ఏ దేశమందైనను మానవునికి దృగ్గోచరమగు చరాచర ప్రపంచమునకు కర్తయైన పరమేశ్వరుని శక్తి, తత్వముల గూర్చిన జిజ్ఞాసయే మతమను పేరుతో వ్యవహరింపబడుచున్నది. భారతీయ వ్మాజ్ఞయములో మిక్కిలి ప్రాచీనములని చెప్పబడు వేదములలో రుద్ర, అగ్ని, భర్గ, శివ, ఇత్యాది పదములు పరమేశ్వర పరముగ ఉపయుక్తమయినను, రాను రాను సులభముగా ఉచ్చరించడానికి అనువైనదియు, మంగళవాచకము అగు "శివ"యను శబ్దమునందు పరమేశ్వర తత్వము నిష్ఠితమయినట్లు కానవచ్చును.
"శివస్య ఇదం" అను నిష్పత్తిచే శైవశబ్దమేర్పడినది. కాగా మంగళప్రదుడగు ఈశ్వరుని తత్వమును తెలిసికొనుటకు ఏర్పడిన మతమే శైవమను పేరుతో వ్యవహృతమైనది. ఐతిహాసిక దృష్టితో జూచిన భరత ఖండము నందు వెలసిన మతములలో శైవమే ప్రాచీనముగ కనిపించును. "లింగ" శబ్దము గూడ 'శివ ' శబ్దముతో సమానము. పరతత్త్వ ఉద్యోతకముగ ఉపయోగమగుచున్నది. "లీన మర్ధం గమయతి" యనెడి నిష్పత్తిచే లింగశబ్దము. ఈ ప్రపంచమెల్ల దేనిచే ఉద్భవించి దేనియందు లీనమగునో, ఆ పరబ్రహ్మమునకే వాకచము. పరమేశ్వరాంశము ప్రతిజీవియందున గర్భితమైయుండునట్లు ఎల్లరు అంగీకరించిన విషయము. అంగుష్ఠ మాత్ర ప్రామాణమగు తేజోరూపము (జ్యోతిర్లింగము) మానవుని హృదయము, సహస్రారము మున్నగు స్థానములందు వెలుగొందునని భారతీయ వేదాంత గ్రంధములు ఉద్గోషించుచున్నవి.
కరచరణాది రూప రహిత జ్యోతిర్లింగమునకు ప్రతిబింబ చిహ్నముగ లింగరూపమున శివారాధనమొనర్చుట భరత ఖండమునందే గాక ఖండ ఖండాంతరములందు గూడ అత్యంత ప్రాచీన కాలము నుండియు పరిపాటిగ జరుగుచుండినట్లు కాననగును. సింధునదీ ప్రాంతమునందలి హరప్పా, మొహంజాదారో మున్నగు ప్రదేశములలో భూగర్భ పరిశోధనలందు దొరికిన వస్తుజాలములు క్రీస్తు పూర్వ్ము కొన్ని వేల సంవత్సరముల నాటివై యొండునని ప్రాతత్వ శాస్త్రజ్ఞులు ప్రకటించినారు.
వీనిలో శివలింగములుగూడ జేరి ఉన్నవి. భరత ఖండము మాట ఇట్లుండ అత్యంత ప్రాచీనములగు శివలింగములు, ఆసియా, ఆఫ్రికా, అమెరికా, ఖండాంతర్గత దేశములలో ఎక్కువ చోట్ల కానవచ్చుటచే శైవమతము ఆ దేశములందు గూడ పూర్వము వ్యాప్తి చెంది యుండినట్లు కాననగును. భారతీయ వ్మాజ్ఞయములో వేదములు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణములు, శివాగమములు, శైవమత ప్రాచీనతను బహుముఖములుగా జూచుచుండును. అనేక సిధ్ధాంతములయిన సాంఖ్యము, యోగము, పాంచరాత్రము, వేదమతము, పాశుపతము, ఇవన్నీ వేదములను ఆశ్రయించినవే, కాని అవి వేదములోని కొన్ని భాగములను మాత్రమే తీసినొని తక్కిన వాటిని విడిచిపెట్టినవి. శైవ సిద్ధాంతము అట్లుకాక సమస్త వేదమును ఆశ్రయించినది. అది అన్ని సిద్ధాంతముల కంటె ఉత్తమ మయినది. కాబట్టి వేదమువలె అది కూడా పరమ ప్రామాణ్యమును పొంధుచున్నది. శైవాగమములు, శైవము, పాశుపతము, సోమము, లాకులము అని నాలుగు బేధములుగా ఉన్నవి.
వాటిలో శైవము, వామము, దక్షిణము, మిశ్రము, సిద్ధాంతము అని నాలుగు విధములు. వాటిలో శక్తి ప్రధానము, దక్షిణము భైరవాత్మకము, మిశ్రము సప్తమాత్రపరము, సిద్ధాంతము వేదసమ్మతము. ఈ సిద్ధాంతమును ప్రతిపాదించే కామికాగమములో ఉత్తర భాగములో వీరశైవ సిద్ధాంతము తెలుపబడినది.
వీరశైవం భక్తి ప్రధానమైన మతం. ఈ మతంలోని మూల సిద్ధాంతము శివతత్వ జ్ఞానమును ప్రకాశింపజేయడం. ఈ మతం సద్ధర్మాచరణకు ప్రాధాన్యతనిస్తుంది. వీరశైవ సిద్ధాంతం వేదాగమములకు విరుద్ధమైనది కాదు. సకల పురాణములు చేత కొనియాడబడిన సిద్ధాంతమిది. వేదాగమ పండితులకు సంతోషాన్ని కలిగిస్తుంది. నిర్మల చిత్తులకు, సాధకులకు, సత్ఫురుషులకు ప్రీతిపాత్రమైనది.
భక్తి ప్రధానమైన వీరశైవ సిద్ధాంతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుదు పార్వతీ దేవికి ఉపదేశించినాడు.
CONTACT US
admin@veerashaivadharmam.com