వీరశైవ సిద్ధాంతము-లక్షణాలు
వీరశైవ సిద్ధాంతమునకు భేదబేదా సిద్ధాంతమని పేరు. దీని ప్రకారము శివునికీని జీవునికీని అభేదత్వము చాలా కొంచెం మాత్రమే. ఇద్దరున్నూ నిత్యులే. అంతటితో అభేదత్వము సరి. ఇద్దరికిని భేదమే ఎక్కువ.
శివుడు పూర్ణుడు, జీవుడపూర్ణుడు
ఈశ్వరుడు ప్రభువు, శక్తుడు, ముఖ్యుడు.
జీవుడు భక్తుడు, అశక్తుడు, అముఖ్యుడు
ఈశ్వరుడు సర్వస్వతంత్రుడు.
జీవుడు సర్వాధీనతంత్రుడు. జీవునికి సారూప్యముక్తి మాత్రమే ఉన్నది. ఇదే శివసామరస్యము. జీవునికి సారూప్యమే కాని సాయుజ్యము లేదు. నిరతిశయ స్వరూపానంద సాక్షి, స్వప్రకాశ శివరూప పరాహంభావపత్తియే ముక్తి. ఈశ్వరునికే కర్తృత్వ శక్తి ఉన్నది.
వీరశైవ సిద్ధాంతమును విశ్వసించి షట్ స్థలమనే అభ్యాసయోగము చేయుట చేత శివత్వము ప్రాప్తిస్తుంది. దీనికి ఊఅసన, ధ్యానము, ధారణము, జ్ఞానము అనేవి సాధనములు. జ్ఞానము చేతనే శివత్యం కలుగుతుంది. ఈశ్వరుడు ద్రష్టవ్యుడు, శ్రోతవ్యుడు, మంతవ్యుడు, నిదిధ్యాసితవ్యుడు. అట్లు చేస్తేనే జ్ఞానోత్పత్తి అవుతుంది. షట్ స్థలజ్ఞానము లేక యోగము కుదరదు. వీరశైవ సిద్ధాంతములో షట్ స్థలజ్ఞానము చాలా ముఖ్యమైనది.
'వి' అంటే విద్య, విద్యలో రమిస్తారు కాబట్టి వీరశైవులని చెప్పబడుతారు. విద్యలో రమించేవాడు వీరుడు. శివరూపమయిన విద్యలో విశేషముగా రమించేవాడు కాబట్టి వీరశైవుడనిపించు కొంటాడు. విద్యలో రమిస్తూ హేయమయిన మాయను విడిచి పెట్టుతాడు. కాబట్టి వీరమహేశ్వరుడౌతాడు. మహేశ్వరులు కర్మయజ్ఞరతులు, బాహ్యపూజ చేస్తారు.
'వి' శబ్దేనోచ్యతే విద్యా శివజీవైక్యబోధినీ|
తస్యా రమంతే యై శైవా వీరశైవాస్తు తేమతా:||
ఈ కారణమున ఈ శైవుడు సర్వజగత్తునందును విశిష్టుడుగా గణింపబడుచుండుట. 'వీరు' డనబడుచున్నాడు.
వీరుడనగా.....
ఒకడు ఒక సైన్యశాఖ యందు చేరియున్నాడనుకొందాము. అంత మాత్రమున వానిని మనము వీరుడనలేము. వాడు రణరంగమున తన శత్రువుతో పోరాడుచు తన లక్ష్యము (శత్రుమరణము) నుండి ఏ మాత్రమును చలింపకుండవలయును. ధనదరాధికముల అంటె ఆత్మ ప్రాణములను గూడ తృణమువలె నైనను లెక్కింపక కర్తవ్య విముఖతకు దూరుడై ఉండవలెను. రణరంగమున తన శతృవును చంపవలయును. అట్లుగాని యెడల తాను చావవలయును కాని వెనుకంజ వేయకూడదు. అప్పుడే మనము వానిని వీరుడనుచుందుము. ప్రాణమందలి తీపిచే ఏదో నెపమున యుదిష్టలక్ష్యమును ముట్టజాలక పారిపోవుటకు అలవడిన వానిని మనమెట్లు వీరుడనజాలము. అట్లే ఈ వీరశైవుడును ఏదో ఒక శైవశాఖయందు చేరినవాడు మాత్రమేగాక తన యుదిష్ట లక్ష్యము (లింగాంగ సామరస్యము) నకు విద్యా చరణయందు కర్తవ్య హానిని సహింపనివాడై ఉండవలెను. అట్లుగాని యెడ ప్రాణములను త్యజించి తీరవలెను. ప్రాణహానికిని సుఖమున ఓర్చుకొనదగును. కాని కర్తవ్య హానికి ఏ తీరునను ఓర్చుకొనకూడదు. అట్లుగాక ప్రాయశ్చిత్తమను నెపమున వ్రతహాని కోర్చుకొనుటకు అలవాటుపడిన ఏ శైవులును ఈ "వీర" విశేషణమునకు అర్హులు కారు అనుట లౌకిక న్యాయమును మనము గుర్తించగలుగుచుంటిమి.
ఈ ప్రమాణముచే ఈ వీర విశేషణము శాస్త్ర దృష్టిని సార్దకమయినదియే గాని నామమాత్రమింతయును కాజాలదు. అట్లే లౌకిక దృష్టిలోను ఇది సార్ధకమైనదియే!
విశిష్ఠత: గురుడు హస్త మస్తక సరియోగమున జిత్కళాన్యాస మొనరించి ఆణవ, కార్మిక, మాయామలములను, వేదమను క్రియాత్మక త్రివిధ దీక్షలచే దగ్ధమొనర్చి, భౌతిక శరీరమును లింగ శరీరముగ జేసి ప్రసాదించిన ఇష్టలింగము ను స్థూల శరీరమున కంఠమునగాని, శిరమునగాని, భుజమున గాని, వక్షమున గాని ధరించుచు సూక్ష్మ కారణ శరీరముల నిష్టితమయిన ప్రాణభావలింగములతో దానికి అవినాభావముగ ఐక్యానుసంధానము అలవరించుకొనుచు, హస్తాంబుజ పీఠము నందుంచికొని అనన్య చిత్తముతో అర్చించుట, ప్రణవ సహిత శైవపంచాక్షరీ మంత్రము మినహా మఱియే ఇతర మంత్రములను మననము చేయకుండుట. ఇష్టలింగార్చనకన్నా భిన్నములయిన కర్మములనెల్ల పరిహరించుట, శరీరము నుండి ఇష్టలింగము ప్రమాద పతిత మయినను వెంటనే ప్రాణత్యాగమొనరించుట, లింగైక్యమైనప్పుదు సాధకుని ఇష్టలింగము నాతని హస్తంబుజ పీఠముననే యుంచి అర్చించి యాతనితో ఖనన మొనరించుట వీరశైవ లక్షణము.
ఈ వీరవ్రతమును విశేషాచార నియమములతో నిర్వహించువారు విశేష వీరశైవులు. ఆజన్మము విరక్తులై (యతీశ్వరులు) సర్వోత్తముగ నిర్వహించువారు నిరాధారులు.
ఏకేశ్వరోపాసనాత్మకమై సులభ ప్రక్రియతోను ఉత్తమోత్తమ ఫలప్రదాయకమగు ఈ వీరవ్రతము కులాంగనా సదృశమనియు తక్కినవి...గణి....కాంగనాతుల్యములనియు ముముక్షువులకిదియే ముఖ్యముగ వరణీయ మని జెప్పబడినది.
సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అను శివుని పంచ వదనములనుండి ఐదుగురాచార్యులు ఉద్భవించి వేరువేరు యుగములో వేరు వేరు నామములతో వ్యవహరించుచు, కావలసిన చోటలనెల్ల గగన యానమున విహరించుచు ప్రపంచమంతట శైవమతోద్ధారణ మొనర్తురనియు వారే వీరశైవులకు గోత్రకర్తలనియు శైవాగమములలో జెప్పబడినది. ఇట్లు ఉద్భవించిన ఆ గోత్రకర్తల తొలినామములు వీర, నంది, భృంగి, (భృంగిరిటి) వృష, స్కంధ అనునవి. వీరే
కృతయుగమున: ఏకాక్షర, ద్వక్షర, త్యక్షర, చతురక్షర, పంచక్షర నామములతోను,
త్రేతాయుగమున: ఏక వక్త్ర, ద్వివక్త్ర, త్రివక్త్ర, చతుర్వక్త్ర, పంచవక్త్ర నామములతోను,
ద్వాపరమున: రేణుక, దారుక, శంఖుకర్ణ (ఘంటాకర్ణ), ధేనుకర్ణ, (గజకర్ణ) విశ్వకర్ణ నామములతోను,
కలియుగమున: రేవణసిద్ద, మరుళసిద్ద, ఏకోరామ, పండితారాధ్య, విశ్వారాధ్య నామములతోను వ్యవహరింతురు.
ఈ పంచాచార్యుల సింహాసనములు వరుసగా రంభాపురి (బాలె హోన్నూరు, కర్ణాటక రాష్ట్రం), ఉజ్జయిని (బళ్ళారి, కర్ణాటక రాష్ట్రం), కేదారము (హిమాలయ ప్రదేశము), శ్రీశైలము (కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్), కాశీ (ఉత్తరప్రదేశ్) అను క్షేత్రములందు నెలకొనియున్నవి.
సదాచారము, శివాచారము, లింగాచారము, గణాచారము, భృత్యాచారము అను పంచాచారములును; విభూతి, రుద్రాక్ష, గురు, మంత్ర, లింగ, జంగమ పాద తీర్థప్రసాదములను, అష్టావరణములును వీరశైవులకు విహితములయి ఉన్నవి. అందుచే వారిలో పురుషులతో పాటు సమాన భాద్యతలతో స్త్రీలకు కూడా లింగధారణ దీక్ష విధింపబడి యున్నది. పుట్టిన శిశువునకు గూడ వెంటనే లింగధారణ దీక్ష గావింపబడును.
ఈ కారణమున బ్రాహ్మణులలో స్త్రీలకసలే లేని బ్రాహ్మణత్వము, పురుషులకైనను ఉపనయనానంతరము లభింపని బ్రాహ్మణత్వము వీరశైవులకు స్త్రీ, పురుష వివక్షత లేక పుట్టుక నుండియు ప్రాప్తించుటచే వారు ఆజన్మ శుద్దులు, దీక్షితులు అయి యుందురు. వారికి లింగమే యజ్ఞోపవీతము.
"యజ్ఞోవై విష్ణురితి శ్రుతే: యజ్ఞస్య విష్ణునామ్న: పీఠస్య, ఉపసామిప్యేన, విశేషణ ఇతం ఆవృతం, యజ్ఞోపవీతం శివ లింగమిత్యర్ధ: శివ విష్ణుమయం లింగం త్రివృత్సూత్రం సనాతనం యజ్ఞోపవీతం పరమ పవిత్రం"
'ఇష్టలింగ ప్రాణలింగ భావలింగాఖ్యా వరణాని యస్య తత్సూత్రం ముణిగణ సూత్రవత్సర్వ వ్యాపకం త్రివృత్సూత్రం జ్యోతిర్మయం మహాలింగం'
"సంస్యూత త్వాత్సమస్తేఘ వస్తుష్వసి చ సంతతం సూచంబాతృరమేశస్య, లింగమితీరితమ్"
'యదక్షరం పరం బ్రహ్మత త్సూత్రమితి ధారయేత్, ధారణాదస్య సూత్రస్య నోబిష్టమ్నా శుచిర్భవేత్"
ఇత్యాది ప్రమాణములచే యజ్ఞోపవీత శబ్దముగూడ శివలింగ వాచకమే.
"లింగ యజ్ఞోపవీతినే శివలాంచన ధారకాయ" అని వీరశైవ పంచాచార్యుల పూజా మంత్రములు ద్ఘోషించు చుండెను. వీరశైవులు తమ దీక్షాదిక శుభకర్మయందు ఈ పంచచార్య స్మారకములుగా పంచకలశములు స్థాపించి పూజింతురు.
"ఈశానస్సర్వవిద్యానామ్" అని పంచ బ్రహ్మమంత్రములలో జెప్పినట్లు సకల విద్యాధీశుడగు శివుని వదన పంచకము నుండి ఉద్భవించిన ఆచార్య పంచకము యొక్క సంతతి అగుటచే, వీరశైవులు (ఈశ్వరకులజులు) శివకులమువారు. అందుచేతను లింగధారణ దీక్ష మూలమునకు వేదాధ్యయనాదిక సమస్తాధికారములు వీరికి కలవు.
లింగాంగ సామరస్యమే (శివజీవైక్యము) లక్ష్యముగా గల ముముక్షువులగుటచే స్వర్గప్రాప్తి రూపక భోగముల కేర్పడిన యజ్ఞయాగాది వైదిక కర్మముల పరిహరించి.
"అష్టావరణ సంపన్న: పంచాచార పరాయణ: వైదికం కర్మకుర్వీత, జ్ఞానైక ఫలసాధనమ్" అను శివాగమ ప్రమాణము చొప్పున జ్ఞానమోక్షైక సాధనమగు ఇష్టప్రాణ, భావ లింగార్చన కర్మమును మాత్రమే ఆచరించుచు అందుకు అవసర మయినంతవరకు, పంచబ్రహ్మ షడంగమంత్రములు, శతరుద్రీయము మున్నగు వైదిక మంత్రముల అధ్యయన మొనరించి వానితోడనే వారు శివపూజ గావింతురు. కావున ఈ విధముగ వీరశైవులు గూడ వేద ప్రామాణ్యమంగీకరించిన వైదికులేగాని అవైదికులు గారు. తక్కిన శైవాంతర్భాగములవలే వీరశైవము గూడ సవైదికమేగాని, అవైదికము కాదు.
"యాతే రుద్ర శివాతనూర ఘోరా పాపకాశినీ|
తయానుస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహీ||"
ఇత్యాది శ్రుతులు లింగధారణ బోధకములే అని నిర్వచింపవచ్చును. వీరశైవులు పాశవిముక్తులేన కర్మ సం హారులు అనుట లోని భావము, వారు హింసాత్మకములై భోదైక సాధనములగు యజ్ఞయాగాది రూపక కామ్యకర్మములకు విధూరులు అనుటయేగాని మరొకటి గాదు. శివజీవైక్య సాధన విముఖులై భోగపరాయణ బుద్దితో కేవలం మట్టిక్రతు కర్మాధికములు చేయూచూ, బహుదేవతారాధనము చేసేడి వారిని (ఖర్మపాశబద్ధు) అని బసవేశ్వరాదులు నిరశించినారు.
వేదమే "యాన్యస్మాకం సుచరితాని తాని సేవితవ్యానినో ఇతరాణి" (తైతరోపనిషత్) అనగా (ఏ కర్మలు మనకు ఉత్తములో అవియే మనము ఆచరించవలెను) అని చెప్పుచున్నది.
"జ్యోతిష్టో మేన స్వర్గకాయో యజేత"
(స్వర్గమును కోరువాడు ఇంద్రాది దేవతలను (జ్యోతిష్టోమము) యజ్ఞవిశేషముచే యజించవలెను) అనుటయూ వేదవాక్యమే, ఈ వాక్యముచే యజ్ఞయాగాదులు కామ్యకర్మలని సిద్ధమగుచున్నవి మరియు
"క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి"
(పుణ్యము తీరిన వెంటనే మర్త్యలోకమున ప్రవేశించినారు) అనువాక్యము స్వర్గాధి భోగములు నశ్వరములని వెల్లడి పరచుచున్నది. అందుననే వీరశైవులు నశ్వర ఫలప్రథములగు కామ్యకర్మలు వదలి అనీశ్వర ఫలద్రములు, హింసా దురాచారములు, రాగరహితములగు, కర్మయజ్ఞము, తపోయజ్ఞములు ఓనర్చువారలై యుండిరి.
"చతుర్వర్ణానాం లింగమశ్నుతే" అనెడి ఉపనిషత్ ప్రమాణముచే నాలుగు వర్ణముల వారికి కూడా లింగధారణ దీక్ష నొంది శివజీవైక్య రూపకమైన మోక్షమును పొందడానికి అధికారము కలదు. గురుడు హస్త మస్తక సం యోగమున జిత్కళాన్యాసము గావించి, దీక్షనొసంగి భౌతిక శరీరమును లింగశరీర మొనర్చినంతనే దీక్షితునకు తొలిజన్మము నశించి వేరొక జన్మము సిద్దించుననియు, అందుచే గురుహస్తాంబుజయే యాతని జన్మస్థానమనియు చెప్పబడును. అందుచేతనే "గురుకరోదర" జనితులు అను వ్యవహారము కూడా వీరికి ఏర్పడినది. జన్మత: వీరశైవులనువారనగా వీరశైవ జనకులకు ఉద్భవించినవారు.
పంచచార్య సింహాసనములలో తమవంశమునకు ఏర్పడిన పీఠమునకు సంబంధించిన గురువునివలననే దీక్ష పొందవలెను. ఇతర కులములలో పుట్టి తరువాత వీరశైవమును స్వీకరించెడివారు, ఈ గురు పీఠము ఐదింటిలో దేనికి సంబంధించిన గురువునివలనైనను దీక్ష పొందవచ్చును.ఏకగురుపీఠమునకు సంబంధించిన శిష్యులెల్ల ఏకోదర ప్రాయులై ఆపీఠ గోత్రమేగల సగోత్రులుగా వ్యవహరింపబడుదురు.
"కలౌశైవమరోచకమ్" అనునట్లు భక్తి, జ్ఞానవైరాగ్య ప్రధానమైన శైవమతము, అందునను ఇష్టలింగధారణ పూజనముగల వీరశైవమును ఉద్దరించుటకై పూర్వోదాహృతులయిన పంచాచార్యులే గాక నడుమ నడుమ మరికొందరు ప్రమథులు గూడ శివాజ్ఞా బద్దులై అవతరించుట ఆవశ్యకమగును. ఇట్టి అవసరము దక్షిణ హిందుస్థానమున క్రీ.శ.12 (పన్నెండవ) శతాబ్ధిలో తటస్థింపగా వీరశైవ మతోద్దారణకై నందీశ్వరుడు కర్ణాటక దేశమున బసవేశ్వరనామమున అవతరించెను. ఈ మహాపురుషుడు వీరశాఇవ మతోధ్ధారకుడే కాని మతస్థాపకుడు కాడు.
లింగ చిహ్నమునందు ఆరు అక్షరములందు ఆరు స్థానములై యున్నవి.
పై విధమున ఆయా బీజాక్షరములు గల స్థానములందు ఆయా తత్వ,స్థల భేదముల, అయా లింగముల దెలియవలయును. ఇందు (న,మ) ఆచారలింగ, గురులింగములు రెండును భక్తితో ఇష్టము గలవై (ఇష్టలింగ) అనబడును. (శి,వా) శివలింగ, చర (జంగమ) లింగములు జ్ఞానముచే ప్రాణముగా నెంచ (ప్రాణలింగ) మన చెల్లును. (య,ఓం) ప్రసాద లింగ, మహాలింగములు రెండును వైరాగ్యముచే భావముజూడ (భావలింగ) మగును. ఈ విధముగ సాధనలచే లింగము నందలి వివరములు సాధించి తెలియవలయును.
CONTACT US
admin@veerashaivadharmam.com