రెండవ పటలమున లింగలక్షణము, లింగభేదములు, ఇష్టలింగార్చకుల శ్రేష్టత్వము, సజ్జికాశివసూత్రముల లక్షణములు, వాటి కలయికల పరమార్థము, దీక్షకై గురువు నాశ్రయించుట, గురువు మరియు శిష్యునిలక్షణములు, శిష్యుని ధర్మములు, దీక్షాక్రమము, లింగధారి నియమాలు వివరించబడినాయి.

లింగసజ్జికాది లక్షణము

దేవ్యువాచ / దేవి ప్రశ్న

త్రియంబక నమస్తే2స్తు త్రిపురఘ్న యమాన్తక।

వద మే కరుణాసింధో లింగధారణలక్షణమ్॥ |1|

దీక్షాది క్రమశ: సర్వం సజ్జికాదిగుణాదికమ్।

శివాగ్నిజననం చాపి సర్వం విస్తరత: ప్రభో॥ |2|

ఓ ముక్కంటీ! త్రిపురారీ! మృత్యునాశకా! కరుణాసాగరా! నీకు నమస్సులు. నాకు మీ ఇష్టలింగధారణలక్షణమును, దీక్షావిధులను, సజ్జికా (లింగమునుంచుటకుపయోగించు పేటిక), గుణ (శివదారము) లక్షణములను, శివాగ్ని నుత్పన్నముచేయు పద్దతిని విపులముగా వివరించుము.

ఈశ్వర ఉవాచ

శృణు దేవి ప్రవక్ష్యామి లింగానాల్ భేదమాదిత:।

దీక్షాయా: సజ్జికాదేశ్చ సర్వం నిగదతో మమ॥ |3|

ఓ దేవీ! ముందుగా నాచే చెప్పబడు లింగములందలి భేదములను దీక్షావిధిని, సజ్జికాది విషయములను వినుము.

లింగలక్షణము, భేదములు

మమ లింగమిదం సర్వం జగత్ స్థావరజంగమమ్

మమ లింగమిదం విద్ధి పాషాణాదివినిర్మితమ్॥ |4|

ఈ స్థావర జంగమమయిన జత్తంతయూ శివలింగ స్వరూపమే. పాషాణాదులచే నిర్మిపబడిన ఈ లింగమును నా స్వరూపముగా తెలిసికొనుము.

నాదేయం శైలసంభూతం పుణ్యక్షేత్రసముద్భవమ్।

గంగోద్భవం సాగరజం లింగం తన్మమ సమ్మతమ్॥ |5|

నదులందు పర్వతములందు ఉద్భవించిన, పుణ్యక్షేత్రములందు వెలసిన గంగానదియందు, సముద్రమునందు ప్రకటమయిన లింగములు నాకత్యంత ప్రీతిపాత్రములు.

వివరణ: నాదేయం - నర్మదాది నదులందు వెలసినట్టిది. నర్మదానదిలోని బాణశిలలు లింగ నిర్మాణమునకు ప్రశస్తములని ప్రసిద్ధి.

యద్దేవి శివనాభాఖ్యం లింగం తత్పరముత్తమమ్।

యద్దేయతే హి గురుణా లింగం సర్వోత్తమోత్తమమ్॥ |6|

ఓదేవీ! వీటిలో శివనాభమని పిలువబడు లింగము ఉత్తమమైనది. దీక్షా విధానముతో గురువుచేత ఇవ్వబడిన లింగము ఉత్తమోత్తమము.

కామ్యాన్యన్యాని లింగాని తత్తదిష్టార్థదాని హి।

సౌవర్ణపారదాదీని స్థూలం స్థూలం ప్రశస్యతే॥ |7|

సాధకులు అభీష్టఫలముల ప్రసాదించెడి అనేకరకములైన కామ్య లింగములు కూడా వున్నవి. పసిమి పాదరసాదుల చేత తయారుచేయబడిన లింగములు పరిమాణమున ఎంత పెద్దవో ఫలప్రదానమున అంతటి శ్రేష్ఠము.

క్రముకాకృతిమారభ్య మావదిచ్ఛాస్తి ధారణే।

ఉత్తరాదుత్తరం శ్రేష్ఠం మమ లింగం మహేశ్వరి॥ |8|

మహేశ్వరీ! వక్కాకారమంతటి పరిమాణము నుంది ధరించువాని అభీష్టమున కవసరమయినంత పరిమాణములతో నా లింగములు నిర్మించవచ్చును. వాని పరిమాణము పెరిగినకొలదీ శ్రేష్ఠత అధికమగును.

పారదం సర్వకామాయ సౌవర్ణం విత్తకామిన:।

రాజతం తు ప్రజాకామి తామ్రం శత్రువినాశనమ్॥ |9|

త్రపుజం రోగనాశాయ సీసకం పాపనాశనమ్।

స్ఫాటికం జ్ఞానదం పుణ్యం రుద్రాక్షం మోక్షదాయకమ్॥ |10|

దారుజం సర్వనాశాయ కాంస్యం రోగార్తిదాయకమ్।

శ్రీశైలజం మహాదేవి హ్యైహికాముష్మికప్రదమ్॥ |11|

పాదరసలింగము సర్వేచ్ఛసిద్ధిని బంగారులింగము ధనప్రాప్తిని, వెండి లింగము సంతాన ప్రాప్తిని, రాగిలింగము శతృనాశనమును, త్రపు(తుత్తునాగ) లింగము రోగనాశనమును, సీసలింగము పాపనాశనమును, స్ఫటికలింగము జ్ఞానమును పుణ్యమును, రుద్రాక్షలింగము మోక్షమును, దారులింగము సర్వనాశనమును, కాంస్యలింగము రోగభయమును కలుగజేయును. శ్రీశైలపర్వత శిలలతో చేయబడిన లింగము ఐహిక-ఆముష్మిక సుఖములను సిద్ధింప జేయును.

సర్వోత్తమోత్తమం లింగం సర్వాభీష్టార్థదాయకమ్।

యద్దత్తం గురుణాదేవి లింగం తదహమేవ హి॥ |12|

(ఈ లింగములలో) సర్వాభీష్టప్రదాయకము, సర్వోత్తమము అయినది గురువు ద్వారా పొందినట్టి ఇష్టలింగము. అటువంటి లింగమును సాక్షాత్తు నేనే అయియున్నాను.

బదరీఫలమానం తు కృతం ధర్మాభివృద్ధిదమ్।

క్రముకీఫలమానం తు ధర్తు: సర్వార్థదాయకమ్॥ |13|

జంబీరఫలమానం తు సర్వకామార్థదాయకమ్।

తతో2ధికం ప్రియం యావచ్చతుర్వర్గఫలప్రదమ్॥ |14|

రేగుఫలపరిమాణమంతటి ఇష్టలింగను ధరించిన వానికి ధార్మికబుద్ధి కలుగును. వక్కకాయ పరిమాణమంతటి ఇష్టలింగము సర్వార్థములను ప్రసాదించును. నిమ్మకాయ పరిమాణమునగల లింగము సమస్త కోరికలను సిద్ధింపచేయును. అంతకన్నా బృహత్ పరిమాణముగల లింగము ధర్మార్థకామమోక్ష రూపమైన చతుర్వర్గఫలమును సిద్ధింపజేయును.

న ప్రమాణం తదన్తస్య శివనాభస్య పార్వతి।

యద్దత్తం గురుణా తస్య సర్వలక్షణలక్షితమ్॥ |15|

పార్వతీ! 'శివనాభ 'మను లింగమునకు పరిమాణ పరిమితి లేదు. గురువుచే ఇవ్వబడిన లింగము సర్వలక్షణలక్షితముగా తెలియును.

సర్వసాధారణం దేవి సర్వసౌభాగ్యదాయకమ్।

సర్వసిద్ధికరం లింగం యచ్చ పాషాణనిర్మితమ్॥ |16|

సర్వోత్తమోత్తమం లింగ యచ్చ శ్రీశైలజం శివే।

దోషాశ్చ బహవ: సంతి దృష్ట్యాదీని ధరాత్మజే॥ |17|

సామాన్యముగా దేవీ! శిలా నిర్మితములైన లింగము సర్వసౌభాగ్యములను, సమస్తసిద్ధులను కలుగజేయును. దేవీ! శ్రీశైలపర్వత శిలల చేత తయారుచేయబడిన లింగము అన్నిటికన్నా సర్వశ్రేష్టమైనది.

కొన్ని నియమములు:

అన్యలింగేషు సర్వేషు నైవ పాషాణసంభవే।

జాతకే మృతకాశౌచే మలమూత్రవిసర్జనే॥ |18|

ఇతర అన్ని లింగములలోను దిష్ట్యాది వివిధ దోషములుండును. కాని శిలా లింగములందు అటువంటి దోషములుండవు.

రతావశుద్ధావుద్యోగే రణే నిద్రాదిషు ప్రియే।

కర్మణా మనసా వాచా జాగ్రత్స్వప్నసుషుప్తిషు॥ |19|

న లింగముత్సృజేత్ క్వాపి ప్రాణై: కంఠగతైరపి।

న పూజాపి పరిత్యాజ్యా కృచ్ర్ఛేపి కులనాయికే॥ |20|

ఓ ప్రియా! జననమరణాది సూతకములందు గాని, మలమూత్రవిసర్జనాది సమయములందు గాని, రతికాలమునందు గాని, అశుద్ధకార్యమునాచరించు నప్పుడు గాని యుద్ధమునందు గాని, నిద్రించునప్పుడు గాని, కర్మణా, మనసా, వాచాగాని, జగ్రత్ -స్వప్న - సుషుప్తి అవస్థలందు గాని, ప్రాణాపాయ సమయమున గాని ఇష్టలింగనును పరిత్యజించ రాదు. హే కులనాయికే! ఎటువంటి సంకటస్థితియందును శివపూజను మానరాదు.

న సకృత్ స్మరణం వాపి మమ లింగస్య సద్గురో:।

తేష్వేకతమమాదాయ లింగం స్వాభిమతం శివే॥ |21|

ధారయేదాత్మతాదాత్మ్యం ప్రాణలింగం మమేతి తత్।

అథ కుర్యన్మహాదేవి సజ్జికాఖ్యం తదాలయమ్॥ |22|

ఇష్టలింగము యొక్క లేదా సద్గురుయొక్క స్మరణను ఒక్కసారి గాక నిరంతరము చేయుచుండవలెను. పైన పేర్కొనిన లింగములలో తనకిష్టమైన నొక దానిని ఎన్నుకొని, దానిని తన ప్రాణలింగముగా భావించి తాదాత్మ్యతను పొంది, దానిని ధరించుట కనుకూలమగు 'సజ్జిక ' అని పిలవబడు ఆలయమును సిద్ధము చేసుకొనవలెను.

స్థిరచరలింగముల ఆలయములు

యథా స్థిరస్య లింగస్య తద్వదేవ చరస్య చ।

స్థిరలింగాలయం దేవి ప్రసిద్ధం దృఢలక్షణమ్॥ |23|

దేవీ! స్థిరలింగమునకు వలెనే, చరలింగమునకును 'సజ్జిక ' అనునది స్థిరము, దృఢము అయిన ఆలయము (గా ప్రసిద్ధిచెందినది)

జానాస్యేతత్స్వరూపం చ చరలింగస్య శాంకరి।

లక్షణం పూజనవిధిమాచారం లింగధారణమ్॥ |24|

క్రమేణ శృణు తత్సర్వం తారతమ్యఫలం శివే।

స్థిరలింగార్చకో లోకే న శుద్ధ: పంక్తికర్మసు॥ |25|

శాంకరీ! చరలింగ స్వరూపమును, లక్షణమును, పూజావిధానమును, ఆచారములను, లింగధారణ విధానమును నీవు తెలిసికొనవలెను. క్రమముగా వీటిని, వీటి ఫలభేదములను వినుము. లోకమున స్థిరలింగమును పూజించువాడు పంక్తిపావనుడు కాడు.

ఇష్టలింగమును పూజించువారు శ్రేష్టులు

ధృతలింగార్చకా: సర్వే పావనా: పంక్తికర్మసు।

పృథగ్ లింగస్య స్థిత్యా తు స్వదేహస్యాప్యశుద్ధిత:॥ |26|

స్ప్రష్టుం న యోగ్యతా లింగం న చైవం శివయోగిన:।

ధృతలింగశరీరత్వాత్ ప్రదాతుర్ఙానసంభవాత్॥ |27|

శుచిరేవ సదా తయ నాశుద్ధిర్నైవ చాశుచి:।

గచ్ఛన్ తిష్ఠన్ స్వపన్ భుంజన్ జాగ్రన్నపి హసన్నపి॥ |28|

ఖాదన్నపి పిబన్ వాపి లింగపొజాం సమాచరేత్।

యథోపవిశ్య పీఠాదౌ శివయోగీ ప్రవర్తతే॥ |29|

తథోపవిష్ట ఎవాసౌ ధావన్ పూజితవానపి।

న కాయక్లేశసహనం నోపవాసాదిపీడనమ్॥

శరీరముపై ఇష్టలింగమును ధరించిన వారందరు ఏకపంక్తిలో కూర్చొనుట కధికారులగుదురు. శరీరమునుండి ఇష్టలింగమును వేరుచేసిన వ్యక్తి అశుద్ధ దేహకారణము చేత శివలింగమును స్పృశించు యోగ్యతను పోగొట్టుకొనును. శివయోగి విషయమున అట్లుకాదు. ఇష్టలింగమును శరీరముపై ధరించుటచేతను, గురుదత్తమయిన జ్ఞానమును పొందియుండుట చేతను అతనికెప్పుడు అశుద్ధిగాని, అశుచిగాని ఏర్పడదు. అతడు నిరంతరము శుచిగానే పరిగణించబడతాడు.

ఇష్టలింగార్చనకు సమయాసమయములు లేవు. నడుచుచుగాని, నిలబడి గాని, పడుకొని గాని, భుజించుచుగాని, మేల్కొని గాని, నవ్వుతుగాని, తినుచూ గాని, నీరు త్రాగుతూ గాని అన్ని సందర్భములలోను లింగార్చన చేయవచ్చును.

శివయోగి ఆసనమున కూర్చొని పూజించునట్లే, కూర్చొని గాని, పరిగెడుతూ గాని లింగార్చనను చేయవచ్చును. దీనికై శరీరమును కష్టపెట్టుట గాని ఉపవాసాదులనాచరించవలసిన అవసరముగాని లేదు.

చతుర్విధా ముక్తి: / నాలుగు విధముల ముక్తి

యథేచ్ఛమపి భుంజానో భోగాల్లింగం సమర్చయేత్।

దయా భూతేషు మద్భక్తి: సర్వత్ర మమ దర్శనమ్॥31॥

మల్లింగధారణం నిత్యం ముక్తిరేషా చతుర్విధా।

తస్మాత్ సౌలభ్యమీశాని తారతమ్యేన యోగినామ్॥32॥

మతస్య మమ చాన్యస్య మన్మతే లింగధారణాత।

తస్య లింగస్య విశ్వేశి చరం కుర్యాచ్ఛివాలయమ్॥33॥

వివిధ భోగములను యథేచ్ఛగా అనుభవించుచు లింగార్చన చేయవచ్చును. జీవులయందు దయ, నాయందు భక్తి, సకల చరాచరప్రపంచమందంటతా నన్ను దర్శించుట, ఎల్లప్పుడూ నా ఇష్టలింగమును ధరించుట అనునవే నాలుగు విధములైన మోక్షములు. అందువలన శైవశైవేతరమతముల పోలికలలో నా మతము నందలి లింగధారణము వలన ఇది యోగులందరికీ సులభమగుచున్నది. అటువంటి లింగమునకు చరరూపమైన ఆలయమును నిర్మింప చేయవలెను.

చరలింగాయ చరాలయరూపా: సజ్జికా: / చరలింగమునకు సజ్జికలే చరాలయాలు

పంచసూత్రోత్థలింగస్య యావత్ పూర్ణం తథా భవేత్।

సౌవర్ణముత్తమం దేవి యది శక్తిస్తథాచరేత్॥34॥

దానిని పంచసూత్ర ఘటితమైన లింగమునకు పూర్ణావకాశ ముండునట్లు సజ్జికరూపమున నిర్మింపచేయవలెను. అది బంగారమయిన సర్వశ్రేష్ఠము. చేయించగలిగిన దానినే చేయించవచ్చును.

రాజతం పిత్తలం తామ్రం నైవ కాంస్యేన కారయేత్।

సీసేన త్రపుణా దేవి తాన్తవీ పాటికాపి వా ॥35॥

ఎతేష్వన్యతమం నిత్యం నాన్యత్ కుర్యాదనాపది।

పరిత్యజ్యాపి యత్నేన ప్రాణమానధనాధికమ్॥36॥

సంరక్షణీయం గిరిజే లింగమేవ న సంశయ:।

సంభావితేన ద్రవ్యేణ వినా తంతుపటోద్భవమ్॥37॥

వెండి, ఇత్తడి, రాగి లోహములను సజ్జికా నిర్మాణమునకుపయోగించవచ్చ్ను. అయితే కాంస్యము, సీసము, యశదము, దారము లేదా గుడ్డతో ఛేసిన సజ్జికలనుపయోగించరాదు. వీటిలో (బంగారు, వెండి మొదలైనవాటిలో) నొకదానితో సజ్జికను చేయించవలెను. ఆపద్ధర్మముగా నేదోయోకదానిని చేయించరాదు. ప్రాణ - మాన - ధనాదులను సైతము ఎదురొడ్డి నిరంతరము ప్రయాత్నపూర్వకముగా ఇష్టలింగమును కాపాడుకొనవలెను.

సజ్జికా లక్షణము

కర్కటాద్యకృతిశ్చాన్యా యథాకామఫలప్రదా।

పంచసూత్రప్రమాణేన సజ్జికా లింగరూపిణీ॥38॥

తాదృశస్య చ లింగస్య భోగమోక్షైకసాధనీ।

భోగస్వర్గాపవర్గాయ మమ నందీశ్వరాకృతి:॥39॥

దారము, గుడ్డ తప్ప, మిగిలిన లోహములతో తన శక్త్యానుసారము కర్కటా (మండ్రగబ్బ)ది ఆకారములలో సుందరముగా చేయించిన సజ్జికలు కోరిన ఫలములను సిద్ధింపజేయును. లింగాకారమున పంచసూత్ర ప్రమాణము గల సజ్జిక భోగమును, మోక్షమును సిద్ధింపచేయును. నా నందీశ్వరాకారముననున్న సజ్జిక భోగమును, స్వర్గమును, ఆపవర్గము (పునర్జన్మరాహిత్యము)ను కలుగజేయును.

భోగమోక్షైకఫలదా సజ్జికార్కఫలాకృతి:।

ఆయురారోగ్య ఫలదా యా2సౌ చూతఫలాకృతి:॥40॥

అర్క (జిల్లేడు) ఫలాకారమునందుండు సజ్జిక భోగ, మోక్షకారకము. మామిడి పండు ఆకారమునందుండు సజ్జిక ఆయురారోగ్య ఫలముల ప్రసాదించును.

ఆయుష్మత్పుత్ర సౌభాగ్యఫలదా మోదకాకృతి:।

ఐశ్వర్యవిజయాయుష్యతేజ:ప్రజ్ఞావిలాసకృత్॥41॥

సజ్జికా శివలింగస్య విల్వీఫలసమాకృతి:।

శివలింగాకృతి: సజ్జా భోగమోక్షైకసాధనీ॥42॥

మోదకా (ఉండ్రాయి) కారము నందుండు సజ్జిక దీర్ఘాయువును కలిగిన పుత్ర సౌభాగ్యము నొసంగును. బిల్వ ఫలాకారము నందుండు సజ్జిక ఐశ్వర్యమును, విజయమును, ఆయువును, తేజస్సును, ప్రజ్ఞాపాటవములను కలిగించును. శివలింగాకారమునందుండు సజ్జిక భోగ, మోక్షములకు సాధనము.

యద్యదిష్టతమం దేవి భూషణం మణికాంచనమ్।

తదేవ సజ్జికాం కృత్వా సర్వకామం సమశ్నుతే॥43॥

దేవీ! (భక్తుడు) తనకిష్టమైన మణికాంచనాదులతో సజ్జికను అలంకరింపజేసి కొని తన కోరికల నన్నిటినీ పొందవచ్చును.

ఏకా ద్వారకపాటాడ్యా పాదత్రితయశోభినీ।

సన్నద్ధగుణసంబద్ధా దృఢా సంతానశోభినీ॥44॥

చతురస్రం పంకజాభం వర్తులం బింబకోపమమ్।

యథా సందర్శితం దేవి గురుణా తత్తథాచరేత్॥45॥

ప్రతి సజ్జికా, ద్వార, కవాటములను, త్రిపాదములను కలిగి ప్రత్యేకముగా తయారుచేసిన గట్టిదారముతో బంధయోగ్యముగానుంచవలెను. దేవీ! అది చతురస్రాకారము, కమలాకారము, గోలాకారము, దొండపండు ఆకారములోగాని, లేదా ప్రత్యేకించి గురువుచే సూచించబడిన ఆకారమునగాని సజ్జికను నిర్మింపజేయవచ్చును.

సజ్జికా గుణలక్షణము/ సజ్జికలకుపయోగించు సూత్ర లక్షణము

సౌవర్ణ: స్యాద్యది గుణ: సర్వసౌభాగ్యదాయక:।

రాజత: పుత్రకీర్తి: స్యాత్తామ్రశ్చేద్ ధనధాన్యకృత్॥46॥

(సజ్జికను శరీరం పై ధరించుటకుపయోగించు దారము)బంగారముదయినచో సర్వసౌభాగ్యము లొసంగును. వెండిదయిన కీర్తివంతులైన పుత్రులను, రాగిదయిన ధనధాన్యములను కలుగజేయును.

పైత్తల: సర్వభోగాయ కాంస్య: కల్మషనాశన:।

త్రపుసీసమయో వాపి సర్వాభీష్టఫలప్రద:॥47॥

ఇత్తడి దారము సర్వభోగములను, కంచుదారము సర్వపాపనాశనమును, సీసదారము సర్వాభీష్టఫలములను సిద్దింపజేయును.

దారిద్య్రాయ చ సంవిద్ధి పటజ: సర్వదు:ఖకృత్।

కార్పట: సరభోగాయ తాంతవ: సర్వకామద:॥48॥

(పాత) వస్త్రముతో చేసిన సూత్రము దారిద్ర్యముతోపాటు సర్వ దు:ఖములకు కారణముగా తెలియుము. నూతన వస్త్రముతో జేసిన సూత్రము సమస్త భోగములను, దారముతో జేసిన సూత్రము సమస్త కోరికలను తీర్చును.

శుక్లో జ్ఞానప్రదస్తత్ర రక్తో వశ్యకరో గుణ:।

శ్యామ: శతృభయకర: పీత: పుత్రప్రదాయక॥49॥

తెల్లని (శివ) దారము జ్ఞానమును, ఎఱ్ఱని దారము జనాకర్షణను, నల్లని దారము శత్రుభయమును, పసుపుదారము పుత్రప్రాప్తిని కలుగజేయును.

చిత్రో విచిత్రఫలద: సుదృఢశ్ఛేదవర్జిత:।

అగ్రంథిఋజురూప: స్యాదానాభ్యా కంఠమధ్యత:॥50॥

అనేక రంగులతోనున్న మిశ్రదారము విచిత్ర ఫలములనిచ్చును. శివసూత్రము గట్టిగాయుండి, ముడులు లేకుండా, పోగులన్నియూ ఒకే పరిమాణ ప్రమాణములతో నుండి నాభినుండికంఠమువరకు గల మధ్య భాగమున నుండునట్లు ధరించవలెను.

యావిధిచ్ఛం భవేద్ దేవి సజ్జికాగుణ ఉత్తమ:।

తావదేవ ప్రకుర్వీత సజ్జికాగుణమీశ్వరి॥51॥

దేవి! ధరించు శివభక్తుని ఇచ్ఛానుసారము తన సజ్జికకు తగిన శ్రేష్టమైన దారమును సమకూర్చుకొనవలెను.

సజ్జికాశివసూత్ర యోగమహిమా / సజ్జికా శివసూత్రముల యోగమహిమ

యా సజ్జికా భవద్రూపా మద్రూపో యో గుణ: శివే।

ఉభయోరావయోర్యోగాజ్జగదేతచ్చరాచరమ్॥52॥

శివే! సజ్జిక నీ స్వరూపము, శివదారము (సూత్రము) నా స్వరూపము. మన ఇద్దరి యీ కలయిక చేతనే సమస్త చరాచరప్రపంచము సృష్టించబడినది.

పుంరూపమఖిలం దేవి మమ రూపం న సంశయ:।

స్త్రీరూపమఖిలం దేవి తవ రూపం న సంశయ:॥53॥

దేవి! పురుషరూపమందున్న సమస్తమూ నిస్సందేహంగా నా రూపమే. అలాగే స్త్రీ రూపమునందున్న సర్వమూ నిస్సందేహముగా నీ స్వరూపమే.

మయా వినా క్వచిన్నాస్తి తవ రూపం తథా మమ।

తదేకరూపలాభాయ గుణయోగ: ప్రకీర్తిత:॥54॥

నేను లేకుండా నీకు అస్తిత్వము లేదు. అటులనే నా స్వరూపమును.(మన ఇద్దరి) ఐక్యరూప ప్రతిపాదనకే (సజ్జికతో) శివసూత్ర యోగము చెప్పబడినది.

శివస్యైవ భవేద్ ద్వారమేకం స్యాదేకమేవ హి।

సార్గలం తిర్యగరరం సర్వమేకాత్మకం శివే॥55॥

సజ్జికకు (ఇష్టలింగమును లోపలనుంచుటకు వెలుపలికి తీయుటకనుకూలముగా) ఒకే ఒక ద్వారముండవలెను. దీనిని తీయుటకు వీలుగా అడ్డముగా కొండెము నొకదానిని ఏర్పరచి, మొత్తము ఒకే ఆకారము నందుండునట్లు చూడవలెను.

యస్య ద్వారయుగే దేవి గౌరీ కాత్యాయనీ ఉభే।

పార్శ్వయో: శాంకరీ రౌద్రీ భద్రకాల్యుపరి త్వధ:॥56॥

శాంకరీ! సజ్జికా ద్వారము యొక్క రెండు పార్శ్వములందు గౌరీ, కాత్యాయనీ, పైన క్రింది భాగములందు రౌద్రీ, భద్రకాళీ (దేవతలు వసిస్తారు).

యస్యా: పాదత్రయం ధర్మకామార్థాత్మకమీశ్వరి।

యస్యా మదాత్మకగుణో భోగమోక్షఫలాత్మక:॥57॥

ఈశ్వరీ! సజ్జికకున్న మూడుపాదములు ధర్మ, అర్థ, కామములకు ప్రతీకలు. వీటిని బంధించు నా స్వరూపమయిన శివసూత్రము భోగమోక్షప్రదాయకము.

గుణస్యాగ్రద్వయోరేవ సంబద్ధౌ చ సువర్తులౌ।

పద్మకుడ్మలసద్రూపౌ ప్రౌక్తౌ జ్ఞానక్రియేతి చ॥58॥

శివసూత్రము యొక్క రెండుకొనలను కలిపి తామరమొగ్గల వలె వర్తులాకారమున వేయు రెండుముడులు జ్ఞానక్రియా శక్తులుగా చెప్పబడినవి.

తదుపర్యేకమీశాని చిత్రమేకం స్వరూపకమ్।

ఆత్మపూర్వాగ్రమాకుంచ్య హ్యాత్మాగ్రమవకుంచయేత్॥59॥

పార్శ్వద్వయాగ్రే సం యోజ్య యథోక్తం గురుణా తత:।

ఉక్తమేవం మయా లింగం సజ్జికాగుణలక్షణమ్॥60॥

ఈశానీ! ఆ రెండు ముడుల పైభాగమున ఒక విచిత్రమైన ముడిని వేయాలి. ఆ ముడికి దారము యొక్క ఒక కొసను ముందుకులాగి, మరియొక కొసను వెనుకకు లాగి, రెండు కొసల అంచులను కలిపి గురువు చెప్పిన ప్రకారము ముడిని వేయవలెను. ఈ ప్రకారము నాచే లింగ - సజ్జికా - గుణ లక్షణములు తెలుపబడినవి.

దీక్షార్థం గుర్వాశ్రయణమ్ / దీక్షకై గురువు నాశ్రయించుట

తద్ధారణక్రమం వక్ష్యే దీక్షాపూర్వం సువిస్తరమ్।

యస్తు మత్కరుణాపాత్రం చరమం జన్మ యస్య వా॥61॥

తస్యైవ జాయతే భక్తిర్మమ లింగస్య ధారణే।

నిర్విష్టవిషయ: శాంత: సర్వత్ర సమదర్శన:॥62॥

దీక్షాపూర్వకముగా ఇష్టలింగధారణమును వివరముగా తెలిపెదను. ఎవడు నా దయాపాత్రుడో, ఎవడికి ఈ మానవజన్మ చివరిదో అటువంటివానికి మాత్రమే నా లింగధారణయందు భక్తి(అనురక్తి) కలుగును. ఇంద్రియ విషయములందు నిరాసక్తుడు, శాంతస్వభావుడు, సమస్త విషయములను సమదృష్టితో చూచువాడు ముముక్షువు అయిన భక్తుడు, శివస్వరూపుడైన గురువును ఆశ్రయించవలెను.

గురులక్షణము

ముముక్షురీశ్వరే భక్త: శ్రీగురుం శివమాశ్రయేత్।

సర్వలక్షణసంపన్నం సర్వజ్ఞం సర్వసమ్మతమ్॥63॥

సదాచారరతం శుద్ధం శివభక్తమలోలుపమ్।

యథార్థవాదినం శాంతం ద్వేషాసూయాదివర్జితమ్॥64॥

విదితాఖిలశాస్త్రార్థమింగితజ్ఞామనాకులమ్।

అనర్థాతురమాత్మజ్ఞమకాముకమవంచకమ్॥65॥

వాగ్మినం శివతత్త్వార్థబోధకం హృష్టమానసమ్।

ఏతాదృశగుణోపేతము పేయాద్గురుమీశ్వరమ్॥66॥

సర్వలక్షణ సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వులకు గౌరవ పాత్రుడు, సదాచార నిరతుడు, శుద్ధుడు, శివభక్తుడు, చంచలస్వభావము లేనివాడు, సత్యమును పలుకువాడు శాంతుడు, ద్వేషాసూయలు లేనివాడు, సకలశాస్త్రార్థముల నెఱిగిన వాడు, లోకజ్ఞత గలవాడు, వ్యాకుల రహితుడు, ద్రవ్యలోభము లేనివాడు, ఆత్మ జ్ఞానసంపన్నుడు, విషయాసక్తిరహితుడు, అవంచకుడు, చక్కని వాగ్మి అయినవాడు, శివతత్త్వార్థ ప్రభోధకుడు, సదా ఆనందమనస్కుడు వంటి గుణసంపన్నుడు శివస్వరూపుడు అయిన గురువు నాశ్రయించవలెను.

వివరణ: గురులక్షణమునకు చంద్రాజ్ఞానాగమము (క్రియాపాదము) 2.48-52; సూక్ష్మాగమము (క్రియాపాదము) 5.4-9 చూడుడు.

రిక్తహస్తేన నోపేయాదుపసర్పన్ గురుం శుచి:।

నమస్కృత్య విధానేన సాష్టాంగం భక్తిపూర్వకమ్॥67॥

కృతాంజలిపుట: స్థిత్వా స్తుత్వా విజ్ఞాపయేత్తత:।

నమస్తే నాథ భగవన్ శివాయ గురురూపిణే॥68॥

దేహి శిష్యాయ మే వీరశైవదీక్షామభీష్టదామ్।

ఇతి పృష్టో2థ శిష్యేణ యది దాతుమనా గురు:॥69॥

శుద్ధమనస్కుడైన భక్తుడు గురువు చెంతకు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదు. గురువును సమీపించి భక్తి పూర్వకముగా సాష్టాంగ విధితో నమస్కరించి చేతులు జోడించి, నిలబడి ప్రశంసాపూర్వకముగా ఇట్లు నివేదించవలెను. భగవాన్! గురు రూపమున అవతరించిన పరర్మశివునకు నమస్సులు. మీ శిష్యుడైన నాకు సర్వాభీష్టప్రదాయకమైన వీరశైవదీక్షను ప్రసాదించుడు అని శిష్యునిచే అడుగబడిన గురువు దీక్షను ఇవ్వదలచినచో, మూడు సంవత్సరముల కాలము, శిష్యుని పరీక్షించి దీక్ష నివ్వవలెను.

అతి త్వరలో అందచేయబడుతుంది.

అతి త్వరలో అందచేయబడుతుంది.

అతి త్వరలో అందచేయబడుతుంది.

అతి త్వరలో అందచేయబడుతుంది.

అతి త్వరలో అందచేయబడుతుంది.

అతి త్వరలో అందచేయబడుతుంది.