షట్ స్థల సాధన యొక్క ప్రథమ సోపానమే భక్త స్థలము. జీవియు భక్త స్థలము నుండియే ఈ షట్ స్థల సోపానమును ప్రారంభించును. భక్తుడు కావలయు ననిన మొట్టమొదట అహంకారమును మరియు మమకారము అను రెండు గుణములను ప్రక్కనుంచవలసి వచ్చును.

అహంకారమనగా: 'న అహం అనహమ్ అనహమేవ అహం కరోతీతి అహంకార:' - తాను కాని దానిని తానని భావించి అభిమానించెడు చిత్తవృత్తిని అహంకారమని పిలుతురు.

శరీరము యొక్క ఇంద్రియములు తాను కాకపోయిన తానే అవియని కల్పించి నేను చేసితిని, నేను చెప్పితిని, నేను వింటిని, నేను కంటిని, నావలననే ఇదంతయు అనుకొనుచు ఈ విధముగా ప్రాణి అత్యంత అభిమానము నొందుచున్నాడు. దీనినే శాస్త్రీయ భాషలందు అహంకారమని పేరిడిరి.

భక్తుడు కావలయుననిన వినమ్ర భావము, వంచిన తల, ముకుళించిన చేతులు పొంది యుండవలసి యుండును. ఇటువంటి భావములు అహంకారియైన మానవునకు అబ్బుట సాధ్యము గాదు. వినయ గుణము లేని చేతులు జోడించ జాలని మానవుడెంతటి భక్తుడగును. అందుకే అహంకారము భక్త స్థలము యుక్క సన్మార్గమునకు మొదటి విఘాతము.

మమకారము: అహంకారము వలెనే మమకారము కూడా ఈ సన్మార్గమునకు మహా శత్రువు. మమకారమనగా క్షణిక సుఖమొసగెడు బాహ్యభోగ వస్తువులందుండెడి ఆసక్తి భావము. బాహ్య వస్తువులందు ఆసక్తుడైన మానవుడు తాను పొందవలసి యుండిన విషయములకు మాధ్యమ రూపమునందు దైవమును ఉపయోగించు కొనుచున్నాడు. అథనికి దైవము ముఖ్యము కాదు, విషయములు ముఖ్యము. సంసారమునందు ఆసక్తమైన మనస్సు భగవంతుని ప్రక్కకు ఎలా పోగలదు.

అట్లైన అర్థము భక్తుడైనవాడు పెళ్ళి చేసుకొనరాదు, ఇల్లు కట్టరాదు, బిడ్డల కనరాదు అని, వీటన్నింటిని త్యజించి కాటికి వెళ్ళవలయును అని కాదు. ఇల్లు, భార్య, బిడ్డలు ఉండిన కూడా దానియందే అత్యంత ఆసక్తిని పెంచుకొని, వారే తన జీవిత లక్ష్యమనరాదు. (భార్యా, బిడ్డల మీద నున్న ప్రీతిని వదిలి వేయుట మరియు భాహ్య వస్తువులందు ప్రీతిని వదిలి వేయుటయే మమకార త్యాగము మరియు వైరాగ్య భావము).

ఆసక్తిని మనసున నింపుకొని పెండ్లాడి పిల్లలను వదిలి అడవికి పోయినంత మాత్రమున వారిపై నున్న ఆసక్తి లేనిదగుచున్నదని చెప్పుటకు సాధ్యము కాదు. ఆసక్తి లేక పంచేంద్రియముల పై పట్టు సాధించిన మానవుడు ఇంటియందే సతీసుతులతోడ బ్రతుకు సాగించుచుండిననూ అతడి జీవనము పవిత్రమయి యుంటుంది. నిరాసక్త భావనతో తనపాలికి వచ్చిన కర్తవ్యములను నెరవేర్చుతూ సతిసుతులతోడనే ఇంతియందే బ్రతుకును సాగించుండినను ఆ ఇల్లు కేవలం ఇల్లు కాదు. అదొక తపోవనము. కావున భక్తుడు కాదగినవాడు ఈ మమకారమునకు వీడ్కోలు పలుకవలెను.

కావున భక్త స్థల సాధనా నౌక ముందుకు సాగుటకు ప్రతిబంధకములైన అహంకార మమకారములను దూరము చేసుకొని ముందుకు సాగవలెను. మద్యము సేవించి మత్తులో తూగి ఉన్మత్తులైన యువకులు, నదీ సమీపమున కట్టి ఉన్న పడవ యొక్క పగ్గములు ఊడదీయకుండానే ఎంతసేపు తెడ్డు వేసినా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదో అదే విధముగా అహంకార మమకారములనే పగ్గములను వదలకపోతే, షట్ స్థలములందు సాధనా నౌక ముందుకు సాగదు. అందుకే షట్ స్థల సాధనా పూర్వపు సోపానమయిన భక్త స్థలమును ప్రవేశించుటకు ముందు గర్వము మరియు మమతలకు తిలోదకములు ఇవ్వవలెను.

భక్త స్థలము

భక్త స్థల సాధన

శ్రీ రేణుక భగవత్పాదులు వారు శ్రీ సిద్ధాంత శిఖామణి యందు భక్త స్థల లక్షణమును క్రింది విధముగా ఉపదేశించి యున్నారు.

శివే భక్తి: సముత్పన్నా యస్యా సౌ భక్త ఉచ్యతే|

తస్యానుష్ఠేయ ధర్మాణా ముక్తి ర్భక్త స్థలం మతం||

(శివుని యందు పరమభక్తిని పెంపొందించుకొని వచ్చిన సాధకుడే భక్తుడు. ఇతడితో ఆచరింప బడెడు ఆచరణనే భక్త స్థలమని పిలువబడుచున్నది).

భక్తి గురించి నిజగుణ శివయోగులు ఈ క్రింది విధమున విశ్లేషణ చెప్పారు.

ఏకాల మందైన పిదప యే దేశమందు వే

రే వస్తువు నందును కలియక అతి మమత

యే రీతితో తనపై నుందునో గురు

దైవమునందనురాగ ముండునదే నిజభక్తి.

భక్తి యొక్క ఈ లక్షణము సంపూర్ణముగా మార్మికమై యున్నది. సామాన్యముగా మానవుడు సకల సమయములందు, సకలావస్థలందు, సకల స్థానములందు అన్నిటి కంటెను ఎక్కువగా తననే ప్రేమించుచుండును. (ఉదాహరణకు, అకస్మాత్తుగా ప్రమాదము జరిగినప్పుడు, మొదట వ్యక్తి తనను తాను కాపాడుకొనును, తరువాతనే తనవారి యొక్క జ్ఞాపకము తెచ్చుకొని, వారిని రక్షింప ప్రయత్నించును. ద్దెనివలన తెలియవచ్చేది ఏమిటన్న వ్యక్తి తొలుత తానను ప్రేమించును).

ఇంత లోతైన, ప్రగాఢమైన తనపైని ప్రేమనే తొలగించుకొని గురువు పై లేక దైవము పై యుంచిన దానినే భక్తి యందురు. ఇటువంటి భక్తి, యే సాధకుని మనసునందు పుట్టునో, అతడు భక్తుడనిపించుకొనును. అంటే భక్త స్థలపు సాధకుడు తనకంటెను అధికమైన శివుడిని ప్రేమించును. పరమశివుడిపైన ఎక్కడలేని శ్రద్ధ ఇతడికి గలుగును. అందుకే ఈ స్థలపు సాధకునందుండిన భక్తిని శ్రద్ధా భక్తియని పిలువబడును.

భక్త స్థల సాధకుని ఆచరణ గురించి పారమేశ్వరాగమము నందు ఇలాగ తెలుపబడినది.

గురౌచ జంగమే లింగే తారతమ్య విశేషత:|

పూజయేత్ త్రివిధం రూపం తత్ భక్త స్థల ముచ్యతే||

(భక్త స్థలము యొక్క సాధకుడు గురులింగ జంగములను యే తారతమ్య భేద భావన లేకయే పూజ చేయును. ఇది భక్త స్థలము యొక్క సాధకుని ఆచరణ).

భక్తి శివుని యందు పూజ గురు, లింగ జంగములది అనిన అదెట్లా సాధ్యమగును. ఎవరియందు భక్తి యుంటుందో వారినే పూజించుటయన్నది తగినట్టిది. ఒకరియందు భక్తి, మరొకరి యందు పూజ భక్తి సిద్ధాంతమునకు చెల్లని మాట. అటులైన భక్త స్థల సాధకుడు శివుని యందు భక్తి కలిగి గురు లింగ జంగములను పూజించుటయన్నది యెట్లు సాధ్యమగును?

వీరశైవ ధర్మము నందు గురు లింగ జంగములను, పరమశివుని రూపమనియే పరిగణింపబడుచున్నది. 'ఏక మూర్తి స్త్రయో భాగ గురు లింగం తు జంగమ ' యను ఆగమోక్తి పరమశివుడే గురు-లింగ-జంగముల రూపము నందు మూడు భాగములుగా భాసిల్లుచున్నదని సూచించుచున్నది.

పరమశివుడు నిర్గుణుడు; నిరాకారుడు అయ్యినందున అతనిపై కేవలము భక్తిని మాత్రమే నిలుపవచ్చును. అయితే అతడిని పూజించుటకు సాధ్యము కాదు. ఏ ఆకారము లేనట్టి అతడిని పూజించుటెట్లు? కేవలము సాకారమునకే పూజయన్నది సాధ్యము. అందుచేత నిరాకారుడైన పరమశివుడే భక్తుల పూజకు అనుకూలమగుటకై గురు-లింగ-జంగమ రూపమునందు సాకారమొందెను.

ఉపనిషత్తు లాతని స్వరూపమును 'అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం' అని వర్ణించినది.

ఈ విధముగా దృష్టికి అగోచరుడైన శివుడిని చూడవలయునన్నచో, తొలుత సాకార రూపమయిన గురువును మొరజొచ్చి వేడుకొనవలెను. పూజించవలెను. సేవ యొనరించవలెను. ఈ గురువే శిష్యుడి సేవచే ప్రసన్నుడై పరమశివుడి మరొక సాకార రూపమయిన ఇష్టలింగమును ప్రసాదించును. విశాల వ్యాపకుడైన పరమశివుడె, ఆరాధకుల ఆరాధనకు అనుకూలము కొరకు తన యొక్క వ్యపక రూపమును వదలి సూక్ష్మరూపమును ధరించి కరపీఠమునకు విచ్చేసెను. ఈ విధముగా సూక్ష్మమగుటకు కారణమేమిటను దానిని శ్రీ రేణుక భగవత్పాదులు శ్రీ సిద్ధాంత శిఖామణి నందు క్రింది విధముగా వివరించెను.

అపరిచ్ఛిన్న మవ్యక్తం లింగం బ్రహ్మ సనాతనం|

ఉపాసనార్థం భక్తానాం పరిచ్ఛిన్నం స్వమాయయా||

(అపరిచ్ఛిన్నమును, అవ్యక్తమును, సనాతనమును అయిన పరమశివ బ్రహ్మము భక్తుల ఉపాసన కొరకు తన మాయా ప్రభావముతో పరిచ్ఛిన్నమును, సంకుచితమును అయిన రూపమును ధరించునని ప్రతిపాదించియున్నారు).

పరమశివుని యొక్క సంకుచిత సాకార రూపమే ఇష్టలింగమన్నది. ఇటులే జంగమమును కూడా పరమశివుడి మరొక రూపము.

జంగమ అంటే శివుడిని తనయొక్క స్వంత ఆత్మరూపమని తెలిసి శివజ్ఞానియైన శివయోగి కూడా 'బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి ' (బ్రహ్మను తెలుసుకొన్నవాడు బ్రహ్మయే యగును) అను శ్రుతి వచనములే పరమశివ తత్వమును పరిపూర్ణముగా తెలిసికొన్న ఈ జంగముడు శివుడి రూపమే అగును గదా!

ఇట్లు గురు-లింగ-జంగములు పరమశివుడి సాకార రూపంగుటచేత భక్త స్థలపు సాధకుడు తన ధ్యేయమైన పరమశివుడి యందు భక్తిని నిలిపి గురులింగ జంగంల పూజను చేయుట చేత భక్తియందు తక్కువ గాని, లోపము గాని కలుగుట లేదు. ఇది భక్తుని యొక్క బాహ్య సాధన.

వీరశైవ దర్శనము నందు ఆచార లింగమని దేనిని పిలుతురన షట్ స్థల ఉపాసన యందు, నిరతుడైన సాధకుడు తనయొక్క యోగ సాధనా బలముతో ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఊర్ధ్వముఖముగా సంచరించు ప్రాణ వాయువును క్రిందు ముఖముగాను, అధోముఖముగా సంచరించు అపాన వాయువును మేల్ముఖముగాను చేయును. అప్పుడు ఆ రెండింటి సంఘర్షణలో మూలాధార చక్రమందు ఒక జ్యోతి ఉత్పన్నమగుచున్నది. యోగ సాధకులకు మాత్రమే గోచరించెడు ఈ జ్యోతిని వీరశైవ శివయోగులు ఆచార లింగమని పిలిచి యున్నారు. భక్త స్థలము యొక్క సాధకుడు ఈ ఆచార లింగమును మూలాధార చక్రమునందు జూచి దానిననుసంధాన మొనరించును. మరొక అర్థమందు ఆచార లింగము యొక్క అనుసంధానమనిన తనలో పెంపొందు కొన్ని వచ్హ్చినట్టి సదాచారములను ఈ స్థలము యొక్క సాధకుడు లింగము వలెనే ప్రీతితో జూచును. ఈ కారణము కొరకే ఈ స్థలముయొక్క సాధకుడిని ఆచార లింగోపాసకుడని పిలుతురు.

భక్త స్థలమును మరియు దాని సాధనా ప్రక్రియను క్లుప్తముగా చెప్పే పటలము