పారమేశ్వరాగమము

దీక్షావిధినిరూపణము

దేవిప్రశ్న

నమస్తే మేరుకోదండధారిణే ఫణిహారిణే।

వద విశ్వేశ దీక్షాయా విధానం పరమేశ్వర॥1॥

మేరుపర్వతమును కోదండముగా దాల్చినవాడా! సర్పములను హారములుగా ధరించినవాడా! పరమేశ్వరా! నీకు నమస్కారము. హే విశ్వేశ! (నాకు) దీక్షావిధానమును శెలవిమ్ము.

ఈశ్వర ఉవాచ

శృణు వక్ష్యామి దేవేశి దీక్షావిధిమనుత్తమమ్।

యస్య విజ్ఞానమాత్రేణ యోగ్య: స్యాల్లింగధారణే॥2॥

హే దేవేశి! యే విధివిధానము తెలుసుకున్నంత మాత్రముననే లింగధారణకు యోగ్యులగుచున్నారో, అటువంటి ఉత్తమమైన దీక్షావిధిని నీకు తెలిపెదను. సావధానముతో వినుము.

దీక్షావిధికి చేయవలసిన గృహసంస్కారము

ఉపలిస్య గృహం సమ్యగుక్తలక్షణకే దినే।

సుధాదిశోభితం కుర్యాద్ రంగవల్ల్యాద్యలంకృతమ్॥3~॥

వితానతోరణైరుక్తం ధూపదీపవిరాజితమ్।

సన్మంగళసమాయుక్తం యథావిభవవిస్తరమ్॥4॥

యథాశక్తి యథాభక్తి మనోమత్యర్థసంయుతమ్।

కార్యం హి వైభవం దేవి విత్తశాఠ్యం న కారయేత్॥5॥

(పైన జెప్పిన ముహుర్తములలో ఏదో) ఒక శుభదినమున ఇంటిని గోమయాదులతో శుభ్రపరచి, సున్నముతో వెల్లవేసి, రంగవల్లులతో అలంకరించి వారి వారి వైభావానుసారము ఇంటి ముఖద్వారమును తోరణములతో అలంకరించి మంగళకరములైన ధూపదీపాది సామాగ్రిని నుంచుకొని, వారి వారి వైభవముగా జరుపవలెను. ఈ కార్యక్రమనిర్వహణలో ధనవిషయమున లోభమునకు లోనుకారాదు.

వివరణ: ఉక్తలక్షణకే దినే - రెండవ పటలమున శుభముహుర్తములను వివరించు 87-94 శ్లోకములను చూడుడు.

కలశస్థాపనము

యజమాన: సముత్థాయ నిర్వర్త్య ప్రాతరాహ్నికమ్।

మిత్రబాంధవసం యుక్తో మంగళస్నానమాచరేత్॥6॥

యజమాని వేకువనే లేచి ప్రాత:కాలక్రియలను తీర్చుకుని తన బంధుమిత్ర పరివారముతో మంగళస్నానము లాచరించవలెను.

సుశుభే సుసమే దేశే గోమయేనోపలిప్య చ।

రక్తమృత్తికయా తత్ర విలిప్య చతురస్రకమ్॥7॥

బాహుమాత్ర ప్రమాణేన పంచవర్ణైర్విలేఖయేత్।

రంగకైశ్చిత్రకై: పద్మై: సర్వత్ర సమలంకృతే॥8॥

మండలే నూతనం వస్త్రమాచ్ఛాద్య తదుపర్యథ।

పంచప్రస్థప్రమాణేన నిక్షిపేచ్ఛాలితండులాన్~॥9॥

అన్ని విధముల మంగళకరము సమతులము అయిన ప్రదేశమును ఎన్నుకొని గోమయముచే నలికి ఎర్రమట్టితో చతురస్ర మండలమును గీచి దానిపై ఐదు విధములైన రంగులతో రేఖలను గీచి, రంగు, రంగుల పద్మముల వంటి ముగ్గులతో నలంకరించిన మండలము పై భాగమున నూతన వస్త్రమును పరచి దానిపై ఐదు ప్రస్థముల బియ్యమును పరచవలెను.

తదుపర్యమలం కుంభం నిక్షిపేన్నూతనం దృఢమ్।

అనులిప్య సుధాభ్యుక్తమాపూరితజలం శివే~॥10॥

పంచపల్లవసం యుక్తం కుంకుమాద్వైరలంకృతమ్।

అశ్వత్థోదుంబరప్లక్షవటచూతమహీరుహాన్॥11॥

కలశోపరిత: సూత్రం వేష్టయిత్వా యథావిధి।

తదంతర్నవరత్నాని నిక్షిపేధక్తిశక్తిత:॥12॥

సువర్ణం వా యథాశక్తి తత్సర్వం గురవే2ర్పయేత్।

ప్రాణప్రతిష్టాం కుంభస్య కుర్యాన్మూలేన పార్వతి॥13॥

గుణితం పట్టవసనం నిక్షిపేత్ కలశోపరి।

ఆబద్ధకంటహారిద్రమావేష్టితమహాంశుకమ్॥14॥

హే శివే! శుభప్రదమైన దృఢమైన క్రొత్తకలశముయొక్క వెలుపలి భాగమును సున్నముతో పూసి, లోపల నీటితో నింపి బియ్యముపై నుంచవలెను. అశ్వత్థ, ఉదుంబర, ప్లక్ష, వట, మామిడి వంటి అయిదు కొమ్మలచిగుళ్లను కలశము పైనుంచి, దానిని కుంకుమాది మంగళసామాగ్రితో నలంకరించవలెను. కలశ పైభాగమున యథావిథి తెల్లని దారమును చుట్టి, వారి వారి భక్తి శక్తుల ననుసరించి కలశములో బంగారమును గాని నవరత్నములను గాని నుంచవలెను. ఇట్లు అలంకరించిన కలశమును (దీక్షానంతరము) గురువునకు సమర్పించవలెను. పార్వతీ! తరువాత మూల మంత్రముతో కలశమునకు ప్రాణప్రతిష్ఠ చేయవలెను. కలశ పై భాగమున మడతబెట్టిన నొక వస్త్రమునుంచవలెను. దాని కంఠమునకు పసుపు వస్త్రమును చుట్టావలెను. ఆ తరువాత మొత్తము కలశముపై సుందరమైన పట్టువస్త్రమును కప్పవలెను.

కలశ పూజ

సంవేష్ట్య మాలికాభిశ్చ దివ్యధూపై: సుధూపయేత్।

చత్వార ఋత్విజస్తత్ర గురురేకస్తు పంచమ:॥15॥

సమర్చయేయు: కలశం బిల్వపత్రైస్తిలాక్షతై:।

దూర్వాభి: కోమలాగ్రాభిర్ర్దోణైశ్చ కరవీరకై:॥16॥

కలశమును పుష్పమాలలతో నలంకరించి సుగంధ ధూపములతో దివ్యభావనను కలిగించవలెను. నలుగురు ఋత్విక్కులు, గురువు వెరసి ఐదుమంది కలిసి కలశమును బిల్వపత్రములటొను, తిలాక్షతలతోనూ, కోమలములైన దుర్వాది, ద్రోణ దర్బలతోను, కరవీర పుష్పములతోనూ అర్చించవలెను.

పంచాక్షరేణ తారేణ పరాప్రాసాదమంత్రత:।

శక్తిపంచాక్షరేణైవ పంచబ్రహ్మానువాకకై:॥

అర్చయంతి పృథక్ చైతే పంచైతల్లింగమృత్విజ:॥18॥

మూలపంచాక్షరీమంత్రమును, ప్రణవమును, శ్రేష్ఠమైన ప్రసాదపంచాక్షరీ మంత్రమును, శక్తిపంచాక్షరీ మంత్రమును, పంచబ్రహ్మప్రతిపాదకమైన అయిదు అనువాకములను, అయిదు మంతి ఋత్విక్కులు వేరు వేరుగా పఠించుచూ అర్చించవలెను.

వివరణ: తారేణ పంచాక్షరేణ: ఓం కారముతో కూడిన 'నమ: శివాయ ' మంత్రము, రుద్రాధ్యాయమునందలి, ఎనిమిదవ అనువాకములోని 'నమ:శివాయ ' అను మంత్రమే మూలపంచాక్షరీ మంత్రము. ప్రసాద పంచాక్షరీ: ఓం హ్రాం, హ్రీం, హ్రూం, హైం, హ్రౌం, శివాయ ' అనునది ప్రసాద పంచాక్షరీ మంత్రము. దీనికి హ్ర: సం యోజనము చేసిన షడక్షరీ మంత్రమగును. దీనిని కరన్యాస, అంగన్యాస, దేహన్యాసములందు సృష్టి సం హారాది క్రమమున ఈ మంత్రమును వినియోగించవలెను. శక్తి పంచాక్షరీ - 'నమ: శక్తయే ' అనునది శక్తిపంచాక్షరీ మంత్రము. పంచబ్రహ్మానువాకములనగా ఏ మహానారాయణోపనిషత్తు (10.4-8) నందలి ఈ క్రింది మంత్రములు.

1. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమ:।

భవే భవే నాతిభవే భవస్య మాం భవోద్భవాయ నమ:॥

2. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ: శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ:।

కాలాయ నమ: కలవికరణాయ నమో బలాయ నమో బలవికరణాయ నమో బల ప్రమథనాయ నమ: సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమ:।

3. అఘోరేభ్యో2థ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య:।

సర్వేభ్య: శర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య:॥

4. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।

తన్నో రుద్ర: ప్రచోదయాత్॥

5. ఈశాన: సర్వవిద్యానాం ఈశ్వర: సర్వభూతానామ్।

బ్రహ్మాధిపతిర్బ్రహ్మణో2ధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥

ధ్యాత్వా22వాహ్య మహాదేవం కలశోపరి పూజయేత్।

మామనాద్యంతమీశానముమయా సహితం శివమ్॥18॥

చతుర్భుజం చంద్రకలావతంసం వరాభయైణోరుకుఠారపాణిమ్।

వామాంకసంశోభితశైలకన్యం భజేన్మహేశం పరమాత్మరూపమ్॥19॥

ఆద్యంతరహితుడు, మహాదేవుడు, ఈశానుడు, ఉమాసహితుడు, శివుడు అయిన నన్ను ధ్యానించి (చెప్పబోవు శ్లోకముతో) కలశమునందావాహనము జేసి పూజించవలెను.

ధ్యానశ్లోకము: వర-అభయ-మృగ-కుఠారములను తన నాలుగు హస్తముల యందు ధరించిన వానిని, చంద్రరేఖను తలపై ధరించిన వానిని, తన వామార్థ భాగమున పార్వతీదేవితో శోభిల్లు వానిని, పరమాత్మరూపుడైన మహేశును నేను సమస్కరించుచున్నాను.

అథ సంపూజ్య విధివత్ షోడశైరుపచారకై:।

యస్య స్మృత్యాదికర్మాంతే సమాప్య కలశార్చనమ్॥20॥

ఉపస్థానం ప్రకర్తవ్యం ఋత్విగ్భిరపిపచవభి:

శ్రీరుద్రస్యానువాకేన మూలేన మ్నునా శివే॥21॥

కలశమును విధియుక్తముగ షోడశోపచారములతో పూజించి "యస్య స్మృత్యా చ నామోక్త్యా" అను మంత్రముతో కలశపూజ ముగించి, ఐదు మంది ఋత్విక్కులచేత శ్రీ రుద్రానువాకముతో గాని మూలమంత్రముతో గాని 'ఉపస్థానము" చేయించవలెను.

వివరణ: ఉపస్థానమ్: సూర్యునికి లేదా అగ్నికి అభిముఖముగా నిలబడి చేయు మంత్రపఠనము. ఇక్కడ కలశమున కభిముఖముగా నిలబడి చేయు మత్రపఠనము 'కలశోపస్థాన ' మనబడినది.

ఎవం దినత్రయం కుర్యాత్ ప్రత్యహం కలశార్చనమ్।

షడ్రసైరన్నపానాధై ర్భోజయేల్లింగధారిణ:॥22॥

ఈ ప్రకారముగా మూడు దినములు ప్రతి నిత్యమూ కలశార్చన చేయవలెను. షడ్రసోపేతమైన అన్నపానాదులతో లింగధారులను భుజింప చేయవలెను.

ఆబద్ధకంకణో దేవి నియతో నియతేంద్రియ:।

ఎకాహారో భవేన్నిత్యం యజమాన: పయోవ్రతీ॥23॥

హే దేవీ! యజమాని ఈ సందర్భమున కంకణమును ధరించి, ఇంద్రియనిగ్రహమును గలిగి, దినమున ఒక్కసారి మాత్రమే ఆహారమును స్వీకరించుచు కేవలము నీటిని మాత్రమే సేవించు 'పయోవ్రతము ' ననుష్ఠించవలెను.

వివరణ: ఇక్కడ ఒకే కలశస్థాపనము వివరించబడినది. అయితే కారణాగమము (క్రియాపాదము 1.46-48) శివదీక్షాసమయమున పంచకలశస్థాపనము చేయవలెననియు , గురువుతో పాటు నలుగురు ఋత్విక్కులు ఒక్కొక్కరు ఒక్కొక్క కలశమునకు ఆయా మంత్రములతో అవాహనాదులను చేసి పూజించవలెననియు తెలుపుచున్నది.

దీక్షయందు లింగసంస్కారము

అథ తద్దక్షిణే భాగే కుంభస్థాపనదేశత:।

వితానాదిసమోపేతే సుకృతే వేదికోపరి॥24॥

నిక్షిప్య పీఠమమలం మూలమంత్రేణ తద్గురు:।

సద్యోజాతేన తదుపర్యాచ్చాద్యాంశుకముత్తమమ్॥25॥

వామదేవేన తదుపర్యేతల్లింగం వినిక్షిపేత్।

అఘోరేణాథ లింగస్య సజ్జికాయా గుణస్య చ॥26॥

తత్పురుషస్యానువాకేన ఈశానస్యానువాకత:।

క్రమేణ కుర్యాత్ తత్ప్రాణప్రతిష్ఠాం గురురాదరాత్॥27॥

పూర్వోక్తమేవం ధ్యాయేత లింగరూపాం తనుం మమ।

ఆవాహనాది కుర్వీత గురు:ఋత్విక్సమన్విత:॥28॥

ఆ తరువాత కలశస్థాపన ప్రదేశమునకు కుడివైపున చిన్న మండపముతో చక్కగా నిర్మించిన వేదికపై మూలమంత్రముతో పరిశుభ్రమైన పీఠమును, సద్యోజాత మంత్రముతో దానిపై ఉత్తమమైన ఉత్తరీయమును, 'వామదేవ' మంత్రముతో ఆ వస్త్రముపై (దీక్షాప్రదానము చేయవలసిన) లింగమునుంచవలెను. 'అఘోర',  'తత్పురుష',  'ఈశాన' అనువాకములతో వరుసగా లింగమునకు, సజ్జికకు, శివదారమునకు ఆదరముతో ప్రాణప్రతిష్ఠ చేయవలెను. లింగరూపమునందున్న నన్ను ఇంతకుముందు చెప్పినట్లు (19వ శ్లోకమున) ధ్యానించుచూ ఋత్విక్కులతో కలిసి గురువు ఆవాహనాది కార్యములను నిర్వహించవలెను.

లింగార్చనము

మూలేనావాహనం కుర్యాదాసనం శంభవే నమ:।

పాద్యమీశాయ దేవాయ దద్యాదర్ఘ్యం శివాయ చ॥29॥

దద్యాదాచమనం స్నానం మహాదేవాయ తే నమ:।

పంచామృతస్నానమథ కుర్యాత్ పంచానువాకకై:॥30॥

మూలమంత్రముతో లింగమునకు ఆవాహనము చేసి 'శంభవేనమ: ' అను మంత్రముతో ఆసనమును, 'ఈశాయ దేవాయ నమ: ' అను మంత్రముతో పాద్యమును, 'శివాయ నమ: ' అను మంత్రముతో అర్ఘ్యమును ప్రదానము చేయవలెను. 'మహాదేవాయ తే నమ: ' అను మంత్రముతో ఆచమనమును చేసి స్నానమును చేయించవలెను. ఆ తరువాత పంచబ్రహ్మానువాకములతో పంచామృతస్నానమును చేయించవలెను.

ఆపో హిష్ఠేతి శుద్దోదస్నానంలింగాయ కారయేత్।

దద్యాత్ కపర్దినే వస్త్రముత్తరీయం త్రిశూలినే॥31॥

'ఆపో హి ష్ఠా ' మంత్రముతో ఇష్టలింగమునకు శుద్ధోదకస్నానమును, 'కపర్దినే నమ: ' మంత్రముతో వస్త్రమును, 'త్రిశూలినే నమ: ' మంత్రముతో ఉత్తరీయమును సమర్పించవలెను.

యజ్ఞసూత్రం తతో దద్యాన్నమ: పశుపతయే శివే।

గంధం కామాంతకాయేతి చాక్షతాన్ మృత్యుఘాతినే॥32॥

శివే! 'పశుపతయే నమ: ' మంత్రముతో యజ్ఞోపవీతమును 'కామాంతకాయ నమ: ' మంత్రముతో గంధమును, 'మృత్యుఘాతినే నమ: ' మంత్రముతో అక్షతలను సమర్పించవలెను.

పుష్పం వృషద్వజాయేతి సమర్ప్యాంగాని పూజయేత్।

శివాయ పాదౌ గురవే గుల్ఫౌ జంఘే మృడాయ చ॥33॥

జానునీ శంకరాయేతి నమ ఊరూ భవాయ చ।

కటిం పినాకహస్తాయ నాభిం మేరుధనుర్భృతే॥34॥

ఉదరం విశ్వరూపాయ విరూపాక్షాయ చ స్తనౌ।

హృదయం పార్వతీశాయ వక్ష: కైలాసవాసినే॥35॥

కంఠం తు నీలకంఠాయ స్కంధౌ స్కందసుతాయ తే।

అనంతబాహవే బాహూన్ హస్తాన్ హస్తిత్వచే నమ:॥36॥

అంగులీరంగజహృతే కక్షం పంచముఖాయ తే।

కర్ణౌ దిక్కర్ణినే దేవి నాసికాం సర్వగంధినే॥37॥

వక్త్రం తు సర్వవక్త్రాయ నేత్రాణి త్రిదృశే నమః।

భృవౌ భూభారభంగాయ లలాట మలికాక్షిణే॥38॥

శిరః సర్వోత్తమాయేతి సర్వాంగం శశిమౌలినే।

పూజయిత్వా2ఖిలాంగాని మహాపూజామథాచరేత్॥39॥

'వృషధ్వజాయనమః' అను మంత్రముతో పుష్పములను సమర్పించి (ఇష్టలింగము యొక్క) అంగములను పూజించవలెను. 'శివాయనమః' అని పాదములను, 'గురవేనమః' అని గుల్ఫములను, 'మృడాయనమః' అని జంఘములను, 'శంకరాయనమః' అని మోకాళ్ళను, 'భవాయనమః' అని తొడలను, 'పినాకహస్తాయనమః' అని నడుమును, 'మేరుధనుర్భృతే నమః' అని నాభిని, 'విశ్వరూపాయ నమః' అని ఉదరమును, 'విరూపాక్షాయ నమః' అని స్తనములను, 'పార్వతీశాయ నమః' అని హృదయమును, 'కైలసవాసినే నమః' అని వక్షస్థలమును, 'నీలకంఠాయనమః' అని కంఠమును, 'స్కందసుతాయ నమః' అని భుజములను, 'అనంతబాహవే నమః' అని బాహువులను 'హస్తిత్వచే నమః' అని హస్తములను, 'అంగజహృతే నమః' అని వ్రేళ్ళను, 'పంచముఖాయ నమః' అని కక్షములను, 'దిక్కర్ణినే నమః' అని చెవులను 'సర్వగంధినే నమః' అని నాసికను, 'సర్వవక్త్రాయ నమః' అని ముఖమును, 'త్రిదృశేనమః' అని కన్నులను, 'భూభారభంగాయనమః' అని కనుబొమ్మలను, 'అలికాక్షిణే నమః' అని లలాటమును, 'సర్వోత్తమాయ నమః' అని శిరస్సును, 'శశిమాలినే నమః' అని సర్వాంగములను పూజించవలెను (ఈ విధముగా) సర్వాంగ పూజ చేసిన తరువాత మహాపూజను ప్రారంభించవలెను.

సహస్రనామభిర్దేవి రుద్రసూక్తోక్తనామభిః।

మూలమంత్రేణ చాన్యైర్వా స్త్రోత్రమంత్రైః సమర్చయేత్॥40॥

శివసహస్ర నామములతో గాని, రుద్రసూక్తమునందలి నామములతో గాని, మూలమంత్రములతో గాని లేదా అభిష్ఠమైన మరి యే ఇతర స్త్రోత్రమంత్రములతో గాని (ఇష్టలింగమును) పూజించవలెను.

పూజోపయోగములైన పుష్పములు

పంచ పుష్పాణి పూజాయామవశ్యం విధినార్చయేత్।

ద్రోణం చ బిల్వపత్రం చ నిత్యం నిత్యార్చనే శివే॥41॥

శివే! లింగపూజయందు అయిదు విధములైన పుష్పములను తప్పనిసరిగా విధియుక్తముగా అర్పించవలెను. తుమ్మిపూలను, బిల్వపత్రములను నిత్యార్చనలో తప్పక ఉపయోగించవలెను.

వివరణ: ఐదు విధముల పూవులు ముందురాబోవు 47 వ శ్లోకములో వివరించబడును.

తిలాక్షతైస్తండులైర్వా నిత్య పూజాం సమాచరేత్।

యాన్యన్యాని సుగంధీని వన్యాని గ్రామజాని వా॥42॥

తిలమిశ్రితములైన అక్షతలతో గాని, వట్టి అక్షతలతో గాని నిత్యపూజను చేయవచ్చును (వీటితో పాటు) వనమున గాని, గ్రామమున గాని లభించు సుగంధయుతములైన ఇతర పుష్పములను కూడా ఉపయోగించవచ్చును.

సర్వం స్యాన్మమ పూజాయాం పుష్పం పల్లవపత్రకమ్।

గ్రామ్యం వా వనజం వాపి సర్వం స్యాత్ కేతకీం వినా॥43॥

ఒక్క కేతకీ పుష్పము తప్ప అడవులలో లేదా గ్రామములో లభించు అన్ని విధములైన పూవులను, పత్రములను, పల్లవములను నా పూజకు వినియోగించదగును.

పద్మైరపామార్గకైశ్చ కల్హారైశ్చ కదంబకైః।

చంపకైర్జాతికుసుమైర్మల్లికావనసంభవైః॥44॥

ఉత్పలైః కరవీరైశ్చ శేవంతీపాటలీముఖైః।

చూతపున్నాగబకులమరుగైర్దవనాదిభిః॥45॥

కుటజైర్వా కురుబకైః కుందకేసరనాగకైః।

ఇత్యాద్యుక్తైరనుక్తైర్వా మమ లింగం సుపూజయేత్॥46॥

తామరులు, ఉత్తరేణిపూవులు, ఎర్రకలువలు, కదంబములు, సంపంగి, జాజిపూవులు, అడవిమల్లెలు, నల్లకువలు, గన్నేరుపూవులు, చేమంతి, పాటలీ, చూత, పున్నాగ, వకుళ, మరువ, దవన కుటజ (కొండమల్లె), కురుబక(ముళ్ళగోరంటు), కుంద(మల్లె), కేసర, నాగకేసర వంటి పుష్పములు, ఇక్కడ చెప్పిన చెప్పని ఇతర పుష్పములతో కూడా లింగమును చక్కగా పూజించదగును.

దూర్వాభిస్తులసీబిల్వైః కరవీరైశ్చ కోమలైః।

ద్రోణైశ్చ పంచభర్నిత్యం మమ లింగం సమర్చయేత్॥47॥

కోమలమైన గరిక, తులసీ, బిల్వపత్రములు, కరవీర, ద్రోణ (తుమ్మి) వంటి అయిదు వస్తువులతో నిత్యలింగార్చన చేయవలెను.

మోక్షార్థీ బిల్వజైః పత్రైరర్చయేచ్చ తిలాక్షతైః।

ధర్మార్థీ ద్రోణకుసుమైరర్థర్థీ కరవీరజైః॥48॥

ధత్తూరైరర్కకుసుమైరపామార్గైర్మనోరథీ।

తులసీ శత్రునాశాయ జాతిర్వశ్యాయ యోషితామ్॥49॥

అర్కపుష్పం రాజవశ్యం నృవశ్యం కమలార్చనమ్।

మల్లికాభిర్జయార్థీ చేద్దూర్వాభిః కీర్తికామన:॥50॥

ఆరోగ్యకామ్యుత్పలజైః పుత్రకామీ కురుంటకైః।

పున్నాగైః పశుకామీ చేత్ సర్వార్థీ సర్వసంభవైః॥51॥

మోక్షమును కోరువాడు (లింగార్చనకు) బిల్వపత్రములను గాని తిలాక్షతలను గాని ఉపయోగించవలెను. ధర్మార్థి అయినవాడు తుమ్మిపూలను, ధనార్థి అయినవాడు గన్నేరు పుష్పములను, మనోవాంఛాసిద్ధికి ధుత్తూర, అర్క (జిల్లేడు), అపామార్గ (ఉత్తరేణి) పుష్పములను, శత్రునాశనమునకు తులసీ దళములను, స్త్రీ వశమునకు జాతి పూవులను, రాజానుగ్రహమునకు అర్క (జిల్లేడు) పుష్పములను, వ్యక్తివశీకరణను గోరువాడు కమలములను, జయమునకు మల్లికలను, కీర్తికి గరికెను, ఆరోగ్యమునకు నల్లకలువలను, సంతానమునకు కురుంటక (ముళ్ళగోరంటు) పుష్పములను, పశుసంపదకు పున్నాగ (పొన్న) లను అనేక విధములైన కోరికల సాధనకు నానారకములయిన పుష్పములను ఉపయోగించవచ్చును. ఇట్లు ఆయా కోరికలను కోరువాడు ఆయా పత్ర పుష్పాదులను ఇష్టలింగపూజకు ఉపయోగించవలెను.

లింగార్చన క్రమము

ఎవం సంపూజ్య విశ్వేశి ప్రత్యహం తు దినత్రయమ్।

తథాష్టాంగయుతం ధూపం గంధావగ్రహకారిణే॥52॥

కర్పూరాదిసుదీపాంశ్చ సోమసూర్యాగ్నిచక్షుషే।

నైవేద్యం షడ్రసోపేతం యద్యద్ యోగ్యం మమాదరాత్॥53॥

అన్నానాం పతయే తుభ్యమితి మంత్రేణ నిర్మలమ్।

తత్సర్వమర్పయేద్దేవి లింగరూపే మయి ప్రియే॥54॥

హే విశ్వేశ్వరీ! ఈ విధముగా ప్రతినిత్యమూ మూడురోజులపాటు చక్కగా పూజించి, తరువాత 'గంధవగ్రహకారిణే నమః' అను మంత్రముతో అష్టాంగయుక్త ధూపమును 'సోమసూర్యాగ్ని చక్షుషే నమః' అను మంత్రముతో కర్పూర హారతిని చూపవలెను. హే దేవి! 'అన్నానాం పతయే తుభ్యం నమః' అను మంత్రముతో నాకు అభీష్టము, నిర్మలము అయిన ద్రవ్యములతో సిద్దముచేసిన షడ్రసోపేతమైన నైవేద్యములను అత్యంత ఆదరముతో ఇష్టలింగ రూపమునందున్న నాకు సమర్పించవలెను.

తాంబూలం చ సకర్పూరం రసజ్ఞాయేతి మంత్రతః।

ఘృతాక్తవర్తిసంయుక్తం నీరాజనమథాచరేత్॥55॥

'రసజ్ఞాయనమః' మత్రముతో కర్పూర మిశ్రితమయిన తాంబూలమును సమర్పించి, నేతిలో తడిపిన వత్తిగల దీపముతో నీరాజనమును ఇవ్వవలెను.

మంత్రపుష్పం తతో దద్యాత్ త్ర్యంబకేతి సుమంత్రతః।

ప్రదక్షిణాం నమస్కారాన్ కృత్వా స్తోత్రైః స్తువేదథ॥56॥

త్య్రంబకం యజామహే అను మంత్రముతో మంత్రపుష్పాంజలిని ఘటించి, ప్రదక్షిణలతో నమస్కరించి స్తోత్రములతో నన్ను స్తుతించవలెను.

క్షమాపనం ప్రార్థానాం చ యస్య స్మృత్యా క్షమాపయేత్।

రాత్రౌ జాగారణం కుర్యాన్మమ లింగస్య సన్నిధౌ॥57॥

ప్రార్థనానంతరము 'యస్య స్మృత్యా చ నామోక్త్యా' అను మంత్రముతో క్షమాపణ కోరవలెను. నా ఇష్టలింగ సన్నిధిలో రాత్రి యందు జాగరణము చేయవలెను.

లింగేన సహ కుర్వీత సజ్జికాయా గుణస్య చ।

ప్రాణస్థాపనమారభ్య యథా లింగస్య తత్తథా॥58॥

సజ్జికా (కరడిక) శివదారముల సంస్కారము

ఇష్టలింగమునకు చేసినట్లుగానే లింగముతోపాటు సజ్జికకు, శివదారమునకు ప్రాణప్రతిష్తాదులు అదే క్రమమున ఆచరించవలెను.

యది తన్తుపటోత్పన్నౌ న చైవం సజ్జికాగుణౌ।

యది లోహమయీ సజ్జా యది వా తాదృశో గుణః॥59॥

లింగేన సహ సంస్కారం కుర్యాదేవమతంద్రితః।

శైథిల్యే సజ్జికాదేస్తు సంస్కృత్య పునరన్యతః॥60॥

ఒకవేళ సజ్జికాశివసూత్రములు దారముతో గాని, గుడ్డతో గాని చేసిన వయినచో ఇష్టలింగమునకు వలె ప్రాణప్రతిష్ఠాదులు చేయరాదు. లోహముతో చేయబడిన సజికా, సూత్రములకు మాత్రమే తప్పనిసరిగ ఈ సంస్కారములను చేయవలెను. సజ్జికాదులు శిథిలమయిన, కొత్త వాటిని తీసుకొని సంస్కరించవలెను.

అష్టబంథే విశీర్ణే తు పునర్బంధం చ కారయేత్।

యది మోహాత్త్యజేద్దేహం స చాండాలో భవిష్యతి॥61॥

ఒకవేళ అష్టబంధనము చిద్రమయినచో విధియుక్తముగా మరలా బంధమును చేయించుకొనవలెను. మోహముతో అట్లు చేయనివాడు దేహత్యాగానంతరము చాండాలుడుగా జన్మించును.

యన్నష్టం తత్ప్రకుర్వీత యథాశాస్త్రం గురోర్వచః।

న తిష్ఠోన్నియమేనాసౌ లింగసంపూజనాదృతే॥62॥

(సజ్జికా శివసూత్రాదులలో) నష్టమయిన దానిని శాస్త్రయుక్తముగా సంస్కరించి ధరించవలెను. ఇదే గురువుల సందేశము కూడా. ఇష్టలింగార్చన చేయకుండా ఎవ్వరూ ఉండరాదు.

దీక్షితుని నియమపాలనము

నాన్యధర్మో భవేధర్మో న ధర్మో2ధర్మ ఎవచ।

నాన్యధర్మైర్న పాషండైర్న దుర్వృత్తైర్న లోలుపైః॥63॥

న ధూర్తైర్నాగురోర్భక్తైర్నాభక్తైర్నానృతోక్తిభిః।

న మతద్వేషిభిర్మూర్థైర్నానాచారరతైరపి॥64॥

న శఠైర్నార్థలుబ్దైశ్చ నాగురూక్తార్థకారిభిః।

న స్త్రీషులోలుపైర్జారైర్న చోరరాత్మకారిభిః॥65॥

నదూషకైర్హింసకైర్వా నానర్హైశ్చ క్వచిత్ ప్రియే।

సహోపవేశయేద్భా షేదశ్నీయాత్ సంగమాచరేత్॥66॥

స్వపేద్గచ్ఛేదుపశ్లోక్యేన్నాభిలోకేన్నాభివాదయేత్।

యది శక్తస్తదా లింగం శివయోగీ సమర్చయేత్॥67॥

ఇతరుల ధర్మం (మన) ధర్మము కాదు. మన ధర్మము ఎప్పుడూ అధర్మము కాదు. అన్యధర్మముల ననుసరించువారలతోను, పాషండుల, దురాచారుల, ఇంద్రియ సుఖలాలసుల, మోసకారుల, గురుభక్తులు కాని వారల, భక్తిహీనుల, వంచకుల, పిసినారుల, గురువాజ్ఞను పాలించని వారల, స్త్రీలను చెడుభావముతో చూచువారల, చోరుల, అహంకారుల, ఇతరులను దూషించువారల, హింసించువారల, అయోగ్యులయినవారలతో ఎప్పుడునూ కలిసి కూర్చొనరాదు. కలిసి మాట్లాడరాదు. కలిసి భుజించరాదు. మైత్రి చేయరాదు. నిదురించరాదు. తిరుగరాదు. అటువంటి వారిని పొగడరాదు. చూడరాదు. నమస్కరించరాదు. గనుక శివయోగి (వీరినందరినీ పరిత్యజించి) చేతనయినచో ఇష్టలింగార్చనారతుదు కావలెను.

పుణ్యకాలేషు యోగేషు విశేషేణ సమర్చయేత్।

సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రితయే దినే॥68॥

నవమ్యాం చ చతుర్దశ్యాం సితాయాం సోమవాసరే।

యథాశక్త్యర్చయేల్లింగం పౌర్ణమాస్యాం విశేషతః॥69॥

పుణ్యకాలములందు, శుభయోగములందు ఇష్టలింగమునకు విశేష పూజలు చేయవలెను. సంక్రాంతి సమయమున, విషువ కాలమున మరియు ముగ్గురి జన్మదినములందు (తన జన్మదినమందు, దీక్షాదినము, గురువుయొక్క జన్మదినము), నవమినాడు, శుక్లచతుర్దశినాడు, సోమవారమునాడు, పౌర్ణమినాడు, వారి వారి శక్త్యనుసారము ఇష్టలింగమును విశేషముగా పూజించవలెను.

వివరణ: సూర్యుడు తులారాశిలో నుండి మేషరాశిలోనికి ప్రవేశించు సమయము సంక్రాంతి. పగలు - రేయి రెండు సమానముగానుండు కాలము విషువ కాలము. తులా మరియు మేష సంక్రాంతులందు విషువకాలము వచ్చును.

అర్ధోదయాదియోగేషు గ్రహణే చంద్రసూర్యయోః।

వ్యతీపాతే కుహూయోగే ప్రదోషే చ విశేషతః॥70॥

అర్ధోదయాది యోగములందు, చంద్రగ్రహణ సూర్యగ్రహణ సమయములందు, వ్యతీపాతములందు, కుహూయోగములందు, సంధ్యాసమయములందు శివలింగపూజను అవశ్యము చేయవలెను.

వివరణ: వ్యతీపాత: ఉత్పాతము లేదా నైసర్గిక అపఘాతము; కుహూ -అమావాస్య; ప్రదోష-రాత్రి యొక్క ఆరంభకాలము.

ప్రతిత్రయోదశీరాత్రౌ శనియోగే విశేషత:।

కృష్ణభౌమచతుర్దశ్యాం గురుణాం చ మృతే2హని॥71॥

పిత్రోః సిద్ధింగతదినే విశేషణే సమర్చయేత్।

శుక్లభౌమచతుర్థ్యాం తు కృష్ణాష్టమ్యాం విశేషతః॥

నృత్యవాదిత్రగీతాద్యైర్యథావిభవవిస్తరమ్॥72॥

ప్రతిత్రయోదశీనాటి రాత్రి, విశేషముగా శనివారమునాడు వచ్చు త్రయోదశిరోజున, కృష్ణపక్షమున చతుర్దశీ మంగళవారము కలిసినరోజున గురువులు లింగైక్యమయిన రోజున, మాతాపితరులు లింగైక్యమయిన దినములందు, విశేషముగా శివార్చనచేయవలెను. శుక్లపక్షమున చతుర్థీతిథి మంగళవారము కలిసినరోజున, కృష్ణాష్టమినాడు, ప్రత్యేకముగా వారి వారి వైభవానుసారము నృత్య - వాద్య - గీతాదులతో ఇష్టలింగమునకు విశేషపూజలు చేయవలెను.

ఘంటానాద మహిమ

దరిద్రః కరతాలైర్వా ఘంటానాదేన చార్చయేత్।

కోటయో బ్రహ్మహత్యానామగమ్యాగమకోటయః॥73॥

శ్రవణేనైవ ఘంటాయా నాదస్యాయాంతి సంక్షయమ్।

శ్రూయతే హి జనైర్యావద్ ఘంటానాదః సమంతతః॥74॥

తావత్పాపాని రక్షాంసి శక్తాః స్థాతుం నహి క్షణమ్।

తస్మాత్ ప్రయత్నతో దేవి ఘంటానాదం సుసాధయేత్॥75॥

దరిద్రుడైన శివయోగి కరతాళములతో గాని ఘంటానాదముతో గాని అర్చించవలెను. కోట్లాది బ్రహ్మహత్యలవల్ల కలుగు పాపములు మరియు రాబోవు జన్మలందు కలుగు కోట్లాది పాపములు ఘంటానాదమును వినినంతనే తొలగి పోవును. ఘంటానాదము వినిపించు ప్రదేశములలో మానవుల పాపములు గాని రాక్షసాది దుష్టశక్తులు గాని ఒక్క క్షణము కూడా నిలబడలేవు. అందువలన హేదేవి! ప్రయత్నపూర్వకముగా ఘంటానాదమును తప్పక చేయవలెను.

తథైవ యత్నతో దేవి తాడయేజ్జయఘంటికామ్।

తదభావే2పి యత్నేన కాంశ్యనాదం సమాచరేత్॥76॥

అదేవిధముగా దేవీ! ప్రయత్నపూర్వకముగా జయఘంటను (జాగిలు) మ్రోగించవలెను. అదిలేనియెడల కంచుతాళములతోనైనా శబ్దమును చేయవలెను.

కుర్వీత కహలానాదం మమ లింగార్చనోత్సవే।

లింగధారీ విశేషేణ శంఖనాదేన పూజయేత్॥77॥

సర్వాభావే2పి యత్నేన యతః శంఖో మమ ప్రియః।

దీపాన్ ప్రజ్వాలయేద్దేవి మమ లింగస్య సన్నిదౌ॥78॥

నా లింగార్చనోత్సవములలో కహలా (డోలు) నాదము చేయవలెను. లింగధారి, విశేషముగా ప్రయత్నపూర్వకముగా శంఖానాదముతో నన్ను పూజించవలెను. ఎందువలననగా శంఖము నా కత్యంత ప్రియమైనది. దేవీ! నా లింగము యొక్క సన్నిధానమున దీపములను వెలిగించవలెను.

అభిషేకః ప్రకర్తవ్యో యథాశక్త్యమలోదకైః।

చులుకోదకమారభ్య యావచ్చక్త్యభిషేచనే॥79॥

అతి త్వరలో అందజేయబడును

అతి త్వరలో అందజేయబడును