అష్టావరణ, పంచాచార, షట్ స్థలములనునవి వీరశైవ దార్శనిక పరిభాషిక పదములు. వీటిని అణువణువున తనయందు నింపుకొనిన మానవుడే పరిపూర్ణమయిన వీరశైవుడు. సామాన్యముగా ఒక మానవుడు జీవించవలయునన్న అతడికి ఆరోగ్యకరమయిన దేహము, హితగమనమైన ప్రాణము, ప్రేరణ దాయకమైన ఆత్మలనునవి చాలా అవసరము. లౌకిక జీవితమునకు దేహము-ప్రాణము-ఆత్మ లనునవి ఎంత ముఖ్యమో అటులే ఆధ్యాత్మిక సాధన ముందునకు సాగవలయుననిన అష్టావరణ - పంచాచార - షట్ స్థలములు లనునవి వీరశైవులగు వారికి తప్పక కావలసినవై యుండును. వీరశైవ ధర్మము నందు సాధకునకు అష్టావరణమే లింగము. పంచాచారములే పంచప్రాణములు. షట్ స్థలములే ఆత్మయని చెప్పబడుచూ వచ్చుచున్నవి. అనగా వీరశైవ సాధకుడు తన శరీరమును గురించి అత్యంత ఆసక్తి శ్రద్ధ వహించి దాని పాలన, పోషణ చేయునట్లు, అష్టావరణములను శ్రద్ధాసక్తులతో గౌరవించుచునే తన దేహమునందు నిలుపుకొనును. ప్రతి వ్యక్తి తన ప్రాణమును ప్రేమించునట్లు, వీరశైవ సాధకుడు పంచాచారములను తన పంచ ప్రాణములని భావించి తన నిత్య జీవితమున నిలుపుకొనుచుండును. ప్రతి జీవి యొక్క లక్ష్యము ఆత్మ సాక్షాత్కారమే అయ్యి యుండినట్లు వీరశైవ సాధకుడు షట్ స్థల సాధనముననే లీనమై నిరంతరము కొనసాగుచుండును.
షట్ స్థల సిద్ధాంతము
దేహము - ప్రాణము - ఆత్మలనునవి క్రమముగా ఒకదాని కంటె ఒకటి సూక్ష్మమైనవి. అంతియే గాదు బహుప్రయాసతో దృష్టిగోచరము కాగలిగి యున్నవి. దేహమును స్థూల నేత్రములతోడనే చూడగల్గుదుము. అయితే ప్రాణము ఉంది అని తెలిసికొనుటకు నాసిక చెంత వ్రేలును ఉంచి గాని లేక కుక్షి దగ్గర పైకి, క్రిందకు కదులుచుండుటయో చూచి దానిని బట్టి తెలుసుకొనెదము. ఈ రెండింటికంటే సూక్ష్మమయిన ఆత్మను తెలుసుకొనుటన్నది అసంభవం అన్నంత కష్ట సాధ్యామయినది. మనయందున్న ఏ ఇంద్రియమును దానిని తెలుసుకొనుటకు అసమర్థమై యున్నవి. అది కేవలము అనుభవ వేద్యమే. దీనివలెనే అష్టావరణ, పంచాచార, షట్ స్థలములనునవి ఒకదాని కంటే మరొకటి సూక్ష్మతత్త్వమయినవి. ఇవి కష్ట సాధనకు మాత్రమే లభించునట్టివి. అష్టావరణములనువాటిని బాహ్య దృష్టి తోడ తెలుసుకొనవచ్చును. అయితే పంచాచారములను గుర్తించవలయునన్న సాధకుని ఆచరణ నవలోకింప వలసియుండును. షట్ స్థల సాధనమన్నది దానిని సాధించగలిగిన సాధకునకు మాత్రమే గోచరమగుంచుండును.
అష్టావరణములు, పంచాచారములన్నవి వీరశైవ సాధకునకు లింగాంగ సామరస్యముతో సిద్ధించుటకు సరియగు కారణము కాకయే, పరంపరాగత కారణములై యున్నవి. అయితే షట్ స్థలములు మాత్రము శివజీవ సామరస్యమునకు సాక్షాత్తు కారణమయి యున్నవి. అష్టావరణములు, పంచాచారములనునవి నిత్యజీవితము నందు స్వల్ప ప్రయాసతోడనే తనలో నిమిడ్చుకొనవచ్చును. అయితే షట్ స్థల సాధనమన్నది సాధకునకు ఆంతరికమైన యాత్రయై యుండుట చేత దీనియొక్క వివిధ స్థలములను, వైవిధ్యభరితమగు ఆయామములను అంతరంగము నందు రూపొందిచుకొనుటన్నది అంత సులభతరమైనది కాదు. వీటిని సాధించుట అనునది సాధకునకు ఒక తపస్సు. అది సాధించినపుడె దీని నిజమైన రుచి తెలియును. సాధనపు లోతునకు చేరవలయునన్న, మొదట ఆ మార్గపు జ్ఞానము ముఖ్యము. ఆ జ్ఞానమును "శ్రీమద్ గిరిరాజ సూర్యసింహాసనాధీశ్వర శ్రీశ్రీశ్రీ 1008 శ్రీశైల జగద్గురు డా||చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములు, శ్రీశైలం" వారు రచించిన 'షట్ స్థల చింతన' అను గ్రంధం నుండి తీసుకొని ఇక్కడ పొందుబరచబడినది.
స్థలము
షట్ అనగా ఆరు. స్థలమనగా స్థానము లేక సోపానము అనునది వ్యవహారిక అర్థము.
షట్ స్థల మార్గానుసరణియైన సాధకుడు తన సాధనయందు నిరతుడైనపుడు, ఆరు ఘట్టములను చేరుటతో బాటు తన ఆంతరిక అభివృద్ధి ద్వారా ఆరు విధములగు పరివర్తనలను పొందును. ఆ కారణముగా దీనిని షట్ స్థలమని పిలువబడినది.
ఉపనిషత్తు నందు సృష్టి క్రమమును
"తస్మా ద్వా ఏతస్మా దాత్మన: ఆకాశ: సంభూత: ఆకాశా ద్వాయు:, వాయోరగ్ని:, అగ్నేరాప:, అద్భ్య; పృథ్వి:, పృథివ్యా ఓషధయ:, ఓషధిభ్యో అన్నం: అనాత్ ప్రజా:" అని ప్రతి పాదింపబడియున్నది.
(తాత్పర్యం: ఆత్మ తత్త్వము నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి సస్యములు, సస్యముల నుండి అన్నము, అన్నము నుండి జీవులు ఈ క్రమములో ఉత్పత్తియైనవి.)
దీనితో పంచ భూతములకు మరియు భౌతికమైన సకల వస్తువులకు పరమాత్మ తత్త్వమే మూల కారణమని తెలియ వచ్చుచున్నది. ఉపనిషత్తు నందు ఆత్మయని పేరొందిన ఆ పరమ చైతన్యమునే వీరశైవ దర్శనము నందు స్థలమని పిలువబడినది.
స్థల వికాసము
స్థలమని వ్యవహరింపబడు ఈ పరశివచైతన్యము శక్తి విశిష్టమై యున్నది. ఈ శక్తియు దానిలో అవినాభావ సంబంధముతో కూడుకొని యుండును.
ఎట్లన "న శివేన వినాశక్తి:, న శక్తి రహిత: శివ:" అని శివశక్తుల కలయిక అన్యోన్యతల యొక్క అవినాభావ సంబంధమును ప్రతిపాదించుచున్నది.
ఈ విధంగా శక్తి విశిష్టమైన ఆ పరశివ చైతన్య రూప స్థల తత్వము 'ఏకోహం బహుస్యాం ప్రజాయేయా' అను వేద వచనము వలె తాను అనేకము కావలెనను సంకల్పం చేసి ఉపాస్య మరియు ఉపాసక భేదములతో లింగ - అంగము అన్నదై రెండు విధములగుచున్నది. లింగము ఉపాస్యమయితే అంగము ఉపాసకము. స్థల తత్వము అంగము - లింగము అనునదై రెండు భాగములయినపుదు వాటిలో నెలకొనియున్న శక్తియు కూడా 'కళ ' మరియు 'భక్తి ' యన్న విధముగ రెండు విధములగుచున్నది. లింగ స్థలమును ఆశ్రయించుకొనిన శక్తికి కళయనియును, అంగ స్థలమును ఆశ్రయించుకొనిన శక్తికి భక్తియనియును పిలువబడుచున్నది. లింగ స్థలము మరియు అంగస్థలము క్రింద చూపిన పటలములో లాగ ఆరు విధములగు చున్నవి.
లింగాగములు ఆరు విధములయిన పిదప వాటిని ఆశ్రయించుకొనిన కళలు మరియు భక్తి కూడా పైన చూపినట్లు ఆరు విధములగా అవుతున్నవి.
షట్ స్థల సాధన (లేక) షట్ స్థల సోపానము
స్థలతత్వమునందు అవినాభావ సంబంధము తోడ నెలకొనిన శక్తియు ముఖ్యముగా ఒకటియే యై యుండిననూ స్థల తత్వపు వికాసమునకు సహకారియై కళ యౌచున్నది. వికాసమొందిన స్థల తత్వపు విభాగములను తిరిగి ఒకటిగా చేయుటకు తోడ్పడినదే భక్తి యగుచున్నది. అనగా ఈ శక్తియే కళయై జీవులందు పరమాత్మ నుండి వేరు చేయుచున్నది. మరియు ఆమెయే పరమాత్మ నుండి వేరయిన జీవులందు భక్తియై నెలకొని మరల వీరికి భగవంతునకు పరిచయ మొనరించి తుదకు అతనిలోనే ఒకటిగా చేయుచున్నది.
(లౌకికముగా తండ్రి యొక్క దేహము నందు ఒకటియై నెలకొనియున్న తనయుణ్ణి తల్లియే తండ్రి నుండి వేరు చేయుచున్నది. అనగా తల్లి గర్భము నందు చేరుటకు మునుపు తండ్రి దేహము యొక్క అంశయై నెలకొనియున్న 'శుక్ర రూపము" తల్లియే ద్వారానే వేరు చేయబడి భూమికి గొని తెచ్చుచున్నది. అంతియే గాక ఆ తల్లియే ఆ శిశువునకు నిజమైన తండ్రి యెవరన్న విషయమును తనయునకు తెలియజేయుచున్నది. తనయుడిని తండ్రి నుండి వేరు చేయుటకును, వేరయిన కొడుకునకు అతని తండ్రిని పరిచయ మొనరించెడు రెండు పనులను స్త్రీ మూర్తి యొకతెయే జేయగల్గుచున్నది.)
దీని వలెనే శక్తియే కళయై జీవులను పరమాత్మ నుండి వేరు చేసి, భక్తియై మరల వారికి పరమాత్మను పరిచయము చేయుట ద్వార జీవునిళొ సామరస్యము పొందుటకు తోడ్పడుచున్నది.
ఈ విధముగా శక్తి సహాయము తోడనే స్థలతత్వము యొక్క లింగాగముల రూపముతో విభాగమై తిరిగి వాటియందు ఆరారు భేదములను పొంది వికాసమొందుచున్నది. దీనికి మనము స్థల తత్వపు వికాసము లేక అవరోహణ క్రమమని పేరిడవచ్చును.
పైన చూపిన విధముగా పరమాత్ముడే అవరోహణ క్రమమునందు దిగివచ్చి జీవాత్ముడగు చున్నాడు. మరల యాతడే పరమాత్మ స్వరూపమును పొందుటకు అవరోహణ క్రమము నందు దిగివచ్చిన మార్గమునే ఆశ్రయించుకొని క్రమ క్రమముగా ఆరోహణము చేయుచూ అనగా మెట్టు మెట్టు పైకెక్కుచు ఆంతరిక సాధనము ద్వారా పొవలసియుంటుంది. ఇదియే షట్ స్థల సాధన లేక షట్ స్థల సోపానము.
షట్ స్థల సోపాన మహత్వము
సామాన్యముగా సకల జీవులు ఏ పని చేసిననూ దాని వెనుకనున్న ఉద్దేశము మాత్రము నిత్యము తృప్తి లభించవలయునన్నదే, అయితే యే వస్తువును పోగొట్టుకొని మానవుడు తృప్తి లేనివాడై యుండునో, ఆ వస్తువును పొందు వరకు శాశ్వమగు సమాధానము గాని, నిత్యతృప్తి గాని కేవలము కలలోని మాటయే గదా!
సాగరము నుండి ఆవిరై వేరు పడ్డ నీటి కణము ఒకటి తిరిగి సాగరము చేరు వరకు తృప్తి చెందబోక కలవరబడుతుంది. దీని వలెనే పరమ చైతన్యము సాగర రూపుడైన పరశివ తత్వము నుండి వెలుపలికి చిమ్మబడిన జీవులు తిరిగి అతడిని చేరు వరకు పరిపూర్ణమగు తృప్తిని పొందజాలరు.
సామాన్యముగా జీవులన్నియు సుఖము పొందవలయునను తీవ్రమయిన కోరికతో ఏమేమో చేయుటకు యేమేమియో యగుటకును ప్రయత్నించును. అయితే యేమి చేసినను, ఏమయినను ప్రధానముగా వేరయిన స్థానమును చేరువరకు ఆనాటి సుఖము చిరసుఖమనుటకు సాధ్యము కాదు. చిరకాల సుఖమన్నది పరమానంద రూపుడైన పరశివ తత్వమును తెలిసికొని అందు లీనమైనప్పుడే కలుగుతుంది.
సాగరమునుండి వేరు పడి మేఘ రూపము ధరించిన చినుకులందు కొన్ని చినుకులు నదులలో పడగ, మరికొన్ని చినుకులు వాగు వంకలందు పడుచుండును. కొన్ని చినుకులు బావులు చెఱువులందును పడుచుండును. వీటిలో నదులందు పడిన చినుకులు త్వరిత గతిని ప్రవహించి సాగరమును చేరును. వాగులలో పడ్డ చినుకులు సంద్రము చేరుటకు ఆలస్యమగును. బావులు, చెఱువులందు పడిన చినుకులు జలధిని చేరుటన్నది యెపుడో, ఏమో. ఇటులే సంస్సరిక వస్తువులందు ఆసక్తి గలిగి మెలగు మానవుడు బావులు, చెఱువులందు పడ్డ చినుకులవలె భగవంతుడిని చేరుటన్నది యెపుడో! ఏనాడో!ఏమో! ఇహలోకపు సుఖాలకు తోడుగ ఆత్మ సాధనను చేసి కొనవలెనని కోరిక కలిగిన మానవుడు వాగు వంకలు నదులలో పడిన వాన చినుకులవలె త్వరితగతిని పరశివ తత్వము నందు చేరి ఒకటిగా లీనమగుచుండును.
సాధనా ప్రవాహమై తన చెంతకు వచ్చిన జీవులను వేగముగా కొనిపోయి భగవంతుని యందు ఒకటిగా చేయు ఈ సాధనా క్రమము ఎట్టిదో తెలుసుకుందాం రండి.
CONTACT US
admin@veerashaivadharmam.com