లింగలక్షణము, భేదములు

మమ లింగమిదం సర్వం జగత్ స్థావరజంగమమ్

మమ లింగమిదం విద్ధి పాషాణాదివినిర్మితమ్॥ |4|

ఈ స్థావర జంగమమయిన జత్తంతయూ శివలింగ స్వరూపమే. పాషాణాదులచే నిర్మిపబడిన ఈ లింగమును నా స్వరూపముగా తెలిసికొనుము.

నాదేయం శైలసంభూతం పుణ్యక్షేత్రసముద్భవమ్।

గంగోద్భవం సాగరజం లింగం తన్మమ సమ్మతమ్॥ |5|

నదులందు పర్వతములందు ఉద్భవించిన, పుణ్యక్షేత్రములందు వెలసిన గంగానదియందు, సముద్రమునందు ప్రకటమయిన లింగములు నాకత్యంత ప్రీతిపాత్రములు.

వివరణ: నాదేయం - నర్మదాది నదులందు వెలసినట్టిది. నర్మదానదిలోని బాణశిలలు లింగ నిర్మాణమునకు ప్రశస్తములని ప్రసిద్ధి.

యద్దేవి శివనాభాఖ్యం లింగం తత్పరముత్తమమ్।

యద్దేయతే హి గురుణా లింగం సర్వోత్తమోత్తమమ్॥ |6|

ఓదేవీ! వీటిలో శివనాభమని పిలువబడు లింగము ఉత్తమమైనది. దీక్షా విధానముతో గురువుచేత ఇవ్వబడిన లింగము ఉత్తమోత్తమము.

కామ్యాన్యన్యాని లింగాని తత్తదిష్టార్థదాని హి।

సౌవర్ణపారదాదీని స్థూలం స్థూలం ప్రశస్యతే॥ |7|

సాధకులు అభీష్టఫలముల ప్రసాదించెడి అనేకరకములైన కామ్య లింగములు కూడా వున్నవి. పసిమి పాదరసాదుల చేత తయారుచేయబడిన లింగములు పరిమాణమున ఎంత పెద్దవో ఫలప్రదానమున అంతటి శ్రేష్ఠము.

క్రముకాకృతిమారభ్య మావదిచ్ఛాస్తి ధారణే।

ఉత్తరాదుత్తరం శ్రేష్ఠం మమ లింగం మహేశ్వరి॥ |8|

మహేశ్వరీ! వక్కాకారమంతటి పరిమాణము నుంది ధరించువాని అభీష్టమున కవసరమయినంత పరిమాణములతో నా లింగములు నిర్మించవచ్చును. వాని పరిమాణము పెరిగినకొలదీ శ్రేష్ఠత అధికమగును.

పారదం సర్వకామాయ సౌవర్ణం విత్తకామిన:।

రాజతం తు ప్రజాకామి తామ్రం శత్రువినాశనమ్॥ |9|

త్రపుజం రోగనాశాయ సీసకం పాపనాశనమ్।

స్ఫాటికం జ్ఞానదం పుణ్యం రుద్రాక్షం మోక్షదాయకమ్॥ |10|

దారుజం సర్వనాశాయ కాంస్యం రోగార్తిదాయకమ్।

శ్రీశైలజం మహాదేవి హ్యైహికాముష్మికప్రదమ్॥ |11|

పాదరసలింగము సర్వేచ్ఛసిద్ధిని బంగారులింగము ధనప్రాప్తిని, వెండి లింగము సంతాన ప్రాప్తిని, రాగిలింగము శతృనాశనమును, త్రపు(తుత్తునాగ) లింగము రోగనాశనమును, సీసలింగము పాపనాశనమును, స్ఫటికలింగము జ్ఞానమును పుణ్యమును, రుద్రాక్షలింగము మోక్షమును, దారులింగము సర్వనాశనమును, కాంస్యలింగము రోగభయమును కలుగజేయును. శ్రీశైలపర్వత శిలలతో చేయబడిన లింగము ఐహిక-ఆముష్మిక సుఖములను సిద్ధింప జేయును.

సర్వోత్తమోత్తమం లింగం సర్వాభీష్టార్థదాయకమ్।

యద్దత్తం గురుణాదేవి లింగం తదహమేవ హి॥ |12|

(ఈ లింగములలో) సర్వాభీష్టప్రదాయకము, సర్వోత్తమము అయినది గురువు ద్వారా పొందినట్టి ఇష్టలింగము. అటువంటి లింగమును సాక్షాత్తు నేనే అయియున్నాను.

బదరీఫలమానం తు కృతం ధర్మాభివృద్ధిదమ్।

క్రముకీఫలమానం తు ధర్తు: సర్వార్థదాయకమ్॥ |13|

జంబీరఫలమానం తు సర్వకామార్థదాయకమ్।

తతో2ధికం ప్రియం యావచ్చతుర్వర్గఫలప్రదమ్॥ |14|

రేగుఫలపరిమాణమంతటి ఇష్టలింగను ధరించిన వానికి ధార్మికబుద్ధి కలుగును. వక్కకాయ పరిమాణమంతటి ఇష్టలింగము సర్వార్థములను ప్రసాదించును. నిమ్మకాయ పరిమాణమునగల లింగము సమస్త కోరికలను సిద్ధింపచేయును. అంతకన్నా బృహత్ పరిమాణముగల లింగము ధర్మార్థకామమోక్ష రూపమైన చతుర్వర్గఫలమును సిద్ధింపజేయును.

న ప్రమాణం తదన్తస్య శివనాభస్య పార్వతి।

యద్దత్తం గురుణా తస్య సర్వలక్షణలక్షితమ్॥ |15|

పార్వతీ! 'శివనాభ 'మను లింగమునకు పరిమాణ పరిమితి లేదు. గురువుచే ఇవ్వబడిన లింగము సర్వలక్షణలక్షితముగా తెలియును.

సర్వసాధారణం దేవి సర్వసౌభాగ్యదాయకమ్।

సర్వసిద్ధికరం లింగం యచ్చ పాషాణనిర్మితమ్॥ |16|

సర్వోత్తమోత్తమం లింగ యచ్చ శ్రీశైలజం శివే।

దోషాశ్చ బహవ: సంతి దృష్ట్యాదీని ధరాత్మజే॥ |17|

సామాన్యముగా దేవీ! శిలా నిర్మితములైన లింగము సర్వసౌభాగ్యములను, సమస్తసిద్ధులను కలుగజేయును. దేవీ! శ్రీశైలపర్వత శిలల చేత తయారుచేయబడిన లింగము అన్నిటికన్నా సర్వశ్రేష్టమైనది.

కొన్ని నియమములు:

అన్యలింగేషు సర్వేషు నైవ పాషాణసంభవే।

జాతకే మృతకాశౌచే మలమూత్రవిసర్జనే॥ |18|

ఇతర అన్ని లింగములలోను దిష్ట్యాది వివిధ దోషములుండును. కాని శిలా లింగములందు అటువంటి దోషములుండవు.

రతావశుద్ధావుద్యోగే రణే నిద్రాదిషు ప్రియే।

కర్మణా మనసా వాచా జాగ్రత్స్వప్నసుషుప్తిషు॥ |19|

న లింగముత్సృజేత్ క్వాపి ప్రాణై: కంఠగతైరపి।

న పూజాపి పరిత్యాజ్యా కృచ్ర్ఛేపి కులనాయికే॥ |20|

ఓ ప్రియా! జననమరణాది సూతకములందు గాని, మలమూత్రవిసర్జనాది సమయములందు గాని, రతికాలమునందు గాని, అశుద్ధకార్యమునాచరించు నప్పుడు గాని యుద్ధమునందు గాని, నిద్రించునప్పుడు గాని, కర్మణా, మనసా, వాచాగాని, జగ్రత్ -స్వప్న - సుషుప్తి అవస్థలందు గాని, ప్రాణాపాయ సమయమున గాని ఇష్టలింగనును పరిత్యజించ రాదు. హే కులనాయికే! ఎటువంటి సంకటస్థితియందును శివపూజను మానరాదు.

న సకృత్ స్మరణం వాపి మమ లింగస్య సద్గురో:।

తేష్వేకతమమాదాయ లింగం స్వాభిమతం శివే॥ |21|

ధారయేదాత్మతాదాత్మ్యం ప్రాణలింగం మమేతి తత్।

అథ కుర్యన్మహాదేవి సజ్జికాఖ్యం తదాలయమ్॥ |22|

ఇష్టలింగము యొక్క లేదా సద్గురుయొక్క స్మరణను ఒక్కసారి గాక నిరంతరము చేయుచుండవలెను. పైన పేర్కొనిన లింగములలో తనకిష్టమైన నొక దానిని ఎన్నుకొని, దానిని తన ప్రాణలింగముగా భావించి తాదాత్మ్యతను పొంది, దానిని ధరించుట కనుకూలమగు 'సజ్జిక ' అని పిలవబడు ఆలయమును సిద్ధము చేసుకొనవలెను.