ఐక్య స్థలము
షట్ స్థల సోపానములందు ఆరవ సోపానమే ఐక్యస్థలము. ఇది చివరి సోపానము. "ఏకస్యభావ: ఐక్యం" అనునది దీని వ్యుత్పత్తి. పరాత్పర వస్తువయిన స్థల తత్వముచేత వేరు చేయబడిన జీవులు సాధనము ద్వారా మరల దానియందే లీనమయ్యెడి అవస్థయే ఐక్యస్థలము. షట్ స్థల సాధనయును శ్రద్ధతో ప్రారంభమై సామరస్యమునందు పూర్ణమవుతుంది. భక్తుని శ్రద్ధయే వికాసమొంది అతడిని శివసాయుజ్యము వరకు గొనిపోవును. సామరస్య మనగా ఒక వస్తువు మరొక వస్తువు నందు కలిసిపోయి ఊకటిగా నగును. జీవాత్ముడు పరమాత్ముని యందు కూడుకొని ఒకటి యగుటను సామరస్యమని పిలువబడుచున్నది. అటులే ఐక్య స్థల సాధకుడు సమరస భక్తితో మహాలింగానుసంధానము చేయునని నిరూపింపబడుచుండును.
సామాన్యముగా ఒక వస్తువు మరొక వస్తువు నందు కలిసిపోయి సమరసము కావలయుననిన ఆ రెండు వస్తువుల యొక్క గుణధర్మములు ఒకటియే యై యుండవలయును. భిన్నభిన్న ధర్మములు కలిగిన రెండు వస్తువులు కలిసి ఒకటగుటకు సాధ్యము కాదు. ఒకటయినట్లు కనిపించవచ్చును. కాని సమరసమును పొదజాలవు. నీటిలో నీరు కలిసినపుడు అది సమరస మొందుతుంది. ఏల ననగా నీటిలో సమాన ధర్మములుండి కలిసిపోయి నపుడు వాటిని వేరుచేయుటకు సాధ్యము కాజాలదు. ఇది మొదట వేసిన నీరు, ఇది పిదప పోసిన నీరు అని విడదీసి చూచుటకు సాధ్యము కాజాలదు. అది ఏకరసమవుతుంది. అయితే నీటిలో పాలు కలిసినచో దానిని సమరసమని పిలువను వీలుకాదు. మొదటుండిన నీటి రంగు పాలను చేరిన మిగులబోదు. ఏలననగా పాలయొక్క గుణధర్మమే వేరు. నీటి గుణధర్మము వేరు అవి రెండును కలియగా కలుగునదే వేరొక ధర్మము. మొత్తము మీద సమాన గుణ ధర్మము పొందిన వస్తువులందు మాత్రము సమరస మన్నది సాధ్యమగును. జీవ పరమాత్మలందు సమరసము కౌల్గవలయు ననిన జీవియును పరమాత్మ యొక్క గుణ ధర్మముల ఎత్తువరకు ఎదగవలసి యుండును. ఆత్మ దృష్టితో విచారింపబది వస్తుత: అంగ లింగములందు ఎటువంటి భేదము లేదు. అయితే వాటిలో నున్న శక్తి సామర్థ్యముల నవలోకించినచో భేదము స్పష్టముగా కనిప్స్తుంది. జీవి అల్పజ్ఞత్వము, మరియు అల్ప కర్తృత్వ శక్తులతో కూడుకొని యుండగా శివుడు సర్వజ్ఞత్వము, సర్వకర్తృత్వ శక్తులతో విశిష్టుడై యుండును. అటులే శివాద్వైత పరిభాష యందు నీలకంఠ శివాచార్యులు "స్థూల చిద చిద్రూపశక్తి విశిష్టత్వం జీవత్వం" అనునదిగా జీవాత్ముని లక్షణమును, శివుని లక్షణమును నిరూపించి యున్నారు. స్థూల చిద చిత్ శక్తియనగా మలత్రయ విశిష్ట అల్పజ్ఞత్వము మరియు అల్ప కర్తృత్వమనియును, సూక్ష్మ చిద చిత్ శక్తియనగా మలత్రయ రహితమగు సర్వజ్ఞత్వము మరియు సర్వకర్తృత్వమనియు అర్థము చెప్పుకొనదగును. కారణమేమనగా సంసార అవస్థయందు జీవ పరమాత్మలందు నెలకొనియుండిన గుణధర్మములు పరస్పరముభిన్నమై యుండుట చేత వారిరువురి సమరస మెట్లు సాధ్యమను సందేహము సహజముగా కలుగుతుంది. ఈ కారణముగానే ద్వైతవాదులు శివ జీవులందు అద్వైతము లేక సమరసము అన్న దెప్పటికిని సాధ్యము కాదని వాదించుటన్నది సాగును. అయితే వస్తుత: శివ జీవుల పరస్పర భిన్నత్వము వార్లో నెలకొని యుండిన గుణధర్మముల కారణమే తప్ప వారి స్వరూపము మాత్రము కాదు. స్వరూపముతో వారిరువురును ఒకటియై యుండుట చేత వీరి స్వరూపము నావరించిన అల్పజ్ఞత్వము, అల్పకర్తృత్వము మరియు సర్వజ్ఞత్వము, సర్వ కర్తృత్వములు దూరముగా జరిగినపుడు వీరిరువురకు సామరస్యమును ఘటింప చేయుటందు ఎటువంటి విరోధము లేదు.
రెండు వస్తువులందు సమానత లేనిచో వాటిలో సామరస్యము కలుగజాలదు. ఇది ప్రకృతికి అనివార్యమయిన నియమమై యున్నందున జీవాత్ముడు శివునియందు సమరస మొందవలయునన్న శివుడి యందుండిన గుణధర్మములను తాను గడించి సామరస్యమునకు సిద్ధము కావలసియుండును. ఆ శివుడి యొక్క గుణములను సంపాదించెడు సాధన సోపానమే ఈ షట్ స్థలము. జీవుడు ఈ సోపానములను తనలో అలవరించుకొనుట ద్వారా శివసామర్థ్యమును పొంది నిలుచును. ఇటువంటి అవస్థకు చేరినపుడు శివసామరస్యము ఘటించి శివుడియందు జీవుడు ఒకటియగును. అంగమందు లింగము కూడుకొని సమరసమొందుతుంది. శివుడియందీ గతి సమరస మొందిన సాధకుడు తనలో సమరస మొందింప జేసుకొనిన శివుడు వేరుగా కనిపించుట లేదు. రేణుక భగవత్పాదులు సిద్ధాంత శిఖామణియందు
జలే జలమివ న్యస్తం వహ్నౌ వహ్ని రివార్పితం।
పరే బ్రహ్మణీ లీనాత్మా విభాగేన న దృశ్యతే॥
అనునదే శివసామరస్యము మొక్క స్థితిని ఉదహరణ పూర్వకముగ వర్ణించియున్నారు. నీటిలో నీరు, అగ్నిలో అగ్ని కూడుకొని ఒకటియైన పిదప వాటిని వేరు చేయుటన్నది యెట్లు సాధ్యము కాజాలదో అటులే శివ ధర్మమును పొంది శివుడి యందు ఒకటయిన జీవిని శివుడి నుండి వేరుచేసి చూచుటకు సాధ్యము కాదు. శరణుల అనుభవ వాణియందు జలమునందు జలము కలిసి యున్నట్లును తైలము నందు తైలము కలిసియున్నట్లును, ఘృతమందు ఘృతము కలిసినట్లును, వాయువు నందు వాయువు కలిసియున్నట్లును మొదలగు వానిని ఈ స్థితిని వర్ణిస్తుంది.
ఈ ఉదహరణలకును శివజీవుల సామరస్యమునకును స్థూలముగా సమరస్ దృష్టితో సామ్యత్వమనిపించినను, సూక్ష్మముగా విచారించినప్పుడు జలము జలముతో కలియకకు శివజీవుల సామరస్యమునకు సూక్ష్మమయిన భేదమున్నది. నీటిలో నీరు కలిసినపుడు తొలుతటి నీరు హెచ్చును. అయితే శివుడియందు జీవి కలిసినపుడు దానియందెటువంటి అధిక్యతన్నది కలుగట లేదు. సాగరము నందు నది కలిసినట్లుగ ఈ సామరస్య మన్నది ఒక అర్థమునందు పొసగును. వేరువేరు నదుల నీటి ప్రహహము సాగరమును చేరినపుడు అందధికముగా గాని లేక ఆవిరియై నీకు పైకి పోయినపుడు అందధికముగా గాని లేక ఆవిరియై నీరు పైకి పోయినపుడు సాగరమందు కొరత అనగా నీరు తగ్గుట కాని కలుగబోదు. తొలుత ఎట్లుండునో అట్లేయుండును. నీరు వచ్చి చేరినపుడును అంతే. ఆవిరియైపోయినపుడును అంతే. శివతత్వము కూడా సాగరము వలెనే తోచును. అందువలననే శివయోగి శివాచార్యులు "తం వందే చిన్మహోదధిం" అని శివుడిని సాగరముతో పోల్చియుండిరి. సాగరము వలెనే అనంత జీవకోటి ముక్తులై శివ చైతన్యము నందు సమరస మొందినపుడు అతడిలో గర్వము లేదు. సృష్టి సమయౌ నందు జీవులు అతడినుండి వేరుపడినపుడు అతడిలో కొరత లేదు. ఏలన అతదు సర్వగతుడు మరియు సర్వవ్యాపకుడు.
ప్రాణలింగాది యోగేన సుఖాతిశయ మేయివాన్।
శరణాఖ్య: శివేనైక్య భావనా దైక్యవాన్ భవేత్॥
ఇది సిద్ధాంత శిఖామణి వచనము. షట్స్థల సాధకుడు తన సాధనా బలముతో విభిన్న స్థానములను దాటి మెల్లమెల్లగా భక్తుడై, మెల్లమెల్లగా మహేశ్వరుడై, ప్రసాది, ప్రాణలింగి, శరణుడై చివరకు సకల సాధనా ఫలమైన నిరతిశయానందమును పొంది శివుడితో ఐక్యభావన నారోహించుకొనును. శివుడితో ఐక్యత ననుభవించెడు కారణమున ఐక్యుడని పిలువబడెడి ఇతడు అన్నిచోట్ల ఏకత్వము నాస్వాదించును. అందువలననే అతడిలో రాగ ద్వేషములు, శోక మోహము లనునవి కలుగజాలవు. "తత్ర కో మోహ: క: శోక: ఏకత్వ మనుపశ్యత:" అని ఉపనిషత్తు కూడా అంతటను ఏకత్వము ననుభవించెడు సాధకుడు శోక మోహములతో నివృత్తుడగు ననుదానిని ప్రతిపాదించుచున్నది. తనకు భిన్నమైన వాడుండినపుడే రాగద్వేషములు. అంతయును తానే యను అనుభవ భావమునకు తెలియవచ్చినపుడు ఎక్కడ రాగము? ఎక్కడ ద్వేషము? రాగ ద్వేషములు లేనపుడు శోక మొహము లెక్కడ? అట కేవలమానందము మాత్రమే. శివయోగి యొక్క ఈ యానందమును వర్ణించుటకు మాటలు చాలవు. శరణు లందరి అక్క మహాదేవి యక్క
లింగమనలేను, లింగైక్యమనలేను, సంగమనలేను, సమరసమనలేను
అయినదనలేను కాదనలేను, నీవనలేను, నేననలేను
చెన్న మల్లికార్జునయ్య లింగైక్యమైన పిదప ఏమని యనలేను.
అని తన లింగైక్యావస్థ యొక్క మౌనమునే మాటల ద్వారా ప్రకటించియున్నది. ఈ యవస్థ కేవలము అనుభవవేద్యము మాత్రమే. దానిని మాటల ద్వార వ్యక్త మొనరించుటకు సాధ్యాము కాదు. ఏలననగా దేవుడిని సాక్షాత్కార మొనరించు కొనుటకు బయలుదేరిన నాధకుడు అతని సాక్షాత్కార మగుచుండినట్లు తననే తొలగించుకొనుచుండును. ఆతడి అహం సో2హమై దానియందె విలీనమైనపుడు అట తెలియవచ్చిన అనుభవమును గురించి తిరిగి వచ్చి చెప్పున దెవరు? అది మూగవాడు తిన్న బెల్లపు రుచివంటిది.
ఉప్పు బొమ్మ, తన అప్పను వెతుకుటకు వెడలెను. తనను తయారు చేసిన యజమానిని ఇట్ల అడిగెను. "నేను ఎటునుండి వచ్చితిని? నా మూలమేది? నాకు నా అప్పను (తండ్రిని) చూడవలయునను ఆశ. అతడుండిన స్థానమేది? తెలుపు" మని అడిగెను. దానికి యజమానిట్లు పలికెను. "నీ మూలము సాగరము, అది చాలా దూరమనెను" అపుడా బొమ్మ "అదెంత దూరమయిన యుండని నేను పోయెదను. అయితే అతడెట్లుండును? ఎంత గొప్పవాడై యుండును? నాకు తెలుపు మనెను. "నాకు చూపుటకై నడువు" మని బొమ్మ అతడిని తనమెంట పిలుచుకొని సముద్రము సమీపమునకు వచ్చెను. తన తండ్రిని కనులారా గాంచి సంతోషమొందెను. మా తండ్రి అదెంత విశాలమని ఆశ్చర్యమొందెను. నా తండ్రి ఎంత లోతుండవచ్చునని యజమానిని అడిగెను. అతదందులకు "నాకు తెలియదనెను". తక్షణమే ఆ బొమ్మ "అట్లయితే నేను పోయి చూచుకొని వచ్చి నీకు మా తండ్రి లోతెంతయో తెలిపెదను" అని పలికి సాగరమునందు కుప్పళించి దూకెను. సాగరమన్నది అంత చిన్నదా! క్రిందకు పోవుచు క్రమేపి కరుగుచు సొరగుచు తలమాను నంతలోనే తానే లేకుండా పోయెను. సాగరము నందు సమరసమొంది ఒకటయి ఐక్యమయి పోయెను. పైన నిలిచిన యజమాని 'నాబొమ్మ తిరిగి వస్తుంది. సాగరపు లోతును తనకు తెలుప్నని బొమ్మకై నిరీక్షించుట యందు కాలము గడుపసాగెను. అయితే బొమ్మ మాత్రము తిరిగి రాలేదు. యజమాని మాత్రమే తుదకు ఇల్లు చేరెనంట.
ప్రస్తుతము సత్య సాధకుని గతియును ఉప్పు బొమ్మ కథ వంటిది. సత్య సాధకుడు సత్య శోధకుడై సాధన నారంభించును. సాధనా పథము నందు అతడు వివిధ సోపానములను ప్రాప్రించుకొనును. సత్యము యొక్క సమీపమునకు పోయి ఇంకేమి సత్యము సాక్షాత్కారమవుతుంది అనునంతలో సాధకుదు ఆ సత్యము నందు సమరసమొందును. దానిలోనే లీనమగును. సత్యము యొక్క సాక్షాత్కారమొందిన శివయోగి మూలకముగా మనము సత్యమును గురించి అడుగుదమని పైన నిలిచిన జనము అతడికి నిరీక్షింతురు. అయితే అతడు తిరిగి వచ్చునా!
ఇట గమనింప వలసిన సూక్ష్మమయిన అంశమొకటున్నది. సత్యము యొక్క సాధకుడు సత్యమునందు లీనమగును. దాని యర్థము అతడు చనిపోవునని కాదు. చనిపోవుటయే ఐక్యత ధ్యేయమయిన ఎవరీ సాధకునకు శరణగుదురు? సత్యమునందు సమరసమొందునది అనిన దానిలో లీనమగునదని దీని యర్థము. అతడి అహము అటులే భావనలు సత్యమయమయి ఆ సమయమునందు తమ అస్తిత్వమును పోగొట్టుకొనును. అపుడది కేవలము ఆనందము మాత్రమే. ఇట్లయి అహము లేకయె అనుభవించిన ఆనందము యొక్క అవస్థను చెప్పుటకు అదెట్లు సాధ్యము.
ఈ అవస్థను ఇట్లు తెలిసికొనదగును. దినమంతయును గడించి అలసిపోయిన మనిషి పడుకొని నిద్రపోవును. పడుకొనువరకు అంతయును తెలియును. కనులు మూసిన పిదపకూడ నిద్ర ఆవరించు వరకు వెలుప జరుగునట్టి ఘటన లన్నియును మసక మసకగా నైనను తెలియును. అయితే నిద్ర యెట్లు వచ్చును. ఆ నిద్రయందు ఎటువంటి ఆనందము నను భవించుననునది మాత్రము ఎవరికిని గోచరింపదు. వేకువన లేచినంతనే "సుఖేన సుప్తోహం న కించిదవేదిషం" పూర్ణమైన ఆనందముగా నిద్రయైనది. వేరే ఏమియును నాకు తెలియుట లేదు అని చెప్పును. ఎవరయినను ఆనందము ఎట్లున్నదని ప్రశ్నించినచో ఆతడిచే సమాధాన మిచ్చుటకు సాధ్యము కాదు. ఏల ననగా అతడు నిద్ర పోయినపుడు వాడి అహం సంపూర్ణముగా లేనిదై యుండును. అనగా తాను దానిలో లీనమై యుండును. నేనను దానిని తొలగించుకొని అహమన్నది లయమై అనుభవించిన ఆ సుఖము నెట్లు తాను వివరించ వలయును. శివ సామరస్య అవస్థయును ఈ సుషుప్తి అవస్థవంటిదే. అందులకై శంకరాచార్యులు "సుషుష్యైక సిద్ధ: శివ: కేవలోహం" నేను శివ స్వరూపుడనను కేవలావస్థను సుషుప్తి యొక్క ఉపమేయము ద్వారా తెలియవచ్చును అనునదిగా ప్రతిపాదిచినారు. నిద్రయందు అహమన్నది లేక ఆనందము ననుభవించుట చేత ఏ రీతిగ దానిని అభివ్యక్త మొనరించుటకు సాధ్యము కాజాలదో అటులే ఐక్య స్థలమందు శివ సామరస్యమును పొంది జీవియును సంపూర్ణమైన అహము నశించి శివతత్వ రూపమగు సచ్చిదానంద మనుభవించుట చేత అతడు శబ్ధ మాధ్యములచేత దానిని అభ్వ్యక్త మొనర్చుటకు సాధ్యము కాజాలదు.
తెలిసి తెలిసి తెలివి వంధ్య మయ్యెను
మరుపు మరువనెది మరుపు
గుహేశ్వరుడను శబ్దము పాడై వంధ్యయయ్యెను
అల్లమ ప్రభువుల ఈ అనుభవ వచనము పైన వివరించిన విషయమునకు ప్రమాణము. బ్రహ్మను తెలిసిన వాడు ఊరకయే ఉంటున్నాడను దానిని ప్రభు దేవులిట సూచ్యముగా నిరూపించియున్నారు.
సామాన్యముగా ఒక వస్తువును తెలిసికొన వలయు ననినచో జ్ఞాత జ్ఞానము మరియు జ్ఞేయ మనెడి త్రిపుటి ఆవశ్యమగును. జ్ఞాతృ అనగా తెలిసికొనెడి వ్యక్తి, జ్ఞేయమనగా తెలిసికొనదగిన వస్తు విషయము. జ్ఞానమనగా తెలుసుకొనెడు క్రియ. బాహ్య వస్తువులను తెలుసు కొనునపుదు ఈ త్రిపుటిలు వేరువేరయి యుంటాయి ఒక వస్తువును చూచునపుడు చూచెడు వ్యక్తియు, కనిపించెడు వస్తువు కంటెను, వేరయి యుండును. చూచెడు వ్యక్తి మరియు చూడబడు వస్తువు ఒకటే యై యుండవు. ఇదే విధముగా చూచేదు క్రియయును ఆ వస్తువు, వ్యక్తుల కంటెను భిన్నమై యుండును. ఈ త్రిపుటీలుండినపుడె బాహ్య వస్తువు యొక్క జ్ఞానము మనకు పుడుతుంది. వీటిలో అకస్మాత్తుగా యే ఒక్కటి లేకుండినను వస్తు వివేకము కలుగుటకు సాధ్యము కాదు. చూచెడు వ్యక్తి మరియు క్రియ ఈ రెండునూ ఉండి చూడవలసిన వస్తువే,యుండనిచో ఆ వస్తువు యొక్క జ్ఞానము మనకెట్లు తెలియ సాధ్యమగును? ఇదే విధముగా ఒక వస్తువు లోనున్న మనసు దాని ప్రక్క గురి పెట్టకున్నచో వస్తు జ్ఞానము కలుగుట యన్నది లేదు. ఒక వస్తువును గురించి తెలియవలసి వచ్చినచో ఆ వస్తువు దెస కేవలము కనులు మాత్రము చూచినచో చాలదు. దాని వెనుక మనసు నుంచుటయును మిక్కిలి అవసరము.
దుష్యంతుని చింతన యందు మగ్నురాలయిన శకుంతల ఎదురుగా దుర్వాస మహర్షి నిలిచి యుండినను ఆమెకు వారిరాక జ్ఞానము తెలియరాలేదు. ఆమె కనులు ఆ మాహర్షిని చూచుచుండి నట్లుండినను మనసు మాత్రము అట లేకుండెను. అందుచే దుర్వాస మహర్షి "ఎవరి చింతన యందు మగ్నమై యుండి నావంటి ఋషి ఎదుట నిలిచినపుడు గౌరవించక అవమానించి యుంటివో ఆ వ్యక్తియే నిన్ను మరచిపోవు నట్లగు గాక అని శపించెను. ఈ శాపమే " అభిజ్ఞాన శాకుంతల" మను నాటకమునకు నాంది యయ్యెనుయ్. దీని నిట నిరూపించియుండిన కారణ మింతే? అదేమనగా కనిపించెడు వస్తువు మరియు దానిని చూచుటకు సాధనమయిన కనులుండిన మాత్రమున వస్తువు యొక్క జ్ఞానము కలుగ జాలదు. జ్ఞాతృవైన జీవాత్ముడుండుటయు కూడా వస్తు జ్ఞానమున కావశ్యము. అదే విధముగా జ్ఞాతృ రూపమయిన జీవాత్మ అనగా మనసు, అటులే జ్ఞేయరూప మయిన వస్తువులుండినంత మాత్రము చాలదు. చూచెడు క్రియయౌను అక్కడ జరుగ వలయును. ఈ రీతిగ జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయములను త్రిపుటిల జ్ఞానము ఘటించుటకు కారణములగుచున్నవి.
ఈ మూడును పరస్పరము వేరే యై యుండును. అయితే ఆత్మ సాక్షాత్కార విషయమునందు మాత్రము త్రిపుటిలు వేరై యుండక ఒకటే యై యుంటాయి. తెలుసుకొనెడు (జ్ఞాత) వస్తువు ఆత్మకు సంబంధించినది. తెలియవలసిన (జ్ఞేయ) వస్తువు అదియును ఆత్మ సంబంధమే "సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ" యను శ్రుతి ప్రమాణానుసారము ఆత్మ జ్ఞాన స్వరూపమై యుండుట చేత తెలుసుకొనెడు క్రియ (జ్ఞానము) కూడా ఆత్మయే యై యున్నది. బాహ్యవస్తువు యొక్క సాక్షాత్కారమునకు మరియు ఆంతరిక సాక్షాత్కారమునకు ఇదియే మూలకారణమయిన వ్యత్యాసము. త్రిపుటిలు భిన్న భిన్నమై యుండినపుడు వాటిచే కలిగెడు జ్ఞానమును మాటలద్వార వ్యక్త పరచవచ్చును. అయితే ఈ మూడును ఒకతి అయినపుడు కలిగిన జ్ఞానమును మాటలతో తెలియజేయుటకు సాధ్యము కాజాలదు. అందుల కొఱకే బయలు స్వరూపి అల్లమ ప్రభువులు -
తెలిసితనునది తాను బయలు
తెలియననునది తాను బయలు
తెలివి గురుతుల యొక్క మరుపులోననె
గుహేశ్వరన్నది తాను బయలు
అని త్రిపుటి లన్నియును బయలు రూపములని తెలుపుట మూలకముగా అవన్నియును ఒకటే యనునదిగ నిరూపించియున్నారు.
ఐక్య స్థల సాధకునందు పశుపతి భావము గాని, సై పతి భావము గాని లేనిదై కేవలము 'శివో2హం' భావము మాత్రము మిగిలి యుంటుంది. భక్తస్థలమునందు భగవంతుడిలో పశుపతి భావము వృద్ధి చెంది మహేశ్వర స్థలమునందు ఈ భావమే పూర్ణ రూపు దాల్చుతుంది. ప్రసాది స్థలమునందు సతి పతి భావము ప్రారంభమై శరణస్థలము నందు నిలిచి పూర్ణ రూపు దాల్చుతుంది. ఈ రెండు భావనలందు ద్వైతము మరియు ద్వైతాద్వైతములు ద్వనిస్తాయి. ఈ సకల భావనలు ఐక్య స్థలము నందు విలీనమై 'శివో2హమ 'ను భావము జాగృత మొందుతుంది. ఈ భావన అద్వైతమును ప్రతిబింబిస్తుంది. వస్తుత: విచారించబడగా ఈ శివో2హ మను భావము కూడా ఐక్య స్థలము యొక్క ప్రారంభ స్థితి. ఏల అనగా శివో2హమను భావమునందు కూడా అత్యంత సూక్ష్మమైన అహమన్నది మిగిలియుంటుంది. శివో2హ మనగా నేను శివుడనని అర్థము. నేను శివుడనను సబ్దము నందును నేనను 'అహం' మిగిలియున్నదని చూడవచ్చును. అయితే ఐక్యస్థల సాధకుడు సాధనా ప్రగాఢత్వమునందు ప్రవేశించినపుడు ఈ భావమును నిలువ జాలదు.
ఒక చెట్టు క్రింద ఋషియొకడు ధ్యానమగ్నుడై "అహం బ్రహ్మోస్మి, అహం బ్రహ్మోస్మి" అను పదము నుచ్చరించుచు జపించుచుండెను. అతడు కూర్చొన్న స్థానము ప్రక్కన దారి యొకటి యుండెను. ఆ దారిలో కృష్ణుడు అర్జునుని రథమును నడుపుచు ఎటకో బయలు దేరి యుండెను. తపము చేసుకొను ధ్వనిని విని ఒక్క క్షణము నిలిచి యాతని సమీపమున కేతెంచి వచ్చి "నేను రథము నడుపు వాడినై యున్నాను. నేను రథము నడుపువాడినై యున్నాను" అని ఋషి కంటెను అధిక స్వరముతో పలుక సాగెను. ఋషి "అహం బ్రహ్మోస్మి" అన్నక్షణము నందె కృష్ణుడు అతడికంతెను బిగ్గరగా "నేను రథము నడుపువాడినై యున్నాను" అని చెప్ప సాగెను. వీరిరువురి మాటలచే రథము నందు ఆసీనుడయిన అర్జునునకు ఆశ్చర్య మయ్యెను. ఋషి కనులు తెరచి కృష్ణుని దెస చూచి "నీవు రథము నందు కూర్చొని రథమును అడుపుటను చూచిన చిన్న పిల్లలు కూడా నీవు రథికుడవన్నది తెలియవస్తుంది. అయినను నీవు "నేను రథము నడుపువాడినై యున్నాను" అని ఎందులకు కించపరచుకొనుచుంటివని ప్రశ్నించెను. "నన్ను చూచువారికి నేను సారథి యన్నది తెలియవచ్చును. అయితే నేను సారథి యన్నది నాకు గుర్తు రావడం లెదు. దారిలో నీవంటి పుణ్యాత్ముడొకడు నేను సారథి యన్న దానిని తెలియజేసెను. దానితో సంతోషాంతరంగితుడనై నేనిట్లు పలుకుచుంటిని అని కృష్ణుడు పలికెను. ఇది విని ఆశ్చర్యమొందిన ఋషి నీవు సారథి యనుంది ఒకరు తెలిపీ పిదప దానిని తెలిసుకుంటె చాలు, ఇట్లు చెప్పుట వలన ప్రయోజనమేమి? అని పలికెను. కృష్ణుడును ప్రశ్నకు మారుగా ప్రశ్నిస్తూ "నా పరిస్థితి ఏమైన గాని నేవేల 'అహం బ్రహ్మోస్మి ' యని జపించుచుంటివి" అని అనెను. బ్రహ్మ స్వరూపుడనై యున్నాను. అందులకే 'అహం బ్రహ్మోస్మి ' యని జపించుచుంటిని అనెను. వెంటనే కృష్ణుడు "నేను రథము నడుపువాడినై యున్నాను అందులకే నే రథసారథి" యని చెప్పుచుంటినని జవాబిచ్చెను. అపుడా ఋషి నవ్వుచు "నీవు రథసారధిగా నుంటివన్న పిదప దానిని మరల మరల చెప్పుటవలన ప్రయోజనమేమి? నీవు రథ సారధివి కావని యెవరేని చెప్పియుండిరా?" అని అడిగెను. అపుడు కృష్ణుడు నవ్వుచు "ఋషివరా! నీవే బ్రహ్మయైన పిదప 'అహం బ్రహ్మోస్మి ' అని జపించుటేల? మీరు బ్రహ్మ కాదని యెవరేని చెప్పి యుండిరా!" అని అనెను.
శివో2హం అనునది గాని, అహం బ్రహ్మోస్మి యనునది గాని ఐక్యస్థల సాధకుని తుది మెట్టునందు నిలుచుట లేదు. దానిని చెప్పుట చేతనే కొంత భేద మింకను మిగిలియున్నదను దానిని సిద్ధపరచి నట్లగును. శివో2హం అను దానిని తెలిసికొని అనుభవించిన మీదట మాటల నాశ్రయించుటేల? అనగా నోట తెలుపు టేలని యర్థము. ఏదో యొక మాటను అతిగా చెప్పినచో దాని విపరీతమే నిశ్చయ మౌతుంది. కారణము లేకయే ఒక వ్యక్తి "నేను దొంగను కాను, దొంగను కాను" అని చెప్పుచు పోయినచో అతడే దొంగయను సంశయము కలుగుతుంది. అటులే "నేను బ్రహ్మను, నేను బ్రహ్మను అను దానిని పున:పున: చెప్పుచుండిన అతడు బ్రహ్మయై యుండలేదు. అందుకే అంత జోరుగా చెప్పుచున్నాడను సంశయము కలుగుతుంది. అయినను దీనిని జపించెడు పరంపర ఉన్నదెందుకు?
సామాన్యముగా మన మనసు "అహం బ్రహ్మోస్మి" అను దానిని వెంటనే ఒప్పుకొన వీలుగాదు. అనేక జన్మలందు అహం బ్రహ్మోస్మి విరుద్దమయిన సంస్కారములే మన మనసు నిండ నిండి యుంటవి. అది ఒకేమారు వెనుకకు తగ్గదు. రుచియును తప్పదు. సంస్కారములన్నింటిని ప్రక్కకుంచి, పిదప "శివో2హం" అనగా అది పచ్చి గోడపై విసరిన రాయివలె అగుక్కు పోఉతంది. అయితే ఆ సంస్కారము లన్నవి ఒకే మారు ప్రక్కకు జరుగవు. మన మోకమారు 'శివో2హం' అన్నపుడు అంతరంగము నందలి మన సంస్కారము 'నీవు శివుడవు కావు. నీవు మల్లయ్యవు ' అని చెపుతుంది. ఆ మనసునకు నమ్మకము కలిగించుటకు మరల 'శివో2హ ' మనెదము. మనసు 'లేదు, నేను శివుడనే కాను సంగయ్య తనయుడని ' చెపుతుంది. ఈ రీతిగ 'శివో2హం శివో2హం' అని జపించుట మన మనో సంస్కార పోరాటమునకు ప్రతీక. నేను శివుడను దానిని ఒప్పుకొనని మనసునకు ఒప్పించెడు ప్రయత్నము. ఎపుడు తొలి సంస్కారములు నశించి శివో2హ మన్నది మనసందు అంతటను నిండుకొనియుండునో అపుడే శివో2హం జపమాగిపోతుంది. ఇట్లు మనో సంసార వాసనలు నశించి శివో2హం అను భావము వృద్ధి చెంది సర్వం అహమను భావము నెలకొని, సత్యమైన ఆత్మజ్ఞానమందు నిలిచిన మహానుభావుడే ఐక్యస్థలము యొక్క శివయోగి. ఇతడికి సాధనా సంబంధమైన ఎటువంటి మధ్యవర్తిత్వముల అవసరము లేదు. పూజ-జపము -ధ్యానము-దానముల గొడవలేవి లేవు. పారమేశ్వరాగమమును ఐక్యస్థల లక్షణమును ప్రతిపాదించుచు-
న పూజా నైవ చ ధ్యానం న యోగ కరణాదికమ్ ।
అహం తా భావనాధీర:శివలింగైక్య సంజ్ఞిక:॥
శివో2హం భావనయు సంపూర్ణ వికాసమొంది అంతయును శివ స్వరూపముగనే చూచుట వలన పూజ ధ్యాన యోగ కరుణాదుల ఆవశ్యకతను మిచి చూచుట వలన పూజ ధ్యాన యోగ కరణాదుల ఆవ్శ్యకతను మించిన సాధకుడే ఐక్యుడని నిరూపించుచున్నది.
పారమేశ్వరాగమము నందలి ఈ పలుకులు విని పూజాదులను వదలి వేసిన వాడే ఐక్యస్థలి యని భావించరాదు. ఇదియును గాక జీవన్ముక్తుడయిన శివయోగి బాహ్యాచరణల నన్నింటిని వదలియె యుండునని చెప్పుటకు వీలుగాదు. శివపూజాదికములను చేయవచ్చును. లేదా వదలవచ్చును. అది అతనికి సంబంధించిన విషయము. చేయుట వలన ప్రయోజనము లేదు వదలుట వలన నష్టము లేదు. అయినను ఒక విధంగా విచారించినపుడు జీవన్ముక్తునియందు సదాచరణము లుండుటయే తగినదని చెప్పదగును. ఎందులకనగా సామాన్యముగా లౌకిక జనులందు పెద్దల ఆచరణల ననుసరించెడు గుణ ముంటుంది. జీవన్ముక్తుడగు యోగియు ఒకవేళ తనకు సదాచరణలతో ఎటువంటి ప్రయోజనము లేదని భావించి, వాటి నన్నింటిని ప్రక్కకుంచి, మనసునకు నచ్చినట్లు వ్యవహరించి, దురాచారములనే తనలో నలవరచుకొన్నచో సామాన్య జనులు కూడా అతని యాచరణలను చూచి ఇదియే మనకును ఆచరణీయమని భావించి దురాచారులయెడ అవకాశముంటుంది. మరియు దుర్జనూను తమ ఆచరణలను సమర్థించు కొనుటకు అవకాశముంటుంది. ఐక్య స్థలావస్థకు వచ్చిన పిదప లింగపూజాదులు తనకవసరము లేకున్నను సామాన్య జనుల దృష్టితో వారికి ప్రేరణ గలిగించెడు ఉద్దేశముతో పూజాదికములందు పూనుకొనియుండుటయే తగినట్టిది. దీనినే సిద్ధాంత శిఖామణియు "జ్ఞానామృతేన తృప్త్యో2పియోగి ధర్మం న సంత్యజేత్" శివ జ్ఞానముతో సంతృప్తుడయిననూ శివయోగియైనవాడు ధర్మాచరణలను విడువరాదని విధిస్తుంది. భగవద్గీతయందు శ్రీ కృష్ణుడు కూడా
యద్యదాచరతి శ్రేష్ఠ: తత్త దేవేతరో జనా:।
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే॥
ఓ అర్జునా॥ గొప్పవారి ఆచరణే ప్రమాణమని భావించిన సామాన్య జనులు, నీవు యుద్ధము నుండి విముఖడవైతే నిన్నే అనుసరింతురు.
అందుచేత నీవు యుద్ధ విముఖుడవగుట సరికాదనుటను ఉపదేశించుట ద్వారా అర్జునుని యందు కర్తవ్య జ్ఞానమును జాగృత మొనరించెను. సామాన్యముగా పసిబిడ్డ ఆరోగ్యము చెడినపుడు వైద్యుడు తల్లికి పథ్యముండుట కాదేశించును. తల్లియైనను తన దేహారోగ్యము చెడినపుడు తన రొమ్ము పాలను త్రాగెడు పసిపాపకు వచ్చిన అరోగ్యమును దూరము చేయు ఉద్దేశముతో తాను పథ్యము చేయును. సమయము వచ్చినపుడు ఔషధమును కూడా సేవించును. ఇదే రీతిగ శివుడి యందు ఐక్య భావము లేకుండినను తనను నమ్మి వెన్నంటి వచ్చెడు జనులకు తన యాచరణల ద్వారా మార్గదర్శనము చేయు ఉద్దేశముతో,ం వారికొరకై తాను శివ పూజాదికము లందు పూనుకొని యుండవలయును. ఇది గాక శివపూజాది సదాచహరణలను తనలో స్థిర పరచుకొనుట చేత తనకు గాని, పరులకు గాని ఎటువంటి నష్టమునులేదు. విడుచుట చేత తనకు హాని లేకుండిననూ అతడి ననుసరించు వారికి హాని యగును. అందువలన శివయోగమునందు సదాచారము లుండుటయే మంచిది.
ఐక్యస్థల సాధకుడు సమరస భక్తి మూలకముగా శాంత్యతీతోత్తర కళతో కూడియున్నట్టి మహాలింగ మనుసంధాన మొనరించును. శివయోగ సాధనా బలముతో భ్రూమధ్య మందుండిన ఆజ్ఞా చక్రము వరకు వచ్చి అచట మాణిక్య వర్ణముతో ప్రకాశించెడు జ్యోతిని శివయోగి సాక్షాత్కరించుకొనును. ఈ జ్యోతినే వీరశైవ పరిభాషయందు మహాలింగమని పేర్కొందురు. దీని ననుసంధాన మొనరించుచు సాగినట్లు శాంత్యతీతోత్తర కళయును అతడిలో సిద్ధమవుతుంది. శాంత్యతీతోత్తర కళయును శబ్దమునీ రీతిగ అర్థము చేసుకొనవచ్చును. శాంతియనగా ఆంతరికమైన నెమ్మది. ఇది నిశ్చలమై నిలుకడగా యుంటుందని చెప్పుటకు వీలులేదు. దీనిలో సూక్ష్మమయిన పోరాటముండును. గాలిలో పెట్టిన దీపము వంటి పోరాటమది. ఈ పోరాటము నిశ్చలమొందిన అదియె శాంత్యతీతకళ. ఇది గాలిలేని చోట నుంచబడిన దీపపు స్థితి వంటి నిశ్చలత్వము. ఇక్కడ ఇటువంటి నిశ్చలమైన శాంతిని నేననుభవింతును అను భావము కూడా లేకుండా కేవలము శాంతియే సర్వత్ర వ్యాపించి యున్నపుడు అది శాంత్యతీతోత్తర కళ. ఈ కళ మహాలింగము ననుసంధాన మొనరించి ఐక్యస్థల శివయోగి యందు నిలిచియుంటుంది. అనగా శివయోగియు సకల భావములను ప్రక్కనిడి తాను బయలులో బట్టబయలై నిర్మలమైన ఆనందమును తనదిగా చేసికొనును. అదే విషయమును సిద్ధాంత శిఖామణి యందును, ఐక్యస్థల మందలి అవాంతర స్థలములను నిరూపించుచు చివరకు భావాభావ లయస్థలమునను మరియు జ్ఞాన శూన్య స్థలములను వివరింపబడినది. అల్లమ ప్రభువులు కూడా తమ వచనమందు
ఒత్తి ఒత్తి పండుచేసినపుడు అదెంతటి రుచియుండును
కామించి కల్పించి భావించి శోధించి తన్నపుడు దానికదే కొరత
భావించెడు భావము కంటె చచ్చుట మేలు గుహేశ్వరా!
అని చెప్పియున్నారు. అల్లముని దృష్టియందు సాధకుడు చివరి యవస్థను చేరినపుడు ఏ భావము నవసరము లేదు. సిద్ధాంత శిఖామణి యందు చెప్పబడిన ఐక్యస్థలమందలి అవాంతర స్థలముల ఉద్దేశము కూడా ఇదేయై యున్నది. శివయోగి యొక్క ఈ యవస్థను వర్ణించుటకు పదములు మౌనము వహిస్తాయి. మాటలును ముగిసి పోతాయి.
కనులు నిండిన పిదప చూడ లేదు
కరములు నిండినపిదప పూజింపలేదు.
చెవులు నిండిన పిదప వినగ లేదు
మనసు నిండిన పిదప తలచ లేదు
గొప్పవాడవు కూడల సంగమ దేవ!
బసవన్నగారి వచన మీ సందర్భమున మిగుల ప్రశంసనీయము. మనోవాక్కాయ భావములన్నియు శివమయమై అతడే సర్వత్ర నిండియుండిన పిదప కోరికలన్నవేవి? భావము లేవి? జగత్తు నందలి సక మతముల ధ్యేయ మీదెస యందున అవస్థనే చేరుట సంభవించుచున్నది. ఇది మాటలకు చిక్కదు. మాటపై నిలువదు. భావమునకు తాకదు. సకలము తానై యుండి లేనట్లుగును. సకలము సాధితమైన స్థితి ఈ యవస్థకు లోనై యుండిన మహార్మునకు ఈ ప్రపంచమునందు మరొక పోలికన్నది లేదు. ఇది అనుపము, అనన్యము.
ఉపసంహారము
స్థలమనగా పరశివ తత్వము. దీనిలో నిరంతరము శక్తి నెలకొని యుంటుంది. శక్తి విశిష్టమయిన ఈ స్థలమే అంగ లింగమను దాని భాగమై తిరిగి అంగము నందు ఐక్య, శరణ, ప్రాణలింగి, ప్రసాది మాహేశ్వర, భక్తుడను ఆరు విధములగుచున్నవి. లింగ స్థలమును మహాలింగము, ప్రసాద లింగము, జంగమ లింగము, శివలింగము, గురు లింగము, ఆచార లింగమని ఆరు విధములగు చున్నది. ఇట్లు వింగడింపబడి స్థల తత్వము తిరిగి ఒకటగుటయే షట్ స్థల సాధనా ధ్యేయము. దానికొరకే భక్తుడు శ్రద్ధా భక్తియుక్తుడై ఆచారలింగము ననుసంధానించి మాహేశ్వరుడగుచున్నాడు. అతడు నిష్టా భక్తియుతుడై గురు లింగము ననుసంధానించి పిదప ప్రసాది యగును. ప్రసాదియును అవధాన భక్తితో శివలింగము నను సంధానించి ప్రాణలింగియవుతున్నాడు. ఇతడు అనుభవ భక్తి మూలకముగా జంగమ లింగము నుపాసించి శరణుడగుచున్నాడు. శరణుడును ఆనంద భక్తితో ప్రసాద లింగము నుపాసించి ఐక్యుడగును. ఐక్యుడు సమరస భక్తితో మహాలింగము ననుసంధానించి చివరకు తనయొక్క మూల స్వరూపమయిన స్థలతత్వమూ పొందును.
షట్ స్థల సాధన యందు కైవల్య సాధనోపాయము లయిన కర్మ, యోగ, జ్ఞాన, భక్తి యనువాటితో బాటు సాధనానుభూతులయిన ద్వైతము, ద్వైతాద్వైతము, అద్వైతము మరియు అనిర్వచనీయ మనున వన్నియు ప్రసంగము ననుసరించి ఘటించుచుండును. భక్త మరియు మాహేశ్వర స్థలము లందు కర్మమధికమై యుండి జ్ఞానము, యోగము అనునది నిశ్చలమైనవై యుండుటయే గాక తక్కువ గాను ఉండును. ద్వైత భావముతో నిట అనుసంధానము కొనసాగుతుంది. ప్రసాది, ప్రాణలింగి స్థలము లందు యోగము ప్రధానమై యుండి కర్మ మరియు జ్ఞానమన్నవి గౌణముగా నుంటాయి. ద్వైతాద్వైత భావనతో నిట ఉపాసన సాగుతుంది. శరణ ఐక్య స్థలములందు జ్ఞానము ప్రధానమై యుండి కర్మ యోగములు గౌణముగా నుంటాయి. అద్వైత భావముతో ఇక్కడ అనుసంధానము జరుగుతుంది. ఈ సకల స్థలము లందు భక్తి మాత్రమే సమముగా నిలిచియుంటుంది. ఈ స్థలములు దాటి మూల స్థలమును చేరిన యా స్థితి అనిర్ఫచనీయమైనది. సాగరము నుండి ఆవిరియై పై కెగసిన నీరు మేఘమయి, వర్షమై, వాగై, వంకయై, నదియై ప్రవహించి తిరిగి సాగరమును చేరునట్లు స్థల సాగరము నుండి వెలుపలికి వచ్చిన జీవి యనెడు నీటి బిందువు విభిన్న సాధనా సోపానముల ద్వారా తిరిగి యా స్థల సాగరము చేరును. నదిగా నుండినపుడు నీరు సాగరము కంటె భిన్నముగా నుండును. అందుకొరకే ద్వైత భావనతో సాధనను ప్రారంభింపవలయును. నది మూలకముగా నీరు సాగర సమీపమునకు వచ్చునపుడు కొంత ఉప్పు కొంత తీపి గుణమును పొంది యుంటుంది. దీనివలెనే సాధన యొక్క మార్గము నందును అనగా ప్రసాది ప్రాణలింగి స్థలముల మధ్యన పూర్ణ జీవియుగాక, పూర్ణ శివుడును కాక ద్వైతాద్వైత భావన నెలకొని యుంటుంది. నీరు సంపూర్ణముగా సాగరమును చేరినపుడు దానిలో కలిసి పోయి ఒకటై నిలుస్తుంది. ఇదే రీతిగ శరణ ఐక్య స్థలములందు అద్వైత భావమును దేహమునందు నిలుపుకొని చివరకు స్థల తత్వము నందు లీనమై, ఘనమునకు ఘనమై మహా ఘనుడుగా తానవుతాడు. ఈ విధముగా ఈ స్థలములందు సకలమున్నది. ఆకారణముగా ఈ సిద్ధాంతము దార్శనిక వాద వివాదములను ప్రక్కనుంచి సమన్వయమును సాధించెను. సాధనా మార్గమవుటయే గాక సత్వయుత సత్పథ మగుచున్నది.
CONTACT US
admin@veerashaivadharmam.com