణముల వలన వీరశైవ సంస్కారములో అష్టదిక్పాలకులకు కాని, నవగ్రహములకు గాని, దేవిద్వయము (సరస్వతి, లక్ష్మి) నకు స్థానములేదు. శివుడే ఇచ్చాశక్తికి అధిపతియై, భగవంతుడై, ఐశ్వర్యప్రదాతయై విరాజిల్లుచున్నాడు. లక్ష్మీదేవి అతని అనుగ్రహము వలననే ఐశ్వర్యమునకు అధిదేవతయైనదని పురాణ ప్రసిద్ధి కలదు. ఈ కారణమువలన వీరశైవులు శివుని మాత్రమే పరబ్రహ్మగా ఎంచి పూజించెదరు.

శివభక్తిని పెంపొందించుటకొరకై శివలీలను తప్పక స్మరించెదరు. శివుని పంచ వింశతి లీలలను నిత్యపారాయణము చేపట్టవలెను. ఈ సందర్భమున శివసహస్ర నామ పారాయణ ప్రాముఖ్యతను గుర్తించవలెను. ఈ శివ సహస్ర నామ ప్రశస్తి మహాభారతములోని ద్రోణపర్వమున కాంచగలరు. ధర్మరాజు భీష్మునిచే విష్ణుసహస్రనామ విషయమును విని శివసహస్ర మహిమను కూడా బోధించమని అభ్యర్థించగా భీష్ముడు అది నాకసాధ్యమైనదనియు, బోధించు శక్తి చాలదనియు శ్రీకృష్ణుని అభ్యర్థించి ఆయనచే గ్రహించమని వివరించెను.

శ్రీకృష్ణుడు తన బాల్యమున ఉపమన్యు మహర్షిచే ఉపదేశమును పొందిన, సకలాభీష్టఫల దాయకమగు శివ సహస్ర నామ మహిమను ధర్మరాజునకు బోధించెను. ఈ కారణమున శివ సహస్రనామ పారాయణము, విష్ణు సహస్ర నామ పారాయణము కంటే అధిక ఫలదాయకమని గుర్తించి తప్పని సరిగా శివ సహస్రనామ పారాయణము చేయగలరు. వీరశైవులు తప్పనిసరిగా శివ సంబంధమయిన స్తోత్రములను పఠించెదరు. శక్తి విశిష్టాద్వైత భావిపూరితములగు మహిమ్నస్తవము, మల్హన, బిల్హణ, అనామయ, హలాయుధ స్తవములను పఠించెదరు.

లింగోపాసన తత్వము: అన్యులు చతుర్విధ ఉరుషార్థములు కోరుచు నుండగ వీరశైవుడు భక్తి పురుషార్థాన్నే కోరుకుంటాడు. అర్చ్నాదులకు లింగమే ఉపాసనీయము. శివమూర్త్యర్చనము వీరశాఇవులకు విహితము కాదు. లింగాచారమును అనుసరించెడి వీరశైవునుకి లింగతత్వము సుపరిచితమై ఉండవలెను. ఈ తత్వము వీరశైవ ధార్మిక గ్రంథములలో వివరింపబడినది. ఇట్టి గ్రంథములన్నింటికినీ సిద్ధాంత శిఖామణియే మూలాధారము. ఇందులో సైద్ధాంతిక వివరణ ఇవ్వబడినది. ఆచార్య రేణుకాచార్యుల వారు దీనిని అగస్త్యునికి బోధించేవారు. శ్రీకంఠ భాష్యము, నీలకంఠభాష్యము, శ్రీకరభాష్యము, సోమనాధ భాష్యము దీనిలోని అంశాలకు వాఖ్యానములు, లింగాంగుడైన వీరశైవుని చేత వైదిక సంస్కారములను చేయించుకునే లోకులు సకల విధములుగా ధన్యులగుచున్నారు.

గురువు ప్రాముఖ్యత: స్వార్థముగురించి సాధన చేసే వీరశైవునకు లింగోపాసనయే పరమ కర్తవ్యమని తెలుసు కొనవలెను. లింగోపాసనకు అర్హతను భక్తునకిచ్చెడి గురువే వీరశైవునకు సర్వోత్కృష్టుడు. హరుడే గురువై లోకమును ఉద్దరించుటకై విచ్చేయునని ఆగములు తెలుపుచున్నవి. గురువే పరమ పూజ్యుడు. గురువే తల్లి. గురుఏ తండ్రి. జన్మనిచ్చిన వారి కంటెను గురువే అధికుడు. గురువును సేవించి ధన్యతపడయవలెనని గుర్తించవెలెను. గురు సేవకై దేహమును సమర్పించిన వీరశైవుడే ధన్యుడని శివాగమసూక్తి కలదు. గురు ధిక్కారము, గురు వచనోల్లంఘనము, గురు గౌరవధంగము మున్నగునవి నరక హేతువులగు మహాపాతకములని గుర్తింపబడినవి. లింగధారణలో గురువునకు ప్రధాన ప్రమేయము గలదు. "గురువు" శిష్యుని దుర్గుణములనెల్ల మాన్పి సద్గుణములు గల వానిగ యొనర్చును.

గురువుగారి పాదపూజ, శ్రీ గురువు క్రియా పాదోదకము, శ్రీ గురువు ప్రసాదములలో ప్రమేయము లేకుండా చేయబడే లింగధారణలకు, ధార్మిక అస్తిత్వము లేదని గ్రహింపదగును. సాంప్రదాయానుగతముగా వీరశైవులకు పంచాచార్యులే గురుస్థానమున ఉన్నారు. గతానుగతముగా నొక ఆచార్యుడు గురువగును. వీరికి ప్రాతినిధ్యము వహించేవాడే మఠస్థ అయ్య. మఠమయ్యగా గౌరవింపబడెడి వీరులేకుండగ వీరశైవ సంస్కారములను చేపట్టజాలము. ఉత్తమ మయిన మఠమయ్య సిద్ధాంత శిఖామణిలోని రహస్యాలను గుర్తెరిగి, నైష్టికుడై త్రికాల స్వేష్ట (ఇష్ట) లింగార్చకుడై చరపట్టాధికారముగల చరమూర్తులను పూజిస్తూ పునీతుడై యుండును. లింగనిష్ఠాపర తంత్రుడై అన్యదేవతా ఉపాసనము యెడల విముఖత గల్గియుండును. లింగార్పిత పదార్థములను మాత్రమే ప్రసాద భావమున గ్రహించును. భవి పాకమును తిరస్కరించును. ఇట్టి గురువును సేవించే వీరశైవుడు ధన్యుడు కాకుండా ఉండునే?వీరశైవ సంస్కారములలో మడపతయ్య పురోహితుడై లోకహితమును చేయుచున్నాడు. వీరిని సముచితముగా గౌరవించి, భూరి దక్షిణల నిచ్చి సంతృప్తి పరచవలెనని పెద్దల అభిప్రాయము. వీరిరువురును వీరశైవ సంస్కారములలో అనివార్యులని గుర్తించవలెను.

లింగధారణ ఆవశ్యకత: లింగమునకు వీరశైవమున ప్రముఖ స్థానము కలదు. లింగమే పరబ్రహ్మమని గుర్తించాలి. గురుదత్తమయిన స్వేష్ఠ లింగమును ధరించి, అనునిత్యము పూజించుట వల్లనే వీరశైవునకు ఆధ్యాత్మిక శ్రేష్టత లభించుచున్నది. లింగమునకు శ్రేష్టత లభించుచున్నది. లింగమునకు దూరమయిన వీరశైవుడు మలదేహిగా మారి భవిత్వమును పొందును. అజ్ఞాన వశముననో, మరేకారణమువలననో లింగధారణకు దూరమయిన వీరశైవుడు తక్షణమే తన తప్పిదమును గుర్తించవలెను. గురువు నాశ్రయించవలెను. లింగదీక్షను బడసి, లింగధారియై, నిత్య లింగార్చకుడై లింగ ప్రసాద పరిపోషిత దివ్యాంగుడై ధన్యుడు కావలెను. లింగధారణ లేకుండగ వీరశైవత్వం సంప్రాప్తము కాదని గుర్తించవలెను.

వీరశైవత్వము జన్మత: లభించేది కాదనియును, లింగాచారత: లభించేదనియును, ఆచారమే స్వర్గమయి నందున లింగవంతులై ఇహపరములకు భద్రత చేకూర్చుకొనవలె ననియును చెప్పవచ్చును. మాతృగర్భములో ఉన్నప్పుడే లింగధారణ సంస్కారము పొందవలెననెడిది శాస్త్రనియమము. ప్రసవానంతరం సాధ్యమయినంత త్వరగా లింగధారణ చేయుట శ్రేయస్కరము.

శాస్త్రోక్త విధిన లింగధారణ చేయని యెడల ప్రయోజనము శూన్యమని గ్రహించవలెను. ఇష్ట లింగోపాసన అనెడిది వీరశైవుని ప్రాథమిక విధి. అను నిత్యము పూజించవలెను. త్రికాలము పూజించి లింగార్పిత నివేదనలను మాత్రమే స్వీకరించుట ఉత్తమము. ద్వికాల పూజ మద్యమము, ఏకకాలమైననూ చేయుకుండా ఉండుట అనెడిది సమర్థనీయము కాదు.

జంగమ ప్రాముఖ్యత: వీరశైవమున గురులింగ జంగములే త్రిమూర్తులు. శివుడే ఈ మూడు రూపములను ధరించి భక్తులను ఉద్దరించుచున్నాడు. భూరుద్రుడగు జంగమయ్య లోకారాధ్యడగుచున్నాడు. పరంపరానుగతముగా వచ్చిన సంస్కారముల వలన పునీతుడై, అంతరంగ బహిరంగములను నిర్మలము గావించుకొని పంచాచార సంబంధిత ప్రవర్తన గల్గి, షట్ స్థల జ్ఞానసంపన్నుడై, నిత్యనైమితకములలో లింగార్చనాదులతో పాటు స్వాధ్యాయన పరాయణత్వము కల్గి వెలిగెడి జంగమయ్య చరలింగమే అనుటలో సందేహము లేదు. వివిధ సంస్కారముల సందర్భములలో భక్తులు జంగమ సత్కారమును విధిగా చేయాలనెడి పరంపరానుగత ఆచారము కలదు. భూరి దక్షిణలివ్వాలని చెప్పబడినది. వీరశైవాచార పరాయణులను గౌరవించి తీరవలెననె అంశము అభిస్మరణీయమే. నిరాదారణ మంచిది కాదని వీరశైవాచార ప్రదీపకలో చెప్పబడినది.

భస్మధారణ ఆవశ్యకత: భస్మము "త్రిలోకపావనం" అని ఆగమమందు తెలుపుచున్నది.భస్మ త్రిపుండ్రాంకిత ఫాలభగుడై వీరశైవుడు శివతేజమును వెదజల్లవలెనని శివాచారము తెలుపుచున్నది.

రుద్రాక్ష ధారణ ఆవశ్యకత: రుద్రాక్ష ధారణ వీరశైవమున అనివార్యము. రుద్రాక్షలు ధరించనిదే రుద్రతేజము ప్రస్ఫుటముకాదు. ఓషాది గుణములు గల రుద్రాక్ష ఆరోగ్యకారకమని ఆయుర్వేద వైద్యులు ఉద్ఘొషించుచున్నారు.

మంత్రం - పంచాక్షరి: పంచాక్షరి మంత్రమే వీరశైవులకు విహితమై ఉన్నది. "మంత్ర జపము" చేయుట వలన దేహమున గల అణవాది మలములు హరించును.

పాదోదకము - ప్రసాదము ఆవశ్యకత: (జంగమ) చరలింగ పాదోదకము వలన ఇహపర సుఖములు లభించునని శివాగమములు తెలుపుచున్నవి. అదే విధిన చరలింగ ప్రసాదమునకు విశేష మహిమలు కలవని చెప్పబడినవి. జీవన్ముక్తికి కారకములగు వీటిని విధిగా స్వీకరించాలని విజ్ఞుల అభిప్రాయము. భక్తి పరిపక్వత పొందిన వారికి ఈ విషయము సుభోదకమే. అట్టి వారే ఈ రెంటిని పవిత్ర భావముతో స్వీకరించగలరు. ఇతరులకు పాదోదకమున మాలిన్యము, ప్రసాదము నందు యెంగిలి గోచరించగలదు. ఆధునిక నాగరికత ప్రభావము వలన భక్తి భావము సన్నగిల్లుచున్నది. ఆగమ బోధనల యెడ నమ్మకమును వహించి, నియమ పాలన చేసినచో ప్రమాదికము కాజాలదనియును, అపనమ్మకమే అనారోగ్య కారకమని సనాతనుల ఉవాచ. అపనమ్మకముతో అమృతము సేవించినను, అది విషతుల్యముగా పరిణమించును గాదా!

పంచాచారములు: గురు లింగ జంగమాదులు వీరశైవానికి అంగమ నియును, పంచాచారముకు ప్రాణమనియును తెలుపబడినది. పంచాచారములే అష్టావరణములు. జీవములేని కాయము వంటిదని గ్రహింపదగును.

పంచాచారములు వీరశైవుడు పాటించవలసిన ఆధారములను తెలుపుచున్నవి. ఆచారవంతుడైన వీరశైవుడు శీలసంపన్నుడై ఆధ్యత్మిక ప్రగతిని సాధించును. లేని యెడల పతనమును చవి చూస్తాడు. అందుకే బసవన్న "ఆచారమే స్వర్గము - అనాచారమే నరకమని" తెలిపిరి.

1. లింగాచారము: పంచాచారములలో "లింగాచారము" మొదటి దానిగా భావించవలెను. గురు ధర్మమైన లింగమునే శివునిగా యెంచి, దానికంటెను మించిన దైవము వేరొకండు లేదని భావించుటయే లింగాచారమని తెలుపబడినది. గురుదత్తమయిన లింగములు మూడని (3) యెంచవలెను. అవి ఇష్ట-ప్రాణ-భావలింగములు.

వీటి ప్రభేధములే ఆచార లింగ, గురులింగ, చరలింగ, ప్రసాదలింగ, మహాలింగములు. వీటిని అర్చించుట వలన ఇష్టార్థ సిద్ధితో పాటుగా లింగాంగ సామరస్యము సిద్ధించునని చెప్పబడినది. పరంపరానుగతముగా వచ్చుచున్న లింగవంతుడనే పదము లింగాచారమును పాటించే వానికి అనువర్తించునని గుర్తింపదగును. లింగవంతుడు సదాచారము గల్గి యుండవలెను.

2. సదాచారము: సత్ప్రవర్తన గల్గియుండుటయే సదాచారమని స్థూలార్థము. శుద్ధ పరిశుద్దాంతరంగ బహిరంగములు గలవాడై, మద్య మాంసాది నిషిద్ధ పదార్థములను విస్మరించి, సాత్విక శాఖాహార నియమ సంపన్నుడై, భవిసంస్కృతి ప్రభావమునకు గురి కాకుండా జీవిస్తూ, భవిపాకము తినకుండా, పవిత్ర కాయము వలన ధనార్జన చేస్తూ శక్త్యానుసారము గురులింగ, చరలింగములకు దాసోహాదులను, భక్తులను సమారాధన సత్కారాదులను చేసి తత్ఫలితముగా లభించిన ప్రసాదమును గ్రహిస్తూ జీవించెడి వాడు సదాచారియను విశిష్టార్థము కలదు. సత్యవాక్పరిపాలన, అస్తేయము, అహింసా ఇత్యాది సద్గుణ సంపత్తి గల్గి ఉండాలను నియమము కలదు. దయార్ద్ర హృదయుడై సకల జీవరాశి యెడల హితభావమును వహించి, జంతు హింసను ప్రోత్సహించే కర్మకాండను నిరాకరించవలెనని చెప్పబడినది. ప్రకృతి అంశములోను శివుడున్నాడనే సత్యమునూ గ్రహించి మెలిగెడి భావ సౌందర్యము గలవాడే సదాచారియని గ్రహింపవలెను. సదాచారము పాటించేవాడు, శివాచారము సదాచారానికి ప్రాణపదమని గ్రహింపవలెను.

3. శివాచారము: శివుడే పరబ్రహ్మయైయును, శక్తిశివాధీనమై చరిస్తూ ప్రకృతిగా పరిణమించుననియును, మాయా ప్రభావమునకు లోనైన జీవి పురుషుడుగా రూపొందిన శివాంశయనియు, తలపవలెను. శివుడే పశుపతి యనియును, అన్యులెల్లరూ పశుతుల్యులనియును యెంచవలెను. శివభక్తి పరతంత్రుడై ద్విదైవ, త్రిదైవ, బహుదైవ, ఇత్యాది భావములను వదిలి వేయవలెను. "శివ మంగళం శుభం" అను భావమును వహించి భావిశుద్ధి కలవాడై "సర్వం శివమయం జగత్తని" నమ్మవలెను. జగత్తు యొక్క హితమునకు కృషి చేస్తూ శివంకరుడుగాను సకలలోక సుఖప్రదాత గాను చూడవలెను. "సత్యం-శివం-సుందరం" ల సాకార స్వరూపమే శివాచారి యని గ్రహింపదగును. విషయ సుఖములకు దూరమై ఇంద్రియలోలత్వము వీడి, మదాష్టకమును మర్థించి, అరిషడ్వర్గమును జయించి నిజమయిన సుఖమును అనుభవిస్తూ, శివానంద చిత్రముద్రమున క్రీడించేవాడే శివాచారియని గుర్తించవలెను.

4. గణాచారము: శివాచారమూ నాచరించేవాడు గణాచారమును గుర్తించిన యెడల అభద్రతాభావము విస్తరించి విస్తృతమయిన ఉపద్రవము వాటిల్లును. ప్రాథమికముగా గణాచారము శిక్షణకు సంబంధం కల్గినట్టి ఆచారము. శివనింద చేసేవారిని నిరోధించి, నిలదీసి, నిందానివారణార్థమై, చర్యలకు పూనుకోవలెను. శివాలయములకును, శివభక్తులకును, ఉపద్రవము వాటిల్లినప్పుడు వీరవ్రతి అయిన వీరశైవుడు వీరుడై సమయోచితముగా పోరాడవలెను. ద్వేష భావమును వహించవలదు. ప్రతివాదిని శిక్షించుట యనేది ముఖ్యము కాదు. ఎదుటి వాడిలోని దుర్మార్గ ధోరణులకు కారకములుగా నిలచిన ప్రేరకాలను త్రుంచవలెను. పంచ సూతకాలను వీడి ధరించవలెనను నియమము కలదు.

5. భృత్యాచారము: గణాచారము చేసేవాడు భృత్యాచారమును చేపట్టి స్వీయ అహంకార నివృత్తికై పాటు పడవలెను. "నా కన్న పిన్నలు లేరు. శివభక్తులకన్న పెద్దలేరనిన" బసవన్న వచనము ఋత్యాచారమునకద్దము పట్టుచున్నది. లింగాగులే శివభక్తుల సర్వోత్కృష్టతను అంగీకరించవలెను. స్వీయ అపరత్వమును ప్రకటించవలెను. లింగాంగులను, గురు, చరలింగములను సేవించి ధన్యత పడయవలెను. "శివదాస" భావన వహించవలెను. "దైవం మానుష రూపేణ" యనే సూక్తిని నమ్మి ప్రతి లింగాంగ భక్తుడు సాక్షాత్తుగా శివుడేనని భావింపవలెను. శివ భక్తుల సర్వతోముఖ శ్రేయస్సుకై తమ సర్వమును సమర్పించు కొనుటకు సంసిద్ధుడు కావలెను. అంత్యజుడైనవాడు లింగాంగుడైతే అతనిని కులజునిగానే భావించాలి. లోకమున రెండే రెండు వర్గములున్నవనియును, ఒకరు లింగాంగులు మరొకని లింగరహితులని పరిగణించవలెను. శివభక్తులెల్లరూ సమానులైన తాను వారికంటే తక్కువవాడని యెంచుట వలన అహంకారము నశించిపోవును.