శరణ స్థలము

శరణ స్థలము షట్ స్థల సోపానమునందు ఐదవ స్థలము. సంపూర్ణముగా శివుడినే శరణు పొందిన సాధకుని 'శరణు' డని పిలుతురు. శరణాగతియే ఈ స్థలము యొక్క ముఖ్యమగు క్రియ. తన బాధ్యతనంతటిని భగవంతునకు సమర్పించి నెమ్మదిగా జీవించు నాతడే శరణుడు.

నా సుఖ దు:ఖములు నీవయ్య

నా హాని వృద్ధులును నీవయ్య

నా మానావమానములును నీవయ్య

తీగకు కాయ భారమా కూడల సంగమ దేవ!

ఇది శరణుని భావన. సాధకునకు ప్రాణలింగి స్థలమునందు సుఖానుభూతి కలుగ నారంభించుటచేత శరణ స్థలమందలి సుఖమే ప్రాప్తించుట చేత నన్ను గూర్చి నేనేల విచారించవలయును. అన్నిటికిని శివుడున్నాడు. కలడు గదా? అని భావించి సకలమును శివునకర్పించును. మరియు నిశ్చింతుడగును. సిద్ధాంత శిఖామణియందు --

అంగలింగీ జ్ఞాన రూప: సతీ జ్ఞేయ: శివ: పతి:।

యత్సౌఖ్యం తత్సమావేశే తద్వాన్ శరణనామ వాన్॥

సతీవ రమణే యస్తు శివే శక్తిం విభావయన్।

తదన్య విముఖ: సో2యం జ్ఞాత: శరణ నామవాన్॥

శివుడిని పతి యనియు తనను సతి యనియు భావించి ఆధ్యాత్మికముగా ఈ సాధనయందు అనుభవించెడు సాధకుడే శరణుడు. సతి తనక్కున్నదంతటిని పతికి సమర్పించి నిశ్చింతురాలయినట్లు సకలమును శివునకు సమర్పించెడు సాధకుడే శరణుడనుటయే శరణస్థలము యొక్క లక్షణమును తెలిసియున్నారు.

సామాన్యముగా ఈ ప్రపంచమందు మహిళలు నిశ్చింతులైయుందురు. తమ జీవన నిర్వహణమున పరిపూర్ణ బాధ్యతను తమ భర్త కర్పించుటయే దానికి కారణము. పురుషులంతటి నిశ్చింతులై యుండుట కానవచ్చుటలేదు. అతని పై సంసార బాధ్యతలన్నియు నుండుట చేత కొంత పోరాటము సాగించవలసి యుండును. సంపాదనాపరుడు కావలసి యుండును. కొంత మిగల్చవలయును. కొంత భవిష్యత్తునకై పెంచవలసి యుండును. ఇటువంటి కొన్ని చింతనలు పురుషుని మనసునందు నిండియుండును. స్త్రీలకు మాత్రము ఇటువంటి వాటిదెస మనసుంచక పతి గడించి తెచ్చిన దానియందె కొంత వెచ్చించి వంటకాదులను చేసి పతికి తినబెట్టి తానింత తిని నిశ్చింతురాలై యుంటుంది. ఇటులే శరణుడును తాని పతియని భావించిన శివునకు సమస్తమును సమర్పించి నిశ్చింతుడై యుండును. భార్య, భర్త ఇంటికి వచ్చునపుడు పుట్టి పెరిగిన ఇల్లు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ప్రేమతో చూచెడు బంధు బలగము, కూడియాడిన చెలికత్తలు వీరందరిని వదలి పతియే పరదైవము, అతనే సర్వస్వమని భావించి, నమ్మి పతీంటిని ప్రవేశించును. ఇదే రీతిగ పూర్వాశ్రమము నందున్న వాటి నన్నింటిని వదలి శివుడే సర్వస్వమని శివునకు శరణాగదుడైన సాధకుడినే శరణుడని యందురు.

యాజమాన్యమను భావము మనిషికు దు:ఖమును కలిగించును. దానిని ప్రక్కనిడి సహజ జీవనము సాగించుటచేత నిత్య సుఖము లభ్యమగును. అంగడిలో ఒక ప్రక్క యజమాని, మరొక ప్రక్క నౌకరు కూర్చొనియుందురు. యజమాని గల్లాపెట్టెచెంత ఊరక కూర్చొని యుండును. నౌకరు మాత్రము యజమాని ఆజ్ఞను తు.చ. తప్పకుండా చేయుచు పనియందు నిమగ్నమయి యుండును. అంగడి బాధ్యత, యజమానత్వమన్నవి యజమాని పై యుండుట చేత గల్లా పెట్టెలో డబ్బు చేరిన సంతోషము, రానిచో దు:ఖమన్నవి అతనికి కలుగవు. అయితే సేవకునకు మాత్రము డబ్బు వచ్చినపుడంతే, డబ్బు రాకపోయినను అంతే. సుఖదు:ఖములు అతనిని బాధింపవు. తన కర్తవ్య నిర్వహణ మేది యున్నదో దానిని చేయుచు నిశ్చింతుడై యుండును. ఏలన ఆతనియందు యజమానత్వము, అంగడి బాధ్యత కాని యుండవు, డబ్బు కూడినపుడు వాడీ లాభము లేదు, రానపుడు నష్టము లేదు. చేను బొందు పోయినను గ్రాసము బొందు పోదనట్లుగ తనకు రావలసిన జీతము తప్పక వచ్చియే తీరును. శరణ స్థల సాధకుడు తన సకల బాధ్యతలను, యజమానత్వమును అర్పించుటవలన ఆతడిలో నిరంతరము నెమ్మదవము నెలకొని యుంటుంది. లాభమే కౌల్గనీ, నష్టమే కలుగనీ, దు:ఖమేరానీ, సుఖమే కలుగనీ అవన్నియును శివునకు సమర్పణమని నమ్మి యుండును. "తేన వినా తృణమపి న చలతి" అతని యనుజ్ఞ లేక ఒక గడ్డి పోచయును కదలవన్నమీదట దు:ఖము కలిగిననూ దాని వెనుక ఆతని సహకారమున్నది. ఆతడు దు:ఖమును కలిగించినచో ఆ దు:ఖము నాతడే దు:ఖ వినాశము చేయును. నేనేల తల చెడుపుకోవలె నన్నదే శరణ స్థల సాధకుని భావన.

ఒక చిన్న పల్లెయందు భార్యాభర్తలు నివసించుచుండిరి. వారికి చాలా కాలమునకు లైగిన బిడ్డడొకడుండెను. ఇరువురును కొడుకును అత్యంత ప్రేమతో చూచుచుండిరి. భార్య, సమయము చిక్కినప్పుడు ఆధ్యాత్మిక చింతనాపరురాలగు చుండెను. సాధు సన్యాసులు, శరణులు, శివయోగులు మున్నగు వారి ఉపదేశములను వినుచుండెను. ఉన్నట్లుండి ఒకమారు కొడుకునకు జ్వరము వచ్చి చనిపోయెను. ఉన్న ఒక్క కొడుకు చనిపోగా ఎక్కడ లేని దు:ఖమును అనుభవంచిరి. భార్యము శివేచ్ఛ ఇదే కాబోలు! అతని ముందు మనమెంతటి వారము. అతని ఇచ్ఛ ఏదైతే అదే కానిమ్ము, అని ధైర్యము తెచ్చుకొని క్రమేపి కొడుకుచే కలిగిన వియోగ దు:ఖమును మరచి పోయెను. ఆమె భర్త మాత్రము బ్రతుకే శూన్యము, ఎవరికై జీవించలి. ఎందుకు సంపాదించాలి అని నిరాశా భావమును పొంది ఒక మూలన కూర్చొని యుండెను. పతి పరిస్థితిని చూచిన సతి తట్టుకొనలేక పోయెను. కొడుకు చనిపోయి ఎన్నియో నెలలు గడిచిపోయినను ఆ దు:ఖమును మరువ జాలని భర్తకు ఉపాయముతో తెలియజెప్పవలయునని తీర్మానించు కొనెను.

కొన్ని దినములు గడిచిన పిదప ఆమ్య్ పుట్టింటి యూరిలో తిరుణాల జరుగుచుండెను. తాను పోవుటకై పతి యనుమతి కోరెను ఏనాడును ఏమియు కోరని సతి ఈనాడు పుట్టింటికి వెళ్ళుటకు కోరగ ఆతడు సమ్మతించెను. పోవలసిన దినము వచ్చెను. ఆమె బయలు దేరుటకు సిద్ధమయ్యెను. పతి చెంతకు వచ్చి "ఏమండి! ఆభరణము లేవి లేక ఉత్త గొంతుతో పోవుటన్నది మీకు అగౌరవము. అందుచేత పక్కింటి గౌరమ్మ నడిగి నాల్గు దినముల వరకు ఆభరణములు కావలయునని అడిగి తీసుకొని ఋఅంది" అని యడిగెను. కానిమ్మని గౌరమ్మనడిగి బంగారు దండలను తెచ్చియిచ్చెను. వాటిని ధరించి పుట్టిఉంటికి వెళ్ళి తిరుణాల ముగించుకొని తిరిగి వచ్చెను. వచ్చి వారమయినను వేసుకొనిన ఆభరణములను తిరిగి ఇవ్వలేదు. మగడును అడుగుటకు వెనుకాడి రేపు ఇవ్వవచ్చు, ఆ మరునాడు ఇవ్వవచ్చు అని ఊరకుండెను. ఈమె మాత్రము తిరిగి ఇవ్వవలయునను విషయము ఎత్తక నగలు ధరించియే తిరుగసాగెను. భర్త 'గౌరమ్మ నగలను దెచ్చి చాలదినములయినది వాటిని తిరిగి ఇచ్చివేతమనెను. 'ఇంకను నాల్గుదినముల నంతరము ఇస్తేసరి. ఇపుడేమి అవసరమొచ్చింది. అని ఆమె పలికెను. అపుడు ఊరకుండిన భర్త ఎనిమిది పది దినములు గడచిన పిదప మరల నగల విషయమెత్తెను. అపుడును ఆమె వెనుకతి సమాధానమె ఇచ్చెను. ఈ రీతిగ నెల గదిచెను. రెండు నెలలయ్యెను. అడిగి అడిగి విసుగు చెందిన భర్త నగలివ్వనిచో మనకు చెడ్డాపేరు వస్తుంది. ఎట్లయినను గౌరమ్మ నగలను ఆమెకు తిరిగి ఇచ్చ్యే తీరవలెనని తీర్మానించుకొని సతి చెంతకు వచ్చి 'గౌరమ్మ నగలను తెచ్చి రెండు నెలలు గడచినవి. పరుల సొమ్ము ఇన్ని దినములు ఉంచుకొనుట మంచిద్ గాదు. ఆమె నగలను ఆమె కిచ్చి వత్తును, నగలను తీసి ఇమ్మని అదిఘెను. అందులకామె 'నా గొంతున కీ నగలు చాలా అందముగా కనిపిస్తున్నవి. అందుచేత వీటిని తీసి ఇచ్చుటకు మనసొప్పుట లేదు. నాకే ఉండనిండు, అనెను. ఇంతవరకు నెమ్మదిగ అడిగిన అతడు ఆమ్య్ మాటలకు కోపించినవాడై 'మరొకరి వస్తువులను తిరిగి ఇమ్మని ఎన్నిమార్లడిగినను ఇంతవరకు ఇవ్వక పెట్టుకొనియే తిరుగుట చాలా తప్పు. ఇపుడు జూస్తే నాకే ఉండనిమ్మంటున్నావు ఎంతటి దురాశా నీది. మరొకరి సొత్తుల నిట్లుంచు కొనుట సరిగాదు" అని చెప్పుచుండగా ఆమె వెంటనే "ఇంతగా బుద్ధి చెప్పెడి తాము దైవము తనవాడయిన కొడుకును ఎన్నియో సంవత్సరముల వరకు మన చెంత నుంచి తన వస్తువును తాను తీసికొనిపోతే ఇంత దు:ఖమేల పడుచుంటిరి? నేను ఆభ్రణముల వ్యామోహమునకై వీటిని పెట్టుకొని యుండలేదు. చనిపోయిన కొడుకు పై తమకున్న వ్యామోహమును దూరము చేయుటకు ఇంకను ఒంటి మీదుంచుకున్నాను. వీటిని తీసుకి పొండి" అని పలికి నగలను తీసి మగడికిచ్చి తిరిగి ఇచ్చి రమ్మనెను.

అన్నియును భగవంతునివే యని భావించి, లాభమే కలుగనీ, నష్టమే వాటిల్లనీ అన్నింటిని భగవంతున కర్పించి తాను, నిశ్చింతుడై యుండెడి శివయోగియే శరణుడు. భగవంతుడును ఎవరు తన కన్నింటిని సమర్పింతురో వారి జీవన నిర్వహణ వ్యవస్థను ఏదో యొక రీతిగ తానే నిర్వర్తించుచుండును.

అనన్యాశ్చింతయంతో మాం యే జనా: పర్యుపాసతే।

తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం॥

అనెడు గీతావాక్యము అనన్యముగా ఉపాసించెడు భక్తుల యోగక్షేమములు భగవంతుడు చూచుకొనుచుండును అనుటకు ప్రమాణమై యున్నది. భగవంతునకు సమస్తము సమర్పించినను మనకు సమ్రక్షణ కలుగనిచో మనమొనర్చిన సమర్పణము పరిపూర్ణముగా చేయలేదని భావించవలయును. సమర్పణ భావమునందు కొరత గలిగియుండినచో కట్టుకొన్న మగడే సహకారముతో జీవించుట అరుదు. ఇంక దేవుడెట్లు మన యోగక్షేమములను చూచుకొనవలయును?

ఒక మారు ద్వారకలో కృష్ణుడు భోజనము చేయుటకు కూర్చొని యుండెను. రుక్మిణి ప్రేమతో వడ్డన చేయుచుండెను. భోజనము సగము వరకు వచ్చియుండెను. కృష్ణుడు వెంటనే లేచి బయటకు వెడలెను. 'నిలవండి, భొంచేసి వెళ్ళండీ అని రుక్మిణి అంగలార్చినను వినని వాడై వెడలిపోయెను. పోయి పదినిమిషములయినను గడవలేదు, తిరిగి వచ్చి భోజనము ముందు కూర్చొనెను. 'నిలవండనియన్నను నిలువక ఎంతో అవసరమున్న పనివలె వెళ్ళిపోతిరి. అంతే వేగంగా తిరిగి వచ్చితిరి. అటువంటి పని ఏముండినది. అదంత తొందరగా ముగుసినదా? అని యడిగెను. అపుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వ్చు "అరణ్యము నందొక భక్తుడు నడుచు చుండెను. నల్గురు దొంగ లాతని పై రాళ్ళు రువ్వసాగిరి. ఆ భక్తుడు భయముచేత కృష్ణ! కృష్ణ! నన్ను నీవే కాపాడుమని ప్రార్థించెను. ఆ ప్రార్థన విని నేను లేచి పోయితిని. నేనటకు పోవుననంతలో దృశ్యమే మారిపోయి యుండెను. కాపాడుమని వేడుకొనిన భక్తుడు తానే దొంగలపై రాళ్ళు రువ్వ తొడగియుండెను. అపుడు నేను తన రక్షణ తానే చేసికొనుచున్నాడనిన పిదప ఇక నాతో పనియేమె? అని వెంటనే తిరిగి వచ్చితిని అనెనట. చేసెడు భక్తి యందనన్యత లేకున్నచో అది భావపూర్వకము కానిచో దనితో ప్రయోజనమేమియు నుండ జాలదు.

వస్తాపహరణ సమయమునందు ద్రౌపది ఒకచేత గట్టిగా చీర చెంగును పట్టుకొని, మరొక చేతిని పైకి చాచి అన్నా! కృష్ణా! కాపాడు మని ప్రార్థించినపుడు కృష్ణుడు ద్వారకలో రుక్మిణి ప్రక్కన నవ్వుచు ఊరక కూర్చొని యుండెను. ద్రౌపది కష్టమందున్నది, కాపాడరాదా? అని రుక్మిణియు కృష్ణుని హెచ్చరించెను. కృష్ణుడు "చూడు రుక్మిణీ! ఆమె ఇంకను ఒక చేత చీర చెంగును బట్టి ఒక చేతనే నన్ను పిఉచుచున్నది అంటె నేను వచ్చి కాపాడుదునను నమ్మకము పూర్తిగ కలుగలేదు. భారమంతయు నాపై యామె యుంచలేదు. నేనేనాడును అర్ధభారము వహింపజాలను. మోపినచో పరిపూర్ణ భారమునే యోయుదును లేకున్న లేదు. ఆమె పూర్తిగా నాపై భారముంచినపుడు నేను వెళ్ళుదును అనియనెనట. ద్రిఉపదియును చీరను వదలి రెండు చేతులతో కృష్ణుని పిలిచెను కృష్ణుడపు డామెను కాపాడెను. అది వేరే విషయము. మొత్తము మీద సకలమును సమర్పించిన భక్తుడిని భగవంతుడు చేయి విడవడు.

శరణుడు సమస్తము భగవంతునకు సమర్పించినపుడు భగవంతుడతని యోగక్షేమముల్లనిటిని చూచుకొనును. దీనితో శరణునకు ఎట్టి బాధలును బాధింప జాలవు. సతతము సంతుష్టుడై యుండును. గీతా దృక్పథమున ఇటువంటి భక్తుడే భగవంతునకు చాలా ఇష్టుడైనవాడగును.

సంతుష్ట: సతతం యోగీ యతాత్మా దృఢ నిశ్చయ:।

మయ్యర్పీత మనోబుద్ధి ర్యో మద్భక్త: సమే ప్రియ:॥

మనో బుద్ధులన్నిటిని నాకర్పించి సదా సంతుష్టుడును, యోగియును, సం యమము గలవాడును, దృఢ నిశ్చయుడును అయిన భక్తుడు నాకు చాలా ప్రీతి కరమైన వాడని ఇలా చెప్పుట ద్వారా కృష్ణుడు శరణస్థల సాధకుని మనోస్థితిని దాని ప్రాశస్త్యమును ప్రతిపాదించియున్నాడు.

శరణ స్థల సాధకుని యందు ఆనంద భక్తియుంటుంది. ఆనంద భక్తితో శరణుని సాధన సాగుతుంది. ఆనందమునకు సుఖమునకు మష్యన సూక్ష్మమైన భేదముంటుంది. సుఖము క్షణికము. ఆనందము నిత్యము, సుఖమన్నది బయటి వస్తువుల ననుసరించి వచ్చుచుండును. ఆనందమన్నది బాహ్య వస్తువుల వేటిని అవలంబింపక ఆంతరిక ఆత్మ యందు పుడుతుంది. ఇదియే సుఖమునకు ఆనందమునకున్న సూక్ష్మమయిన వ్య్త్యాసము. శరణుడు బయటి విషయములందు అనాసక్తుడై యుండుటచేత అతడాత్మ సుఖి.బయటి విషయమందనాసక్తికి యాతని సమర్పణా మనోభావనమే కారణము. అతడు తన సకల భారమును శివున కర్పించి నిశ్చింతుడైయుండును. సాంసారిక భారమును భరించిన వాడు దు:ఖియగును. దానిని విదిలించుకొన్న వాడు సుఖియగును, సకల భారముల మోయునట్టి సామర్థ్యము భగవంతునకు ఉన్నందున ఆతడికి దానిని వదిలివేసి నెమ్మదిగా జీవించునదే తగినట్టిది.

సామాన్యముగా మనము మన భారమును దించుటలేదు. అధికము చేసుకుంటున్నాము. ఒకడు తన గుఱ్ఱము మీద పెద్ద గడ్డి మోపును పెట్టుకొని దాని వెనుక తాను కూర్చొని బయలుదేరెను. ఎదురుగా వచ్చిన దయాశీఉడయిన ఒక బాటసారి దీనిని చూచి సహింపజాలక "మనవారెంత క్రూరులు. బలహీన ప్రాణి యీ గుఱ్ఱము. దానిపై గడ్డిమోపునుంచుటయే గాక తానును కూర్చొనుట ఎంత అన్యాయము" అనుచు వెడలిపోయెను. వాడి మాటలతో బాధపడిన రౌతు ఔను ఇంత భారమును గుఱ్ఱముపై మోపరాదు అని తలంచి గుఱ్ఱముపై నున్న మోపును తలపైకెత్తుకొని తాను మాత్రము గుఱ్ఱంపైనే కూర్చొని యుండెను. తొలుత రౌతు తాను నెమ్మదిగా నుండెను. ఇపుడు తనకును భారము, అంతేగాదు గుఱ్ఱమునకు భారముగనే యుండెను. మన జీవితమును ఈ విధముగనే యున్నది. మన జీవ్నా భారమును భగవంతుడే మోయును. ఆతనిపై భారమునుంచక మనపైన ఉంచుకొని "దార్లోన పోవు తగవును ఒడిలో వేసుకొన్నట్ట్లు" అను లోకోక్తివలె భారపు బాధ ననుభవించు చుంటిమి. ఈ భారమును దించుకొను వరకు మనకు స్థిమితమన్నది కలలోని మాట.

భగవంతునికి మనమెవరును భారము కాజాలము. సంపూర్ణ ప్రపంచ వ్య్వస్థను మిక్కిలి క్రమబద్దముగాను, కట్టుదిట్టముగాను నిర్వహించునట్టి యాతనికి మన మొకరము భారము కాగలమా! తీగకు కాయ భారమగునా? మనము మన తలపై నుంచుకొనినను దాని నతడే మోయును. దించిన అతడే యోయును. మనము మోసినపుడు మనకును అతడికి అనగా ఇరువురునకు భారము, దించినపుడు మనమైనను నెమ్మదిగా నుండదగును.

ఇంతియే గాక భగవంతుని యందొక కళయున్నది. అతడు సకల జనుల భారము నెంత మోసినను అది ఆయనకు భారము కాజాలదు. ఏల ననగా అతనిలో అనంత శక్తులున్నవి. సంకల్పమాత్రము చేతనే అవన్నియును పనిచేయ నారంభించును. అతడేమి చేసినను నిర్లిప్తమైయుండి తామరాకు వలె దేని నంటుకొన కుండును. "జన్మ కర్మ చ మే దివ్యం" దివ్యమైన జన్మ కర్మలని కృష్ణునిచే గీతయందు చెప్పబడినది. ఈ రీతిగ సకలమును మోయుట లేక మోసినను భారము కానట్టి శక్తి శివునియందు నెలకొని యున్నది. కారణమేమన మనము మన భారమును ఆతడిపై నుంచి నిశ్చింతులై యుండవచ్చును. శరణ స్థల యోగియుసకలమును శివున కర్పించుటచేతనే సదా ఆనందముతో గూడియుండును. ఈ యానందమే ఆతడి భక్తియై యుంటుంది. ఆనంద భక్తితోడనే ఆతడు ప్రసాద లింగాను సంధానమొనరించును.

శివయోగ సాధనా మూలకముగ విశుద్ధ చక్రమునందు కనిపించు జ్యోతినే వీరశైవాచార్యులు ప్రసాదలింగమని పిలుతురు. కంఠస్థానమందుండిన విశుద్ధ చక్రమునందు కనిపించెడు జ్యోతిని అనుసంధానమొనరించు సాధకునకు నిత్య ప్రసన్నత లభించుటచేత దీనిని ప్రసాద లింగమని పిలుతురు. వెనుకటి సకల స్థలములయందు లింగ విషయమును ప్రతిపాదించునపుడు చక్రముల విషయమును నిరూపించ బడినది. అల్లమ ప్రభువులు చక్రముల వర్ణనా విషయమును తమ సుందరమైన వచనము నందు

గురుస్థానమం దాధారచక్రము, పృథ్వియను మహాభూతం

చతు:కోణ చౌదళ ప్ద్మం అటనున్న అక్షరాల్ నల్గు వ శ ష స

దాని వర్ణము సువర్ణం దాని కధి దేవత దాక్షాయణి

లింగస్థానమునందు స్వాధిస్ఠాన చక్రం అప్ప్సువను మహాభూతం

ధనుర్గతి షద్దళ పద్మం అటనున్న అక్షరాలారు బ, భ, మ, య, ర, ల

దాని వర్ణం మరకత వర్ణం దాని కధి దేవత బ్రమ

నాభియందు మణిపూరక చక్రం, తేజమను మహాభూతం

త్రికోణం, దశదళ పద్మం అట నున్న అక్షరాలు పది

డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ

దాని వర్ణం కృష్ణవర్ణం దాని కధిదేవత విష్ణువు

హృదయ స్థానమందు అనాహత చక్రం, వాయువను మహాభూతం

షట్కోణం, ద్వాదశ దళ పద్మం, అటనున్న అక్షరాలు పండ్రెండు

క,ఖ, గ,ఘ,ఙ్,చ,చ,జ,ఝ,ఞ్,ట,ఠ

దాని వర్ణం కుంకుమ వర్ణం దాని కధి దేవత మహేశ్వరుడు

కంఠస్థానమునందు విశుద్ధ చక్రం, ఆకాశమను మహాభూతం

వర్తులాకారం షోడశదళ పద్మం, అటనున్న అక్షరాలు పదునారు

అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఋ,ౠ, లౄ, ఏ, ఐ ఒ,ఓ,ఔ, అం, అ:

దాని వర్ణం శ్వేత వర్ణం దాని కధిదేవత సదాశివుడు

భ్రూ మధ్య స్థానము నందు ఆజ్ఞాచక్రం, మనసను మహాభూతం

తమధాకారం ద్విదళ పద్మం అటనున్న అక్షరాలు రెండు హం, క్షం,

దాని వర్ణం మాణిక్య వర్ణం దాని కధి దేవత శ్రీ గురువు

ఉదాన జ్యోతి బ్రహ్మరంధ్రంపైని సహస్రదళ పద్మం

అటనమృత మున్నది ఓంకార స్వరూపమయి

గుహేశ్వర లింగము సదా సన్నిహితుడు.

ఈవిధముగా ప్రతిపాదించి యున్నారు. వీటిలో విశుద్ధ చక్రం నందు కనిపించెడు లింగమే ప్రసాద లింగము

ఈ ప్రసాద లింగము నందు శాంత్యతీత కళయును నెలకొనియుండును. సకల దు:ఖములు దూరమై ఆత్మానందము నందుండునది శాంతి. ఈ శాంతి స్థిరము కాదు. కొట్టుమిట్టాడు చుండును. ఆత్మదెస మనసు పారాడినపుడు శాంతి. వెలికి వచ్చినపుడు అశాంతి. ఇట్లు కొట్టుమిట్టాడెడి మనసునందు నిరతము ఆత్మ నెలకొని శాంతి స్థిరమైనపుడు అది శాంత్యతీత కళయనిపించును. ప్రసాద లింగాను సంధానమును స్వీకరించు సాధకునకు ఇటువంటి శాంత్యతీత కళయును నెలకొనగలదు. అతడనుభవించు శాంతియందు తొణికిసలాటలుండవు. మొత్తము మీద శరణుడు ఆనంద భక్తి గలిగి శాంత్యతీతె కళతో కూడినట్టి ప్రసాద లింగము ననుసంధాన మొనరించును. సకల వైశిష్ట్యములను తనలో నలవరచుకొని యుండిన సాధకుని వ్యవహారము లన్నింటి యందును భగవత్స్వరూపము యొక్క దృష్టియును ఉన్నతమై కనిపించుట చేత ఆతని కార్యములన్నియు నొక విశిష్టమైన అర్థవంతమై తోచును.

శరణుడు నిద్రించిన జపమని ఎంచుడీ

శరణుడు మేల్కొని యుండ శివరాత్రి చూడుడీ

శరణుడు నడచిన యెడ పావనమని తలచుడీ

శరణుడు పలికినట్టిదె శివతత్వము కాంచుడీ

కూడల సంగమ శరణుని కాయమే కైలాసమని కాంచుడీ

ఈ రీతిగ బసవణ్ణగారు శరణుని జీవల సాఫల్యతను సుందర శబ్దములచే వర్ణించియుండిరి. దీని నెల్ల అవలోకించి నపుడు శరణ శబ్దము ఎంతటి అర్థవంతమనిపించును. పండ్రెండవ శతాబ్ది శరణులందు ఇటువంటి గుణగణములుండుట చేతనే వారిని శరణులను పేరుతో పిలువబడు చుండిరి. వారా పేరుతోడనే ఇష్టపడ్డవారై దాని ద్వారనే క్రాంతికి నాంది పలికిరి.

ఇవన్నియు నేమైన యుండని. శివుడియందు ఒకటగునట్టి ఐక్య స్థలమునకు సమీప మందుండిన ఈ శరణ స్థలము యొక్క యోగియందు సాగరము చెంత చేరిన నదియందు సాగర జలమందలి ఉప్పు గుణము చేరునట్లు శివగుణములను అధికమగుచు వస్తాయి. 'శివో2హం' యను భావము వృద్ధి చెందుచు శివుడిని చేరు తీవ్రత తలెత్తి కనిపించుచుండును.