ప్రసాది స్థలము షట్ స్థల సాధన యందు మూడోవ సోపానము. 'ప్రసాదో అస్య అస్తి ఇతి ప్రసాది ' యను వ్యుత్పత్తికి అనుగుణముగ ప్రసాదము కలిగిన వానికి ప్రసాది అని పిలువబడును. అట్లయితే ప్రసాదమనగా నేమి? ప్రసాద శబ్దమునకు మూడర్థములు కలవు. 1. దైవమునకు సమర్పించిన అన్నము, 2. దైవానుగ్రహము, 3. మానసిక ప్రసన్నత. శివునియందు నిరంతరము నిష్ఠ కలిగినవాడై అతడికి సమర్పించిన అన్నమునే సేవించుచు శివకృపకు పాత్రుడై, శివుడి అనుగ్రహ బలముతో మానసిక ప్రసన్నతను పొందిన సాధకుడు 'ప్రసాది ' అని పిలువబడును.

సామాన్యముగా అందరూ తమ మనసు ప్రశాంతముగా ఉండాలి, ఎటువంటి చింతలును మనసును పీడించరాదు అని కోరుకుంటూ ఉంటారు. అయితే అందరి మనసులు నిరంతరము ప్రసన్నముగా ఉండుట లేదు. దానికి కారణము మన మనసులు నిర్మలముగా ఉండకపోవుట. నిర్మలమగు మనసు నందే ప్రసన్నత కలుగుచుండును. 'దొంగ మనసు ఎటకు వెళ్ళినను కలవరమే ' యను లోకోక్తి వలె పాపి మనసు నిరంతరము చింతాక్రాంతమై యుండును. ఇంటిలో చాలినంత సంపద నిండియుండవచ్చును, దేనికిని కొరత అన్నది యుండక పోవచ్చును, అయితే మలిన పూరితమగు మనసు సదా అప్రసన్నము. మనసు నిరంతరము ప్రసన్నముగా ఉండవలయుననిన మొట్టమొదట దానియందలి మాలిన్యత తొలగించవలెను. ఆ మనసు నిర్మలమై యుండాలి.

మనస్సు యొక్క పరిశుద్ధత అథవా మాలిన్యము అనునవి మనము తీసుకొను ఆహారమును బట్టి యుంటివి. పరిశుద్ధము, పవిత్రమగు ఆహారము సేవించుట వలన మనసు పరిశుద్ధమగుటయే గాక పవిత్రమును కాగలదు. ఇదేవిధంగా అపరిశుద్ధము, అపవిత్రమగు ఆహారమును భుజించుటవలన మనసు కూడా అపరిశుద్ధమై అపవిత్రతను పొందగలదు. ఇదే విషయమును 'సిద్ధాంత శిఖామణి ' 'అన్నశుద్ధ్యా హి సర్వేషాం సత్వశుద్ధి రుదాహృతా ' అని ప్రతిపాదించియున్నది. హిందీలో 'జైసె ఖాయెంగే అన్న వైసా బనేగా మన్ ' అని వచించియున్నారు. ఇదే విషయమును మహాకవి కాళిదాసు 'అన్నానురూపా తనురూప వృద్ధి: ' అను యుక్తియందు పరికింప వచ్చును. మనము సేవించెడు అన్నమునకు అనుగుణముగనే మన మనసును పవిత్రమూ అపవిత్రమునూ కాగలదు.

ప్రసాది స్థలము

ధర్మపాలకుడగు ఒక సాధువు అధర్మ పాలకుడగు రాజు యొక్క అంత:పురమునకు విచ్చేసెను. రాజు అధార్మికుడైననూ సాధు సత్పురుషులకు సాధ్యమైనంత వరకు గౌరవించెడు పద్ధతిని అలవరించుకొనియుండెను. విచ్చేసిన సాధువులకు ఆదర పూర్వకమగు ఆతిధ్యములు, అతిథి పూజలు, ప్రసాద నివేదనలు, అంతులేని విశ్రాంతులు పరిపూర్ణముగా నియమ నిబద్ధతలతో నెరవేరెడివి. అదే విధంగా ధర్మపాలకుడగు సాధువునకును చక్కని అతిథి మర్యాదలు, ఆదర అతిథ్యములు, పూజా పునస్కారములు లభించినవి. అందులకు సంతసించిన సాధువు కొన్ని దినములచటనే మకాము చేసిరి. ప్రతిదినము అతని అతిథ్యమునకు ఎండి తట్టలు, చెంబులు, బంగారపు లోటాలు ఉపయోగింపబడెడివి. ఒక నాటి రాత్రి వెండి చెంబుతో నీళ్ళునింపి, దానిపై బంగారు లోటా నుంచి సాధువు విశ్రాంతి తీసుకొను గదియందుంచిరి. అటునిటు తిరుగాడి బయటి నుండి వచ్చిన సాధువు వాటిని చూచి మనసున ఆనందపడిరి. మనసు వాటిని తీసుకొమ్మని ప్రేరేపించెను. చేతులు రెండును వెండిచెంబు బంగారు లోటలోని నీటిని పారబోసి జోలెలో దాచెను. ఆ పిమ్మట ఎవరికిని చెప్పకనే కాలికి బుద్ది చెప్పెను. రాత్రి తొలగిపోయి వెలుగు వెలికి వచ్చెను. బహిర్దేశమునకు వెళ్ళి వచ్చి స్నానము చేసి పూజకు కూర్చొనెను. 'ఏనాడును పాపమొనరించి యొరుగని నేను వెండి బంగారమునకు ఆసపడి వాటిని దొంగలించి తెచ్చితిని గదా!' అని మనసున పశ్చాత్తాపపడసాగెను. వెంటనే తిరిగి రాజు చెంత కేతెంచి మహారాజా! దయచేసి నన్ను క్షమించండి అని పలికి జోలె నుండి బంగారు లోట వెండి చెంబు బయటకు తీసి రాజు ముందుంచెను. రాజు ఆశ్చర్యమొంది 'ఓ సాధుపుంగవా! తొలుత వాటిని గొనిపోనేల? కొనిపోయిన పిదప తిరిగి తెచ్చి ఇచ్చుటేల?' అని ప్రశ్నించిరి. అపుడు ఆ సాధువు మహారాజా! ఇదంతయును తమ అంత:పురమునందు కొనసాగుతున్న ఆహార పదార్థముల ప్రభావమే, ఏనాడును పరుల యొక్క ఏ చిన్న వస్తువునకేని ఆశపడని నేను, తమ అంత:పురమునందలి పాపపూరితమైనట్టియు, తామస బరిత మైనట్టియు అన్నాదులను స్వీకరించుట వలన నా మనసు పాపమునకు లోగి వెండి బంగారములకు ఆశపడినది. అందుచే నేనే వాటిని తొనిపోయితిని. పిదప సాత్విక ఆహారమును స్వీకరించుటచే దొంగలించి తెచ్చుట తప్పనుభావన నాలో కలిగినది. ఆ కారణముగా తిరిగి వీటిని తెచ్చి ఇచ్చితిని అని పలికిరి.

మనము భుజించిన అన్నము నుండియే మనసు శుద్ధము, అపరిశుద్ధము ఏల అవుతుందనగా మనము సేవించిన అన్నము యొక్క అత్యంత సూక్ష్మభాగమే తుదకు మనసు యొక్క అవయవముగా పరిణామము చెందుతుంది. ఆకారణంగా అశుద్ధాన్నముచే మనసు అశుద్ధమవుతుంది. శుద్ధాన్నముచేత మనసు శుద్ధమవుంతుంది. అదే విషయమును ఉపనిషత్తు "అన్నమయం హి సౌమ్య మన:" (ఓ సౌమ్యుడా!మనసు అన్నమయమై యున్నది) అని ప్రతిపాదించుచున్నది. కారణములేకయే ఒకానొక సమయమున మనసు పరివర్తన చెందుతుంది. చింతాక్రాంత మవుతుంది. కోపపడుతుంది. వీటన్నిటికిని కారణము అపుడపుడు కొన్ని దినముల క్రిందట సేవించిన అన్నమే. ఇట్లు మనము సేవించిన అన్నము యొక్క అత్యంత సూక్ష్మభాగమే మనసగుటచేత భగవద్గీత యందును తామస, రాజస, సాత్విక మనబడెడు అన్నము నందు మూడు ప్రకారములు అని తెలుపుటయే గాక 'యుక్తాహార విహారస్య ' అని శాస్త్ర సమ్మతమగు అహారమును శాస్త్ర ప్రమాణము నందు సేవించెడు వానికి మాత్రము యోగము యొక్క సిద్ధి లభ్యమగునని ఉపదేశించుట ద్వారా యోగసాధన యందు అన్నము యొక్క మహత్వమును ప్రతిపాదింప బడుచున్నది. ఆ కారణముగనే వీరశైవ సమాజము నందును కూడా శివయోగ సాధకులయిన స్వాములు మడితో తయారు చేయబడినదియును, నియమమును ఉపదేశించుట దారా జీవితమునకు సాత్వికాహారమే ముఖ్యమన్నదిగా ప్రతిపాదించుచున్నది.

మహా భారత యుద్ధమునందు పార్థుని బాణములచే కూల్చబడిన భీష్మపితామహుడు శరతల్పగతులయ్యి ఉత్తరాయణముకు నిరీక్షించెడు విషయము పరిశీలింపదగును. శరతల్పగతుడైన భీష్ములవారు పాండవులందరిని రమ్మని తెలిపిరి. విధేయులయిన పాండవులు, తల్లి కుంతి మరియు పత్నియగు ద్రౌపదితో గూడి పితామహుల చెంత చేరి చేతులు జోడించి 'పితామహా! మమ్మెల్లరను రమ్మని పిలిపించితిరేల? అనిరి. అప్పుడు పితామహులగు భీష్ముల వారు హీన స్వరమున 'మిమ్ము పిలిపించినది ధర్మోపదేశము చేయుట కొరకు. నేను దేహత్యాగము చేయు కాలము ఆసన్నమైనది. ఆ కారణముగా ధర్మ రహస్యమును తమకుపదేశించుటకై తమను పిలిపించితిని ' అనిరి.భీష్మోపదేశము వినకుతూహులులై పితామహుని చెంత నిలిచిరి. ద్రౌపది మాత్రము ముఖమును త్రిప్పుకొని నవ్వసాగెను. పితామహుడగు భీష్ముడు ఆశ్చర్యముతో 'ఏల నవ్వుచుంటివి? నేనేమైన అనుచితము లాడితినా, అని ప్రశ్నించెను '. అట్లేమి కాదు తాతా! అదెందుకో నవ్వు వచ్చెను. ఊరకయే నవ్వితిననెను. అప్పుదు పితామహులు 'అమ్మా!నవ్వు ఊరకరాదు. దానికి ఏమేని కారణముండియే యుంటుంది. ఏలనవ్వితివో చెప్పు ' మనెను. "తాతా! నీవు వినవలెనను ఆక్షేపించినచో చెప్పుట నా కర్తవ్యము. వెనుకటి కొకమారు హస్తినాపురమందలి సభలో దుష్ట దుర్యోధనాదులు నన్ను వస్త్రాపహరణ చేయుటకు యత్నించినపుడు ఆ సభలో ఆశీనులైన మిమ్ము ధర్మోపదేశమొనరించుడని అనన్యభాన తోడ ప్రార్థించితిని. వెక్కి వెక్కి ఏడ్చుచు ధర్మ భిక్ష వేడితిని. అప్పుడు తాము ధర్మును గురించి ఒక్క మాటైనను దుర్యోధనునకు చెప్పలేదు. నేడో రేపో చచ్హుటకు దినములు లెక్కించెడు అవస్థయందుండిన తాపిపుడు ధర్మమును గురించి చెప్పుట ప్రారంభించితిరి. ఆనాడు ధర్మము తెలుపుడని ప్రార్థించినపుడు ఎటకు పోయియుండెను ఈ ధర్మోపదేశము" అని ఆవేశ పూరితముగా పలికెను ద్రౌపది. తాత నిత్లేల మాట్లాడుచున్నది ద్రౌపది అని అందరు ఆశ్చర్య చకితులై ద్రౌపదిని చూచుచుండగ భీష్ముడు కంటిలో నీళ్ళు నింపుకొని "నీవు పలికిన మాట నిజము. అయితే దానికి కారణము లేకపోలేదు. అధర్మపరుడగు దుర్యోధనుని ఉప్పు తిని నా దార్మిక మనసు కూడా అధర్మముచే ఆవరింపబడియుండెను. అందుచేత ఆ సమయము నందు ధార్మికమగు పులులు నానుండి వెలుపలికి రాలేదు. ఇపుడర్జునుని బాణములచేత అధర్మముతో కూడిన అన్నముచే పోషింపబడుచుండిన దేహము నుండి రక్తమంతయును వెలికి చేరినది. ధర్మపూరితమగు మనసు జాగృతమొంది జీవింపబడుచున్నది. ఆ జీవికతో గూడిన ఈ మనసు ఇపుడు మీకు ధర్మోపదేశ మొనరించుచున్నది ' అని పలికెను.

మనము సేవించెడు అన్నము యొక్క సూక్ష్మ భాగము మనపై రూపుదాల్చుటచేత మనసును నిర్మల భరితమొనరింప వలసి వచ్చినచో దానిని అన్నము చేతనే ప్రారంభిచ వలసి యుండును. మనము పవిత్రులము కావలయునన్నచో మనము స్వీకరించేడు అన్నము పవిత్రముగా ఉండవలయును. దానిని శుద్ధ మోరించవలయును. అన్న శుద్ధికై విభిన్న దర్శనములందు విభిన్న ఉపాయములు ఉపదేశింపబడియున్నవి. అయితే వీరశైవ ధర్మము నందు అన్నమును శివునకు, అటులే శివ స్వరూపులయిన గురు-లింగ-జంగములకు సమర్పించుట ద్వారా ప్రసాదముగా చేసికొని సేవించుట వలన అన్న శుద్ధి అవుతుందని ప్రతిపాదింపబడినవి. "విశుద్ధ మన్న జాతం హి యచ్ఛివాయ సమర్పితం" అనెడు సిద్ధాంత శిఖామణి యందలి వచనమునూ శివునకు సమర్పించుటచేత "అన్నము శుద్ధి" యను తత్వమును ప్రతిపాదించుచున్నది. ప్రసాద సేవనము వలన మనసు నైర్మల్యమొంది మనసు నందే నిత్య ప్రసన్నత కు లోనై లింగాంగ సామరస్యమునకు సోపానమవుతుంది. అటులే శరణులు "ప్రతి నిత్యము ప్రసాద భోగి యగుటకు మోక్షచింతన యేల?" అని ప్రసాదము యొక్క మహతిని తెలిపినారు.

శివునకు లేక గురు లింగ జంగములకు అన్నమును సమర్పించుట చేత అది శుద్ధి ఎట్లవుతుంది? సామాన్యముగా పదార్థము నందు కాని, అన్నము నందు కాని అనేక దోషములుండును. ఆ దోషములను దూరము చేయుట వలన పదార్థము మరియు అన్నము శుద్ధి యవుతుంది. దేవ నిర్మిత సృష్టి యందు పదార్థములను పవిత్రమొనరించెడు విశేష గుణమును చూడగలము. దుర్గంధ పూరితమగు చెడు వాసనల చేత కూడిన కసవు దిబ్బయందలి ఎరువును మనము మల్లెపాదునకు వేయుదుము. ఆ మల్లెపాదుకు వేసిన ఎరువు చెడు వాసనతో కూడి యుండినను దానిని అది స్వీకరించి మనకు సుగంధ భరితమగు పూలనిస్తున్నది. అదే విధంగా అరటి, మామిడి, సేపు మొదలయిన పండ్ల చెట్లకును మనము వేసెడు యూరియా మొదలగు ఎరువులు చేదయినవిగా యుండినను ఆ చెట్లన్నియును తియ్యని పండ్లనే మనకిచ్చు చున్నవి. మనము వేసిన దుర్గంధము మరియు విషపూరితములనే అవి తిరిగి మనకొసగినచో ఎవరు వాటిని స్వీకరించుచుండిరి. అయితే మార్పునందు దుర్గంధమును సుగంధము చేసెడు మరియు చేదు విషపూరితమును మధురత్వమును చేసెడు శ్రేష్ఠ గుణత్వముండుట వలన అంతటను మనము గమనింవచ్చును. ఈ విధంగా ప్రకృతి దానికి ఇచ్చిన అపవిత్ర పదార్థములందలి దోషమును తొలగించి పవిత్ర మొనరించుచున్నదన్న పిదప ఆ ప్రకృతిని నిర్మించిన భగవంతుడు అతనికి నివేదించిన పదార్థములందలి లేక అన్నమునందలి దోషములను బుగ్గి చేసి పవిత్రము చేయకుండునే?

సామాన్యముగ పదార్థములకు సంబంధించి రెండు దోషములుండును. 1. పదార్థగత దోషము 2. వ్యక్తిగత దోషము. గడ్డిగింజ లందు కానవచ్చెడు కసవు పుల్లలు, మట్టి రాళ్ళు అనునవి పదార్థమందలి దోషములు. ఈ పదార్థము నాదేయను అభిమానమును, దీనిని ఎవరికి నివ్వరాదనుటయే గాక తానే యనుభవింపవలయునను స్వార్థమనునవి పదార్థమునకు సంబంధించినంత వరకు వ్యక్తిగత దోషములు. పదార్థములందలి దోషములను చేటలో వేసి చెరిగి, జల్లెడలో వేసి జల్లించి ఏరివేయుట ద్వారా దోషములను అనగా గడ్డి రాళ్ళు మన్ను ఇత్యాదులను తొలగించి పరిశుభ్రము చేయవచ్చును. అయితే పదార్థములకు సంబంధించిన వ్యక్తిగత దోషములు తొలగి పోవలయుననిన పదార్థములను దైవమునకు సమర్పించ వలసి యుండును. పదార్థమును పరమేశ్వరునకు అర్పించినపుడది ప్రసాద మవుతుంది. ప్రసాదమునందు ఇది నాది అను మమకారము గాని, దీనిని నేనే ఉపయోగించవలయునను స్వార్థము గాని మిగలబోదు. దీనిని ఈ విధముగా అర్థము చేసికొనదగును.

మీరు దేవస్థానమునకు బయలు దేరితిరి. ఉత్తచేతులతో దేవాలయమునకు పోరాదను వాడుక చొప్పున పండు కాయ కూడా మీచేత నున్నవి. దారిలో మీ స్నేహితుడు కలిశాడు. మిమ్ము చూచిన సంతోషముతో "ఏమది! ఎక్కడకు బయలు దేరితిరి" అని యడిగెను. "ఇక్కడకే దేవస్థానమునకని" మీ సమాధానము. చేతిలో ఏమో పట్టుకొన్నట్లున్నది ఏమది? తిరిగి ప్రశ్నించిరి. అపుడు మీరు "పండు, కాయ ఉన్నది. దేవుడికి కావలయును గదా! తీసుకొని పోవుచుంటిని" అని పలికితిరి. దీనికంతటికిని తృప్తి పడని అతడు "ఎవరివి ఇవ్వంతా?" అని యడిగినపుడు మీరు ఎదపై చేయి వేసికొని ఇవన్నియునూ నావే. వచ్చునపుడు అంగడి నుండి కొని తెచ్చితిని" . ఇదంతా అయిన పిదప స్నేహితునకు వివరము తెలిపి దేవస్థానమునకు పోయి, కొనిపోయిన పదార్థములను అర్చకునికివ్వగా అతడు దైవమునకు కాయను కొట్టి, కర్పూరమును వెలిగించి హారతి నిచ్చి, పండును నైవేద్యముగా చూపి, మనకు దానియందు కొంత భాగమును దైవ ప్రసాదముగా తిరిగి ఇచ్చును. దానిని చేత పట్టుకొని ఇంటి దారి పడ్తారు. మార్గమధూమున ఆ స్నేహితుడు మరల తారసపడ్డాడు. అతడు మిమ్ము చూచి "ఎంత తొందరగా దేవస్థానమునకు పోయి వచ్చితిరి. అదటుండ నిండు. ఇపుడును తమ చేతిలో ఏమో కనిపించుచున్నది." అని యడిగిరి. అపుడు మీరు "ఇది ప్రసాద" మందురు. అతడు "ఎవరిది" అని తిరిగి ప్రశ్నించెను. దానికి మీరు "ఇది దేవుడి ప్రసాదము. నీవు కొంచెము తీసుకో" అని పలికి ప్రసాదము నిత్తురు. మీరు దేవస్థానమునకు పోవునపుడు అదే పండు, కాయ మీ చేత నున్నాయి. వచ్చునప్పుడును ఆ పండు కాయ చెక్కయే ఉంటాయి. అయితే పోవునపుదు వాటిని పండు కాయ అని యందురు. ఎవరిదన్నపుడు నాదని యందురు తిరిగి వచ్చునపుడు వాటినే ప్రసాద మందురు ఎవరిదన్నపుడు దేవుడిది అందురు. అనగా నావన్న భావము తొలగిపోయి దైవమునది అను భావము దృఢమైనపుడు ఆ పదార్థమే ప్రసాదమవుతుంది. పదార్థసేవనము వలన బంధనము. ప్రసాద సేవనము వలన మోక్షము. ఇంతియే గాక ఆలయమునకు వెళ్ళునపుడు మీ స్నేహితునకు పండు కాయ నిచ్చుట లేదు. అయితే తిరిగి వచ్చునపుడు ప్రసాదమని ఇత్తురు. వస్తువు పదార్థముగా నుండినపుడు త్యాగ గుణ ముండబోదు. ఆ పదార్థమే ప్రసాదమైనపుడు త్యాగ గుణమలవడుతుంది. అన్నమును భగవంతునకు సమర్పించి ప్రసాదముగా ఉపయోగించుటచేత మానవును యందు నిలిచిన అన్నమునకు సంబంధించిన భావనాత్మక దోషములన్నియు కూడా దూరమవుతాయి.

ఇటువంటి ప్రసాదమును ఉపయోగించుట వలన మనోనైర్మల్యము సిద్ధించి మానసికమగు శాశ్వత ప్రసన్నత కలుగుతుంది. ఎందువలననగా ప్రసాది స్థలపు సాధకుడు ప్రతి దినము ప్రసాదమునే ఉపయోగించుచు లింగ భోగోపయోగియై యుంటాడు. దానినే పారమేశ్వరాగమము నందు

యోsనర్పితం మహేశాని నార్చయిత్యాపి జంగమాన్||

నాశ్నాతి నత్యజే న్మహ్యా మర్పితం కృచ్ర్ఛగోపిs వా|

సోsయం ప్రసాదీ కథిత: సోsహమేవ న సంశయ:||

గురు లింగ జంగముల పూజను చేయక, భగవంతునకు నైవేద్యమును చూపక ఎవరు భుజింపరో, భగవంతున కర్పింపబడిన ప్రసాదము నందు కొంచెమేనియును అదల వడ్డించిన పదార్థములన్నిటిని భుజింతురో వారు ప్రసాది అనబడి ప్రసాది స్థలపు సాధకుని ఆచరణను తెలుపుతున్నది. ప్రసాది స్థలపు సాధకుడు తాను ఉప్యోగింపవలసిన సకల పదార్థములను లింగమునకు సమర్పించిన పిదప లింగ ప్రసాద రూపమున వాటిని సేవించుటయు దాని యందు ఒక్క మెతుకేని మిగిల్చక ఉపయోగించుటయు సాధకుడు చేయును.

వీరశైవ ధర్మ సాధనా పథమున స్త్రీ పురుషులకు సమాన అధికారమున్నది. పురుషుని వలెనే స్త్రీ కూడా, షట్ స్థల మార్గమునందు ముదడుగు వేయవచ్చును. భక్త, మహేశర, ప్రసాది కావచ్చును. ప్రసాది స్థలమునకు వచ్చినపుడు మహిళయు కూడా శివ ప్రసాదమునే భుజింప వలసి యుండును. అయితే ఇటనొక సమస్య ఎదురవుతుంది. అదేమనగా ధర్మ శాస్త్రము నందు పతివ్రతా కాంతామణి భర్తృ శేషము (పతి సేవించి వదిలిన అన్నము) నారగించవలెనని తెలుప బడియుండుటయే. పతివ్రతయైన మహిళ ప్రసాది స్థలము నందు పాదార్పణ చేసినపుడు ఏ యాహార ముండిననూ శివునకు సమర్పింపక స్వీకరింపరాదను నియమమును తన జీవిత నియమమై యుండుట చేత పతి భుక్త శేషమును ఎట్లు సేవింపవలెను? భర్తృ శేషమును స్వీకరింపకున్నచో పతివ్రతా ధర్మమునకు హాని. దానిని శివునకు అనగా లింగమునకు సమర్పింపక స్వీకరించినచో ప్రసాది స్థలమున కపచారము. ఒకవేళ సమర్పించియే స్వీకరింప వలయునన్న పతి ఉచ్ఛిష్టము (ఎంగిలి) సతికి పావనమై యుండిననూ దానిని పరదైవ మయిన లింగమునకు సమర్పించుట అనుచితక్రియ గదా! ఒక చోట సామాజిక పతి, మరొకచేట ఆధ్యాత్మిక పతి. ఈ సందర్భమున మహిళ యేమి చేయవలెను?

కారణాగమము నందు ఈ సమస్యకు సముచితముగు సమాధానము తెలుపబడినది.

సువాసిని సమర్చ్యాపి భోగరూప నివేదనం

అన్యేనైవ విధయానుజ్ఞాప్య తద్ భర్తృశేషకమ్||

ఉభయం చైవ భుంజీత భక్తియుక్తా మయి ప్రియే|| (కారణాగమము 9-19)

భగవంతునకు నైవేద్యమును చూపుటయందు రెండు విధములు 1. భోగరూప సమర్పణ 2. అనుజ్ఞారూప సమర్పణ. భగవాన్! ఈ పదార్థమును స్వీకరించి నన్ను కరుణించుమను భావముతో సమర్పించుటన్నది భోగరూప సమర్పణ. భగవాన్! నేనీ పదార్థమును స్వీకరించుచుంటిని, దానికి తాము అనుజ్ఞ నిమ్మను భావముతో భగవంతునకు సమర్పించుటన్నది అనుజ్ఞారూప సమర్పణ. పతిభక్తి పరాయణపరురాలైన సతియూ భర్తృ శేషాన్నమును స్వీకరించునపుడు భగవంతునకు అనుజ్ఞారూప సమర్పణమును మరియు క్రమముతో అన్నమును స్వీకరించునపుడు భోగరూప సమర్పణ మొనరించుట ద్వారా తనయొక్క లౌకిక పతివ్రతా ధర్మమును ఆధ్యాత్మికమైన ప్రసాది స్థలపు ధర్మమును పాలించవచ్చును. ఇది ఆగమము యొక్క అభిప్రాయము. అయితే కంప్యూటర్ యుగమందు జీవించుచున్న నేటి మానవులకు స్త్రీ పతివ్రతా ధర్మమును పాలించుటకై భర్తృశేషమును స్వీకరించవలెను అనిన అది రుచింపబోదు. అదియును గాక ప్రగతి పరచింతన ప్రతి దినము వ్యాప్తి చెందుతూ వచ్చిన వీరశైవ ధర్మము నందు స్త్రీ పురుషులకు సమానమైన హక్కు భాధ్యతలనొసగి యుండిన కారణమున పతివ్రతా స్త్రీయు తప్పని సరిగా భర్తృశేషమును స్వీకరించియే తీరవలయునను నియమమేమియును లేదు. ఇంకను స్వీకరించువారికి ఏల స్వీకరించుచుంటివి? ఇదంతయును సరికాదను విరోధమును లేదు. భర్తృశేషమును స్వీకరించువారు పై తెలిపిన ఆగమోక్తిని అలవరుచుకొనవలయును. కేవలము క్రమముగా అన్నమును సేవించెడు స్త్రీలు భోగరూప నైవేద్యమును చేయవలెను. మొత్తము మీద ప్రసాది స్థలపు సాధకుడు సాధకురాలు తాము స్వీకరించెడు సకల పదార్థములను ఇష్టలింగార్పితము చేసియే గ్రహించవలయును.

ప్రసాది స్థలపు సాధకుడు ఇంకను కేవలము తాను తినబోవు అన్నమును మాత్రము లింగార్పితము చేయుట లేదు. శబ్దస్పర్శాదులగు సకల విషయములను లింగార్పిత మోనరించి ప్రసాద రూపముగా ననుభవించుచుండును. వీరశాఇవ ధర్మమునందు ప్రతి ఇంద్రియమునకు ఒక్కొక్క లింగమును సంయోజనమొనరించి ఆ లింగము ఇంద్రియమున కధిష్టాన దేవతగా పరిగణించబడుతుంది.

దీక్షా సందర్భమున శ్రీ గురువులు శిష్యుని దేహమందలి సకలేంద్రియము లందును లింగ సంయోజన మొనరించుట ద్వారనే అతని మాంసమయ శరీరమును మంత్రమయ దేహముగా పరివర్తింప చేయును. నాసిక యందు ఆచార లింగము, జిహ్వయందు గురులింగము, చక్షువులందు శివలింగము, చర్మము నందు జంగమ లింగము, చెవులందు ప్రసాదలింగం, ఆత్మ యందు మహాలింగమును సంయోజింప బడుతున్నది. నాసిక కేల ఆచారలింగము? జిహ్వాకేల గురులింగము? ఇట్లే ఆయా ఇంద్రియముల కాయా లింగము లేల కావలయును? అను విషయమును శరణులయిన ఆదయ్యగారు చాలా మర్మికముగా ఈ విధముగా తెలిపియున్నారు.

చరించి వర్తించునదే ఆచార మైన కారణమున

ఇదా పింగళ నాడుల రేచక పూరకములు

చరించి వర్తించెడు దెనయందే

నాసికకు ఆఅచారలింగ మవసర మయ్యెను

మంత్రమూర్తియే గురువైన కారణమున

షడక్షరాలే షడ్రుచులై కాన్పించునదై

అటువంటి షడ్రుచిని జిహ్వాముఖమునకు చేరుదెసకు

జిహ్వకు గురులింగ మవసర మయ్యెను

స్వయం ప్రకాశమే శివుడైన కారణమున

ఆ మహా ప్రకాశమే నేత్రములందు నెలకొని యుండి

సకల పదార్థముల కాన్పింప జేయు దెసలో

నేత్రములకు శివలింగ మవసర మయ్యెను

చరమే జంగమ మైన కారణమున

చర్మము సర్వాంగములందు నెలకొని అటనట

స్పర్శను కలిగించెడు దెసలో

చర్మమునకు జంగమ లింగ మవసర మయ్యెను.

నాద సునాద మహానాదమె ప్రసాదమైన కారణమున

ప్రసాదమును శబ్దము శ్రోతృముఖమునకు చేరు దెసలో

శ్రోత్రములకు ప్రసాద లింగ మవసర మయ్యెను

ఈరీతి పంచేంద్రియములకు పంచలింగము లవసరమయ్యెను

ఆత్మ య్న్నది నిరామయ నిర్గుణ నిష్కళ నిర్భిన్న

నిరుపమానమైన దెసలో

గోప్యమైన ఆత్మకు ఘనాఘనత గలిగిన

మహాలింగ మవసరమయ్యెను

ఈరీతిగ షట్ స్థలములయిన దెసగా సౌరాష్ట్ర

సోమేశ్వరుడొకడు షల్లింగ మవసర మయ్యెనయ్యా!

ప్రసాది స్థలపు సాధకుడు ఆచార లింగమునకు గంధమును సమర్పించి దానిని ఆచార లింగ ప్రసాదముగాను, గురు లింగమునకు రుచి (రసమును) ని సమర్పించి దానిని గురు లింగ ప్రసాదముగాను, శివలింగమునకు రూపమును సమర్పించి దాని శివలింగ ప్రసాదాముగాను, జంగమ లింగమునకు స్పర్శనుసమర్పించి దానిని జంగమలింగ ప్రసాదముగాను, ప్రసాద లింగమునకు శబ్దము సమర్పించి దానిని ప్రసాద లింగ ప్రసాదముగాను, మహాలింగమునకు తృప్తినర్పించి దానిని ప్రసాద లింగ ప్రసాదముగాను, భావించి ఆయా ఇంద్రియముల ద్వారా దానిననుభవించును.

శబ్ద స్పర్శాదులందును అనేక దోషములుండును. వాటిని లింగార్పితము చేయుట చేత ఆ దోషములు దూరమై పరిశుద్ధ రూపమున మనకు లభ్యమవుతున్నాయి. ఏ విషయము నుపయోగించునపుడైననూ ఇది ఉత్తమము. ఇది కనిష్టము అను ద్వంద్వ భావముండి మనసు ఉత్తమమైన దాని నాశించి దానిలో ఆసక్తి కనపరుస్తుంది. కనిష్టమైన దానిని ద్వేషించి దానిని తిరస్కరిస్తుంది. అయితే అదే విషయము ప్రసాదమను భావము గలిగిన ఈ భేదములు తొలగి ప్రసన్నతో దాని నుపయోగించుటకు సహాయపడుతుంది.

సుస్వరం-అపస్వరం; ఇంపు-కర్కశము; స్తుది-నింద ఇవన్నియును శబ్దమునందు కాన్పించు భేదములు. సుస్వర సంగీతము, ఇంపయిన ద్వని మరియు స్తుతిపరమైన శబ్దములను వినుటకు పరితపించెడి మనస్సు అపస్వర సంగీతము, కర్కశమగు శబ్దమును, నిందలను విన్నంతనే అనాసక్తత కలుగుతుంది. మరియు ఉద్విగ్నత పొదుతుంది. శబ్ద విషయమున మానవుని మనసు కల్పించుకొనిన తరతమ భేద బుద్ధియే దీనికి కారణము. ఆ శబ్ద విషయమున చెవులందు సంయోజింప తగిన ప్రసాద లింగమునకు సమర్పించి ఇది ప్రసాద లింగము యొక్క ప్రసాదమను భావముతో విన్నపుడు ఈ భేద బుద్ధి దూరమవుతుంది. ప్రసాది స్థల సాధకుడిట్లు శబ్దమును ప్రసాద లింగము యొక్క ప్రసాదముగా భావించి వినుట వలన అతడిలో శివప్రసాదమను భావన నెలకొంటుంది. దీని చేత స్తుతి విన్నపుడానందము, నింద విన్నపుడు క్రుంగుట యన్నవతడిలో కలుగవు. అతడా రెండింటిని సహజ భావనతో స్వీకరించును.

కఠోరము - మృదుత్వ మనునవి స్పర్శయందలి భేదములు. కఠోర స్పర్శ చర్మనుకు దు:ఖమనిపిస్తె, మృదు స్పర్శ హితవనిపిస్తుంది. స్పర్శను చర్మమునందు సంయోజింపబడి జంగమ లింగమునకు సమర్పించి, జంగమలింగ ప్రసాదముగా భావించి, అనుభవించుట చేత ఈ భేదము తొలగి ప్రసాద భావము అలవడుతుంది. ప్రసాది స్థల సాధకుడిట్లు స్పర్శను జంగమ లింగ ప్రసాదమని భావించి స్వీకరించుట చేత అతడికి కఠిన స్పర్శతో దు:ఖముగాని, మృదు స్పర్శతో సుఖము గాని యనిపించుట లేదు. అతడికరెండును సమానమే.

కురూపము - సుందరము ఇవి రూపము నందలి భేదములు. కురూపమును గాంచినపుడు వేసరికపడు కళ్ళు సుందర రూపమును గాంచినంతనే అటు ప్రక్క పరుగిడుట కాసక్తి చూపును. రూపమును గాంచి యా సౌందర్యమును కళ్ళయందు సంయోజింపబడు శివలింగమునకు రూపము సమ్ర్పించుట చేత ఇది కురూపము, ఇది స్ఫురద్రూపమను భావము తొలగి, కనిపించునదంతయును శివలింగ ప్రసాదము, అదంతయును శివరూపమను శివమయ భావమలవడుతుంది. ప్రసాది స్థల సాధకుడీగతిని రూపమును శివలింగము యొక్క ప్రసాదముగా భావించి అనుభవించుట చేత సౌందర్యముంకు లొంగి మోహితుడు కాకుండ కురూపమును తిరస్కరింపక కనిపించునంతయును శివరూపమను ఉన్నత భావము గలిగి బ్రతుకుటన్నది అతని జీవిత విధానమై యుండును.

రామకృష్ణ పరమహంస సాయంకాలమున సూర్యాస్తమయమును వీక్షించుచు నిలిచిన సందర్భమున స్ఫురద్రూపియైన సురకాంత యొకతె దారియందు వెడలుచుండెను. సూర్యుడు కూడా నిలిచి వెనుదిరిగి చూడవలయునన్న సౌందర్య దేహమామెది. రామకృష్ణుని చూపు ఆమె వైపుకు మరలెను. మనమందు ఆది శక్తి సౌదర్యము గుర్తుకు వచ్చి "తల్లీ! నీ లీల లెవరికిని అర్థము కావు. మానవులను నీ దెసకు లాగుటకై ఎంతటి మోహనరూపు ధరించి వెడలితివి. అయితే నీ యాకర్షణీయమగు రూపు నన్ను నీదెసలాగదు ఏలన రూపమును చూచెడు దృష్టిని మరియు రూపమును నీకు సమర్పించుటచేత నాకు నీవు గాక, నీ ప్రసాదము గాక మరేమియును కాంపింపదు" అనిరంట. ఇది ప్రసాద దృష్టి, రూప ప్రసాది వస్తువులను చూచును. అయితే వాటిని తన భేద దృష్టితో కొలుచుట లేదు. మనసందు ఆసపడుటలేదు.

తీపి, చేదు, కారము, ఒగరు, పులుపు, ఉప్పు అనెడు ఆరు విధములయిన రసములు మిళితమై ఒక దానితో నొకటి కలిసినపుడు కలిగెడు రుచి అటులే యద్వతద్వమై అవి కలిసినపుడు కలిగెడు అరుచి యనునవి రసమందలి భేదములు. నాలుకకు రుచికరమగు పదార్థము లభ్యమైనపుడు ఆనందిస్టె, అరుచియగు పదార్థమును సేవించినపుడు దు:ఖిస్తుంది. నాలుకయందు సంయోజింపబడిన గురులింగమునకు రసమును సమర్పించినపుడు రుచి-అరుచియను భేదము మాత్రము తొలగి ప్రసాద భావ మలవడుతుంది. దేవస్థానమునందు దొరికిన కొబ్బరి మొదలగు ప్రసాదములందు గాని, గురు-లింగ-జంగముల నుండిద్ లభించిన తీర్థము మున్నగు వాటియందు ఎవరును రుచియన్నది చూడకయె భక్తితో స్వీకరించుటన్నది సమాజము నందు మనము చూచెదము. ఇదియొక సందర్భమున అరుచియై యుండినను వాటియందు హేయ భావమును సహింపలేకున్నను భక్తి భావముతోడనే సేవింతుము. దానికి కారణమేమన ప్రసాద భావమే. ప్రసాది స్థల సాధకుడు రసమును గురు, లింగము యొక్క ప్రసాదమన్నదిగా భావిచి స్వీకరించుట చేత అతడు నాలుక యొక్క చపలత్వమునకు లోనుగాక తనకు లభించిన దానియందే తృప్తి భావము పొందుట ద్వార ప్రసన్నుడగుచున్నాడు.

సుగంధ - దుర్గంధ మనునవి గంధము నందలి భేదములు. సుగంధము ముక్కునకు సుఖము నివ్వగా దుర్గంధము ముకుపుటములు మూసుకొనునట్లు చేయును. అందులకై అందరును సెంటు, స్నో, పౌడరు మొదలగు సుగంధపు వస్తువులనే ఎక్కువగా వాడెదరు. అన్ని సమయములందు మనకు సుగంధము లభ్యము కాజాలదు. మనము కోరకున్నను కొన్ని సందర్భములందు దుర్గంధము మనయెడ చుట్టుకుంటుంది. అపుడే దానిని ఆస్వాదించు ముక్కు ద్వారా మనసు దు:ఖిస్తుంది. నాసికయందు సంయోజింపబడిన ఆచార లింగమునకు గంధ విషయమును అర్పించినచో దానిలో సుగంధ-దుర్గంధమను భేదము లోపించి ప్రసాద భావమలవడుతుంది. ప్రసాది స్థల సాధకుడు తానాఘ్రాణించెడు సకల విధములగు గంధములను (సువాసనలను) నిరతము ఆచార లింగము యొక్క ప్రసాదముగా భావించి ఆఘ్రాణించుట చేత అతడిని ఎటువంటి వాసనయును భిన్న పరచజాలదు. సుగంధము ప్రసాదమె. దుర్గంధమును ప్రసాదమే యను భావన అతడిలో కలిగియుండుట చేత అతడు నిత్య ప్రసన్నుడవుతుంటాడు.

ఈ రీతిగ ప్రసాది స్థల సాధకుడు సకల విషయములను ప్రసాద రూపమునందే స్వీకరించుట చేత ప్రసాదమునందు నువ్వుగింజంతేనియును వదలక పూజ్య భావముతో స్వీకరించుట వలన అతడి మనసు నిర్మలమైనదై శాశ్వతమయిన చిత్త ప్రసన్నతను పొందుతుంది. దీని వలన తెలియునదేమనగా "ప్రసాదే సర్వదు:ఖానాం హాని రస్యోపజాయతే" యను తీతోక్తివలె సమస్త దు:ఖములు దూరమగుటయే కాక శివుని ప్రసాదము అనగా శివానుగ్రహముగా కూడా లభ్యమవుతుంది. జీవితమున నెటువంటి సంఘటనలను, ఎటువంటి నిందలును ఈతడి ప్రసన్నత్వమును చెరుపజాలవు.

ప్రసన్నతయు రెండు విధములు. ఒకతి నైమిత్త్కము. మరొకటి నిర్నిమిత్తము. నైమిత్తిక ప్రసన్నత అనిత్యమైనది. వేరొక వస్తువు లభించుటచే కలిగెడు ప్రసన్నత యనునది నైమిత్తికము. వేరొకరు మనలను పొగడినపుడును, కావలసినవారు ఇంటికి వచ్చినపుడును, ఇష్టమైన వస్తువు ప్రాప్తించినపుడును, చేసిన సంకల్పములు పరిపూర్ణమైనపుడు వచ్చెడు ప్రసన్నత నైమిత్తికమనబడుతుంది. ఇది శాశ్వతము కాదు. వచ్చిపోయెడు వస్తువులు లభించుట వల్ల వచ్చెడు ప్రసన్నత అదెట్లు శాశ్వతము? దీనికి మారుగా యేదేని బాహ్య విషయమందలి వస్తువు లభించకయే నిరాలంబ ప్రసన్నత నిర్నిమిత్తము. ఇది శాశ్వత ప్రసన్నత. ఏలననగా ఈ ప్రసన్నతను మరొక వస్తువు లేదా వ్యక్తి కారణమగుట లేదు. వస్తువులు రాని లేక పోని, సంకల్పములన్నవి కలసిరాని లేక కలసి రాకపోని, స్తుతిగాని లేక నిందగాని యుండని ప్రసన్నతన్నది నిరతము నెలకొని యుంటుంది. నిత్యం ప్రసాద సేవనతో మరియు శివానుగ్రహముతోడనే ఇటువంటి ప్రసన్నతన్నది అబ్బుతుంది.

ఒక గ్రామాన శివయోగి యొకడు ఊరి వెలుపల నొక కుటీరము నిర్మించుకొని అట నివసించు చుండెను. తన చెంతకేతెంచిన భక్త సమూహమునకు అధ్యాత్మిక చింతనాపరమగు ఉపదేశముల నిచ్చుటచేత జనులను భక్తిదెస శ్రద్ధాపరులను చేయుచుండెను. అతని చెంతకేతెంచిన వారెల్ల అతని ఉపదేశముల చేత తృప్తులై వెళ్ళి పోవుచుండిరి. దీనితో ఆ ప్రాంతపు జనులెల్లరును పునీతులగుటయే గాక ఆ ప్రదేశమునను అతని కీర్తి వ్యాప్తి చెందసాగెను. దీనిని ఓర్వజాలని కొందరు దుష్టులు ఎటులయినను అతడిని ఈ స్థానము నుండి వెళ్లగొట్టవలయునన్న అలోచనాపరులై నియమము నేర్పరచుకొని తమలో నొక అధికుడని గుర్తించ్ శివయోగిని బయటకు వెలువరించుటకై అతడికి బాధ్యతను అప్పగించిరి. అతదు శివయోగి చెంతకు వచ్చెను. అట వేల కొలది జనులు వారి ఉపదేశమును వింటూ దానియందే తమ్ము తాము మైమరచి ముగ్నులయియుండిరి. విశాలమయిన మఱ్ఱి చెట్టు కట్టపై శివయోగి కూర్చొని ఉపదేశమిచ్చుట యందు తన్మయులయి యుండిరి. వచ్చిన దుష్టుడును ప్రవచనమును వింటు దూరముగా నిలిచి యుండెను. ప్రవచనమును ముగిసెను. వచ్చిన జిజ్ఞాసువులందరు వారికి నమస్కరించి ప్రసన్న భావముతో అచట నుంది నిర్గమిచిరి. శివయోగి కనులు మూస్ ధ్యానమగ్నులయిరి. అందరును అటు నుండి వెదలిన పిదప ఆ దుష్టుడు శివయోగి చెంత కరుదెంచి అనరాని మాటలతో దూషించెను. నీవు దంభాచారివి. నాటకాలాడుతున్నావు అని అనేకరీతులుగా మనసునకు వచ్చినట్లు దూషింపసాగెను. ఒక గంట సేపు దీనినంతయును శివయోగి మౌనముగా వింటు కూర్చొని యుండెను. ఆ దుష్టుడును తిట్టినంత సేపు తిట్టి ఊరకయ్యెను. అపుడు శివయోగి కనులు తెరచి యాతనిని జూచి చిరునవ్వు నవ్వెను. నేనింత తిట్టినను ఇతడు నవ్వుతున్నాడు గదా! అని అనుకొని మరింత బాధపడుచు ఇంటి ప్రక్క దారి పట్టెను. మరునాడు క్రొత్తక్రొత్త తిట్ల పురాణమును సంగ్రహించి సాయంకాలమునకు శివయోగి చెంతకు వచ్చెను. ప్రవచనము ముగిసి జనులందరును వెడలిపోయిన పిదప యోగిచెంత చేరి తిట్ల పురాణమును చేబట్టి తిట్ట నారంభించెను. అపుడును శివయోగి వాడి తిట్లు పూర్తియగు వరకు ఊరకుండి పిదప వాడిని చూచి నవ్విరి. ఆ నవ్వుచేత దుష్టునకు తాపము హెచ్చి దీనికి వేరే ఉపాయములాలోచింప వలయునని యెంచి వెంటనే శివయోగి ముఖము పై కాండ్రించి ఉమ్మివేసెను. శివయోగియును అదే ప్రసన్నత్వముతో తమ ముఖము పై బదిన ఉమ్మిని వస్త్రముతో తుడుచుకొనిరి. అతడిని చూచి ఊరక నవ్వసాగిరి. దీనితో నా దుష్టును మనసు కుతకుతలాడసాగెను. ఇతడినేమి చేయాలి? ఎట్లు హింసించాలి? అని యనుకొనును ఇంటి దారి పట్టెను. శివయోగి యొక్క ప్రసన్న ముఖమే అతని కనులకు కనిపించుచుండెను. వాడి మనోతాపము పశ్చాతాపముగా పరిణమించెను. ఇటువంటి సౌమ్యుడగు యోగిని నేను ఏమేమో దూషించితిని. అది చాలక ముఖముపై ఊసితిని. అయినను ఒక మాటయినను బదులాడలేదు. అదెంతటి క్షమాగుణము! అదెటువంటి ప్రసన్నత్వము! అను పశ్చాతాపము తోడి విచారపు టాలోచనలు దుష్టుని మనము నందు మొనలెత్త సాగెను. తిండి సహింపదయ్యెను. నిద్రపట్టదయ్యెను. లేచి చక్కగా శివయోగి చెంత కేతెంచెను. వారపుడు ధ్యానమందు లీనమై యుండిరి. పాదములపై బడి కన్నీరు గార్చెను. కనులు తెరచిన శివయోగి ఎవరు నీవు? అని ప్రశ్నించిరి. "నేను తమను దూషించితిని. ముఖముపై ఉమ్మితిని. మహాపాపిని నేను. మీరు క్షమిచితిని అని అనే వరకు తమ పాదములను వీడను". అని మరింత గట్టిగా పాదములు పట్టి విడువడయ్యెను. అపుదు శివయోగి అతని వీపును నిమిరి పైకి లేప్చు "క్షమిచుటకు నీవేమి తప్పు చేసియుంటివి? తప్పు చేసిన వ్యక్తి ఇట లేడు. నీ దూషణలును లేవు. నిన్నటి వ్యక్తి యందలి మనమందు ద్వేషము, నోటిలో తిట్లు నిండి యుండినవి. ఇప్పటి వ్యక్తిలోని మనసు నందు భక్తి, నోటిలో మృదు వచనములు నిండి యున్నవి. నిన్నటి ఆ వ్యక్తి ఇపుడెక్కడ? ఇట్లున్నపుడు నేనెవరిని క్షమిచవలెను. లే. పైకి లెమ్ము. నీ జీవితము మంగళకరము కానిమ్ము" అని పంపిరి. ఇది నిత్య ప్రసన్నత.

ప్రసాది స్థల సాధకుడు నిత్యప్రసాదమును భుజించుట ద్వారా శివానుగ్రహమును పొంది యుండుట చేత అతడిలో ఇటువంటి నిత్య ప్రసన్నత యనునది నిండియుండును. స్తుతి-నిందల సుడిగాలియు కూడా ఈతడి ప్రసన్నత్వమును కదలించజాలదు.

ప్రసాది స్థల సాధకుడు అవధాన భక్తితో శివలింగమును అనుసంధాన మొనరించును. అవధానమనగా జాగృతి తోడి ఏకాగ్రత అని యర్థము. జాగృతియనగా నిద్ర నుండి మేల్కొనుట గాదు. మొహ నిద్రనుండి జాగృతి నొందుట. సామాన్యముగా మానవుడు పరుండినపుడు అజ్ఞానావస్థయందు ఉంటాదు. దొంగలు రాత్రులందు అందరు నిద్రించినపుడే ఇంటిలోని సంపద నపహరించుకొని పోతారు. మనము ఇంట్లోని సంపదను వివిధాలోచనలతో దొంగలకు చిక్కకుండునట్లు రక్షించుకుంటూ ఉంటాము. అయితే నిజమయిన సంపద గృహమందుండిన ధన-కనక-వస్తు-వాహనములు కావు. మనసునందుండిన జ్ఞాన సంపదయే మానవుని నిజమయిన ఆస్తి.

పసిడి నీది కాదు, భూమి నీది గారు,

కాంతయును నీయది గాదు

నీదన్నది జ్ఞాన రత్నము, దానినలంకరించుకొన్నపుడె

మా గుహేశ్వర లింగమందు నీకంటె ధనవంతులు లేరు చూడుమా!

అల్లమ ప్రభువుల ఈ పలుకులు మన ఆత్మజ్ఞానమేనిజమయిన సంపద అను దానికి సాక్షి. ఇటువంటి నిజమయిన సంపదను కాపాడుకొనుటకు మన మెటువంటి రక్షణ వ్యవస్థయును చేసుకొని యుండలేదు. దీనిని దొంగలించుటకు దొంగలెందరో పొంచుకొని యున్నారు. వార్ ఇనుండి సంరక్షించుకొనవలసిన కాలము నందు మొహనిద్రలో మునగక ఎచ్చరికతో నుండవలసి యుంతుంది. ఒక సుభాష్తకార్లు --

కామ: క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరా:|

జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||

కామ, క్రొధ, లోభ, మోహ, మద, మత్సరములను ప్రతి మనసునందు వాసము చేయుచున్నట్టి దొంగలు. వీరినే అరిషడ్వర్గ మందురు. వీరు జ్ఞాన రత్నమును అపహరించుటకు పొంచుకొని యుందురు. అందువలన లెమ్ము లేలెమ్ము. జాగృతి నొందుము అని మానవుడిని హెచ్చరించినారు. ఉపనిషత్తు కూడా "ఉత్తిష్ఠత జాగృత ప్రాప్యవరాన్ నిబోధత" అని అవధాన మొనరించుతుంది. ఈ సందర్భమున వివేకానందుల వారి 'Stand up be hold be strong' అను మాటను స్మరించుకొనవలయును.

ఈ రీతిగ కామాది దొంగలు జ్ఞాన రత్నము నపహరించకుండునట్లు జాగ్రత్త వహించుటయే అవధానౌ. షట్ స్థల సాధనా పథికుడు శ్రద్ధా భక్తుల నలవరించుకొని భక్తుడౌతాడు. క్రమముగా వికసనము పొందును. వచ్చినట్టి భక్తి ఫలితము నశింపరాదను అవధానము కలిగినవాడై నపుడు ప్రసాది యగును. పొలము నందు సమృద్ధిగా పండిన పంటను పశువులు-దూడలు పిట్టలు-పక్షులు పాడు చేయరాదని రైతులు పంటను కాయుటకై వెళ్ళెదరు. అటులే ప్రసాది స్థలము నందు పెరిగి వచ్చిన భక్తి పంటను సాధకుడు అవధాన పూర్వకముగా ఆ పైరును కాయును. అధ్యాత్మిక క్రాంతికి రూపకర్తయైన అల్లమ ప్రభువుల ఈ వచనమును వినుడు.

తనువు పారగ జేసి, మనసు గుద్దలిగ జేసి

త్రవ్వి తీసితి నయ్య భవభ్రాంతి వేరును

చిదిపి సంసారమను మట్టపెద్దను నాటితి బ్రహ్మ బీజము

అఖండమండలమను బావి, పవనమె రాట్నము

సుషుమ్న నాడి నుండి ఉదకము తీర్చి

వృషభము లైదును నిర్మలత్వము చెరిపెనను

సమతా సహనమను కంప నుంచి, నిరతము జాగృత మొంది

పైరు పెంచితిని చీడు గుహేశ్వరా!

ఇక్కడ నిరంతరము జాగృతి గలిగి యుండుమను మాట అతి ముఖ్యమైనది. ఇది ప్రసాది స్థలపు అవధాన భక్తికి సూచకము. వెనుక చెప్పినట్లు అవధానమనిన హెచ్చరికయని అర్థము. ఇది జీవితమున అతి ముఖ్యమైనది. ఇటు మానవునకు దేనినుండియును కొరతన్నది లేదు. పక్షివలె ఆకసమున ఎగురగలడు. చేపవలె నీటిలో ఈదగలడు. అంతయును యాంత్రికముగనే నడిచినది. అయితే జీవితము నందు ఎరుక మాత్రము లేకున్నది. ఎరుకతో జీవించువాడు మహాత్ముడు నిద్రించువాడు జీవితమును సాగించి మరణించువాడు మానవుడు. ఎరుకతో జీవించ్ వాడియందు వివేచనము (ఆలోచన) జాగృతమొంది ప్రతి ప్రసంగము, పరిస్థితియందును పూర్తిగా విచారించి అడుగు వేయుట మంచిది.

బుద్దుడు సిద్ధార్థుడై యుండినపుడు రథారూఢుడై నగర సందర్శనమునకై బయలు దేరిన సమయమున రోగి, ముదుసలి మరియు మృతదేహము (శవము) ఎదురయినపుడు సారథితో వారి అవస్థలను గురించి క్షుణ్ణముగా తెలిసికొనెను. ఈ యవస్థలనునవి ప్రతి యొకరి విషయము నందును అనివార్యమన్నది తన మనసెరిగినపుడు వెంటనే యాతని మనసు జాగృతి నొందెను. ఈ జాగృతియే రోగము, ముదుసలితనము, చావు వీటిని మించిన పరమ సత్యానందము యొక్క సంశోధనకై యత్నింపజేసెను. సిరిసంపదలతో గూడిన సామ్రాజ్యము, ప్రేమించెడు ప్రియసతి, వాత్సల్యము నెరపు కుమారుడు, ఆదరణ జూపు తల్లిదండ్రులు వీరందరిని వదలి అడవికి బయలుదేరి సత్యశోధనకై సిద్ధపడెను. సిద్ధార్థుడు సిద్ధమయిన అర్థము గలవాడయ్యెను. అనగా నిజమైన అర్థమునందు బుద్ధుడయ్యెనని భావము. సిద్ధార్థుడు బుద్ధుడగుటకు అతని బ్రతుకునందు యోచించెడు ఆ హెచ్చరికయె కారణము. బుద్ధుడు చూచిన సన్నివేశమున్నియును మనందరి యెదుట కనిపించునవె. అయితే కనులు విప్పారుట లేదు. హెచ్చరిక పొందుటలేదు. అంతియే గాదు మన మల్పాత్ములమై మిగిలెదము. బుద్ధుడు మేల్కొనెను. మహాత్ముడయ్యెను.

సమర్థ రామదాసు వరుడై పెళ్ళి మంటపమున కూర్చొని యుండిన సందర్భము. ప్రక్కన కాబోయే ఇల్లాలగు పెళ్ళి కూతురు. బంధువులు బాంధవులు, ఆప్తేష్టులు, ఇష్టమిత్రులు, సమ్రంభపు పెండ్లి కార్యమున పాల్గొని యుండిరి. ముహుర్తము సమీపించెను. అందరిచేతులలోను అక్షతలు చేరినివి. పురోహితులు మత్రాలు చదువ నారంభించిరి. "సుముహుర్త స్సావధానో సులగ్నే సావధానో..." అను మంత్ర పఠనము సాగుచుండ అటు రామదాసు మనసు జాగృతి నొందసాగెను. ఈ మంత్రాథము రామదాసు ఆలోచనాశక్తిని రేకెత్తించి మస్తకమును జాగృతం చేయసాగెను". ఉత్తమ ముహుర్తమునందు జాగృతి నొందవలయును. ఇదే ఉత్తమమయిన అవకాశము. ఇపుడు జాగ్రత్తతో జాగృతి నొందకున్నచో మున్ముందు జాగృతి నొదుటకు వీలు కాదు అని ఆ మంత్రము చెప్పుచున్నది. రామదాసు పెళ్ళిమంటపము నుండి లేచి బయలు దేరిరి. జాగృతి యను ఆ ప్రవాహపు వేగమెంతగా ఉండినదంటే, దాని నాపుటకు తల్లిదండ్రుల వాత్సల్యము కాని, కాబోవు పత్నీవ్యామోహము గాని, బంధు బలగముల బాంధవ్యమునకు గాని సాధ్యము కాలేదు. తిరిగి కూడా చూడకుండ రామదాసు ఆత్మారాముడిని సాధించి రాముడే తానగుటకు బయలుదేరెను. ఇది అవధానపు ప్రవాహము, జాగృతి యొక్క వేగము.

సాగరము చేరుటకై తమకముతో పరుగిడుచున్న నది తన దెస వచ్చిన ఉపనదుల నన్నిటిని తనలో చేర్చుకొని మహా నదియై సాగుచుండును. సమతల ప్రదేశమున నెమ్మదిగాను తగ్గు ప్రదేశమునందు అత్యంత వేగముగాను ప్రవహిస్తుంది. ఇదే రీతిగ షట్ శ్థల పథమునందు సాగిన సాధకుడు ఈ సాధన కనువును, ఆవశ్యమైనట్టి తగిన శ్రద్ధా - నిష్టలను తనలో అలవరించుకొనుట ద్వారా తన సాధనను బలపరచుకొని, ఈ ప్రసాది స్థలము నందు అవధానము వహించి, తనలో నిలుపుకొని, జాగృతి వహించి, వేగవంతముగ సాధనయందు ముందునకు సాగును. పళ్ళపు ప్రదేశమున ప్రవహించునదికి వేగమ్ను కలిగించునట్లు, అవధానము సాధకుని సాధనకు తీవ్రతను కలిగించుచుండును. ప్రసాది స్థల సాధకుడు అవధానము గలిగి భక్తి పరుడై యుండును. అనగా అతడు జీవితము నందు జాగృత మొందును. సాధనయందును తీవ్రతను కనుగొనునని యర్థము.

ఈ స్థల సాధకుడు శివలింగమును అనుసంధానమొనరించును. ఈ పూర్వపు స్థలములయందు తెలిపిన శివయోగ ప్రక్రియననుసరించి దృఢసంకల్పముతో సాధకుడు తన మనోవృత్తిని మణిపూరక చక్రమునందు స్థిరపరచినపుడు అక్కడ జ్యోతి సాక్షాత్కార మగును. ఈ జ్యోతిని శివలింగమని వీరశైవ శివయోగులు పేర్కొనియున్నారు. దీనిని అనుసంధాన మొనరిస్తూ ఈ స్థల సాధకుడు అంతరంగములో ఆత్మిక వికాసము చేసికొని, ప్రపంచపు వస్తువులయందు శివభావమునొంది విషయ-వస్తువులను ఆ శివుని ప్రసాదమని భావించి స్వీకరిస్తూ లింగ భోగోపభోగియగును.

సారాంశమేమనగా మనసు యొక్క నిర్మాణమునకు కారణమైన అన్నమును గురు-లింగ-జంగములకు సమర్పించుటవలన పవిత్ర ప్రసాదముగా చేసి అనుభవించి, శివుని అనుగ్రహము పొంది, దేహేంద్రియములందు నెలకొల్పిన లింగములకు తాను అనుభవించెడు విషయముల నెల్ల సమర్పించి ఆ లింగముల ప్రసాదమని భావించి, వాటిని స్వీకరిస్తూ నిత్య ప్రసన్నత్వమును చిత్తమునందు అలవరచుకొని అవధాన భక్తిచేత శివలింగమును అనుసంధానము చేయు సాధకుడే ప్రసాది.