మొదటి పటలము మంగళాచరణముతో ఆరంభమై, సౌగత - వైదిక - సౌర - వైష్ణవమతములను, వాటి అవాంతరభేదాలను, ఏడు విధములైన శైవమతములను, వీరశైవ, వైష్ణవ, శాక్త, సౌర, వినాయక, కాపలదర్శనములను, వీరశైవమత వైశిష్ట్యమును, భస్మరుద్రాక్షలింగధారణమహాత్మ్యమును, వీరశైవ పద నిర్వచనమును, లింగపూజావిధానమును, శివయోగి మహిమను సూక్ష్మంగా పరిచయం చేస్తేతరువాతి పటలాలు ఈ విషయాలనే మరింత విస్తృతంగా వివరిస్తాయి.

మంగళాచరణమ్

వందే గిరీంద్రతనయాద్విరదానవాగ్ని

భూనందిభ్రుజ్గిరిటిసేవితపాదపద్మమ్।

పఞ్చాననం ఫణిశశీభతరక్షుచర్మ

భూషం మహేశమనిశం శిరసా గిరీశమ్॥1||

పార్వతి, గణేశ, కార్తికేయ, నంది, భృంగి, రిటి ఇత్యాది ప్రమథగణములచేత సేవించబడు పాదపద్మములవాడు, అయిదు ముఖములవాడు, సర్పమును, చంద్రుని, ఏనుగు మరియు పులిచర్మములను ఆభరణములగా ధరించినవాడు మహేశ్వరుడయిన గిరీశునకు నిరంతరం శిరసు వంచి నమస్కరింతును.

పాశాఙ్కుశేష్టదవిషాణకరాగ్రబీజ -

పూరోజ్జ్వలం తరుణదివ్య జటాప్రకాశమ్।

కోటీరకోటిశశిరేఖముమాతనూజం

వందే గణేంద్రమనిశం వరదానదక్షమ్॥2||

పాశ, అంకుశ, వరద (ముద్రను), బీజములతో నిండిన (దానిమ్మ) ఫలమును హస్తములయందు ధరించి, సుందరమైన జటాజూటములతో ప్రకాశించుచు, లలాటాంతమున చంద్రరేఖనలంకరించుకుని భక్తులకు వరముల నిచ్చుటలో దక్షుడైన ఉమాసుతుడైన గణనాథునకు ఎల్లప్పుడు నమస్కరింతును.

కైలాసశిఖరే రమ్యే సిద్ధగంధర్వసేవితే।

సర్వకల్యాణనిలయే పుణ్యే శంకరమందిరే॥

ఏకదా రహసి ప్రేమ్ణా పార్వతీ పరమేశరమ్।

సర్వలోకోపకారాయ నమస్కృత్యైవమబ్రవీత్॥3||

ఒకప్పుడు సిద్ధ, గంధర్వులచేత సేవించబడుతూ, సమస్తశుభములకు నిలయము, పరమపవిత్రము, శివునకావాసము అయిన కైలాస పర్వతశిఖరము నందు అత్యంతసుందరమైన ఏకాంతప్రదేశమున పార్వతీదేవి ప్రేమతో పరమేశ్వరునకు నమస్కరించి సమస్తలోకోపకార్థమై ఇట్లు పలికినది.

మత భేదనిరూపణము

పార్వతి ప్రశ్న:

దేవదేవ మహాదేవ చంద్రశేఖర ధూర్జటే।

మతభేదస్వరూపం మే వద తత్త్వేన సర్వశ:॥4||

మతాని కతి భేదాని లక్షణం తస్య తస్య కిమ్।

ఆచారశ్చ కథం తత్ర ప్రాయశ్చిత్తం ఫలం త్వపి ॥5||

దేవాధిదేవా! మహాదేవా! చంద్రశేఖరా! ధూర్జటీ! (లోకమునందలి) మతభేధములను వాటి యథార్థస్వరూపమును సమగ్రముగా తెలియజేయుము. మతములెన్ని విధములు? వాటి వాటి లక్షణములేవి? వాటిని ఆచరించు విధానమేది? వాతికి సంబంధించిన ప్రాయశ్చిత్తవిధులను, వాటి ఫలములను నాకు తెలియజేయుడు.

ఈశ్వర ఉవాచ:

శృణు దేవి ప్రవక్ష్యామి మతానాం లక్షణాదికమ్।

యద్ జ్ఞాత్వా నిర్వృతిం యాతి శివ: సంజాయతే స్వయమ్॥ |6|

ఈశ్వరుని సమాధానము: ఓ దేవి! ఏ జ్ఞానముచేత (మానవుడు) ముక్తుడై, స్వయముగా తానే శివుడగుచున్నాడో, అటువంటి (జ్ఞానమును బోధించు) మత లక్షణాదులను చెప్పెదను వినుము.

సౌగత - వైదిక - సౌర - వైష్ణవమతాని

ఆదౌ తు సౌగతమతం తచ్చ పఞ్చవిధం ప్రియే।

బౌద్దసౌగతచార్వాకజైనార్హతవిభాగత:॥ |8|

హే ప్రియే! మొట్ట మొదటది సౌగతమతము. అది బౌద్ధ, సౌగత, చార్వాక, జైన మరియు అర్హత అను విభాగములతో ఐదు విధములు.

వివరణ: బౌద్ధము, సౌగతం అన్నవి ఒకే మతానికి చెందిన పర్యాయ నామాలు. చార్వాకము బౌద్ధముకన్నా వేరైనది. జైన, అర్హత అనునవి కూడా ఒకే మతానికున్న పర్యాయపదాలు. ఈ మత ధర్మాలను లక్షణాలను ఇక్కడ వివరించ్డంలేదు గనుక భేదములు అస్పష్టములు.

తేషామిదం మహాముఖ్యం మతం సాధారణం ప్రియే।

తారే తుత్తరతారే స్వాహేతి శూన్యార్థకో మను:॥ |9|

ఈ మతములందు సాధారణముగా శూన్యమును తెలియజేయు 'తారే తుత్తారతారే స్వాహా' అను మంత్రము చాలా ముఖ్యమైనది.

వివరణ: శూన్యవాదము బౌద్ధమతంలో ప్రధానమైన అవాంతర శాఖ. 'తారే తుత్తారతారే స్వాహా' అన్నది బౌద్ధుల మంత్రయానశాఖలో ప్రసిద్ధమైన దేవీ తారకు సంబంధించిన మంత్రము.

అథ వైదికమీశాని మతం యద్ వేదసమ్మతమ్।

మంత్రస్తు బ్రహ్మగాయత్రీ సర్వసాధారణ: ప్రియే॥ |10|

హే! ఈశానీ! తరువాతది వేదసమ్మతమయిన వైదిక మతము. ఇందు బ్రహ్మగాయత్రీ మంత్రము సర్వసాధారణమైనది.

తతో2ధికం సౌరమతం గాయత్రీ సౌరలక్షణా।

తచ్చ పఞ్చవిధం దేవి పఞ్చభేదం నిశామయ॥ |11|

వైకర్తనం తథాదిత్యం పౌష్ణం మార్తాండసంజ్ఞితమ్।

సౌరం సర్వోత్తమం తత్ర యత్తు సూర్యాధిదైవతమ్॥ |12|

దీనికన్నా ఉత్తమమైనది సౌరమతము. ఇందు సూర్య గాయత్రీ మంత్రము అత్యంత సాధారణము. సౌరము అయిదు విధాలు: వైకర్తనము, ఆదిత్యము, పౌష్ణము, మార్తాండము మరియు సౌరము అని. వీటిలో సూర్యుడే ప్రధానదేవత. సౌరము సర్వోత్తమయిన శాఖ.

వివరణ: సౌరము అయిదు విధాలని పేర్కొన్నా, నాలుగు శాఖలు మాత్రమే పేర్లతో వివరించడం జరిగింది.

తతో2ధికం మహాదేవి మతం వైష్ణవముత్తమమ్।

తద్భేదమపి వక్ష్యామి తచ్చ పఞ్చవిధం మతమ్॥ |13|

గోపాలం నారసిం హం చ రామం కృష్ణాత్మకం పరమ్।

నారాయణమితీశాని గాయత్రీ వైష్ణవీ తథా॥ |14|

హే! మహాదేవీ! అంతకన్నా ఉత్తమమైన మతము వైష్ణవము. దాని భేదములు కూడా ఐదు విధములు. అవి గోపాలము, నారసిం హము, రామము, కృష్ణము, నారాయణము. హే! ఈశానీ! ఈ (శాఖలన్నిటనూ) వైష్ణవ గాయత్రీమంత్రము ప్రధానమయినది.

సప్తవిధం శైవమతమ్

అథ వక్ష్యే గిరిసుతే మతం మమ మహత్తరమ్।

శైవం సప్తవిధం పుణ్యం వీరశైవాదిభేదత: ॥ |15|

వీరశైవం తథానాదిశైవమాదిపదం తత:।

అనుశైవం మహాశైవం యోగశైవం తు షష్ఠకమ్॥ |16|

సప్తమం జ్ఞానశైవాఖ్యం తత్ర సర్వోత్తమోత్తమమ్।

వీరశైవమితీశాని తదజ్గానీతరాణి తు॥ |17|

ఏడు విధముల శైవము

హే పార్వతీ! తదనంతరము మహత్తరమయిన నా మతమును తెలిపెదను. పవిత్రతమయమయిన శైవము వీరశైవాది భేదములతో ఏదువిధములై యున్నది. ఇవి వరుసగా వీరశైవము, అనాదిశైవము, ఆదిశైవము, అనుశైవము, మహాశైవము, యోగశైవము మరియు జ్ఞానశైవము. వీటిలో వీరశైవము సర్వోత్తమయినది. మిగిలినవి దానికి అంగములు.

వివరణ: చంద్రజ్ఞానాగమము (క్రియాపాదము 10వ అధ్యాయము) శైవము ఎనిమిది విధములని పేర్కొంటున్నది. అనాదిశైవము, ఆదిశైవము, వీరశైవము అన్న పారమేశ్వరాగమములోని మతముల తరువాత పూర్వశైవము, మిశ్రశైవము, శుద్ధశైవము, మార్గశైవము మరియు సామాన్యశైవము అని తెలియజేస్తున్నది. పారమేశ్వరాగమములోని అనుశైవ, మహాశైవ, యోగశైవ మరియు జ్ఞానశైవమన్నవి అక్కడ పేర్కొనబడలేదు. సూక్ష్మాగమము (క్రియాపాదము 10వ అధ్యాయము) వీరశైవములోని ఏడు మతబేధాలను వరుసగా - అనాదిశైవము, ఆదిశైవము, మహాశైవము, అనుశైవము, అవాంతరశైవము, ప్రవరశైవము మరియు అంత్యశైవము అని తెలియజేస్తున్నది. ఇందులోని మహాశైవము, అవాంతర శైవము, ప్రవరశైవము మరియు అంత్యశైవము అన్నవి క్రొత్తవి. ఆగమాలలో ఈ బేధాల నిర్దిష్టలక్షణాలు అస్పష్టము.

గాణపత్యాదిమతాని

గాణపత్యం వైరభద్ర్యం భైరవం శరభాభిధమ్।

నాందికేశం చ కౌమారం పైశాచమితి సప్తధా॥ |18|

అష్టకోటిమహాభేదం గాణపత్యమతం ప్రియే।

సప్తధా వీరభద్రాఖ్యం భైరవం చాష్టధోదితమ్॥ |19|

శారభం తత్పఞ్చవిధం నాందికేశం త్రిధోదితమ్।

కౌమారమితి పైశాచమతం తు త్రివిధం ప్రియే॥ |20|

గాణపత్యాదిమతములు

గాణపత్యము, వైరభద్ర్యము, భైరవము, శారభము, నందికేశము, కౌమారము మరియు పైశాచమని ఏడు ప్రసిద్ధ మతములు. ప్రియా! వీటిలో గాణపత్యము ఎనిమిది కోట్ల భేదములను, వీరభద్రము ఏడు భేదములను, భైరవము ఎనిమిది భేదములను, శరభము ఐదు భేదములను, నందికేశము, కౌమారము, పైశాచము ఒక్కొక్కటి మూడు భేదములను కలిగియున్నవి.

పైన పేర్కొనిన మతములతో పాటు, మరియొక మతాన్ని కలుపుకొని మృగేంద్రాగమము (చర్యాపాదము ఈ.36-37) మొత్తము ఎనిమిది మతములను పేర్కొంటున్నది.

సౌగతాదీని యావన్తి వైష్ణవాన్తమతాని తు।

యచ్చ శైవం మమ మతం సర్వేషాముత్తమోత్తమమ్॥ |21|

పైన పేర్కొన్న సౌగతము నుండి వైష్ణవము వరకు గల మతములలో శైవము అన్నిటికన్నా ఉత్తమోత్తమయినది.

షడ్ దర్శనాని

తంత్రం తు షడ్విధం ప్రోక్తం షడ్దర్శనవిభేదత:।

వీరశైవం వైష్ణవం చ శాక్తం సౌరం వినాయకమ్॥ |22|

కాపాలమితి విజ్ఞేయం దర్శనాని షడేవ హి।

తత్తత్తంత్రోక్తమార్గేణ తత్తత్కర్మ సమాచరేత్॥ |23|

ఆరు దర్శనములు: తంత్రశాస్త్రము దర్శనభేదములను ఆరు విధములుగా చెబుతున్నది. అవి: వీరశైవము, వైష్ణవము, శాక్తము, సౌరము, వినాయకము, కాపాలము. ఆయా తంత్రములందు విధించిన మార్గములననుసరించి ఆయా కర్మలను ఆచరించవలెను.

మత సాంకర్య నిషేధ:

శైవం పాశుపతం సోమం లాకులం చ చతుర్విధమ్।

శైవభేదమితి జ్ఞేయం సంకరం న సమాచరేత్॥ |24|

అనాదిశైవ: ప్రథమ ఆదిశైవో ద్వితీయక:।

తృతీయస్తు మహాశైవశ్చతుర్థో హ్యనుశైవక:॥ |25|

పంచమో2వాంతర: శైవో యోగశైవస్తు షష్ఠక:।

సప్తమో వీరశైవాఖ్యస్తత్తత్కర్మ సమాచరేత్॥ |26|

మతసాంకర్య నిషేధము: శైవము, పాశుపతము, సోమము, లాకులము అనునవి శైవమతమునందలి నాలుగు భేదములు. వీటిని సంకరము చేయరాదు. మొదటిది అనాది శైవము, రెండవది ఆదిశైవము, మూడవది మహాశైవము, నాలుగవది అనుశైవము. అవాంతరశైవము ఐదోవది. యోగశైవము ఆరోవది. వీరశైవము ఏడోవది. ఒక ఆగమమునందు విధించిన కర్మలను, దేవతలను ఇతర ఆగమములందు నిర్దిష్టములైన కర్మలతోను దేవతలతోను సంకరము చేయరాదు.

తత్తదాగమకర్మాణి తత్తద్‌దైవం న మిశ్రయేత్।

గోపాలం పఞ్చరాత్రం చ నారసిం హం చ వైష్ణవమ్॥ |27|

నారాయణం పఞ్చవిధం సంకరం న సమాచరేత్।

నిత్యా2నిత్యా శాబరాఖ్యా శక్తిశ్చేతి చతుర్విధా॥ |28|

శాక్తభేదమితి జ్ఞేయం సంకరం న సమాచరేత్।

బ్రహ్మేంద్ర: సావన: సూర్య ఇతి సౌరశ్చతుర్విధ:॥ |29|

తస్మింస్తస్మిన్ యథా ప్రొక్తం తత్తద్దేవం న మిశ్రయేత్।

అర్హశ్చార్వాకబౌద్దశ్చ జినశ్చేతి చతుర్విధమ్॥ |30|

వైనాయకమితి జ్ఞేయం సంకరం న సమాచరేత్।

నిరీశ్వరం సేశ్వరం చ కాపాలం భైరవం తథా॥ |31|

చతుర్విధం తు కాపాలం సంకరం న సమాచరేత్।

అత్రాదౌ వీరశైవాఖ్యం తంత్రాణాముత్తమోత్తమమ్॥ |32|

గోపాలము, పాంచరాత్రము, నారసిం హము, వైష్ణవము, నారాయణము అని వైష్ణవము ఐదు విధములు. వీటిని సంకరము చేయరాదు.

శాక్తమతము నిత్యము, అనిత్యము, శాబరము, శక్తి అని నాలుగు భేధములతో నున్నది. వీటిని కూడా సంకరము చేయరాదు. బ్రహ్మ, ఇంద్ర, సవన, సూర్య భేదములతో సౌరము నాలుగు విధములు. అయా మతములందు నిర్దేశొంచిన ప్రధాన దేవతలను ఇతర దేవతలతో కలపరాదు.

అర్హత, చార్వాకము, బౌద్ధము, జైనమని నాస్తిక మతాలు నాలుగు. అలాగే వైనాయకము కూడా నాలుగు విధములు. దీనిని ఇతరమతములతో సంకరము చేయరాదు.

నిరీశ్వరము, సేశ్వరము, కాపాలము, భైరవము అనునవి కాపాలిక మత భేదములు. వీటి సాంకర్యమును నిషేధించడమయినది. వీటిలో మొదట తెలిపిన అన్ని తంత్రములలోను వీరశైవము ఉత్తమోత్తమమైనది.

పంచాక్షర మంత్రోద్దార: / పంచాక్షరమంత్రమును ఉద్దరించు విధానము

తత్ర మంత్రో మహాదేవి శైవపంచాక్షరో మమ।

తదుద్దారం ప్రవక్ష్యామి శృణు శైలకుమారికే॥ ।33।

హే మహాదేవి! వీరశైవమతమున శివ పంచాక్షరీ మంత్రము (ఉపదేశించబడి వున్నది. దాని) ఉద్దరించు విధానమును తెలిపెదను వినుము. ఓ శైలకుమారీ!

జవిపూర్వం మరుత్పూర్వం స్మరపూర్వం సమన్విత:।

పార్శ్వమక్షీఅమాయుక్తం వరుణస్థం ధను: ప్రియే॥ |34|

వహ్నిపూర్వం తతో దేవి మంత్ర: సాక్షాన్మదాత్మక:।

సర్వేషామపి శైవానాం సర్వసాధారణో మను:॥ |35|

ప్రథమముగా (జవి) 'న ' కారము నుంచవలెను. తరువాత (మరుత్) విసర్గమును అంతమున కలిగిన (స్మర) 'మ ' కారమును ఉంచవలెను. దానికి తరువాత (అక్షి) ఇ కారముతో కూడిన (పార్శ్వ) శ కారమును, (ధనుం) ఆ కారముతో నున్న (వరుణ) వ కారమ్ను, చివరన (వహ్ని) రేఫమునకు ముందరిదయిన 'య ' కారమును వరుసగా కూర్చిన సిద్దించు 'నమ:శివాయ ' అను నా మంత్రము శైవులందరికీ సర్వసాధారణమైన మంత్రము.

వివరణ:

'జవి ' అనగా నకారము 'మరత్ ' అనగా అకారము. జవిని ఏది ముందుగా గలిగి యున్నదో అది అనగా (న్ + అ = న).

'స్మర ' అనగా మకారము. 'సర్గ ' మనగా విసర్గ. స్మరపూర్వము సమన్వితము - అనగా మకారమును ముందుగా గలిగి విసర్గతో కూడినది (మ:).

పార్శ్వమనగా శకారము. అక్షి అనగా ఇకారము. అక్షియుక్తమయిన పార్శ్వమనగా (శి).

వరుణమనగా వకారము. ధను: అనగా దీర్ఘము. వరుణస్థమైన ధనస్సు అనగా ఆకారమును చివరన కలిగిన వకారము (వా).

వహ్ని అనగా రేఫము, వహ్ని పూర్వమనగా వర్ణమాలికలో రేఫమునకు ముందున్న యకారము (య).

ఇట్లు 'నమ:శివాయ ' అను మత్రమునుద్దరించవలెను.

దేవ్యువాచ / పార్వతి ప్రశ్న

మతతారతమ్యవిషయక: ప్రశ్న: తత్సమాధానం చ / మతతారతమ్యములను గురించిన ప్రశ్న మరియు సమాధానము

ఉక్తాన్యేతాని దేవేశ సర్వాణి చ సమాని వా।

తారతమ్యేన వా తత్ర కిం మతం చంద్రశేఖర॥ |36|

నోక్తం శాక్తమతం దేవ హ్యుత్తమం వా2ధమం సమమ్।

తదద్య కథయ స్వామిన్ యత్తు సర్వోత్తమోత్తమమ్॥ |37|

ఓ దేవేశ! (మీచే) సమస్త మతములు చెప్పబడినవి. అయితే ఇవి అన్నియూ సమానమతములా? (లేక) వాటిలో తారతమ్యములున్నవా? అట్లున్న వాటిలో సర్వశ్రేష్టమయినదేది? ఓ చంద్రశేఖరా! శాక్తము ఇతరమతముల కన్నా అధమమా? ఉత్తమమా? సమానమా? అను విషయమును తెలుపలేదు. గనుక సర్వోత్తమమయిన దాన్ని తెలియజేయుము.

ఈశ్వర ఉవాచ /ఈశ్వరుని సమాధానము

సర్వాణి చ మహాదేవి మతాని తు మహాన్త్యపి।

ప్రాప్యమేకం ఫలం తేషాం విశేష స్తత్రవక్ష్యతే॥ |38|

ఓ మహాదేవీ! ఈ మతములన్నీ గొప్పవే. ఎందువలననగా ఈ మతముల ద్వారా పొందుబడుతున్న ఫలము ఒక్కటే. (అయినా) వాటి వైశిష్ట్యమును తెలిపెదను వినుము.

వీరశైవ మత వైశిష్ట్యమ్ / వీరశైవమతము యొక్క విశిష్టత

విత్తాయాసమహాయత్న సాధ్యాన్యన్యాని పార్వతి।

మహాఫలం శుభకరం శైవమేవ న సంశయ:॥ |39|

పార్వతీ! ఇతరమతములు అధికధనవ్యయముతో పాటు, బహుశ్రమతో అత్యంత ప్రయత్నముతో సాధించవలసినవి. అయితే శైవమతము శుభావహము మహాఫలప్రదమయినది. అందు సందేహము లేదు.

తత్ర వక్ష్యే శివే వీరశైవం సర్వోత్తమోత్తమమ్।

నాన్యస్య తద్భవేద్యోగ్యం శాక్తేయం సర్వసమ్మతమ్॥ |40|

శివే! అందులోనూ సర్వోత్తమోత్తమయిన వీరశైవమతమును తెలిపెదను వినుము. ఈ మతము నందలి విశేషము ఇతర మతములందులేదు. శాక్తము అందరికీ సులభసాధ్యమయిన మతము.

వీరశైమమతం సద్యో భోగమోక్షైకసాధనమ్।

సర్వోత్తమం మమ మతం యత: సర్వోత్తమో2స్మ్యహమ్॥ |41|

వీరశైవమతము తక్షణమే (ప్రాపంచిక) భోగములను (పారమార్థిక) మోక్షమును సిద్ధింపజేయు ఒకే ఒక సాధనము. నేను సర్వోత్తముడయినందున నా (చే ప్రసాదించబడిన) వీరశైవము సర్వోత్తమమైనది.

న వీరశైవసదృశం మతమస్తి జగత్రయే।

సర్వభోగప్రదం పుణ్యం శివసాయుజ్యదాయకమ్॥ |42|

సర్వ భోగప్రదము, పుణ్యమయము, శివసాయుజ్య సంధాయకము అయిన వీరశైవ(మత)ము వంటి మతము ముల్లోకములలో (మరియొకటి) లేదు.

యథా మత్సదృశో నాస్తి పురుషాణాం త్వయా సమా।

స్త్రీణాం తథా వీరశైవసదృశం నాస్తి వై మతమ్॥ |43|

పురుషులలో నావంటి పురుషుడు, స్త్రీలలో నీవంటి స్త్రీ లేనట్టే, వీరశైవ(మత)మునకు సమానమైన మతము వేరొకటి లేదు.

అపి పాపశతం కృత్వా జ్ఞానతో2జ్ఞానతో2పి వా।

వీరశాఇవమతం ప్రాప్య శివ ఏవ న సంశయ:॥ |44|

తెలిసీ తెలియని అజ్ఞానముతో వందలాది పాపకార్యముల జేసినవాడు వీరశైవ మతమునాశ్రయించి నిస్సందేహముగా సాక్షాత్ శివుడే అగుచున్నాడు.

న తస్యాప్తి భయం పాపాన్నాధిక్యం పుణ్యకర్మణ:।

స్వయం హి పుణ్యపాపానాం నిర్ణేతా చ నియామక:॥   |45|

అటువంటి వానికి పాపభయము (లేదు). పుణ్యకార్యము(ల) వలన (కలగు) ఆధిక్యత వుండదు. ఎందువలననగా పుణ్యపాపకార్యములను నియంత్రించేవాడు, నిర్ణయించేవాడు తానే అగుచున్నాడు.

యే వీరశైవే దేవేశి దీక్షితా: శివయోగిన:।

తాన్ దృష్య్టైవ పలాయన్తే దూరతో యమకింకరా:॥ |46|

ఓ దేవేశీ! వీరశైవ దీక్షను పొందిన శివయోగులను చూసిన మాత్రముననే యమకింకరులు దూరము నుండే పరుగిడుతున్నారు.

భస్మరుద్రాక్షలింగధారణమాహాత్య్మమ్ / భస్మ -రుద్రాక్ష - లింగధారణ మహాత్య్మము

సభస్మరుద్రాక్షతనుం సలింగం శివయోగినమ్।

దృష్ట్వా సద్యో విముచ్యన్తే పాపినో2పి న సంశయ:॥ |47|

విభూతి, రుద్రాక్ష, లింగమును ధరించిన శివయోగిని చూసినంత మాత్రమునే మహాపాపాత్ములు సైతము తక్షణమే ముక్తులగుచున్నారు, సంశయము లేదు.

యస్య భస్మ లలాటే2స్తి కంఠే లింగం మదాత్మకమ్।

రుద్రాక్షధారణం దేహే సో2హం దేవి న సంశయ:॥ |48|

ఎవని నుదుట విభూతిరేఖలు, కంఠమున నాస్వరూపమయిన లింగము, శరీరముపై రుద్రాక్షమాల ధరించబడియున్నవో వాడు నిస్సందేహముగా నేనే అయి యున్నాను.

య ఇచ్ఛేన్మమ సారూప్యం సో2ర్చయేచ్ఛివయోగినమ్।

య ఇచ్ఛేద్రౌరవం ఘోరం స నిందేచ్ఛివయోగినమ్॥ |49|

ఎవడు నా సారూప్యము(క్తిని) కోరుచున్నాడో, వాడు శివయోగిని పూజించవలెను. ఎవడు భయంకరమయిన నరకమును వాంచించుచున్నాడో వాడు శివయోగిని నిందించవలెను.

నిత్యం పశ్యేద్వీరశైవదీక్షితం శివయోగినమ్।

యస్య కంఠగతో2హం వై స (న) తస్మదుత్తమ: ప్రియే॥ |50|

వీరశైవదీక్షితుడైన శివయోగిని అనునిత్యం దర్శించవలెను. ఎవడి కంఠమున నేను (లింగరూపమున) ధరించబడి ఉన్నాన్నో అటువంటి వానికన్నా ఉత్తముడు వేరొకడు లేడు.

యాదృశీ భావనా కార్యా మయి త్వయి శివే తథా।

తథైవ కార్యా వై వీరశైవదీక్షిత ఉత్తమే॥ |51|

ఎటువంటి పూజ్యభావన నాయందు, నీయందు చూపబడుచున్నదో ఉత్తముడైన వీరశైవదీక్షితుడైన శివయోగిపట్లను అటువంటి భావనను కలిగి ఉండవలెను.

తస్య పూజా మమ శివే తన్నిందా చ మమైవ హి।

యద్యస్తి మయి సద్భక్తిరర్చయేచ్ఛివయోగినమ్॥ |52|

ఓ శివే! (అటువంటి) శివయోగిని పూజించిన నన్ను పూజించినట్టు, అతనిని నిందించిన నన్ను నిందించినట్లు, నాపై నిజమైన సద్భక్తి ఉన్నచో శివయోగినే పూజించవలెను.

నిమిషం నిమిషార్థం వా యత్ర స్యు: శివయోగిన:।

తత్కైలాసం పరం విద్ధి తత్ర కాశీ శివో2ప్యహమ్॥ |53|

నిమిషముగాని, అర్థనిముషము గాని శివయోగి నిలబడిన ప్రదేశమే కైలాసముగా, కాశీ క్షేత్రముగా, సాక్షాత్తు నా శివ స్వరూపముగా తెలిసికొనుము.

మమ యో ధారయేల్లింగం యథోక్తం గురుణా శివే।

చాండాలస్పృష్టదోషో2పి స్మరతో నశ్యతి క్షణాత్॥ |54|

శివే! ఎవడు గురువు ఆదేశముననుసరించి నా లింగమును (శరీరమున) ధరించుచున్నాడో, అటువంటి వాని స్మరణ మాత్రముననే చాండాలస్పర్శచే కలుగు దోషము క్షణమున నశించుచున్నది.

న తస్య జాతిభేదోస్తి న శుచ్యశుచికల్పనా।

న స్పృష్టిర్నాపి వా2శుద్ధి: సర్వం శివమయం యత:॥ |55|

అటువంటివానికి జాతిభేదములుండవు. పవిత్ర అపవిత్రముల కల్పనలుండవు. అస్పృశ్యత అశుద్ధముల ప్రసక్తి ఉండదు. ఎందువలననగా సమస్త (ప్రపంచ)ము శివమయమే గనుక.

భుక్త్వా2వశిష్టపాత్రం యత్తదుచ్ఛిష్టధియా శివే|

క్షాలయేచ్ఛివయోగీ య: స యాతి నరకం ధ్రువమ్॥ |56|

శివే! శివయోగి భుజించినపాత్రను ఎంగిలి అన్నభావనతో ఎవడు కడుగ ప్రయత్నించుచున్నాడో వాడు నిశ్చయముగా నరకమునకేగుచున్నాడు.

న స్పృష్టిర్న రజోదేషో న స్త్రీబాలాదికల్పనా।

న జన్మమరణాశౌచం న స్నానాదివిధిర్యత:॥ |57|

వీరశైవమున స్పర్శదోషము, రజోదోషము, స్త్రీ బాల వివక్షత, జనన మరణ కాలముల అశౌచము, స్నానాది నియమములు లేవు.

వివరణ: స్త్రీల రజోదర్శనమున గాని, ప్రసవమరణాది సూతకములుగాని వీరశైవులకు లేవు. దీక్షాపురస్సరముగా గురువుచే నీయబడిన ఇష్టలింగమును శరీరముపై నిరంతరము ధరించుచూ నిత్య శివపూజా నిరతులయినందున వారికి సూతకాదులు లేవు. సూతకాది సందర్భములందు కూడా శివపూజ మానరాదన్నది ఇక్కడ తాత్పర్యము. అటులనే ప్రసవాది కష్టకాలములందు శివపూజాభంగము దోషము కాదు.

బ్రాహ్మణా: క్షత్రియా వైశ్యా: శూద్రా యే చాన్యజాతయ:।

లింగధారణమాత్రేణ శివా ఏవ న సంశయ:॥ |58|

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మరియే ఇతర వర్ణ వర్గములకు చెందినవారైనా లింగధారణ చేసిన మాత్రముననే నిస్సంశయముగా శివ స్వరూపులగుచున్నారు.

స్త్రియోబాలాస్తథా వృద్ధా ఖఞ్జౌ: కుబ్జాంధపంగవ:।

ఉన్మత్తా బధిరా: కాణా: శాఠా ధూర్తాశ్చవఞ్చకా:॥ |59|

చోరా జారాస్తథా వేశ్యా ఆచాండాలాన్తసంభవా:।

మల్లిజ్గధారణాదేవ మద్రూపా ఏవ తే శివే॥ |60|

స్తీలు, బాలురు, వృద్ధులు, షండులు, కుబ్జులు, గ్రుడ్డి, కుంటి, పిచ్చి, చెవిటి, శఠ, ధూర్త, వంచకులు, చోర, జార, వేశ్య, చాండాలాది అంత్యవర్ణములకు చెందిన వారెవరైనాసరే నా లింగధారణ చేసినంతనే నా స్వరూపులే అగుచున్నారు.

న బాలవృద్దభేదో2స్తి నమస్కారాదిపూజనే।

సర్వే2పి వందనీయా హి విధవాపుష్పిణీముఖా:॥ |61|

నమస్కారాది పూజలకు బాలురు వృద్ధులన్న భేదము లేదు. (ఈ మతములో) విధవలు, రజస్వల (లతో పాటు) అందరూ వందనీయులే.

యస్యాస్తి భక్తిరీశాని వీరశైవమతాశ్రయే।

భక్తిమాత్రపవిత్రా హి సర్వ ఏవాధికారిణ:॥ |62|

హే ఈశీనీ! భక్తి గల వారందరూ వీరశైవమున అధికారులగుచున్నారు. (ఎందువలననగా) భక్తి మాత్రము చేతనే వారు పవిత్రులుగా చేయబడుతున్నారు.

దేవ్యువాచ / దేవి ప్రశ్న

వీరపద నిర్వచనమ్‌విషయక: ప్రశ్న: / 'వీర ' పద నిర్వచనమునకు సంబంధించిన ప్రశ్న

జయశంకర సర్వేశ సర్వజ్ఞ సకలోత్తమ।

మతే తు వీరపూర్వత్వే కిం ప్రమాణమిహోచ్యతామ్॥ |63|

యౌగికం రూఢికం వేదముపచారో2పి వా ప్రభో।

తదద్య కథయేశాన నాస్తి చాన్యస్య చేదృశమ్॥ |64|

హే శంకరా! మీకు జయమగుగాక! ఓ సర్వేశ్వరా! సర్వజ్ఞా! సకలోత్తమా! ఈ మతమున 'వీర ' శబ్దమును ముందు చేర్చుటకు గల కారణమేమిటి? వీర శబ్దము యౌగికమా (ధాతువు నుండి ఉత్పన్నమయినదా?), రూఢమా (లోక ప్రసిద్దమయినదా?), లేక ఓపచారికమా(ఓపాధికా?) ప్రభూ. మరే మతమునకు గాని ఇటువంటి వీరశబ్దము ఎందుకు లేదో తెలుపుము.

ఈశ్వర ఉవాచ / ఈశ్వరుని సమాధానము

సాధు పృష్టం త్వయా దేవి సర్వలోకహితం త్విదమ్।

మహారహస్యమేతత్ తే వక్ష్యే మోహవశార్దిత:॥ |65

ఓ దేవీ! సమస్తలోకహిత కరమైన ఈ ప్రశ్న నీచేత చక్కగా అడుగబడినది. ఇది చాలా రహస్యమైనది. మోహపరవశుడనై నీకు చెప్పెదను (వినుము).

వీరపద నిర్వచనము

వీరత్వం నామ విశ్వేశి తురీయా యత్ర యత్ర వై।

గురూక్తమార్గనిరతా మతే వీరపదాభిధే॥ |66|

సర్వే2పి వీర దేవేశి తురీయాస్తత్ర తత్ర యే।

కింతు మే శైవభేదో యో వీరశైవ: స ఉచ్యతే॥ |67|

అన్యత్ర కర్మబాహుల్యాదాచారస్య వ్యతిక్రమాత్।

న చిత్తశుద్ద్యలాభాచ్చ భేద సద్భావత: సుఖమ్॥ |68|

విశ్వేశీ! తురీయావస్థను పొందిన యోగులకు వీరత్వమున్నది. 'వీర ' పదముతో పిలువబడు మతమునందు గురువు బోధించిన మార్గముననుసరించు వారందరూ వీరులే. తురీయావస్థను (నాలుగవదశ) చేరిన వారందరూను వీరులే. నేను బోధించిన శైవ మత భేదము వీరశైవమని పిలువబడుచున్నది.

ఇతర మతములందు కర్మకాండ బాహల్యమువలన, ఆచార విషయములందు వ్యత్యాసము వలన, చిత్తశుద్ధి కలుగుటలేదు. భేదబుద్ధి తొలగునందువల్ల వాటిలో ఆత్మ సుఖము లేదు.

వివరణ: జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అనునవి మానవుని నాలుగు అవస్థలు. నాలుగవదయిన తురీయావస్థ కేవలం ఆనంద స్థితి. సూక్ష్మాగమములో షట్‌స్థలములకు చెందిన భక్తులు 'వీరులు ' గా పేర్కొనబడినారు. ప్రాణము పోయినా ఆచారమును వీడని భక్తుని ఆచారలింగవీరుడని (8.41); గురూపదేశము ననుసరించి, అన్యాచారములననుసరించని మహేశ్వర స్థలభక్తుని గురులింగవీరుడని (8.48), శివలింగమును దప్ప అన్యదేవతల నర్చించని, పుణ్యక్షేత్రములపై వ్యామోహము లేని ప్రసాదిస్థలమునకు చెందిన భక్తుని శివలింగవీరుడని (8.53); తను, మన, ధనముల జంగమునికర్పించి వాటిని కలలో సైతము తలవని ప్రాణలింగ స్థల భక్తుని చరలింగవీరుడని (8.59); పరుల సొమ్మును తాకని నిస్పృహుడయిన శరణస్థల భక్తుని పరలింగవీరుడని (8.65); జీవభావనకు సంబంధించిన కృత్యముల స్మరించక చిద్వికారములకు లోనుగాని, ఐక్యస్థలమునకు చెందిన భక్తుని మహాలింగవీరుడని (8.72) పేర్కొనబడినది.

లింగధారణ మహాత్మ్యము

అత్ర వక్ష్యే విశేషం తే లింగధారణవైభవాత్।

భక్తిమాత్రేణ కల్యాణి సుఖం దు:ఖాంబుధిం తరేత్॥ |69|

నీకు విశేషమును చెప్పెదను వినుము. ఓ కల్యాణీ! ఇష్టలింగధారణ యందలిగల భక్తి మాత్రము చేతనే (భక్తుడు) సులభముగా దు:ఖసాగరమును దాటగలడు.

ప్రవేశమాత్రేణ మతే మమ శైవే మతోత్తమే।

అనాయాసేన సుసుఖం లింగధారణవైభవాత్॥ |70|

ఉత్తమమైన నా (వీర)శైవ మతమున ప్రవేశించిన వెంటనే లింగధారణ మాహాత్మ్యము చేత అనాయాసముగా సుఖమును పొందగలడు.

అన్యత్ర నాస్తి మల్లింగధారణం మతవర్తిషు।

శైవథ ఏవ కుర్వీత లింగధారణమీశ్వరి॥ |71|

ఇతర మతానుయాయులలో నా లింగధారణ (ప్రక్రియ) లేదు. ఓ ఈశ్వరీ! శైవమునవలంబించినవాడు మాత్రమే లింగధారణమును చేయవలెను.

మతాంతరస్థో యో మూఢ: కుర్యన్మల్లింగధారణమ్।

స జీవన్నేవ చాండాలో మృతో నరకమశ్నుతే॥ |72|

ఇతరమతానువర్తులలోని వాడు ఎవడైనా మూర్ఖముగా నా లింగధారణమును చేసిన జీవించివుండగా చాండాలుడై, మరిణించిన తరువాత నరకముననుభవించుచున్నాడు.

యో వినా గురుకారుణ్యమిచ్ఛయా లింగధారణమ్।

స జీవన్నేవ చాండాలో మృతో నరకమశ్నుతే॥ |73|

ఎవడు గురుకారుణ్యముచేత గాక, తనకుతానే లింగధారణమును చేసుకొనుచున్నాడో, వాడు జీవించి వుండగా చాండాలుడై, మరిణించిన తరువాత నరకమును పొందుచున్నాడు.

యో2న్యధర్మ: పరం ధర్మమాచరేదిచ్ఛయా2న్విత:।

స జీవన్నేవ చాండాలో మృతో నరకమశ్నుతే॥ |74|

ఒక ధర్మునకు చెందినవాడు తన ఇచ్ఛానుసారము మరియొక ధర్మముననుసరించినచో, జీవించి వుండగ చాండాలుడై, అనంతరము నరకమును పొందును.

యది భక్తిర్దృఢా దేవి మమ లింగస్య ధారణే।

శివయోగినమాశ్రిత్య తం గురుం శివమర్చయేత్॥ |75|

ఓదేవీ! నా ఇష్టలింగధారణము ఎవడు దృఢభక్తిని కలిగి యున్నాడో వాడు శివయోగి చెంత జేరి అతనిని గురురూపము నందున్న శివునిగా అర్చించవలెను.

దీక్షాం వినా లింగధారణే దోష: / దీక్షారహితముగా చేయు లింగధారణ దోషము

శివదీక్షాం వినా దేవి య: కుర్యల్లింగధారణమ్।

స యాతి నరకం ఘోరం యస్యజేత్తదభక్తిత:॥ |76|

దేవీ! ఎవడు శివదీక్షారహితముగా ఇష్టలింగధారణమును చేయుచున్నాడో లేదా, పొందిన లింగధారణమును భక్తిరహితంగా పరిత్యజించుచున్నాడో వాడు ఘోరమైన నరకమును పొందుచున్నాడు.

వినా విధానమీశాని న కుర్యాల్లింగధారణమ్।

కృతం చేదకృతం విద్ధి న తచ్చైవమతం భవేత్॥ |77|

(గురుదీక్షారూపమైన) విధివిధానము లేకుండా లింగధారణము చేయరాదు. అట్లు చేసిన, అది చేయని దానిగా తెలిసికొనుము. అది శైవమతమునకనుగుణము కాదు.

వీరశైవ మతోత్కర్ష: / వీరశైవ మత వైశిష్ట్యము

లింగధారణమాత్రేణ శివత్వప్రాప్తిరేవ హి।

శైవం మమ మతం దేవి సద్యోముక్తివిధాయకమ్॥ |78|

దేవీ! లింగధారణమాత్రముననే శివత్వ ప్రాప్తి కలుగును. నా శైవమతము సద్యోముక్తి ప్రదాయకము.

వివరణ: వీరశైవమత వైశిష్ట్యమునకు ఈ క్రింది ఆగమములను చూడుడు. కారణాగమము, క్రియాపాదము 1,4-9; మకుటాగమము, క్రియాపాదము 1,10-18

తస్మచ్చైవమతం సర్వమతానాముత్తమోత్తమమ్।

మమ స్వరూపం దేవేశి మల్లింగస్య చ ధారణాత్॥ |79|

అందువలననే శైవమతము ఇతర మతములన్నిటికన్నా ఉత్తమోత్తమమయినది. దేవేశీ! నా స్వరూపమయిన లింగమును ధరించుటచేత (వీరశైవుడు) నా స్వరూపమునే పొందుచున్నాడు.

వినా నానుగ్రహం తేషాం మమ శైవమతే శివే।

భక్తి: సంపద్యతే క్వాపి తత్పునర్భవభాజనమ్॥ |80|

నా అనుగ్రహమ్ లేకుండా ఎవరికి కాని నా శైవమతమున భక్తి (అనురక్తి) కలుగదు. అటువంటి భక్తి కలుగని వానికి పునర్జనాదులు తప్పవు.

సకృత్ ప్రవిశ్య చ వరో గతేషు బహుజన్మసు।

మమ శైవమతే దేవి సో2హమేవ న సంశయ:॥ |81|

అనేకములైన పూర్వజన్మములననుభవించి ఒక్కసారి శైవమతమున ప్రవేశించిన మానవుడు నిస్సందేహముగా శివస్వరూపుడే అగుచున్నాడు.

పంచాక్షర మంత్ర మహాత్మ్యము

యథా నదీనాం సర్వాసాం పుణ్యా భాగీరథీ శివే।

యథైవ భవతీ సర్వయోషితాం పురుషేష్వహమ్॥ |82|

యథైవ కాశీ క్షేత్రాణాం తీర్థేషు మణికర్ణికా।

మమ పంచాక్షరీమంత్ర: సర్వమంత్రేషు వై యథా॥ |83|

యథైవ సర్వలోకేషు కైలాసస్థానమావయో:।

తథా శైవమతం దేవి విద్ధి సర్వోత్తమోత్తమమ్॥ |84|

హే శివే! సమస్త పుణ్యనదులలో భాగీరథీ (గంగ) వలె, స్త్రీలలో నీవలె, పురుషులలో నావలె, క్షేత్రములలో కాశీక్షేత్రమువలె, తీర్థములలో మణికర్ణికవలె, సర్వ మంత్రములళో నా పంచాక్షరీ మంత్రమువలె, సర్వలోకములలో మన నివాసమైన కైలాసమువలె, (సర్వమతములలోను), శైవమతమును సర్వశ్రేష్టమైనదిగా తెలిసికొనుము.

మమ సర్వోత్తమత్వేన మత్సృష్టత్వాత్ పరస్య చ।

తదేవ తారతమ్యం తే మతే మమ పరత్ర తు॥ |85|

నా సర్వోత్తమత్త్వము చేతను, సమస్తము నాచే సృజించబడుటచేతను నా మతమయిన శైవమతము, ఇతర (మత)ములకన్నా భిన్నమైనది.

యథా వర్ధయతే రాజా భృత్యం కర్మానుసారం।

తారతమ్యపదం దత్త్వా తథైవాహం మతే మమ॥ |86|

ఏ విధముగా సేవకుని సేవానిరతిననుసరించి రాజు అతనికి తారతమ్య పదవులలో నియమిచుచున్నాడో ఆ విధముగానే నా శైవము నందు భక్తిని బట్టి తరతమ స్థానములను ప్రసాదించుచున్నాను.

శివలింగ మహిమ

విశేషం తత్ర వక్ష్యామి రహస్యం గోప్యతాం త్వయా।

న ప్రకాశయా కుత్రాపివినా భక్తం సులక్షణమ్॥ |87|

ఇచ్చట ఒక విశేషమును చెప్పెదను. దీనిని గోప్యముగా నుంచుము. సులక్షుణుడైన భక్తునకు తప్ప అన్యులకెప్పుడునూ తెలుపవలదు.

దేవాలయాదిషు యథా చిత్రాదిషు యథా గృహే।

దృశ్యతే చాకృతిర్యస్య తజ్ఞానం జాయతే స్ఫుటమ్॥ |88|

దేవాలయములందు, ఇంటియందలి చిత్రపటములందు, ఎటువంటి ఆకృతి చూడబడుచున్నదో, అటువంటి ఆకారజ్ఞానమే మనకు స్పష్టముగా తెలియును.

ఎవం హి వీరమంత్రే తు సర్వపాపై: ప్రముచ్యతే।

లింగస్య దర్శనాద్దేవి మమ జ్ఞానం ప్రజాయతే॥ |89|

అదేవిధముగా ఎట్లు వీరమంత్రము (పంచాక్షరీ మంత్రం) చేత సర్వపాపముల నుండి ముక్తి కలుగునో అటులనే ఇష్టలింగ దర్శనముచేత నా (శివ) జ్ఞానము కలుగును.

గతేషు బహుసంఖ్యేషు దు:ఖరూపేషు జన్మసు।

మత్కారుణ్యేన తస్యాంతే జాయతే లింగదర్శనమ్॥ |90|

దు:ఖమయములయిన అనేక జన్మలు గతించిన అనంతరము, నా కరుణా కటాక్షము చేతనే చివరికి ఇష్టలింగదర్శనమగును.

యదీదమితి జానాతి లింగం మమ మహేశ్వరి।

మజ్ఞానాద్దర్శనాత్సద్యో మల్లింగస్య చ సో2స్మ్యహమ్॥ |91|

మహేశ్వరీ! నా లింగము నా అనుగ్రహ కారణమే అని తెలుసుకున్నవాడు నా (శివ) జ్ఞానము చేత నా ఇష్టలింగ దర్శనము చేత వాడే నే నగుచున్నాను.

ఎవం హి మహిమా దేవి మమ లింగస్య కిం పున:।

ధృతే తు తస్మిన్ స్వతనౌ సర్వా లింగమయీ తను:॥ |92|

ఇటువంటి (మహిమాన్వితమైన)ది ఇష్టలింగము. దేవీ! అతువంటి లింగమును శరీరముపై ధరించిన భక్తుని శరీరము లింగమయమే అగుచున్నది.

లీలార్థకమపి త్వీశి యత్తల్లింగముదాహృతమ్।

తల్లింగమయమిత్యేతచ్ఛరీరం తస్య ధారణాత్॥ |93|

ఈశ్వరీ! సృష్ట్యాదిలీలలకు యే లింగము కారణముగా ఉదాహరించబడుచున్నదో అటువంటి లింగమును ధరించుట చేత భక్తుని శరీరము లింగమయమగుచున్నది.

దేవ్యువాచ / దేవి ప్రశ్న

కిమర్థం సర్వే లింగధారణం న కుర్వంతీతి ప్రశ్నస్తత్సమాధానం చ / అందరూ లింగధారణమునెందుకు చేయరు అన్న ప్రశ్న, సమాధానము

వృషధ్వజ వృషారూఢ విరూపాక్ష విషాదన।

న తే కుర్వంతి కిం సర్వే లింగధారణమీశ్వర॥ |94|

ఓ వృషధ్వజా! నందివాహనా! ముక్కంటీ! విషభక్షకా! ఈశ్వరా! లోకము అందరూ ఎందుకు లింగధారణమును చేసికొనుటలేదు?

ఈశ్వర ఉవాచ / ఈశ్వరుని సమాధానము

కథం భవిష్యతి శివే వినా మత్కరుణాం నృణామ్।

కర్మపూరితదృష్టీనాం మన్మాయామోహితాత్మనామ్॥ |95|

హే శివే! కర్మవాసనల చేత భ్రమాత్మకమయిన దృష్టిని గలిగి, మాయా మోహితులైన మానవులకు నా కరుణ లేనిదే అది ఎట్లు సాధ్యమగును?

వివరణ: ప్రశ్నకు ప్రశ్నతోటే సమాధానము. లింగధారణ సంస్కారము లభించాలంటే శివుని అనుగ్రహం ఉండాలి. అది అందరికీ లభించదు. యుక్తాయుక్త కర్మవశులయిన మానవులు తమ కర్మఫలములను పరిహరింప జేసుకొనుటకే పరమేశ్వరుడు తన మాయచేత 'తిరోధానమును ' (మరుపు) సృజించినాడు. ఇది శివుని పంచకృత్యములలో ఒకటి. జీవుడు పుణ్యపాప రూపమయిన సర్వకర్మ ఫలములను సంపూర్ణంగా పరిహరించుకున్న క్షణమే 'తిరోధానము ' తొలగి పోతుంది. ఆ తరువాత పరమేశ్వరుని ఐదవ కృత్యమయిన అనుగ్రహము ఆరంభమవుతుంది. దాని ప్రభావముచేత భక్తి అంకురించి లింగధారణాది సంస్కారములకు వీరశైవులు, యోగ్యులౌతారు.

లింగపూజా విధానము

తదనుష్ఠానమాత్రేణ విధూయాఖిలబంధనమ్।

సర్వకల్యాణనిలయం మమ సాయుజ్యమేతి స:॥ |96|

(ఇష్టలింగనును ధరించి) పూజానుష్టానములను చేయువాడు సర్వబంధములనుండి విడువడి సమస్త కల్యాణ నిలయమైన నా సాయుజ్య పదమును జేరుచున్నాడు.

జ్ఞానతో2జ్ఞానతో వాపి శక్త్యా2శక్త్యాదినాపి వా।

యన్న్యూనమతిరిక్తం వా2వస్థాత్రయయుతో2పి వా॥ |97|

విగుణా యాంతి సాద్గుణ్యం శైవస్థశివయోగిన:।

సకృల్లింగార్చనేనైవ యత్తద్రూపం మహేశ్వరి॥ |98|

తెలిసిగాని - తెలియకగాని, శక్తుడైనా - అశక్తుడైనా, తక్కువగా గాని - ఎక్కువగా గాని, జాగ్రత్-స్వప్న-సుషుప్తులను మూడు అవస్థలలోనూ శైవమతావలంబి అయిన శివయోగి ఒకసారి ఇష్టలింగపూజచేసినచో దోషములు సైతము గుణములుగా పరివర్తనము చెందును.

సర్వత్ర మమ దర్శిత్వం భక్తిరేకాన్తరూపిణీ।

మన్మతస్థస్య మత్ప్రాప్యై ద్వయమేవ హి సాధనమ్॥ |99|

వీరశైవమతము నాశ్రయించిన వానికి నన్ను చేరుటకు రెండే సాధనలు. ఒకటి (ప్రపంచమునందు) అంతటా నన్ను చూడగల్గడము, రెండు నాయందు అచంచలము ఏకాంతమూ అయిన భక్తిని కలిగి వుండడము.

న పుష్పిణీ త్యజేత్ పూజాం న భుక్త్వా నాశుచిస్త్వపి।

యదైవ పూజయేల్లింగం తదా2నుగ్రాహకో హ్యయమ్॥ |100|

రజస్వలయైన స్త్రీ ఇష్టలింగ పూజను మానరాదు. అటులనే భోజనానంతరము గాని అశౌచ సందర్భములలో గాని లింగపూజ మానరాదు. లింగార్చన చేసిన మరుక్షణమే నేనతనిని అనుగ్రహించువాడను.

స్మరణాత్ కీర్తనాద్దేవి మమ లింగస్య ధారణాత్।

అనాయాసేనాతిశయం ఫలం స్యాదుత్తమోత్తమమ్॥ |101|

దేవీ! నా ఇష్టలింగమును స్మరించుట చేతను, కీర్తించుటచేతను, ధరించుట చేతను, అనాయాసముగా అతిశయమయిన ఉత్తమోత్తమఫలము లభించును.

నమే2స్తి యస్మిన్ కారుణ్యం న తస్యాత్ర రుచిర్భవేత్।

యదైవ స్యాదత్ర రుచిస్తదా ముక్తో న సంశయ:॥ |102|

ఎవనిమీద నా కారుణ్యము ప్రసరించదో, అటువంటి వానికి ఇష్టలింగార్చన మీద అభిరుచి కలుగదు. ఇష్టలింగార్చనమీద అభిరుచి కలిగినవాడు నిస్సందేహముగా ముక్తుడగుచున్నాడు.

అతో మహారహస్యం హి మతమేతన్మహత్తరమ్।

శైవం పాశుపతం చేతి యదేకం నామభేదత:॥ |103|

అందువలన ఈ మతము అత్యంత రహస్యము, సర్వశ్రేష్ఠము. శైవ పాశుపత మతములు రెండూ ఓక్కటే. పేర్లు మాత్రమే వేరువేరు.

తత్ర సప్తవిధేష్వేషు వీరశైవం మహత్తరమ్।

శైవే వీరత్వమాత్రేణ కిం పునర్లింగధారణాత్॥ |104|

ఏదు విధముల శైవమతభేదములలో వీరశైవము మహత్తరమైనది. వీరత్వగుణము చేతనే శైవులు వీరశైవులనబడగా లింగధారణ చేసినవారు వీరశైవులని ప్రత్యేకముగా చెప్పవెలెనా?

శివయోగి మహిమ

యథైవ దర్శనాల్లోకే శిఖరస్య శివాలయే।

నశ్యన్త్యనేకపాపాని శివత్వం జ్ఞానసంభవాత్॥ |105|

తథైవ దర్శనాల్లింగధారిణ: శివయోగిన:।

సద్యో నశ్యన్తి పాపాని తమ: సూర్యోదయే యథా॥ |106|

లోకమున శివాలయ శిఖరదర్శన మాత్రముననే శివత్వజ్ఞానము కలిగి సకల పాపములు ఎట్లు నశించుచున్నవో అట్లే ఇష్టలింగమును ధరించిన శివయోగిని చూసిన మరుక్షణమే సూర్యోదయమున చీకటి వలే పాపములన్నియూ నశించును.

అత ఎవ మహాదేవి గుప్తం మతమిదం కలౌ।

మన్మతజ్ఞానమాత్రేణ ముచ్యేయురపి పాపిన:॥ |107|

హే మహాదేవీ! అందువలననే కలియుగమున ఈ మతము రహస్యముగా ముంచబడినది. నా మతమును గురించి తెలుసుకున్న మాత్రముననే పాపులు ముక్తులగుదురు.

లాభ: శైవమతస్యైకో వీరశైవప్రవర్తనమ్।

భక్తిర్భూతదయా చేతి మత్కైవల్యం చతుర్విధమ్॥ |108|

వీరశైవమతానుయాయులకు కలుగు గొప్ప లాభము లేవనగా (భగవంతునిపై) భక్తి, (జీవులపట్ల) భూతదయ మరియు నాలుగు విధములైన కైవల్యము.

వివరణ: సాధారణముగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యము లన్నవి మోక్ష ప్రకారాలు. అయితే ఇక్కడ శివభక్తి, భూతదయ, శివలింగధారణ, మరియు సర్వ్త్ర శివదర్శనములనునవి కైవల్యభేదాలుగా చెప్పబడినవి.

యది చాస్త్యధికం మత్తస్తదా స్యాన్మన్మతాత్ పరమ్।

యది స్యాన్మత్పరం దేవి మత్‌స్వాతంత్ర్యం కుతస్తదా॥ |109|

ఓ దేవీ! నా కన్నా శ్రేష్టుడైన దైవముండియుండిన నా మతముకన్నా గొప్పదయిన మరియొక మతముండియుండెడిది. ఒకవేళ అటువంటిది ఉండి వుండిన నాకింతటి స్వాతంత్ర్యమెట్లు సాధ్యము?

ఇత్థం తే కథితం దేవి మతభేదమత: పరమ్।

తారతమ్యం ఫలం చాపి కిం భూయ: శ్రోతుమిచ్ఛసి॥ |110|

హే దేవీ! ఈ విధముగా ఉత్తమమయిన మతమును, దాని భేదములను, తారతమ్యములను, వాటి ఫలములను తెలియజేసినాను. దీని తరువాత ఏవి వినదలచినావు?

ఇతి శ్రీపారమేశ్వరతంత్రే శివద్వైతసిద్ధాంతే వీరశైవ దీక్షాప్రకరణే మతభేదనిరూపణం నాప ప్రథమ: పటల: సమాప్త: / ఇట్లు శ్రీ పారమేశ్వరతంత్రమున శివద్వైతసిద్ధాంతమున వీరశైవదీక్షాప్రకరణమున మతభేదనిరూపణమను మొదటి పటలము సమాప్తము.