వీరశైవ మతస్థాపకుడు

ఇంతటి గొప్ప గుణాలతో ప్రకాశిస్తున్న వీరశైవ ధర్మం ఆంధ్రరాష్ట్రంలోనే ప్రారంభం కావడం, తెలుగువారందరికీ గర్వ కారణం. వీరశైవ ధర్మాన్ని భూలోకంలో మొట్టమొదట స్థాపించినవారు పరమశివుని ముఖోధ్భూతులైన రేణుక, దారుక, ఘటాకర్ణ, ధేనుకర్ణ, విశ్వకర్ణ అనే పంచాచార్యులలో మొదటివారు శ్రీ రేణుకాచార్యులు.

ఈ రేణుకాచార్యుల వారు ఆంధ్రప్రదేశ్ లో గల తెలంగాణ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలోని "సోమనాధ" లింగం నుండి ఉద్భవించారు.

కొలనుపాకలో చంద్రుడు గురువు శాపమును నివారించుకొనుటకు శివుని అనుగ్రహం పొందగోరి సోమనాథ లింగమును ప్రతిష్ఠించినట్లు "కొలనుపాక మహాత్యం" అనే కావ్యంలో పేర్కొనబడినది. ఇదే లింగం నుండి త్రేతాయుగంలో జగదాది జగద్గురువైన, పంచాచార్య జగద్గురువులలో ప్రప్రథముడైన శ్రీ రేణుకాచార్యులు ఉద్భవించారు. ఈ విషయం రేణుకాగస్త్య సంవాదరూపంలో ఉన్న "సిధ్ధాంత శిఖామణి" లో కూడా ఉన్నది.

"అధ త్రిలింగవిషయే కుల్యపాకాభిదేస్థలే

సోమేశ్వర మహాలింగాత్ ప్రాదురాసీత్పరేణుక:"

ఆంధ్రప్రదేశ్ లో కొలనుపాక క్షేత్రము అత్యంత ప్రాచీనమైనది. శ్రీశైల మహాక్షేత్రము కూడా అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రమే. ఈ రెండు పుణ్యక్షేత్రాలు కూడా వీరశైవ ధర్మం అతి ప్రాచీనమైనదని తెలుపుటకు సజీవ సాక్ష్యాలు.

కొలనుపాకలోని సోమేశ్వర లింగం నుండి రేణుకాచార్యులు ఉద్భవించి లోక కల్యాణం కొరకు పాటుపడగా, శ్రీశైల క్షేత్రంలోని మల్లిఖార్జున లింగం నుండి ధేనుకర్ణ శివాచార్యులు ఉద్భవించి, ధర్మప్రచారం చేసినారు.

వీరశైవ ధర్మ పరిరక్షణ, ప్రచారం కొరకు ఈ ఇరువురు ఆచార్యులు శ్రీశైలంలో సమాగమయై, సమాలోచన చేసినట్లు, చరిత్ర వలన శ్రీశైలం క్షేత్రంలోని గోడలపైన శిల్పముల వలన స్పష్టమవుతుంది.

త్రేతాయుగములో విభీషణుని ప్రార్థన ఆలకించి రేణుకాచార్యులు లంకకు వెళ్ళి ముక్కోటి శివలింగాలను ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. అగస్త్యమహర్షికి రేణుకాచార్యుల వారు వీరశైవ సిధ్ధాంతాన్ని ఉపదేశించారు. రేణుకాచార్యుల తరువాత అదే పీఠపరంపరలోని ద్వితీయావతారులైన శ్రీ రేవణసిద్ధులవారు శృంగేరి ఆది శంకరాచార్యులతో "శివతత్వ సిధ్ధాంత" చర్చలు చేసేవారు. శ్రీ రేవణసిద్ధుల చేత శ్రీ శంకరాచార్యుల వారు మహామహిమాన్వితమైన "చంద్రమౌళీశ్వర లింగము"ను స్వీకరించారు. ఈ విషయం శృంగేరి పీఠం ప్రచురించిన "గురువంశ కావ్యం" లో ఉన్నది.

"సుసిద్దేన రేవణ సిద్ధ మహాయోగినా దత్తం శ్రీ చంద్రమౌళీశ్వర లింగం" అని గురువంశ కావ్యం లో మూడవ సర్గలోని ముఫై నాలుగవ శ్లోకంలో ఉన్నది.

ఈ రేవణ సిద్ధుల కాలంలోనే ఉజ్జయినీ పీఠ పరంపరలోని మరుళసిద్ధులు, కేదార పీఠపరంపరలోని ఏకోరామారాధ్యులు, శ్రీశైల పీఠ పరంపరలోని పండితారాధ్యులు, కాశీపీథ పరంపరలోని విశ్వారాధ్యులు పంచాచార్య జగద్గురువులుగా ప్రసిద్ధులై ఉన్నారు.

శ్రీపతి పండితారాధ్య విరచితమయిన శ్రీకర భాష్యంలో ఉన్నది. శ్రీశైల క్షేత్రంలో వీరశైవ ధర్మపీఠము సూర్యసింహాసన పీఠము. ఈ సూర్యసింహాసనా పీఠము ద్వాపర యుగంలో ఉన్నది. ద్వాపరయుగంలో పీఠ పరంపరలోని సదానంద జగద్గురువుల వారు కుష్ఠు రోగ పీడితుదైన పిగళుడనే భక్తుని, తనకున్న తపోనిష్ఠ చేత కాపాడి, అయురారోగ్యమును ప్రసాదించి, లింగధారణ చేసినట్లు వ్యాస విరచిత శ్రీశైల ఖండంలో ఉన్నది.

"తస్మిన్ శ్రీ పర్వతే పుణ్యే సంసారమయ భేషజే

ఆస్తే లింగాంగ సంబంధీ సదానందాహ్వయోముని:" అని సదానందుల వారి అర్ణనా సంబంధ శ్లోకమిది, కాగా మరో శ్లోకం జగద్గురు సదానంద స్వామిగారు పింగళునకు బోధించిన వీరశైవ ధర్మము ఈ క్రింద విధంగా వర్ణింపబడినది.

ఆ హుయ పింగళం శిష్యమిదం వాక్యమభీషత్

అద్య ప్రభృతి సాధోత్వం త్రింపుండ్రం భస్మనావరం|

సర్వాంగోధ్ధూళనం నిత్యం కురుధర్మ పరాయణ:

అగ్నిరిత్యాది భిర్మంత్ర్యె: శ్రీమతృం చాక్షరేణవా|

రుద్ర మంత్ర జపాభ్యాస పరోభ హసమాహితా:

యావ జీవ మిదం దత్త మిష్ట లింగం సమర్భయ|

కరాబ్జపీఠే విన్యస్య తద్ధ్యానాసక్త మానస:

లింగాంగ సంగినోవత్స! పునర్జన్మ న విద్యతే|

యుగ పదజ్ఞాన సిద్ధి స్వాత్తతో మోక్షమవాప్నుయాత్

తస్మాత్త్వం ప్రాణలింగాంగ సంబంధీభవ సర్వదా||

జగద్గురు సదానందుల వారు పింగళుడనే భక్తునకు వీరశైవ ధర్మసూత్రాలను, కరపీఠము నందు లింగ మొనర్చిన భక్తునకు పునర్జన్మ ఉండదనే భావం కలిగిన శ్లోకాలు స్కాంద పురాణంలోని "శంకరసం హిత" లో శ్రీశైల ఖండంలో 85వ అధ్యాయములో ఉన్నవి.

కొలనుపాక సోమేశ్వర దేవస్థానము, శ్రీశైల భ్రమరాంభా మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్థానం ఈ రెండు వీరశైవ ధర్మాభివృద్ధి యుగయుగాల నుండి మూలకేంద్రాలై భాసిస్తున్నాయి.

శ్రీశైల క్షేత్రంలో మల్లిఖార్జున స్వామి దేవాలయమునకు, శ్రీభ్రమరాంభా దేవాలయమునకు మధ్య భాగంలో శ్రీమద్గిరిరాజ సూర్యసింహాసన పీఠమున్నది. ఈ నాటికీ ఈ పీఠము దేదీప్యమానమై వెలుగొందుతుంది. మల్లిఖార్జున దేవాలయానికి వాయువ్య దిశలో ఘంటాకర్ణ మఠమున్నది. ఇప్పుడు "ఘంటామఠము" గా పిలువబడుతున్నది. ఈ ఘంటామఠము కేదార పీఠమునకు సంబంధించిన మఠము. అక్కడ ఈ నాటికి వీరశైవ పంచాచార్యుల మూలపురుషులలో ఒకరైన ఘంటాకర్ణ శివాచార్యుల విగ్రహమున్నది. వీరశైవులు ఇష్టలింగమును పూజించే సమయంలో ఎడమ చేతిలో ఇష్టలింగమును పెట్టి పూజించి, కుడి చేతిలో జపమాల పట్టుకొని పంచాక్షరీ మంత్రం జపం చేస్తారు.

ఈ విధమైన వీరశైవ పూజాపద్దతి గల ఘంటాకర్ణ విగ్రహమును ఘంటా మఠంలో చూడవచ్చు. ఈ ఘంటామఠమునకు అత్యంత సమీపంలో పశ్చిమ దిక్కున నంది మఠమున్నది. దీనిని ప్రస్తుతం "నందుల మఠం" అని పిలువబడుతుంది. ఈ నందుల పీఠం ఉజ్జయినీ పీఠమునకు సంబంధించిన మఠం. ఈ నందుల మఠమునకు సమీపంలోనే రుద్రాక్ష మఠమున్నది. రుద్రాక్షమఠం కాశీజంగమవాడి మఠం ప్రధాన కేంద్రంగా గల జ్ఞానసిం హాసన పీఠమునకు సంబంధించినది. రుద్రాక్షమఠమునకు అతి కొద్ది దూరములో సారంగమఠమున్నది.

ఈ సారంగ మఠము వైరాగ్య పీఠమైన రంభాపురీ పీఠమునకు సంబంధించినది. అతి ప్రాచీనకాలంలోనే ఈరశైవ ధర్మానికి సంబంధించిన పంచ మఠాలు శ్రీశైల క్షేత్రంలో స్థాపించబడ్డాయి. శ్రీశైల క్షేత్రంలో సమాగమమై, ధర్మ రక్షణ కొరకు సమాలోచనలు జరిపేవారని తెలుస్తుంది.

వీరశైవం అతి ప్రాచీనమైనదని తెలుపుటకు ఆంధ్రదేశంలో గల శ్రీశైల క్షేత్రంలోని పంచమఠాలు, శిల్పాలు విగ్రహాలు నిలువెత్తు సాక్ష్యాలు. సిద్ధాంత శిఖామణిలో బ్రహ్మ, విష్ణ్వాది దేవతలు లింగదారులేనని వారందరు శివభక్తులని వివరించబడిన శ్లోకం.

బ్రహ్మ విష్ణ్వాదయో దేవామునయో గౌతమాదయ:

ధారయంతి సదాలింగ ముత్తమాంగే విశేషత:

                                                                    - సిద్ధాంత శిఖామణి

లక్ష్మ్యాదిశక్త యస్సర్వా: శివభావ విభావితా:

ధారయంత్య వికాగ్రీషు శివలింగ మహర్నిశమ్||

                                                                     - లింగమహాపురాణము

ఇత్యుక్త్వా దేవతా స్సర్వా శివలింగాది ధారణమ్

కృత్వా పాశుపతా2భూవన్ తస్మాత్వశుపతిశ్శివ:||

                                                                     - శ్రీకరభాష్యము

బ్రహ్మాది దేవతలే శివలింగమును ధరించి శివభక్తులైనారని, పై శ్లోకాలలో స్పష్టంగా వివరింపబడింది. అంగముపై లింగమును ధరించిన వారందరూ వీరశైవులే, కావున దేవతలందరూ లింగమును ధరించినవారే. దీనిని బట్టి వీరశైవ ధర్మమెంత ప్రాచీనమో తెలుపనక్కరలేదు.

మలత్రయం: మల మనగా సంస్కృతి (సంసార) బంధమునకు కారణమయిన పాశము. ఈ పాశము ఆణవ, మాయా, కార్మికములని మూడు విధములు. అందులో

ఆణవమలము: అవిద్య తన ప్రాబల్యముచే ఆత్మ యొక్క జ్ఞాన క్రియారూప శక్తిని ఆవరించి (బంధించి) ఆత్మను జ్ఞానక్రియ రూపశక్తిని అవరించి (బంధించి) ఆత్మను అణురూపము (సంకుచితమే) గా జేసి పడవైచున్నది.

మాయామలము: సత్యము అసత్యముగాను, ప్రకాశము అప్రకాశముగాను కనబడజేయు అవరణము. అనగా అవిద్యచే ఆత్మకు ప్రాప్తించిన కించిత్ అజ్ఞత్వ, కించిత్ కర్తృత్వ, భోగలోల ఉపత్వములు మొదలైన నానావిధ వైషయిక ధర్మములకు అనుగుణమును సపరినామకమును అగు కార్యవర్గమునకు ఉపాదాన కారణమై సత్యజ్ఞానానంద రూపుడగు పరాత్ముని మరుగు పరచి, తన కార్యముచే కల్పింపబడిన ప్రపంచమునే వ్యాపింపజేసి మిరయుచుండ పాశవిశేషము.

కార్మికమలము: వృక్ష భోజన్యాయమువలె ప్రవాహరూపమున అనాధియైన ధర్మత కర్మ ఫల వాసనా రూపమైన పాశము.

ఇట్టి త్రివిధ మలములు అనుక్రమముగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరముల నావరించి ఆత్మకు పశుత్వము (జీవభావము)ను ప్రాప్తింపజేసినవి. ఇందుచే ఆత్మ తనను విడనాడకుండిన (సంసార) సంస్కృతి బంధమునకు లోనై చిక్కుల నందుండుచున్నది. ఇట్ల స్వస్వరూపా జ్ఞానముచే ప్రాప్తించిన జీవత్వ పరిహారమునకై ముముక్షువునకు శివదీక్షావశ్యకత తప్పనిదైయున్నది.