పారమేశ్వరాగమము

శివలింగ మహిమ

విశేషం తత్ర వక్ష్యామి రహస్యం గోప్యతాం త్వయా।

న ప్రకాశయా కుత్రాపివినా భక్తం సులక్షణమ్॥ |87|

ఇచ్చట ఒక విశేషమును చెప్పెదను. దీనిని గోప్యముగా నుంచుము. సులక్షుణుడైన భక్తునకు తప్ప అన్యులకెప్పుడునూ తెలుపవలదు.

దేవాలయాదిషు యథా చిత్రాదిషు యథా గృహే।

దృశ్యతే చాకృతిర్యస్య తజ్ఞానం జాయతే స్ఫుటమ్॥ |88|

దేవాలయములందు, ఇంటియందలి చిత్రపటములందు, ఎటువంటి ఆకృతి చూడబడుచున్నదో, అటువంటి ఆకారజ్ఞానమే మనకు స్పష్టముగా తెలియును.

ఎవం హి వీరమంత్రే తు సర్వపాపై: ప్రముచ్యతే।

లింగస్య దర్శనాద్దేవి మమ జ్ఞానం ప్రజాయతే॥ |89|

అదేవిధముగా ఎట్లు వీరమంత్రము (పంచాక్షరీ మంత్రం) చేత సర్వపాపముల నుండి ముక్తి కలుగునో అటులనే ఇష్టలింగ దర్శనముచేత నా (శివ) జ్ఞానము కలుగును.

గతేషు బహుసంఖ్యేషు దు:ఖరూపేషు జన్మసు।

మత్కారుణ్యేన తస్యాంతే జాయతే లింగదర్శనమ్॥ |90|

దు:ఖమయములయిన అనేక జన్మలు గతించిన అనంతరము, నా కరుణా కటాక్షము చేతనే చివరికి ఇష్టలింగదర్శనమగును.

యదీదమితి జానాతి లింగం మమ మహేశ్వరి।

మజ్ఞానాద్దర్శనాత్సద్యో మల్లింగస్య చ సో2స్మ్యహమ్॥ |91|

మహేశ్వరీ! నా లింగము నా అనుగ్రహ కారణమే అని తెలుసుకున్నవాడు నా (శివ) జ్ఞానము చేత నా ఇష్టలింగ దర్శనము చేత వాడే నే నగుచున్నాను.

ఎవం హి మహిమా దేవి మమ లింగస్య కిం పున:।

ధృతే తు తస్మిన్ స్వతనౌ సర్వా లింగమయీ తను:॥ |92|

ఇటువంటి (మహిమాన్వితమైన)ది ఇష్టలింగము. దేవీ! అతువంటి లింగమును శరీరముపై ధరించిన భక్తుని శరీరము లింగమయమే అగుచున్నది.

లీలార్థకమపి త్వీశి యత్తల్లింగముదాహృతమ్।

తల్లింగమయమిత్యేతచ్ఛరీరం తస్య ధారణాత్॥ |93|

ఈశ్వరీ! సృష్ట్యాదిలీలలకు యే లింగము కారణముగా ఉదాహరించబడుచున్నదో అటువంటి లింగమును ధరించుట చేత భక్తుని శరీరము లింగమయమగుచున్నది.

దేవ్యువాచ / దేవి ప్రశ్న

కిమర్థం సర్వే లింగధారణం న కుర్వంతీతి ప్రశ్నస్తత్సమాధానం చ / అందరూ లింగధారణమునెందుకు చేయరు అన్న ప్రశ్న, సమాధానము

వృషధ్వజ వృషారూఢ విరూపాక్ష విషాదన।

న తే కుర్వంతి కిం సర్వే లింగధారణమీశ్వర॥ |94|

ఓ వృషధ్వజా! నందివాహనా! ముక్కంటీ! విషభక్షకా! ఈశ్వరా! లోకము అందరూ ఎందుకు లింగధారణమును చేసికొనుటలేదు?

ఈశ్వర ఉవాచ / ఈశ్వరుని సమాధానము

కథం భవిష్యతి శివే వినా మత్కరుణాం నృణామ్।

కర్మపూరితదృష్టీనాం మన్మాయామోహితాత్మనామ్॥ |95|

హే శివే! కర్మవాసనల చేత భ్రమాత్మకమయిన దృష్టిని గలిగి, మాయా మోహితులైన మానవులకు నా కరుణ లేనిదే అది ఎట్లు సాధ్యమగును?

వివరణ: ప్రశ్నకు ప్రశ్నతోటే సమాధానము. లింగధారణ సంస్కారము లభించాలంటే శివుని అనుగ్రహం ఉండాలి. అది అందరికీ లభించదు. యుక్తాయుక్త కర్మవశులయిన మానవులు తమ కర్మఫలములను పరిహరింప జేసుకొనుటకే పరమేశ్వరుడు తన మాయచేత 'తిరోధానమును ' (మరుపు) సృజించినాడు. ఇది శివుని పంచకృత్యములలో ఒకటి. జీవుడు పుణ్యపాప రూపమయిన సర్వకర్మ ఫలములను సంపూర్ణంగా పరిహరించుకున్న క్షణమే 'తిరోధానము ' తొలగి పోతుంది. ఆ తరువాత పరమేశ్వరుని ఐదవ కృత్యమయిన అనుగ్రహము ఆరంభమవుతుంది. దాని ప్రభావముచేత భక్తి అంకురించి లింగధారణాది సంస్కారములకు వీరశైవులు, యోగ్యులౌతారు.